మెయన్ ఫీచర్

రాహుల్ ‘కూటమి’కి పురిట్లోనే సంధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఫలించేలా కన్పించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో విపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసి ఇటీవలి ఉపఎన్నికలలో విజయం సాధిం చడంతో అంతా కలిస్తే ఇక మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేననే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఉమ్మడిగా మోదీని ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు పిలుపు ఇస్తున్నా, ఆచరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో ఇదు రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను రాబోయే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్స్ గా భావిస్తున్న తరుణంలో- ఈ రాష్ట్రాలలో విపక్షాలది తలోదారిగా మారింది. దీంతో ఈ పార్టీలు ఏ విధంగా కలుస్తాయనే ప్రశ్న తలెత్తుతున్నది. భాజపాను ఓడించేందుకే ‘మహాకుటమి’ ఆలోచనలు సాగుతు న్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేస్తున్నారు. ‘మహాకూటమి ఓ విఫలైమన ఆలోచన. ఇందులోని పార్టీలు పరస్పరం పోరాటం చేస్తూ ఉంటాయ. ప్రభు త్వం ఏర్పాటు చేయాల్సి వస్తే ఒకే దగ్గరకు చేరతాయ. కర్ణాటకలో అదే చూశాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ అదే చేయాలని ప్రయత్నిస్తున్నారు’-అని ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరక సొంతంగా పోటీ చేస్తున్న బిఎస్పీ అధినేత్రి మాయావతి భవిష్యత్‌లో కూడా ఇదే వైఖరి అవలంబిస్తారని సంకేతం ఇచ్చారు.
కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండదని మాయావతి, సీపీఎం తేల్చి చెప్పాయి. ఉత్తరాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా పోటీ చేస్తున్నామని గతవారం ప్రకటించిన మాయావతి ఇప్పుడు 2019 ఎన్నికలలోనూ పొత్తు ఉండక పోవచ్చని చెబుతున్నారు. ‘‘మాకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తే పొత్తు పెట్టుకుంటాం. లేని పక్షంలో సొంతంగా పోటీ చేస్తాం’’ అంటూ, తాము అడిగిన సీట్లు ఇస్తేనే పొత్తు అని ఆమె ఏకపక్షంగా ప్రకటనలు చేయడం కాంగ్రెస్‌కు ఇరకాటంగా మారింది. బిజెపి, కాంగ్రెస్ కలసి బీఎస్పీని బలహీనం చేస్తున్నాయని మండిపడటం ద్వారా కాంగ్రెస్‌తో చేతులు కలిపే ఉద్దేశం లేదన్నట్లు మాయావతి స్పష్టం చేసారు. భాజపా, కాంగ్రెస్‌లు ఉన్నతవర్గాల కోసమే పని చేస్తాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిమ్నకులాలపై దాడులు జరుగుతున్నాయని పెరిగిపోతున్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు చేసారు.
మాయావతి ధోరణి చూస్తుంటే భాజపాను ఎదిరించడంపై కన్నా, తాను అడిగిన సీట్లు ఇవ్వని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇదే సమయంలో దిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో సిపిఎం కుడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం జాతీయ మహాసభల్లో కాంగ్రెస్‌తో ముందస్తు పొత్తులు పెట్టుకోరాదన్న నిర్ణయానికి కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది. ఎన్నికల అనంతర పొత్తులపై అప్పటి పరిస్థితుల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సీపీఎం భావిస్తోంది. 2004లో యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం బయటి నుంచి మద్దతు ఇచ్చింది. అదే తరహాలో ఎన్నికల తర్వాత రాజకీయ మార్పులను బట్టి చర్యలు తీసుకోవాలని సీపీఎం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంలలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై కాంగ్రెస్ రెండుగా చీలిన్నట్లు కనిపిస్తున్నది. రాహుల్ గాంధీ మమతా బెనర్జీతో పొత్తు పట్ల ఆసక్తి వ్యక్తం చేస్తున్నా ఆమె మాత్రం ఎటువంటి సానుకూల సంకేతం ఇవ్వడం లేదు.
రాహుల్‌ను తన మిత్రుడిగా పేర్కొన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మధ్యప్రదేశ్ లో సొంతంగా అభ్యర్ధులను నిలబెట్టి, వారికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ- బిఎస్పీ కూటమిలో కాంగ్రెస్ కు స్థానం లభిస్తుందా? అనే అనుమానాలున్నాయి. బిహార్ సీఎం నితీశ్ కుమార్ తిరిగి బిజెపితో చేతులు కలపడాన్ని విభేదించి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాన్ని, రాజ్యసభ సభ్యత్వాన్ని కుడా పోగొట్టుకున్న శరద్ యాదవ్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం ఒక విధంగా ఆర్‌జేడి, కాంగ్రెస్‌లతో కూడిన ‘మహాకుటమి’ ప్రాధాన్యతను తగ్గించడమే! కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు ప్రస్తుతం బిజెపితో ఉన్న కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాను కూడా కూటమిలోకి తీసుకొచ్చేందుకు శరద్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే భాజపా వ్యతిరేక ఓట్లలో చీలిక తప్పదని, పరోక్షంగా భాజపాకే లాభం కలు గుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్ నుండి వలస కార్మికులు భయంతో సొంత రాష్ట్రాలకు వెళుతుండడంతో అక్కడి బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. వలస కార్మికులు వెళ్లిపోవడానికి కాంగ్రెస్ ఎమ్యెల్యే అల్పేష్ ఠాకూర్ కారణమనే విమర్శలు చెలరేగడంతో కాంగ్రెస్ నోట మాట రావడం లేదు. బీజేపీ మత ఉద్రిక్తతలు, గందరగోళాన్ని సృష్టిస్తోందని, ఉత్తరాది ప్రజలు కూడా భారతీయులే అంటూ విమర్శలు కురిపించిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డాయి. గుజరాత్‌లో దాడులకు పురి గొల్పింది తమ ఎమ్యెల్యే అల్పేష్ ఠాకూర్ అని స్పష్టం కావడంతో ఆ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలలో ఉండ గలదని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అల్పేష్ మాత్రం గుజఠాత్ నుంచి వలస కార్మికులు పారిపోవడం లేదని, ఛట్‌పూజ కోసమే వెళతున్నారని పేర్కొనడం ద్వారా ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. అల్పేష్ నాయకత్వంలోని ఠాకూర్ సేన దాడులకు నేతృత్వం వహిస్తోంది. గుజరాతీయుల ఉద్యో గావకాశాలను కొల్లగొడుతున్న ఇతర రాష్ట్రాల వారు వెనక్కి వెళ్లి పోవాలని రెచ్చగొట్టే విధంగా ఠాకూర్ చేసిన ప్రసంగాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక, మహారాష్టల్రో తాము ఉమ్మడిగా పోటీ చేయని పక్షంలో తమ ఉనికికి ఇబ్బందికరం కాగలదని ఒక వంక కాంగ్రెస్, మరోవంక ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ గ్రహించారు. అందుకనే లోక్‌సభ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించారు. లేనిపక్షంలో భాజపా విజయం సాధిస్తుందని భయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని నిరూ పించుకునేందుకు పవార్ అనుసరిస్తున్న ఎత్తుగడలు కాంగ్రెస్‌కు చికాకు కలిగిస్తున్నాయి. మొదటగా ఒక ఇంటర్వ్యూలో రాఫెల్ ఒప్పందంలో ప్రధాని మోదీ తప్పేమీ లేదని చెప్పడం ద్వారా, ఈ ఒప్పందం కేంద్ర బిందువుగా ఎన్నికల ప్రచారం జరపాలని ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌కు పవార్ పెద్ద షాక్ ఇచ్చారు. తర్వాత తాను ఆ విధంగా మాట్లాడ లేదని ఎన్ని వివరణలను పవార్ ఇచ్చుకున్నా జరగవలసిన నష్టం జరిగి పోయింది. పవార్ వంటి రాటుదేలిన నేత అటువంటి సున్నితమైన అంశంపై మాట జారే అవకాశం ఉండదు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన అలా అని ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోదీతో ఆయనకు గల సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసినవే. మరోవంక రాజ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితిని సైతం తమ కూటమిలో భాగస్వామిగా చేర్చుకోవాలని పవార్ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నవి. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
మహారాష్టక్రు ఇతర రాష్ట్రాల నుండి ముఖ్యంగా బిహార్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగులు, కార్మికుల పట్ల వ్యతిరేక ధోరణులను ఉద్దవ్ థాకరే అనుసరిస్తూ ఉండటం తెలిసిందే. ఇతరులు వచ్చి మహారాష్ట్రీయులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఆయన పలుసార్లు ఆందోళనలు జరిపారు. అటువంటి నేతతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యా సదృశం కాగలదని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. కానీ భాజపా వ్యతిరేక వోటర్లలో చీలికను నివారించడానికి ఇది అవసరమని పవార్ పట్టుబడుతున్నారు.
ఇక, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మహాకూటమి ఏర్పాటులో కాంగ్రెస్ విజయం సాధించినా సీట్ల సర్దుబాటు అంత తేలికగా జరిగే అవకాశం లేదు. క్షేత్ర స్థాయిలో అంతగా బలం లేని తెలంగాణ జన సమితి నేత కోదండరామ్‌కు ఇస్తున్న ప్రాధాన్యత కాంగ్రెస్ వర్గాలకే నచ్చడం లేదు. తమను తక్కువ చేసి చూపడం పట్ల ఆగ్రహం చెందుతున్న కోదండరామ్ సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమిలో సీపీఐ చేరినా, చెప్పుకోదగిన బలం ఉన్న సిపిఎం చేరనే లేదు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు నేత అజిత్ జోగితో చేతులు కలిపి, ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మాయావతి ప్రకటించడంతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న భాజపాను గద్దె దింపే అవకాశాన్ని ఎక్కడ పోగొట్టుకోవలసి వస్తుందో అని కాంగ్రెస్ కలవరం చెందుతున్నది. కాంగ్రెస్ తాను బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీలకు ఉదారంగా సీట్లు ఇవ్వడానికి ఇష్ట పడటం లేదు. తమకు బలం లేని చోట్ల ఇతర పార్టీలు కూడా అటువంటి ధోరణినే అనుసరిస్తూ ఉండడంతో ఇరకాటంలో పడుతున్నది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఘడియకో గండంతో రోజులు లెక్కబెట్టుకొంటూ వస్తున్నది. ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని దేవగౌడ రిమోట్ కంట్రోల్‌తో ఇంటి నుండి నడపటం, అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉండటం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. కాంగ్రెస్‌లోని విబేధాలను సానుకూలంగా మార్చుకొని, వారి మాటలను లెక్కచేయకుండా జెడిఎస్ రాజ్యం చేస్తున్నది. అవసరమైతే భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని నిలబెట్టుకొంటామని సంకేతాలు ఇస్తూ కాంగ్రెస్ వారిని మాట్లాడకుండా చేస్తున్నారు. తమి ళనాడులో ఇప్పటి వరకు డిఎంకెతో తమ బంధం గట్టిగానే ఉన్నా ఎన్నికలు దగ్గర పడే సరికి ఆ పార్టీ ఎక్కడ బిజెపి వైపు దృష్టి సారిస్తుందో అని కాంగ్రెస్ కలవరం చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుతో కొత్తగా ఏర్పడిన బాంధవ్యం పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఒడిశాలో భాపా అనూహ్యంగా బలం పుంజుకోవడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గవలసి వస్తున్నది. ప్రధాని పదవిపై తమ ఆశలను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్న మాయావతి, మమతా బెనర్జీ వంటి నాయకులు ముందుగా కాంగ్రెస్ కోలుకోకుండా చేయడం ద్వారా- రాహుల్ గాంధీ బలమైన నేతగా ఎదగ కుండా చేయాలని దృష్టి సారిస్తున్నారు. ఈ ధోరణి ‘మహాకుటమి’ కోసం రాహుల్ చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే కూలిపో యేందుకు కారణ మవుతోంది.

-చలసాని నరేంద్ర