మెయిన్ ఫీచర్

వారి జీవితాలకు వెలుగు సీతవ్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో దేవదాసీ వ్యవస్థ ఉండేది. అమ్మాయిలను దేవుళ్లకిచ్చి పెళ్లి చేసే సాకుతో వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టేసేవారు ఊరి పెద్దలు. ఈ సంప్రదాయం ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. ఇలాంటి ఆచారాన్ని రూపుమాపడంలో కీలకపాత్ర పోషించింది కర్నాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన సీతవ్వ జోడట్టి. ఈమె కూడా దేవదాసీనే. ఏడు సంవత్సరాల వయసులో ఈమె మెడలో నల్లపూసల దండ వేసి దేవదాసిగా మార్చేశారు. ఏది మంచి, ఏది చెడో తెలియని ఆ వయసులో చేతికి పచ్చనిగాజులు, పచ్చని చీర, కాలికి పెట్టిన మెట్టెలు, మెడలో నల్లపూసల దండ చూసిన ఆ చిన్నారి సీతవ్వ సంబరపడిపోయింది. సౌందట్టిలోని ఎల్లమ్మ ఆలయంలో ఆమెను దేవదాసీగా మార్చేసారు. ఇలా చేసింది ఎవరో కాదు సీతవ్వ తల్లిదండ్రులే. వారికి పుత్ర సంతానం లేకపోవడంతో పుడితే సీతవ్వను దేవదాసీగా మారుస్తానని మొక్కుకున్నారట. అలా సీతవ్వ దేవదాసీగా మారింది. ఏమీ తెలియని పసితనంలోనే ఆమె మెడలో అతి పెద్ద గుదిబండను వేశారు ఆమె తల్లిదండ్రులు. పెరిగే కొద్దీ ఆమెకు నెమ్మదిగా నిజం అవగతమవ్వసాగింది. 1982లోనే కర్నాటక ప్రభుత్వం దేవదాసీ సంప్రదాయాన్ని రద్దు చేసినప్పటికీ ఈ సమస్య పూర్తిగా కనుమరుగవ్వలేదు. చాలామంది దేవదాసీలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. వారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక అవసరాల రీత్యా తల్లిదండ్రులే కూతుర్లను పరాయి వారితో పంపుతున్నారు. వారి సంపాదనతోనే కుటుంబమంతా బతకాలి. కానీ అన్యాయానికి గురయ్యేది మాత్రం దేవదాసీనే.. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న సీతవ్వ ముందడుగు వేసింది. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకుని నిశ్చయించుకుంది.
1991లో కర్నాటక మహిళా సంక్షేమ శాఖ వారు వచ్చి సీతవ్వలాంటి వారికి చాలా విషయాలు తెలియజేశారు. దాంతో ‘అసలు మేము దేవదాసీలుగా ఎందుకు మారాలి?’ అనే ప్రశ్న మొదలైంది వారిలో.. అలాగే ‘మేము ఎందుకింత ఇబ్బందులు పడాలి? ఎవరి మీదో ఆధారపడి బతికేకంటే మా బతుకు మేమే బతికితే సరిపోతుంది కదా అనుకున్నారు సీతవ్వలాంటివారు.
అనుకున్నదే తడవుగా సీతవ్వ దేవదాసీ వ్యవస్థనుంచి బయటపడింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. చాలా వేధనకు గురైంది. ఏమాత్రం భయపడలేదు. బాధపడలేదు. ముందడుగే వేసింది. అలా 1997 సెప్టెంబర్‌లో మరికొందరు మహిళలతో కలిసి ‘మహిళాభివృద్ధి మట్టు సంస్కరణ సంస్థే’ను ఏర్పాటు చేసింది. ఈ కూపం నుండి మొత్తం 3,600 మంది మహిళలను బయటకు తేవడానికి సీతవ్వ చాలా ఇబ్బందులు పడింది. ఆమెను అనరాని మాటలు అన్నారు. తట్టుకుంది. ఈ సంస్థ వెనకడుగు వేసేలా చేయడానికి చాలా కుట్రలు పన్నారు. అయితే మరెవ్వరూ తనలా బాధపడకూడదని భావించిన సీతవ్వ.. వేటికీ తలొగ్గలేదు. సీతవ్వ తను ఏర్పాటు చేసిన సంస్థతో కలిసి మొత్తం 4,800 మంది దేవదాసీలను, వారి పిల్లలను ఈ ఉచ్చు నుంచి కాపాడింది. దేవదాసీల పిల్లలకు ఉపకార వేతనాలను కూడా అందించింది. కర్నాటకలోని బెల్గాంలో దేవదాసీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేలా చేసింది సీతవ్వ. అంతటితో ఆగిపోలేదు. మరో అడుగు ముందుకేసి బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళల అక్రమరవాణా.. వంటివాటిపైన పనిచేయాలని నడుం కట్టింది సీతవ్వ. తప్పకుండా సీతవ్వ ఈ దురాచారాలను కూడా రూపు మాపుతుంది. అందుకే భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. ఈ అవార్డును ప్రకటించేటప్పటికి సీతవ్వ ఇంట్లో పనులను చేసుకుంటూ టీవీ హెడ్‌లైన్స్ వింటోందట.. అందులో సీతవ్వ జోడట్టికి పద్మశ్రీ అవార్డు లభించింది అని వచ్చిందట. అది విన్న సీతవ్వ ఆశ్చర్యపోయిందట. కారణం ఆ సమయంలో ఆమెకు పద్మశ్రీ అంటే ఏంటో కూడా తెలియదట. *