మెయిన్ ఫీచర్

సర్వసిద్ధి ప్రదాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ శరీరమే ‘క్షేత్రం’. ఈ క్షేత్రానికి ‘శక్తి’ అధిష్ఠాత్రి. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి కరుణించి కాపాడే తల్లికి క్షయం లేదు, వృద్ధి లేదు. తరగటం, పెరగటం ఉండవు. తరిగిపోయేది శరీరం. క్షీణించేది క్షేత్రం. క్షీణించే క్షేత్రంలో అక్షయంగా రాణించే కృపాకటాక్షిణి- జగన్మాత.
క్షేత్రపాలకులందరూ ఆమె విభూతులే. అందుకే అగ్నిజ్వాలలో ఆమె ఉంటుంది. కాని భక్తులకు చల్లని సుగంధ పరిమళ గంధాన్ని అందిస్తుంది. మహాప్రళయ జలధిలో వశిస్తుంది. కాని సకాల వర్షాలనిచ్చి భక్తులకు అన్నపానీయములనిచ్చి ఆదుకుంటుంది. నరులను నారాయణులుగా రూపుదిద్దుతుంది. తల్లి ఉనికి విలువను గుర్తించని వారిపట్ల ఆమెకు ద్వేషం లేదు, మందహాసం చేస్తుంది.
ఆధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక తాపాలకు గురియైన సంసారులకు శరత్కాల చంద్రునిలాగా చల్లని వెనె్నలనిచ్చి, తాపోపశమనాన్నిచ్చి సుఖ సంతోషాలకు మోక్షానికి మార్గాన్ని చూపుతుంది. ఆమె ఎప్పటికీ పిన్న వయసులోనే దర్శనమిస్తుంది. దార్శనిక శక్తికి మారుపేరు జగన్మాత. ఆ జగన్మాతే - బాలాత్రిపుర సుందరి.
‘అ’కారం నుంచి ఉద్భవించిన సమస్త వాఙ్మయం, జగన్మాత స్వరూపం. అది అక్షరం, క్షయం లేనిది. తల్లిని అంతర్ముఖంగా ఆరాధించాలి. అప్పుడే తల్లి లీలా విలాసాలు గోచరమవుతుంది. లీలలంటే సేవలు. అంటే తల్లి చూపించే వాత్సల్యము. దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేసే లీలలు, బిడ్డలపట్ల మాతృమూర్తికి ఉండే ఆదరణ.
సమస్త వాఙ్మయం మూడు మాత్రల్లో, మూడు వేదాల్లో, మూడు దమాలలో కూడుకొని ఉంటుంది. గుణత్రం, భువత్రయం, కాలత్రయం, మూర్తిత్రయం, వేదత్రయం, నాదత్రయం- యిలా అనేక త్రివర్గాలకు నిలయమైన బృహత్‌త్రయి త్రిపురసుందరి. కూటత్రయంలో ప్రాణికోటికి ప్రాణశక్తి ప్రసాదిస్తూ అందరికీ కరావలంబం అనగా చేయూతనిస్తూ, పురత్రయాన్ని పాలించే జగజ్జనని బాలా త్రిపురసుందరి.
జగన్మాతకు అందరూ సమానమే. బంధు ప్రీతి లేదు. తప్పుచేసినవారిని వారు ఎవరైనా సరే శిక్షిస్తుంది. అందుకే తండ్రి దక్షుడు చేసిన అధర్మయజ్ఞాన్ని ఆమె నిరసించి, అందుకు తానే బలి అయింది. ఇదే జగన్మాత త్యాగం. ఇంత జరిగినా బాలాత్రిపురసుందరి ముఖంలో మందహాసం మాత్రం స్థిరంగానే ఉంది. తనను కొలిచే భక్తులను కూడా స్థితప్రజ్ఞతను ప్రసాదించి, చిదానందాన్ని పంచి ఇచ్చే చిద్రూపిణి- బాలాత్రిపుర సుందరి. మూడు పాయలు అనగా త్రికరణములు- మనోవాక్కాయములు, త్రిగుణములు అనగా సత్వరజస్తమోగుణములు, స్థూల సూక్ష్మకారణ శరీరములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు- ఇవన్నీ వేరు వేరుగా ఉండక ముప్పేటగా, ప్రేమతో ఒక్కటిగా అల్లుకొన్న ‘త్రిపుటు’లందు ప్రేమయే నిండి ఉంటుంది. ఆ విధముగా ఏకరూపమున అల్లుకొన్న ప్రేమను కరుణించే జగన్మాత- బాలాత్రిపుర సుందరి.
అటువంటి జగన్మాత స్వరూపాన్ని ‘బాల’గా స్మరించుకుంటే, శ్రీమాతకు మరింత దగ్గరవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, నవరాత్రి పూజలో పది పనె్నండు సంవత్సరములలోపు వయసు కన్యలను పూజించి వారికి పసుపు కుంకుమ నూతన వస్తమ్రులు ఆభరణములిచ్చి దేవిని ‘బాల’ రూపంగా ఆరాధించి, ఆమె లీలా వినోదాన్ని అనుభవించి, ఆనందించి తరిస్తారు.
ఒకప్పుడు ఇంద్రాది దేవతలు, తమ విజయానికి జగన్మాత కారణమన్న సత్యాన్ని మరచిపోయి, గర్వంతో అంతా తమ స్వశక్తితోనే పొందామని తలంపసాగారు. ఆ తరుణంలో అపురూపమైన ‘శక్తి’ వారి ఎదుట సాక్షాత్కరించింది. ఆ అద్వితీయ అపురూప శక్తి ఏమిటో వారికి గోచరించలేదు. తెలిసికొనటానికి అగ్నిదేవుడు ముందుకువచ్చి శక్తితో ‘‘నేను సర్వజ్ఞుణ్ణి. అన్నిటినీ దహించగలను’’ అన్నాడు. మహాశక్తి, అతని ఎదుట ఒక గడ్డిపోచ ఉంచి, దీనిని కాల్చమన్నది. అగ్నిదేవుడు సాయశక్తులా ప్రయత్నించాడు. అతని యావశ్శక్తి, అతని అహంకారము వలన పనిచేయలేదు. దీనవదనుడైనాడు. ఆశ్చర్య చకితుడైనాడు. నా వేడి ఉష్ణశక్తి ఏమైంది అని ఆలోచిస్తూ అవమానంతో కృంగిపోయాడు అగ్నిదేవుడు. ఈ విధంగానే వాయుదేవుడు మొదలుగాగల దేవతలందరూ విఫలులైనారు. అపుడు ‘‘ఉమా హైమవతీ బహుశోభమానా’’ అయి ప్రకాశిస్తూ, మందహాసంతో మహాశక్తి త్రిపుర సుందరీదేవి దర్శనమిచ్చింది. అహంకారాన్ని పోగొట్టుకున్న దేవతలు, తమ విజయానికి తమలో వున్న ఆ మూలశక్తియే కారణమని, తాము నిమిత్తమాత్రులమని తెలిసికొని తల్లి పాదముల్ని ఆశ్రయించారు. ఇది ఉపనిషత్ చెప్పిన ‘శక్తి’స్వరూపం- బాలాత్రిపుర సుందరీ పూజకు దీప్తినిస్తుంది.
భండాసురుని కుమారులు ముప్ఫయి మంది రాక్షసులు. భండాసురుడు, బండలాంటివాడు. తిండి దొరకాలేగాని, సుష్టుగా తిని, మొద్దు నిద్రపోతూ యుగాల్ని క్షణాలుగా గడిపేస్తాడు. దుర్జన సాంగత్యమే చేయాలనేవాడు విషంగుడు. ఇంద్రియములకు పూర్తిగా లోనై, దిగజారిన భోగలాలసకు దాసుడైనాడు వాడు- విశుక్రుడు. విషంగుణ్ణి సంహరించటానికి మాత్రిణీమాత మంచి వ్యూహరచన చేస్తుంది. విశుక్రుని ప్రాణాలు హరించేందుకు ‘వారాహి’ తన వీర్యాతిశయాన్ని ప్రయోగిస్తుంది.
ఒక్కసారి కామేశ్వరుని ముఖంవైపు చూస్తే, విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమవగా, సర్వవిఘ్నములను జయిస్తుంది, జగన్మాత. భండాసురుడు ప్రయోగించే ప్రతి శస్త్రానికి, ఆమె చేతిలో ప్రత్యస్త్రం ఉంది. అవసరమైతే ఆమె చేతి వ్రేళ్ళు, గోళ్ళనుండి మత్స్య కూర్మ వరాహాది దశావతారాలతో, శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరిస్తాడు. నారాయణుని సహకారంతోగాని, నరునిలోని భండత్వం నశించదు. నరజాతిలోని అసురత్వాన్ని నారాయణుడు నశింపజేస్తే పశుత్వాన్ని పశుపతి అణచివేస్తాడు. కామేశ్వరాస్త్రంతో భండాసురునితో సహా అతని రాజధానియైన శూన్యక మహానగరాన్ని అగ్నికి అర్పించింది. చతుర్బాహుడు మొదలు ఉపమాయుడు వరకు ముప్పది మంది రాక్షసులు భండాసురుని తనయులు. వారిని తనూజయై తొమ్మిది సంవత్సరముల వయసుగల ‘బాలాత్రిపురసుందరి’ వధించింది. దార్శనిక విమర్శ శక్తియే బాలాత్రిపుర సుందరీ స్వరూపం. ఆ తల్లి పూజతో ద్వైత వృత్తులు తొలగి ఆత్మానందం కలుగుతుంది.
సర్వసిద్ధి ప్రదాత్రి- బాలాత్రిపుర సుందరి. మోక్ష స్వరూపిణి బాలాపరమేశ్వరి. మంత్రములన్నింటిలో మహిమాన్వితమైనది- బాలాత్రిపురసుందరీ మంత్రం. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొదటగా ‘బాలా’ మంత్రాన్ని ఉపదేశిస్తారు. శ్రీచక్రంలో మొదటి ఆవరణలో ఉండే దేవత బాలాత్రిపురసుందరి. ఇవన్నీ శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలో ‘‘్భండ సైన్య వధోద్యుక్త బాలావిక్రమ నందితా, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణే..’’ లో వ్యక్తమవుతాయి.
విశ్వంలోని సకలశక్తులు ఆమె నుంచే వస్తాయి. అందరి ఆలోచనలు భావాలు సంకల్ప వికల్పాలు తల్లికి తెలుసు. బాల అయినా, అందరి జీవనాల్ని సుఖమయం చేసే తల్లి. అందుకే వర్ణరూపంలో అనగా అక్షర రూపంలో బాలాత్రిపుర సుందరీ దేవిని ఉపనిషత్తులు కీర్తించాయి. కల్పనా లోకంలో నిర్వికల్పంగా విహరిస్తూ వెలుగులకు వెలుగైన అతీతశక్తి బాలాత్రిపురసుందరి. ఆమె ఎప్పుడూ చిన్నవయసులోనే ఉంటుంది. పరమాణు ప్రమాణంలో ఉన్నా, బ్రహ్మాండాన్ని అలుముకున్న చీకటిని, చిటికెలో తన చిత్కళతో పారద్రోలి, జ్ఞాన వెలుగును ప్రసాదించేది బాలాత్రిపుర సుందరి. కుమారస్వామి తారకాసుర సంహారం గావించాడు. తారకాసురుని కుమారులు- తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే త్రిపురాసురులు. వీరు తమ తండ్రి మరణానికి పరితపించి, బ్రహ్మను గూర్చి తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని కోరారు. అది సాధ్యపడదంటే, ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ విధంగా జరిగితే మరణించేటట్లుగా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. త్రిపురాసురులు మూడు పురములు కట్టుకొని, ఆకాశంలో తిరుగుతూ వేయి సంవత్సరములు జీవించిన పిమ్మట, ఆ మూడు పురములు ఒకే చోటికి చేరినపుడు, ఒకే బాణంతో ఆ పురాల్ని ఛేదించగలిగిన వాని చేతిలో మాత్రమే వారికి మరణం సంభవించేటట్లు వరం కోరుకున్నారు.
జగత్తత్త్వంలో రథాన్ని, వేద తత్త్వంలో గుఱ్ఱాల్ని, నాగతత్త్వంతో పగ్గాల్ని , మేరు శిఖర తత్త్వంతో ధనుస్సును, వాసుకి తత్త్వంతో వింటి నారిని, సోమ విష్ణు వాయు తత్త్వాలతో బాణాల్ని తయారుచేసి, బ్రహ్మ స్వయంగా సారధి అయ్యాడు. వాటి ప్రయోజనం సమకూరలేదు. పరమేశ్వరుడు అంతర్ముఖుడై పరతత్త్వాన్ని భావించాడు. త్రిపురములన్నీ ఒకే సరళ రేఖపై చేరాయి. ఒకే బాణంతో త్రిపురాలను ఛేదించాడు పరమేశ్వరుడు. చిరునవ్వుతో బాలాత్రిపుర సుందరి ధనుస్సునుంచి బయటకు వచ్చింది. నేటి ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలో బాలాత్రిపుర సుందరీదేవి శిలాకారంలో ప్రకాశిస్తూ భక్తుల పాలిటి పెన్నిధిగా ఉన్నది. అక్కడ గర్భగుడిగా చెప్పబడుతున్న దివ్య ప్రదేశమే, శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆవిర్భవించిన ‘చిదగ్నికుండము’. ‘చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా’- లలితా సహస్రనామం.
మహా సరస్వతీదేవి అంశయే- మహాకాళి. ఆ దేవిని బాలా బీజ మంత్రంతో ఉపాసన చేసి, సర్వవిద్యా పారంగతుడైన, వాక్సుద్ధిని పొంది, మహాకవి అయినవాడు మహాకవి కాళిదాసు. ఇది బాలాత్రిపుర సుందరీ మహత్మ్యం.
‘‘శ్యామకృష్ణ సోదరి శుక శ్యామల త్రిపుర సుందరి, ఈ మహిలో నీ సమాన దైవమెందుగాననే కామాక్షీ’’ అంటూ లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ జగన్మాతను కీర్తించాడు. త్రైలోక్య మోహనాది చక్రేశ్వరి, త్రైపద పరబ్రహ్మ మహిషి, భాస్వరి సాలోక్యాది ముక్తిప్రధానకరి, సదాశివకరి, గురు గుహోదయకరి మూలాది నవాధారేశ్వరి శుభకరి నీలాల కధరి, నిత్యానందకరి, లీలావిశ్వోత్పత్తి స్థితి లయకరి, బాలపరమేశ్వరి పంచదశాక్షరి అని, గానలోలే, బాలే పంచదశాక్షరి పాహిమాం అంటూ నాదాత్మకంగా నాగవరాళి రాగంలో అర్చించాడు- ముత్తుస్వామి దీక్షితులు.
దేవీ కటాక్ష సిద్ధిని లోక కల్యాణానికి ఉపకరించి, సర్వమానవ సౌభ్రాతృతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని ఉద్బోధిస్తుంది- శ్రీ బాలాత్రిపుర సుందరీ పూజ.

-పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464