మెయిన్ ఫీచర్

అఖిల భువన సాక్షి అన్నపూర్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అగ్నేనయ సుపధారాయే అస్మాన్’’ వేదకాలంనుండి అనాదిగా, అగ్నిదేవుడు ఉష్ణశక్తికి ప్రతీకగా ఆరాధింపబడుతున్నాడు. అగ్నిదేవుణ్ణి, విశ్వశక్తిని తెలిసికొనే ‘సుపధ’ అంటే మంచి మార్గాన్ని తెలుపవలసిందిగా ప్రార్థన చేశారు. పదార్థము, శక్తీ అన్న రెండూ సృష్టికి మూలకారణం. సృష్టి స్థితిక్రమంలో మరణానంతరం, జీవుడు తన కర్మ జ్ఞానాలను బట్టి అనుసరించే రెండు మార్గాలు- దేవయానం, పితృయానం. అవే వెలుగు చీకటి మార్గాలు. ఉత్తరాయణం, దక్షిణాయనం; పగలు -రాత్రి. కాలంతో సహా, అన్నీ పదార్థ శక్తుల ఫలాలే. మరణానంతరం చంద్రలోకానికి పోయిన జీవుడు, తన కర్మ జ్ఞానములను బట్టి, అవి తీరిపోయేవరకు అక్కడే ఉండి, మిగిలిన పూర్వకర్మతో- వర్షధారలు చంద్ర కిరణముల ద్వారా పంట పొలములందలి సస్యములలో ప్రవేశిస్తారు.
అన్నరూపంగా జీవులలో ప్రవేశించి, స్ర్తి పురుషులలో, శుక్ల శోణితములుగా మారి జీవోత్పత్తి జరుగుతుంది. కనుక ‘అన్నం’ నుండే రేతస్సు కలుగుతుంది. దానినుండి ఈ ప్రాణిజాలమంతా జన్మ ఎత్తుతోంది. కనుక, జీవుల జీవాల్ని నియమం చేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత- అన్నపూర్ణాదేవి. తైత్తిరీయ ఆరణ్యకం, ప్రశ్నోపనిషత్, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు ఈ విషయాల్ని అందజేసినాయి.
‘తస్మాద్యా ఏతస్మాదాత్మన ఆకాశస్సంభూతః
ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృధివీ, పృధివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నమ్ అన్నాత్పురుషః సవా ఏష పురుషోన్న రసమయః’’- పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశమునుండి వాయువు వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము, అన్నము నుండి పురుషులు అనగా జీవులు పుడుతున్నారు. జీవులంతా అన్నంతో పుట్టి జీవిస్తున్నారు. ఓషధుల ద్వారా పంటలు, తద్వారా మంచి అన్నము ఏర్పడుతోంది. మంచి వర్షము మేఘము ద్వారా కల్గుతోందని, మేఘము యజ్ఞ్ధూమము చేత కల్గుతోందని, యజ్ఞములు వైదిక కర్మల వలన, వైదిక కర్మలు వేదములవలన కలుగుతున్నాయని, ఆ వేదమాత ‘అన్నశక్తి’ స్వరూపంగా అన్నపూర్ణాదేవిగా పూర్ణ స్వరూపంతో వెలుగొందుచున్నదని, వేదములు, ఉపనిషత్తులు, ఆనందవల్లి తెల్పుతున్నాయి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు- సృష్టి స్థితి లయ కారకులని తెలిసిన విషయం. జీవులు అన్నం నుండి పుట్టటం, అన్నంవలన జీవించటం, అన్నంలోనే లయమవటం చేత, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు- త్రిమూర్తులకు మూలశక్తి- ఆది పరాశక్తి. ఈ విధంగా, అన్నపూర్ణాదేవి, మహాశక్తి స్వరూపిణిగా చెప్పబడింది.
ఎవరి గృహంలో అన్నమును అందరూ తింటారో, ఎవరు ఇతరులకు తనకున్నదాంట్లో కొంచెం అన్నదానం చేస్తారో- వారి పాపాలన్నీ దగ్ధమైపోతాయి. వారి ఇంట్లో సుఖశాంతులు వెలసి, గృహం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఆరోగ్యంగా భాసిల్లుతుంది. వీటిని ప్రసాదించే జగన్మాత అన్నపూర్ణాదేవి. ఇది అధర్వవేదం చెపుతున్న విషయం.
ప్రకృతి స్వరూపం-ఋతువులు. ‘శక్తి’ స్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసి, సద్భుద్ధి భిక్షనొసగి, జ్ఞానపుష్టివంతులుగా నొనర్చు కరుణామయి అన్నపూర్ణాదేవి.
ప్రాణికోటికి ప్రాణశక్తిప్రదాయిని అన్నపూర్ణాదేవి. మానవుని ఇంద్రియాలన్నీ బహిర్ముఖంగా ఉంటాయి. కనుక అతని దృష్టి సహజంగా బహిర్ముఖంగా ఉంటుంది. జగన్మాత ఆత్మస్వరూపిణి. సాధనతో దృష్టిని అంతర్ముఖం చేస్తే, ధ్యానయోగం సిద్ధిస్తుంది. అపుడు శక్తి సహస్రారాంతర్గత చంద్రమండలం చేరగానే ఆనందామృత వర్షిణి, అమృతధారలను వర్షింపజేస్తుంది. ఆ తురీయావస్థలో ఆకలిదప్పులు ఉండవు. చిన్మయంతో చిద్రూపిణి చిచ్ఛక్తిరూపం దర్శనమవుతుంది. ఆ పరంజ్యోతి స్వరూపమే అన్నపూర్ణాదేవి.
అయితే, ఇవన్నీ సామాన్యునికి సాధ్యమా? సాధ్యంకాని విషయాల్ని చెప్పి ప్రయోజనం ఏమిటి? అనేప్రశ్నలు ఉదయించక మానవు. ఎందుకు ఆ విషయాల్ని ప్రస్తావన చేస్తున్నామంటే, మన మహర్షులు అటువంటి యోగసిద్ధులని, భారతీయ విజ్ఞాన సంపదను భావితరంవారికి తెలియజేస్తూ, వారు మనకందించిన మంచి విషయాల్ని తెలిసికొని వాటిని ఆచరించి మన జీవితాల్ని సార్థకత నొందించుకోవటానికి చెప్పటం జరిగింది. ఇది కూడా అన్నపూర్ణాదేవి ఆరాధన, ఉపాసనే.
స్థూలంగా సేవిస్తే సాకారంలోను, సూక్ష్మంగా భావించి ధ్యానించి ఆరాధిస్తే నిరాకారంగాను సాక్షాత్కరిస్తుంది అన్నపూర్ణాదేవి. ధ్యాన ఆవాహనా అర్ఘ్య పాద్య ధూప దీప నైవేద్యాది షోడసోపచారములకూ ఆనందపడుతుంది తల్లి. దహరాకాశంలో రస స్వరూపిణిగా ధ్యానం చేసే మానసిక పూజకు దరహాసం చిందిస్తుంది. ఎవరు ఎలా చింతించి, స్మరిస్తే వారికి ఆ విధంగా సాక్షాత్కరిస్తుంది అన్నపూర్ణాదేవి.
నీటిలో ‘వెలుగు’ ఉంది, నీటిలోనే ‘రసం’ ఉంది. ‘రసోవైసహ’ అన్నది శ్రుతి. అమృతము కూడా జలములలోనే ఉంది. బ్రహ్మ పదార్థముంది. ఉదకములకు మూలమైన అగ్ని, వెలుగునిస్తుంది. వెలుగులకు వెలుగయి నెలవులకు నెలవైన పరంజ్యోతి- అన్నపూర్ణాదేవి.
మరో జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందించే మోక్షప్రదాయిని, జ్ఞానజ్యోతి- అన్నపూర్ణాదేవి.
‘‘అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః’’ అని అన్నశక్తిని, అన్నాన్ని పొందే విధానాన్ని గీతాచార్యుడు భగవద్గీతలో బోధించాడు. ఇది అన్నపూర్ణ తత్త్వాన్ని తెలియజేస్తుంది.
‘‘నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ, నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ, ప్రాలేయాచల వంశపావనకరి’’ అని సంబోధించి, ‘‘్భక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’- కాశీ పట్టణానికి అధీశ్వరివి, భక్తులను దయతో ఉద్ధరించే దానివి, తల్లీ నాకు జ్ఞానభిక్షను ప్రసాదించమని అన్నపూర్ణాదేవిని ‘‘అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతీ’’ అని అన్నపూర్ణామాతను వేడుకొన్నారు, ఆదిశంకరాచార్యులు.
‘‘శబ్దాత్మికే శశికళాభరణార్థదేహే శంభోరుర స్థ్యల నికేతన నిత్యవాసే, దారిద్య్ర దుఃఖ భయహారిణి..’’ నాదరూపమైన శబ్దమే స్థూల శరీరముగా గలది, చంద్రకళ ఆభరణముగాగల అర్థరూపుడైన దేవుని అర్థాంగి, సర్వలోకాత్ముడైన శంభుమూర్తి వక్షస్థలమే అనగా అంతర్గత సూర్యమండలమే నిత్య నివాసముగా స్ఫురించు తేజోరూపిణి, దారిద్య్రమును దానివలన కలుగు దుఃఖమును దానికి ముందు వెనుక కన్పట్టు భయమున పారద్రోలు అమృతవర్షిణి ‘‘అన్నపూర్ణాదేవి’’ అని స్తుతించారు, శంకర భగవత్పాదులు. ఇది అన్నపూర్ణాదేవి తత్త్వాన్ని తెలియజేస్తుంది.
‘యజ్ఞకృత్ యజ్ఞ గుహ్యమన్న మన్నాద ఏవచ- విష్ణు సహస్రనామ’- సకాలల వర్షములకు, అన్నసమృద్ధికి, సర్వజన ఆరోగ్య భాగ్యాన్ని కాంక్షిస్తూ యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తారు. సృష్టిలయములనే విశిష్టములైన యజ్ఞాలు నిర్వహించే స్వామి యజ్ఞకృత్. యజ్ఞ్ఫలాన్ని ప్రసాదించే స్వామి యజ్ఞాంతకృత్. యజ్ఞములలోకెల్ల జ్ఞానయజ్ఞ స్వరూపుడు స్వామి. యజ్ఞంలోని పరమార్థమైన పరబ్రహ్మ తత్త్వం తానేయైన స్వామి యజ్ఞగుహ్యుడు. సకల భూతరాశికి ఆహారము తానే అయిన పరమాత్మ - అన్నస్వరూపుడు. ప్రాణికోటి రూపంతో ఆహారాన్ని స్వీకరించేది కూడా ఆ పరమాత్మే. అన్నము తానే, ఆహారాన్ని స్వీకరించేది ప్రాణికోటి రూపంలో ఆయనే. రెండూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మలోని మహాశక్తి అన్నపూర్ణాదేవి. ‘‘అహమన్నం అహమన్నం అహమన్నం అహమన్నమ్ అహమన్నాదోహమన్నాదః’’ అని తైత్తిరీయక శ్రుతి, భృగువల్లి’’ గూర్చి వివరించింది.
వాగ్గేయకారత్రయమైన శ్యామశాస్ర్తీ, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వాములలో, ముత్తుస్వామి దీక్షితులు- అన్నపూర్ణాదేవిని ఆరాధించి జ్ఞాన వైరాగ్యసిద్ధిని పొందిన నాదయోగి. ఆయన, ఐదవ ఏటనే చిదంబరనాధ యోగీంద్రులవారి వెంట కాశీ క్షేత్రానికి వెళ్లారు. రోజూ గంగాస్నానం, శ్రీ విశ్వనాధుని దర్శనం, అభిషేకం శ్రీవిద్యోపదేశముగా శ్రీ చక్రార్చన, జగన్మాత ఆరాధన దీక్షితుల దినచర్య. ఒకనాడు చిదంబర నాధయోగీంద్రులు, దీక్షితులవారిని అన్నపూర్ణాదేవి ఆలయానికి స్వయంగా తీసికొని వెళ్లారు. ‘‘నీపై జగన్మాతకు పరిపూర్ణమైన అనుగ్రహము కలిగినది. నిన్ను జగన్మాత ఎల్లవేళలా కాపాడుతుంది. అంత్యమున మోక్షాన్నిస్తుంది. ఎక్కడ ఉన్నా అన్నపూర్ణాదేవిని ఆరాధించు’’ అని ఉపదేశించారు. మరునాడు ప్రాతఃకాలమున గంగానదిలో స్నానం చేస్తుండగా ఆయనకు ఒక వీణ కాలికి తగిలింది. దానిమీద దేవనాగరి లిపిలో ‘రామ’ అని వ్రాసి ఉంది, యాలి పైకి తిరిగి ఉంది. చిదంబరనాధ యోగీంద్రులవారు, ‘‘ఇది నీకు అన్నపూర్ణాదేవి అనుగ్రహించిన ప్రసాదం. నీవు గొప్ప వాగ్గేయకారుడివి అవుతావు’’ అని దీవించారు.
ఆ వీణపై మ్రోగిస్తూ అప్పటికప్పుడు దీక్షితులు ‘‘అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువనసాక్షి, కటాక్షి; ఉన్నత గర్తా తేర విహారిణి ఓంకారిణి దురితాపన్నివారిణి, పన్నగాభరణరాజ్ఞి, పురాణి పరమేశ్వరి విశే్వశ్వరి భాస్వరి; పాయసాన్న పూరిత మాణిక్యపాత్ర హేమ దర్వీ విధృత కరే కాయజాది రక్షణ నిపుణ తరే, కాంచన మయ భూషణాంబర ధరే..’’ మాణిక్యమయమైన పాత్రలో ప్రీతికరమైన పాయసమును, బంగారు గరిటెతో ప్రసాదిస్తూ, మోక్షాన్ని అనుగ్రహించే జగన్మాత అన్నపూర్ణాదేవి అని, కర్ణాటక దేవ గాంధారి రాగంలో (ప్రస్తుతం సామరాగంలో గానం చేస్తున్నారు) ఆర్ద్రతతో గానం చేశాడు. శ్రీదేవీ శరన్నవరాత్రి పూజలో, అన్నపూర్ణాదేవి ఆరాధన రోజున అమ్మ భక్తుడైన ముత్తుస్వామి దీక్షితుల్ని ఆయన కీర్తనల్ని తప్పనిసరిగా మననం చేసికోవాలి.
ముత్తుస్వామి దీక్షితులు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణాపథానికి వచ్చేశాడు. నరకచతుర్దశి రోజున, అన్నపూర్ణాదేవి దివ్య తేజోరూపంగా దర్శనమిచ్చిందాయనకు. నవావరణ పూజ ముగించి భాషాంగరాగమైన హనుమత్తోడి జన్యము నిషాదాంత్యమన పున్నాగవరాళి రాగంలో ‘‘ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదా పూర్ణే, సువర్ణే మాంపాహి పంచాశద్వర్ణే మాంపాహి, పంచాశద్వర్ణే శ్రీయం దేహి, రక్తవర్ణే అపర్ణే కాశీక్షేత్ర నివాసిని కమలలోచన విశాలిని, విశే్వశ మనోల్లాసిని జగదీశ గురు గుహపాలిని, విద్రుమపాశిని, పున్నాగవరాళి ప్రకాశిని, భక్తవిశ్వాసిని, చిదానంద విలాసిని అని కీర్తిస్తూ అన్నపూర్ణాదేవి కటాక్ష సిద్ధినొంది, ఆ దివ్య తేజస్సులో లీనమైనాడు ముత్తుస్వామి దీక్షితులు. ఈరోజుకి కాశీలో హనుమాన్ ఘాట్‌లో శ్రీ చక్రేశ్వర శివాలయంలో, దీక్షితులవారి విగ్రహం దర్శించవచ్చు. జగన్మాతతోపాటు తల్లి భక్తుల్ని తలుచుకోవడం ఈ రోజున అంతే ముఖ్యం.
‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే’’- అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండి వచ్చింది. అయినా ఆ శక్తి యింకా పూర్ణమే. ఆ పూర్ణశక్తియే అన్నపూర్ణాదేవి.
‘కాశీ’ అంటే వెలుగు. మంచి మనసు కలిగి, త్యాగధనులైన వారి చేతులయందు వెలుగు ఉంటుంది. కనుకనే అటువంటివారి కరములతో వడ్డించిన భోజనం చేస్తే అమృతంగా మారి, భుజించినవారికి జ్ఞానవెలుగు దర్శనమిస్తుంది. బంగారంలో అంతర్లీనంగా అగ్ని ఉంటుందని వేదం చెప్పింది. అటువంటి అగ్నితత్త్వం కలిగిన బంగారు ఆభరణాలతో, వెలుగుకు నిలయమైన కాశీ క్షేత్రంలో వెలసిన అన్నపూర్ణాదేవిని, జగజ్జేగీయమానంగా అలంకరిస్తారు- దీపావళి పండుగ రోజున. ఆ వెలుగును చూచినవారి జీవితం ధన్యం. అనంతమైన విశ్వశక్తిని అర్థం చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని ఉద్బోధిస్తోంది అన్నపూర్ణాదేవి.

- పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464