మెయిన్ ఫీచర్

చింతలు తీర్చే సిరిమాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు పైడితల్లి సిరిమాను సంబరం
*
పశ్చిమాకాశం సింధూరవర్ణం పులుముకుంది. పుడమి తల్లి పులకరించింది. సిరిమాను సిరులు కురిపించేటందుకు కదిలింది. జయజయధ్వానాలు మిన్నుముట్టేయి. అందరి చూపులు నింగివైపే. పైడితల్లికి ప్రతీకగా వస్తున్న సిరిమానును తిలకించి బతుకు బంగారం చేసుకోవాలనీ, ఆ తల్లి పారాణి పాదాలు కనులారా చూసి జన్మధన్యతను పొందాలని ఒకటే ఆరాటం. ఉత్తరాంధ్రులకు పండుగలకే పండుగ పైడితల్లి సిరిమాను పండుగ.
*
పైడితల్లి పండుగకు ఈ ప్రాంతీయులు ఎవరు ఎక్కడ ఉన్నా, బొట్టుపెట్టి పిలిచినా, పిలవకపోయినా సకుటుంబంగా తరలిరావాల్సిదే. పండుగలో పాలు పంచుకోవాల్సిందే. సిరిమాను దర్శించి తరించాలన్న ఉబలాటమే!
పైడితల్లి పరాశక్తి అంశరూపం. తనను చూడటానికి వచ్చిన బిడ్డల ఆనందాన్నీ, ఉత్సాహాన్నీ చూసి మురిసిపోతుంది. తన బిడ్డలపై కరుణామృతాన్ని వర్షిస్తుంది. ఆ వర్షంలో తడవాలనే అందరి ఆకాంక్ష.
ఏమి జన సందోహం! ఎందుకంత తొక్కిసలాట! ఎటుచూసినా, సందు, గొందు, మిద్దె, మేడ అన్న తేడా లేకుండా అంతటా జనం. జన ప్రభంజనం. చంద్రుని చూసి ఉరకలెత్తిన సముద్రంలా, ఆనంద తరంగల్లా ముందుకు దూసుకువస్తున్న జన సంద్రం. అంతటా కోలాహలమే.. ఉత్కంఠయే. నింగిలో చుక్కలా సిరిమానుపై పైడితల్లి. బంగారు తల్లి. ఆనందవల్లి. సిరులు జల్లే కల్పవల్లి. మిలమిలా మెరిసిపోతున్న తల్లి.. పైడితల్లి.
ఎవరీ పైడితల్లి?
విజయనగరం సంస్థాన పాలకులు పూసపాటి వారి ఇలవేల్పు కనకదుర్గమ్మ. ఆ తల్లికి వెలకట్టలేనంత మడులు, మాన్యాలు అందించిన వంశం. ఆ తల్లి కటాక్షంతో వరప్రసాదంగా జన్మించిన ఆణిముత్యం. అమ్మ పేరును పైడితల్లి (బంగారు తల్లి)గా పేరు పెట్టారు. అల్లారుముద్దుగా పెరిగింది. రాజప్రసాదంలో అన్ని భోగాలు అనుభవించింది. చిన్న వయస్సులోనే కనకదుర్గమ్మను హృదయంలో పదిలపరచుకుంది. రాజదర్పణాన్ని ఏనాడూ దరి చేరనీయలేదు. రాజ కుటుంబంలోనే కాదు- జన బాహుళ్యంలోను అందరి మనస్సులను దోచుకుంది. అనురాగ మమకారాలు అందించింది. ఆమె ఉనికివల్లనే రాజ్యం సుభిక్షంగా ఉండేదని నాటి జనవాక్కు.
పొరుగు సంస్థానం బొబ్బిలివారితో పొరపొచ్ఛాలేర్పడ్డాయి. మాటా మాటా పెరిగి పోరు స్థాయికి వచ్చింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు విదేశీయుల పన్నాగం తోడైంది. అన్న మొదటే విజయ రామరాజుతో పోరు వద్దని మొరపెట్టుకుంది. చిట్టితల్లి మాట అన్న కాదన్నాడు. కదనానికి కాలుదువ్వాడు. ఫలితం బీభత్సం.. అన్న విజయం పొందినా తనువు చాలించాల్సి వచ్చింది. అన్న మరణం తట్టుకోలేని చిట్టితల్లి మనస్సు తల్లడిల్లింది. ప్రాసాదం వెనుకనున్న పెద్దచెరువులో తనువు చాలించింది. క్షేమదేవతగా జన్మిస్తానని, బంధువైన పతివాడ అప్పలనాయుడుకు కలల కనిపించి తన ఉనికిని తెలియజేసింది. నాయుడు బృందానికి జలదేవతగా, బంగారు బొమ్మగా దొరికింది. అక్కడే చెరువుగట్టుమీద వున్న వేప చెట్టు నీడన అందరూ కలిసి ప్రతిష్ఠించారు. గుడి కట్టారు. నేడది ‘వనంగుడి’గా ప్రసిద్ధి పొందింది.
కన్యకాపరమేశ్వరి, వాసవీమాత వలె అవివాహితగా మరణించడం చేత అమ్మవారిగా ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. పట్టణం అభివృద్ధి చెందడంతో, నగరం నడిబొడ్డున మరో గుడి నిర్మించి ఆరునెలల పాటు ‘చదురు గుడి’గా నామకరణం చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ ఉత్సవాలలో ప్రధానమైనది ‘సిరిమాను సంబరం’. అపూర్వ గర్భరాగాన్ని తెలియజెప్పడం కోసం నిర్వహిస్తున్న పెద్ద పండుగ సిరిమాను సంబరం.
నాలుగు శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ పండుగను ఎవరు, ఎలా నిర్ణయించారు? ధర్మశాస్త్రాలననుసరించి సమాధానం చెప్పుకోవచ్చు. చంద్రుడు శరత్కాలంలో షోడశ కళలతో శోభిస్తాడు. జగన్మాత శోడశ కళాప్రపూర్ణ. శరత్కాలం అమ్మవారికి ఎంతో ఇష్టం. పైడితల్లి కనకదుర్గ వరప్రసాదం. నవరాత్రులు ముగిశాక, కనకదుర్గ అపరాజితగా, రాజరాజేశ్వరిగా ఆరాధనలందుకుంటుంది. విజయదశమిలో ‘విజయ’ అంటే అమ్మవారు. ఆమెకు ప్రీతికరమైన రోజు మంగళవారం. జగన్మాత మంగళదేవత. పైడితల్లి కూడా మంగళదేవతయే! అందువల్ల విజయదశమి గడిచిన తరువాత వచ్చే మంగళవారం సిరిమాను సంబరం చేయాలని నాటి పెద్దలు నిర్ణయించారు.
ఇది రెండు రోజుల పండుగ. ముందురోజు ‘తొలేళ్ళ పండుగ’గా ప్రసిద్ధి. ఆ రోజు మేళతాళాలతో, ఘటాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. చుట్టపక్కాలతో ప్రతి ఇల్లు ఆనందంతో కళకళలాడుతూ ఉంటుంది. పగలంతా ఊరంతా రకరకాల వేషాలతో ఉత్సాహం కొలుపుతూ ఉంటుంది. ఆ రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాల్లో మునిగితేలుతుంది. గుడిలో వేదఘోషలు. కంటికి నిద్ర ఉండదు. అంతటా సందడే సందడి.
మరుసటి రోజు మంగళవారం. సిరిమాను పండుగ రోజు.
సిరిమాను చింతచెట్టుతో రూపొందిస్తారు. చింతలు తీర్చే చెట్టు చింతచెట్టు. ఆ చెట్టు ఎక్కడ ఉన్నదీ ప్రధానార్చకుడికి కలలో కనిపించి అమ్మవారు చెబుతుంది. ఆ చెట్టుకి పూజలు చేసి, తెచ్చి సిరిమానుగా మలుస్తారు. అమ్మవారికి ప్రతీకగా ప్రధాన అర్చకుడు సిరిమాను చివర కూర్చోడానికి అనువుగా ఏర్పాటుచేస్తారు. పైడితల్లికి రోజంతా పూజలు నిర్వహించాక, సిరిమాను ఆ సాయంత్రం ఆలయంనుండి, పైడితల్లి పుట్టి పెరిగిన రాజప్రాసాదం వరకూ ముమ్మారు ప్రయాణం చేస్తుంది. భక్తజన సందోహానికి దర్శనమిచ్చి, ఆనంద తరంగాల్లో తేలియాడేటట్లు చేసి అనుగ్రహిస్తుంది.
‘ముమ్మారు’లో ప్రత్యేకత..
ధర్మశాస్త్రాల్లో మూడు సంఖ్యకు ప్రాముఖ్యం ఉంది. త్రిమూర్తులు, ముల్లోకాలు, త్రిశక్తులు, త్రికాలాలు, త్రిపుటులు, త్రిగణాలు- ఇలా ఎన్నో ఉన్నాయి. మన భావనలోనే రహస్యమంతా ఇమిడి ఉంది. ఆ భావనయే ‘రసం’- అంటే పరమాత్మ. పరమాత్మకు ప్రతీక దీపిక. ఆ దీపికయే మంగళదేవత. కన్నతల్లి..పైడితల్లి.
తల్లికి పిల్లలపై వాత్సల్యం ఎక్కువ. ఏ అమ్మకైనా అంతే. అందుకే బంగారు తల్లి పైడితల్లికి బెంగ మరీ ఎక్కువ. సంవత్సరానికొకసారైన తన పిల్లల్ని చూడాలని, ఆప్యాయంగా పలకరించాలని, వారి కన్నుల్లో ఆనందాన్ని తిలకించాలని, అనుగ్రహించాలని సిరిమాను దేవతగా నింగినుండి సాగుతూ దర్శనమిస్తూ, తన చల్లని చూపులతో వరాల జల్లులు కురిపిస్తుంది. ఆ చూపులు వెలకట్టలేనివి. మాటలకందనివి. అందువల్ల ఆ తల్లిని నిరంతరం తలుస్తూ, కొలుస్తూ ఉండటమే శ్రేయస్కరం.

-ఏ.సీతారామారావు