మెయన్ ఫీచర్

ఇక.. పొత్తులే కాంగ్రెస్‌కు శరణ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముహూర్తం ప్రకటించడంతో రాజకీయ పార్టీలు పొత్తులపై దృష్టి సారించాయి. మిగతా పార్టీల కంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పలు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కాంగ్రెస్, భాజపాల మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుంది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.
2014 ఎన్నికల తర్వాత మసకబారిన కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ఈ ఎన్నికలు మంచి అవకాశం. దేశవ్యాప్తంగా బలోపేతమైన బీజేపీ కూటమిని ఢీ కొనాలంటే కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తులను ఖరారు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతంలో బలహీనంగా ఉంది. అక్కడ అనేక కారణాలతో ఆ పార్టీ ఓటు బ్యాంకు ముక్కలైంది, మొదటి నుంచి అండగా ఉండే దళితులు, గిరిజనులు, మైనార్టీలు దూరమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య దూకుడు పెంచినా, ఇంకా ఎక్కడో కొన్ని చోట్ల వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడుతున్నట్లు రాజకీయ విశే్లషకుల అంచనా. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో దళితులు ఎన్నికల ఫలితాలను శాసించే అవకాశం ఉంది. కానీ, ఈ వర్గాలను కాంగ్రెస్ దూరం చేసుకుంది. ఎక్కువ సీట్లను బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) గెల్చుకోలేకపోవచ్చు. కాని ప్రతి నియోజకవర్గంలో ఓట్లను గణనీయమైన సంఖ్యలో చీల్చే శక్తి బీఎస్పీకి ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో బీఎస్పీతో, ఎస్పీతో కూడా పొత్తు పెట్టుకుంటామని తొలుత కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీఎస్పీ తన అభ్యర్థిని రంగంలోకి దింపలేదు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బీజేపీని చిత్తుగా ఓడించారు.
కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీల నేతలందరూ హాజరై ఇదే ఐక్యతను ఇకముందు కూడా ప్రదర్శిస్తామన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఏకతాటికిపైకి వచ్చేందుకు సమయం పెద్దగా లేదు. కాంగ్రెస్ ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ వెనకాడుతున్నట్లు కనపడుతోంది. ఇది కాంగ్రెస్‌కు ఏ మాత్రం కలిసి వచ్చే అంశం కాదు. కాంగ్రెస్ ఒంటెత్తుపోకడలతో విసుగు చెందిన బీఎస్పీ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆధ్వర్యంలోని ‘్ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్’తో పొత్తు ఖరారు చేసుకుంది. ఇక్కడ 35 సీట్లలో బీఎస్పీ, 55 సీట్లలో అజిత్ జోగి పార్టీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది.
దళితులు మధ్యప్రదేశ్‌లో 15.2 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 11.6 శాతం, రాజస్థాన్‌లో 17.2 శాతం మంది ఉన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ సామాజిక వర్గం జనాభా ఇదే రీతిలో ఉంది. దీని వల్ల ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములను వీరు శాసిస్తారు. మధ్యప్రదేశ్‌లో 60 అసెంబ్లీ సీట్లలో దళిత ఓటర్ల ఆధిపత్యం ఎక్కువ. 2013 ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేసి 6.3 శాతం ఓట్లను తెచ్చుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి, ఓడిన కాంగ్రెస్ మధ్య ఎనిమిది శాతం ఓట్ల తేడా ఉంది.
బీఎస్పీ సత్తా ఏమిటో కాంగ్రెస్ ఇకనైనా తెలుసుకోవాలి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అంటే ప్రజల్లో ఎంతోకొంత వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో పొత్తుల ద్వారానే బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలన్న ఫార్ములాను కాంగ్రెస్ త్వరితగతిన అమలు చేయలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ కటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూసే ప్రసక్తిలేదని, రోజులు గడుస్తున్నా పిలుపులేదని, సొంతంగానే తాము పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేయడం గమనార్హం. ఉత్తర భారతంలోని దళిత వర్గాల్లో ఆమె తిరుగులేని నాయకురాలు. కొన్నిసార్లు సీట్లు రావచ్చు. చిత్తుగా ఓడిపోవచ్చు. అధికారం రావచ్చు. రాకపోవచ్చు. కాని భారతదేశ రాజకీయాల్లో దళిత ఓటర్ల శక్తి, సత్తా ఏంటో రుజువు చేసి చూపించిన ఘనత బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం, మాయావతికి దక్కుతుంది.
పార్టీల పేర్లు మాత్రమే తేడా అని.. నిజానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని మాయావతి నిర్మోహమాటంగా చెప్పారు. బీజేపీ వలే కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్రకులాలు, ఆ తర్వాత బీసీల హవా నడుస్తోంది. బీఎస్పీతో ఒకసారి పొత్తు పెట్టుకుని సీట్లు ఇస్తే భవిష్యత్తులో తమ పార్టీ పరిస్థితి యూపీలో మాదిరిగా తయారవుతుందని కాంగ్రెస్ పెద్దల భయం. అధికారానికి దూరమై విలవిలలాడుతున్న కాంగ్రెస్ నేతలు ఇపుడు త్యాగాలకు సిద్ధం కాక తప్పదు. ఈ రోజు ఉత్తరాదిన దళిత వర్గాల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా దళితుల సంక్షేమం కోసం పథకాలు అమలవుతుంటాయి. రాజ్యాధికారం కావాలంటే- బీఎస్పీ ఓటు బ్యాంకును చెల్లాచెదురుచేయాలి. ఏ పార్టీకీ తగిన మెజార్టీ రానప్పుడు బీఎస్పీ మద్దతు కీలకమవుతుంది. ఇదే మాయావతి ఫార్ములా. ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గీర్, చంపా, రాయగఢ్, బస్తర్ ప్రాంతాల్లో బీఎస్పీకి తగిన ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 4 శాతం ఓట్లు బీఎస్పీకి వచ్చాయి. రాజస్థాన్‌లో గత ఎన్నికల్లో మూడు శాతం ఓట్లతో రెండు సీట్లు బీఎస్పీకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో ఆరు శాతం ఓట్లతో నాలుగు సీట్లు వచ్చాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సాంఘిక అసమానతలు ఎక్కువ. సామాజిక ఆర్థిక, రాజకీయ రంగాల్లో కులాల మధ్య విభజన స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ‘ఓల్డ్ మైండ్‌సెట్’తో ఉండే నేతల ప్రభావం ఎక్కువ. వీరి వల్ల ఈ ఎన్నికల్లో పార్టీకి చివరి నిమిషంలో కీడు జరిగే అవకాశాలు ఎక్కువ. ఈ ఎన్నికల్లో తమ గెలుపు గ్యారంటీ అనే కొన్ని సర్వేలను చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు. కాని సర్వే ఫలితాలను పూర్తిగా నమ్ముకోవడం మంచిది కాదు. ప్రధానంగా బీసీ, దళిత ఓటర్లలో చైతన్యం వచ్చింది. రాజ్యాధికారమే లక్ష్యంగా తాము ఎందుకు పనిచేయరాదని దళిత యువత ప్రశ్నిస్తోంది. వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో కాంగ్రెస్, బీజేపీలు లేవు. బీజేపీ బీసీ వర్గాలకు చేరువైనా, ఆ పని ఇంకా కాంగ్రెస్ చేయలేకపోయింది. ఏ పార్టీ అయినా అధికారం లేకుండా ఎక్కువ కాలం బతకలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా కాంగ్రెస్ పార్టీకి ఊపు రావాలంటే, ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పొత్తుల విషయంలో ఆ పార్టీ సముచిత నిర్ణయం తీసుకోవాలి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మిగిలిన మూడు రాష్ట్రాలతో చూస్తే బలంగానే ఉంది. ఇక్కడ పొత్తులు పెట్టుకోవడం మంచిదే. మహాకూటమి ద్వారా కేసీఆర్‌ను గద్దె దించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సీట్ల కేటాయింపులు సరిగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ 90 సీట్ల కంటే తక్కువ సీట్లకు పోటీ చేస్తే ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మహాకూటమిలో చేరాలని టీడీపీ సహా మరో రెండు పార్టీలు ఉబలాటపడ్డాయి. ఇందులో టీడీపీకి మాత్రమే కాస్తోకూస్తో ఒక డజను స్థానాల్లో బలం ఉంది. మిగిలిన పార్టీల బలం నామమాత్రమే. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి క్యాడర్ చాలావరకూ టీఆర్‌ఎస్‌కు బదిలీ అయింది. ‘మహాకూటమి’లోని పార్టీల గొంతెమ్మ కోర్కెలకు తలొగ్గి ఎక్కువ సీట్లు ఇస్తే దెబ్బతింటామని కాంగ్రెస్ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఇదే జరిగితే, ఆ స్థానాలను టీఆర్‌ఎస్ తన్నుకుపోయే అవకాశాలు లేకపోలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పొత్తుకు సిద్ధమంటున్న బీఎస్పీతో మాట్లాడేందుకు వెనకాడుతున్న కాంగ్రెస్- తెలంగాణలో గెలిచేందుకు అవకాశాలున్నా అవసరానికి మించి పొత్తు పెట్టుకుని సీట్లను కేటాయిస్తే వ్యూహాత్మక తప్పిదమవుతుంది.
వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటేనే ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి గురించి మాట్లాడేందుకు అర్హత ఉంటుంది. పొత్తు పేరిట ఇష్టారాజ్యంగా సీట్లు కేటాయించడం కూడా బెడిసికొడుతుంది. చరిత్రలోకి వెళితే- కాంగ్రెస్‌ను ఓడించేందుకు 1982లో ఆవిర్భవించిన టీడీపీ ఈ రోజు ‘గాంధీభవన్’తో బంధం కోసం ఆరాటపడుతోంది. ఈ పొత్తును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అయితే ప్రజలు కరాఖండీగా తిరస్కరిస్తారు. కాని తెలంగాణ రాష్ట్రంలో ఈ పొత్తుపై ప్రజల్లో వ్యతిరేకత కనపడడం లేదు. ఇక్కడ కేసీఆర్ అనుకూల, వ్యతిరేక శక్తుల మధ్య పోటీ జరుగబోతోంది. దశాబ్దాల తరబడి పాము, ముంగిస వైరంలా నడిచిన కాంగ్రెస్, టీడీపీలు ఒకే కూటమి కిందకు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకత తెలంగాణలో ఇప్పటికైతే కనపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రధాని పదవిని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న రాహల్ గాంధీ పొత్తుల విషయమై ఉదార వైఖరితో ఉంటామని పదే పదే చెబుతున్నా ఆచరణలో అమలు చేయాలి. సర్వేలను నమ్ముకునో లేదా మైండ్‌సెట్ మారని నేతల మాటలు వినో పొత్తులపై తప్పటడుగు వేస్తే కాంగ్రెస్ తీవ్రమైన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097