మెయిన్ ఫీచర్

సత్యజ్ఞానానంద స్వరూపిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరుగుతున్న ప్రతి క్షణంలో, జీవిస్తున్న ప్రతి ప్రాణిలో, కదిలే ప్రతి కణంలో, ప్రసరించే ప్రతి కిరణంలో, తల్లి శక్తి వ్యక్తమవుతుంది. పాంచభౌతికమయిన మన శరీరమే జగన్మాత ఆలయం. ఈ విశాల కువలయం- జగదంబ ఆలయం- విశ్వమంతా ఆమె చైతన్యమే. అశాశ్వతమైన దేహభ్రాంతిని తొలగించుకొంటేనే ఆత్మతత్త్వం బోధపడుతుంది. ఆ ఆత్మతత్త్వమే శ్రీ లలితా పరమేశ్వరి.
శ్రీమాతలోని దేవీతత్త్వం, శ్రీమహావిష్ణువులోని దివ్యతత్త్వం రెండూ ఒకే తత్త్వానికి చెందినవే. అదే పరమతత్త్వం. ఆ పరమతత్త్వానికి రెండు రూపాలు మాత్రమే. సగుణ సాకారంగా, రెండూ వేరు వేరుగా కనపడినా నిరాకార నిరంజనంగా, చిన్మయ దృష్టితో తన్మరుూభావంతో తరచి తరచి భావన చేస్తే, రెండింటిలోనూ ఒకే ఆనందమయ బిందువు దర్శనమిస్తుంది. ఆ ఆనందమయ, పరమానందమయ బంధువే ‘శ్రీ లలితా పరమేశ్వరి’. ఆ దేవియే శ్రీలలితా త్రిపురసుందరి.
నిరాకారము, నిశ్చలము అయినది- శివతత్త్వం. శివుణ్ణి ఆశ్రయించి అనుసరించి ఉంటుంది ‘శక్తి’. ఇదే శివ శక్తిసామరస్యం. శివతత్త్వాన్ని నామరూపాత్మకంగా మార్చి దర్శింపజేస్తోంది అదిశక్తి. చరాచర విశ్వమంతా దాని విభూతి. కనుక, నామరూపాత్మకమది. చెప్పేది నామం, చెప్పబడేది రూపం. నామం- భావప్రపంచం అయితే, రూపం వస్తు ప్రపంచం. ఈ రెండింటి నడుమ నడిచేదంతా క్రియారూపం. నామ, రూప, క్రియలనే మూడూ ‘త్రిపురములు’. త్రిపురముల సృష్టికర్త్రి అయి, వాటిలో ఆనందమయంగా విహరించే మహోదాత్తశక్తి ‘లలితా త్రిపురసుందరి’.
శోభ, విలాసము, గాంభీర్యము, లాలిత్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, ఔదార్యము, సౌకుమార్యము- అన్నీ ఒక రాశిగా పోస్తే- లలితా పరమేశ్వరీ రూపం. భవ భయ బాధలను తొలగించి, భవాన్ని విభవంగా రూపుదిద్దగల మహాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి. అందుకే భక్తులు ఆ ‘శక్తి’ని అనే్వషిస్తూ వెడతారు. జగన్మాత అనుగ్రహాన్ని పొంది, కుండలినీయోగ శక్తితో యోగ సమాధిలో అమృతతత్త్వాన్ని పొందుతారు.
విశ్వప్రేమ- జగన్మాత తత్త్వం. దీనిని నిత్య జీవితంలో అమలుపరిస్తే, జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే విశ్వప్రేమ త్యాగానికి దోహదం చేస్తుంది. త్యాగబుద్ధి ఉన్నవాడికి అమృతమైన మనస్సు ఉంటుంది. మనస్సుకి అధిపతి చంద్రుడు. జ్యోతిషశాస్త్ర రీత్యా చంద్రుడంటే తల్లి, జగన్మాత. కనుక విశ్వప్రేమతో జగన్మాత, అనుగ్రహాన్ని పొందుతారు.
శ్రీలలితా పరమేశ్వరీ దేవికి సంబంధించిన విషయమలు బ్రహ్మాండ పురాణంలో, లలిత లలిత పదములతో వివరింపబడినాయి. అవి చిన్న కథలుగా చెప్పబడినాయి. కథల వెనుక దాగివున్న ఆధ్యాత్మికతను గంభీర భావాలను తెలిసికోవాలి. జగన్మాత ప్రాభవాన్ని, ప్రాదుర్భావాన్ని చెప్పి, హయగ్రీవుడు అగస్త్య మహర్షి కోరికపై లలితా నామాలను చెప్పాడు. అదే లలితా సహస్రం. అంతేకాదు, వాటిని రహస్య నామ సహస్రం అన్నాడు. దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో కూడా ‘రహస్య యోగిని, పరాపర రహస్య యోగిని..’ అని చెప్పబడింది. అంటే, ప్రతి ఒక్క నామాన్ని భక్తితో భావన చేస్తూ నామ సంకీర్తనం చేస్తే తల్లి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. రహస్యం తెలియకపోయినా, లలితాంబను ప్రతి పదంలో భావిస్తూ నామపారాయణ చేస్తే సంతుష్టురాలై మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది.
శాక్తేయ విద్యలలో శంకర పీఠాధిపతుల ఆదేశ అనుగ్రహముతో శ్రీ విద్యా సంప్రదాయం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. శ్రీచక్రము, శ్రీవిద్యా మంత్రములు శ్రీదేవీ స్వరూపాలే. శ్రీదేవీ మహాత్మ్యమును శబ్ద రూపంగా, శ్రీవిద్యామంత్రములు వెల్లడి చేస్తాయి. శ్రీవిద్య బ్రహ్మవిద్య. కనుక, శ్రీవిద్య మంత్రం, శ్రీచక్రం యంత్రం, శ్రీసహస్రం అంటే లలితా సహస్రనామం- మంత్రానికీ యంత్రానికి సంబంధించిన ‘తంత్రం’. శ్రీవిద్యలో అక్షరూపంగా వెలుగొందే శక్తి, శ్రీచక్రంలో రేఖాకారంగాను, శ్రీసహస్రంలో- సూక్ష్మరూపంగాను దర్శనమిస్తుంది. ఇదే లలితా పరమేశ్వరీ తత్త్వం. శ్రీవిద్య, శ్రీచక్ర అధ్యయన అర్చన సర్వులకు అంత సులభంకాదు. కానీ, సహస్ర నామాలను చదవడం, ఆ దివ్య నామాలతో శ్రీ లలితా పరమేశ్వరీ దేవిని ఆరాధించటం, అందరికీ సాధ్యం. అన్ని నామాలు ఆత్మతత్త్వ నామాలే. మనలోని పరతత్త్వాన్ని భావన చేసికొని జగన్మాతను సేవించటమే నామపారాయణ.
మన శరీరమే ఒక శ్రీచక్రం. శ్రీచక్రమునందు తొమ్మిది ఆవరణలు ఉంటాయి. ఈ తొమ్మిది ఆవరణలు, మన శరీరంలోని తొమ్మిది ద్వారాలకు సంకేతం. మానవ శరీరంలో షట్చక్ర సందర్శనంతో సకల దేవతలు ఒకే తత్త్వానికి చెందినవారని అర్థమవుతుంది. మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలిని మేల్కొలిపి, సహస్రారానికి చేరుస్తే, అమృతధారలు వర్షిస్తాయి. నశించే స్వభావం కల్గిన శరీరం నశించినా, నశించని అమృత తత్త్వాన్ని దర్శింపజేస్తుంది కుండలినీ యోగ శక్తి. అదే ‘ఆత్మవిద్య’. ఆత్మవిద్యను ప్రసాదించే మహోదాత్త శక్తి- శ్రీ లలితా త్రిపురసుందరి.
ఈ కుండలినీ యోగశక్తి ప్రభావానే్న, సద్గురు నాదయోగి శ్రీ త్యాగరాజస్వామి, తన ఘన రాగ పంచరత్న కీర్తనలలో వివరించాడు. శ్రీరామచంద్రుడు నీలమేఘ శ్యాముడు (నల్లనివాడు) కాని, త్యాగయ్య రాముణ్ణి చంద్రవర్ణునిగా అనగా తెల్లనివాడుగా కీర్తించాడు. ఇది సత్యమా? అసత్యమా? శ్రీరామచంద్రుడు కుండలినీయోగ శక్తివంతుడు. మూలాధారం నుంచి షట్చక్రాలను, గ్రంధిత్రయాన్ని అధిగమించి కుండలిని సహస్రారానికి చేరితే, చంద్రమండలమైన సహస్రారం నుండి అమృతధారలు వర్షిస్తాయి. అమృతం తెలుపు. కనుకనే, నీలమేఘశ్యాముడైన రాముడు, చంద్రవర్ణునిగా తెల్లగా దర్శనమిచ్చాడు త్యాగయ్యకు. ‘‘సుధాసారాభివర్షిణి, సహస్రారాంబుజా రూఢాయై నమః’’- అన్న లలితా సహస్ర నామములలో చెప్పబడిన విషయాల్ని ‘‘చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున చూచి బ్రహ్మానందమనుభవించువారెందరో మహానుభావులని’’ శ్రీరాగంలో కీర్తించాడు- త్యాగయ్య. ఇది శ్రీ లలితా పరమేశ్వరీ ఆరాధనకు ఉపాసనకు సంపూర్ణ స్ఫూర్తిదాయకం.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నామ విశేషాలను ఆరోగ్య విషయాలకు అన్వయించి, మన పూర్వీకులు పారాయణ చేసి, తీర్థం ఇచ్చి, ఆరోగ్యాన్ని ప్రసాదించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎముకలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు లలితా సహస్రనామ స్తోత్రంలో ‘‘మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా’’ అనే శ్లోకాన్ని మూలబీజ మంత్రంతో ‘‘ఓం ఐం హ్రీం శ్రీం అస్థి సంస్థితాయై నమః’’ అని ఉచ్ఛరిస్తూ తీర్థం యిస్తే, మంత్రాక్షర శక్తి ప్రభావంతో క్రమేపి ఎములకు సంబంధించిన వ్యాధులు నయమయ్యేవి. తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రస గంధములతో భాసిల్లే ‘సాకినీ’ దేవతగా పరిపూర్ణమైన పృధ్వీతత్త్వంతో, అన్నింటికీ మూలాధారయైన మూలాధార క్షేత్రంలో వసించే శ్రీ లలితా పరమేశ్వరీ శక్తియే ఆరోగ్యానిచ్చేది.
సాకినీ మాతకు పెసలతో కూడిన అన్నం (కిచిడి) నివేదన చేస్తారు. ఎముకల సంబంధమైన వ్యాధిగ్రస్తులకు వైద్యులు నానబెట్టిన మొలకలెత్తిన పెసలతో కూడిన ఆహారాన్ని ఇమ్మంటారు. ‘‘ముద్గౌదనా సక్త చిత్తా సాకి న్యంబా స్వరూపిణీ’’ అన్న నామరహస్యం ఇదే. భక్తి వెదకి చూస్తే, తరచి తరచి ఉపాసిస్తే, యిలాంటి అనేక మర్మములు, విశేషాలు, విజ్ఞాన ఆరోగ్య సూత్రాలు దర్శించవచ్చు. శ్రీసహస్రం- శ్రీమాత శ్రీలలితా త్రిపురసుందరి మనకిచ్చిన రక్ష.
నీరు, నేలను పవిత్రం చేస్తే, నీటితో పవిత్రమైన నేల, తనపైనున్న ప్రాణికోటిని పవిత్రం చేస్తుంది. అటువంటి జలములందు ఈక్షణ గలది అనగా వాటిని చూస్తూ పోషించేది, వాటి స్వరూపమే అయినది- శ్రీ లలితా పరమేశ్వరి. పుష్కరోత్సవం సంవత్సరానికి ఒక మారు వస్తుంది. గురుగ్రహం ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు, ఒక్కో నదికి పుష్కరం ఏర్పడుతుంది. ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించటానికి ఒక సంవత్సరం పడుతుంది. ఉదాహరణకు, కన్యారాశిలో గురుడు ప్రవేశించినపుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి, మరలా కృష్ణానదికి పుష్కరములు రావాలంటే పనె్నండు సంవత్సరాలు పడుతుంది. ఎందుకని? గురుడు ఒక్కో రాశిలో ఒక సంవత్సరం ఉండి, తిరిగి కన్యారాశిలో ప్రవేశించటానికి 12 సంవత్సరాలు పడుతుంది. ‘పుష్కర’ శబ్దానికి ‘పోషయతీతి పుష్కరమ్’- ఎల్లప్పుడూ పోషిస్తూ లోకానికి జీవనభూతమైనవి. అవి ఏవి? జలములు కనుక జలమునకు పుష్కరమని పేరు. పుష్కం (పోషణ) రాతీతి (అదత్తేఇతి) పుష్కరమ్- అనగా పోషణ ఇచ్చునది. పుష్కరోత్సవం అంటే, జలములందు ఉత్సవం. లలితా సహస్రనామంలో ‘పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా’ అనే నామాలున్నాయి. దీనిని బట్టి పుష్కరోత్సవం అంటే శ్రీలలితా దేవి ఆరాధనయే.
జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో, ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. ఈ మానవ శరీరాన్ని ఈ జన్మకు ప్రసాదించిన జగన్మాతను స్మరిస్తూ ఈ ఉపాధి అనగా శరీరం ఉండగానే ఇందులో దాగివున్న ఆనంద బిందువును భక్తిశ్రద్ధలతో దర్శించాలి. ‘నీవార శూక వత్తాన్వీ పీతాభాస్వత్యణూపమా’ అన్నది మంత్రపుష్పం. దానికి శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, శ్రీ సహస్రనామ పారాయణ మార్గం చూపిస్తాయి, ముఖ్యంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ.
శ్రీమాత అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వాగ్గేయకార త్రిమూర్తులలో మధ్యముడు- ముత్తుస్వామి దీక్షితులు. సంగీత త్రిమూర్తులు ఒకే ఊరులో జన్మించటం విశేషం. ఆ ఊరే తిరువారూరు- శ్రీపురము. ఈ గ్రామంలో వేంచేసిన తల్లి, కమలాంబిక, స్వామి-శ్రీత్యాగరాజస్వామి. శ్రీపురమంటే శ్రీచక్రమే. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది ఆవరణలకు, తొమ్మిది కీర్తనలను మనకందించి, భావితరంవారిని తరింపజేసిన ముత్తుస్వామి దీక్షితులు- అనవరత స్మరణీయుడు. కమలాంబిక అంటే శ్రీలలితా త్రిపుర సుందరీదేవి. శ్రీచక్రమే ఆమె నిలయం. కాశీలో హనుమాన్ ఘాట్‌లో శ్రీచక్రేశ్వరీ శివలింగాన్ని, ముత్తుస్వామి దీక్షితులవారు ప్రతిష్ఠించారు. నేటికీ ఎంతోమంది దర్శించి, నవావరణ కీర్తనలు దీక్షితులవారి విగ్రహం ముందు కూర్చుని గానం చేస్తారు. లలితా సహస్రనామం పారాయణ చేసి ఆత్మానందాన్ని పొందుతారు. ‘లలిత’రాగంలో ‘‘ననుబ్రోవు లలిత వేగమే చాల నిన్ను నెఱ నమ్మియున్నవాడగదమ్మ భక్తకల్పకలతా’’ అని కీర్తించాడు లయబ్రహ్మ, కామాక్షీ వరప్రసాది శ్యామశాస్ర్తీ. ఇది శ్రీ లలితాపూజకు పూర్తి స్ఫూర్తి.
మనిషి తనలోని భండాసుర ప్రవృత్తిని అణచుకొని, శ్రీలలితా పరమేశ్వరీ ఆరాధనతో ప్రాప్తించిన ‘శక్తి’ని విశ్వకల్యాణానికి వినియోగించాలని చెప్తోంది- శ్రీలలితా దేవి పూజ.

-పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464