మెయిన్ ఫీచర్

జ్ఞానానే్వషణతో సత్యనిరూపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతం, భవిష్యత్తులనుంచి ఎవరూ ఏమాత్రం స్పందించకుండా, అందరూ ఈ అస్తిత్వంపట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.
ఒంటె గతంలో జీవిస్తుంది. సింహం భవిష్యత్తులో జీవిస్తుంది. శిశువు ‘‘ఇప్పుడు, ఇక్కడ’’అనే వర్తమానంలో జీవిస్తాడు. ఒంటె, సింహాలది మనసు, ఆత్మల పూర్వస్థితి. శిశువుది మనసు, ఆత్మల తరువాత స్థితి. మనోరహిత స్థితి అంటే అదే. దానినే సూఫీలు ‘‘అహంరహిత స్థితి’’అంటే మనసు, ఆత్మలులేని స్థితి అంటారు. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. మనసులేని ఆత్మ, ఆత్మలేని మనసు మీకు ఎప్పుడూ ఉండదు. ‘‘నీవు, నేను’’అనేవి ఒకే శక్తిలోని భాగాలు. అవికూడా అంతర్థానమవుతాయి.
శిశువు మాటలకందని మార్మికమైన, అనిర్వచనీయమైన అద్భుతం. ఒంటెకు జ్ఞాపకశక్తి, సింహానికి తెలివితేటలు, శిశువుకు జ్ఞానం ఉంటాయి. ఒంటె ఒక హిందువులా, క్రైస్తవునిలా, మహమ్మదీయునిలా ఎప్పుడూ ఆస్తికుడే. కానీ, సింహం ఎప్పుడూ నాస్తికుడే. అయితే శిశువు మాత్రం ఎప్పుడూ ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. వాడు కేవలం ప్రేమ, అమాయకత్వాలతో నిండిన ధార్మికుడు మాత్రమే. అందుకే వాడు ఒక హిందువుగా, క్రైస్తవునిగా, మహమ్మదీయునిగా, సామ్యవాదిగా ఎప్పటికీ కాలేడు.
జ్ఞానవృక్ష ఫలాన్ని తిన్న ఆదాము సింహంలా మారాడు. అది తినక ముందు వాడు కేవలం ఒంటె మాత్రమే. అందుకే తాను తిన్న ఫలాన్ని మళ్ళీ వాంతి చేసుకున్నాడు ఆదాము. వెంటనే అతని తెలివితేటలు అంతరించి శిశువుగా మారిపోయాడు. శిశువుగా మారిపోవడమంటే క్రీస్తుగా మారిపోవడమే. అందుకే క్రీస్తు తన శిష్యులకు ‘‘రిపెంట్’’అని పదేపదే చెప్పేవాడు. ‘‘రిపెంట్’’అంటే హీబ్రూ భాషలో ‘‘వెనక్కి రండి’’అని అర్థం. ఎందుకంటే, ‘‘ఈడెన్ పూదోట’’ మీకోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉంది. జ్ఞానవృక్ష ఫలాన్ని వాంతి చేసుకున్న వెంటనే ‘‘ఈడెన్ పూదోట’’ తలుపులు మీకోసం తెరుచుకుంటా యి.
ఒంటె జ్ఞానవృక్ష ఫలం తినక ముందున్న ఆదాము లాంటిది. సింహం జ్ఞానవృక్ష ఫలం తిన్న తరువాత మారిన ఆదాము లాంటిది. శిశువు క్రీస్తుగా మారి ఇంటికి చేరుకున్న ఆదాము. దానినే బుద్ధుడు ‘‘నిర్వాణ’’అని, జీసస్ ‘‘దేవుని రాజ్యం’’అని అంటారు. దానినే మీరు ‘‘తావో, దమ్మ, మోక్ష’’అంటూ ఎలాగైనా అనవచ్చు. ఎందుకంటే, మాటలకు అక్కడ పెద్దగా అర్థాలుండవు. అది మాటలు లేని వౌనం, ఆలోచన లేని అమాయకత్వం.
ప్రేమ నుంచి వాత్సల్యానికి:
ప్రేమకు రెండు విభిన్నమైన పరస్పర వ్యతిరేక అర్థాలున్నాయి. మొదటిది ‘బాంధవ్యం’, రెండవది ‘అస్తిత్వ స్థితి’. బాంధవ్యంతో కూడుకున్న ప్రేమ బానిసత్వంగా మారుతుంది. ఎందుకంటే, అక్కడ ఆశల కోరికలు, ఆశాభంగాల వేదనలు, పరస్పరం శాసించుకునే ప్రయత్నాలు ఉంటాయి. అందువల్ల అది అధికార పోరాటంగా మారుతుంది. కాబట్టి, బాంధవ్యంతో కూడుకున్న ప్రేమ సరియైనది కాదు.
రెండవది ‘‘అస్తిత్వస్థితి ప్రేమ’’. అది పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఆ స్థితిలోని ప్రేమ ఎవరినుంచి ఏదీ ఆశించకుండా వ్యాపించే సుమ సుగంధంలా ఉంటుంది. కాబట్టి, ఆ స్థితిలో ఉన్న మీరు ఎలాంటి బాంధవ్యాన్ని సృష్టించకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, నిరంతరం ప్రేమిస్తూ, ఆ ప్రేమను అందరికీ పంచుతూ ఉంటారు. అదే మీకు లభించే బహుమతి.
ప్రేమ సుగంధంలా మారినప్పుడు అది మానవత్వాన్ని మించిన అద్భుత సౌందర్యంతో కూడుకున్న దివ్యత్వ శోభతో వెలిగిపోతూ అన్నివైపులకు వ్యాపిస్తూ ఉంటుంది. దానిని మీరు ఆపలేరు. అంతేకాదు, అది ఎవరికి ఎలాంటి బంధనాలను సృష్టించదు, వాటలో ఎవరినీ చిక్కుకోనివ్వదు. కానీ, మీరు మీ పసితనంనుంచే బాంధవ్యాలను సృష్టించడానికి అలవాటుపడ్డారు. అలా మీకు తెలియని వ్యక్తికి మీరు ‘నాన్న’ చుట్టరికాన్ని తగిలిస్తారు. కానీ, అతనే మీ నాన్న అని మీరు కచ్చితంగా చెప్పలేరు.
నేనొక కథ విన్నాను:
దేనినీ నమ్మని, చివరికి దేవుడిని కూడా నమ్మని ఒక నాస్తికుడు ఒకసారి ఒక హస్తసాముద్రికవేత్తను కలిసి ‘‘మీ శాస్త్రం నిజమే అయితే ఇప్పుడు మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు’’అన్నాడు చెయ్యి చూపిస్తూ.
వెంటనే ఆ హస్తసాముద్రికుడు అతని చేతిని పరిశీలించి ‘‘ఇప్పుడు మీ నాన్న చేపలు పట్టేందుకు వెళ్ళాడు’’అన్నాడు. ‘‘కాదు. మా నాన్న మరణించి మూడేళ్ళయింది. అందుకే ఈ శాస్త్రాలన్నీ పరమచెత్త అంటాను’’ అన్నాడు ఆ నాస్తికుడు. ‘‘నా లెక్క తప్పుకాదు. ఆ చనిపోయిన వ్యక్తి మీ నాన్న కాదు. మీ అసలు తండ్రి చేపలు పట్టేందుకే వెళ్ళాడు. కావాలంటే మీ అమ్మని అడుగు. ఆమె నిజంగా నిజాయితీ గలదైతే. ఆ చనిపోయినవాడు మీ నాన్నకాదని, చేపలు పట్టేందుకు వెళ్ళినవాడే మీ నాన్న అని చెప్తుంది’’అన్నాడు ఆ హస్తసాముద్రికవేత్త.
ఇలా ఉంటాయి బాంధవ్యాలు. మీ జీవితమంతా అనేకరకాలైన బాంధవ్యాలతో ముడిపడి ఉంటుంది. అవి వాస్తవమైనవి కావచ్చు లేదా ఊహాత్మకమైనవి కావచ్చు. ఏదేమైనా, ఒక రకంగా ఆ బాంధవ్యాలన్నీ అతి సూక్ష్మమైన మానసిక బానిసత్వానికి సంబంధించినవే. మీరు వాటికి బానిస కావచ్చు లేదా మీకుమీరే బానిస కావచ్చు.
మరొక ముఖ్య విషయం, మీకుమీరు బానిస కానంతవరకు ఎప్పటికీ మీరు మరొకరికి బానిస కాలేరు. బానిసత్వమనేది రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకడు బలవంతుడు కావచ్చు, మరొకడు బలహీనుడు కావచ్చు. కానీ, ఏ బాంధవ్యంలోనైనా మీరు చెరసాల అధికారి అయితే ఇతరులు ఆ చెరసాలలో బందీ అవుతారు. అలాగే చెరసాల లోపల ఉన్న వారివైపునుంచి చూస్తే, వారికి మీరు బందీగా కనిపిస్తారు, మీకు వారు చెరసాల అధికారిగా కనిపిస్తారు. అతి బాధాకరంగా జీవించే మానవాళి దీనస్థితికి ఉన్న అనేక ముఖ్య కారణాలలో ఇది ఒకటి.
బాంధవ్యంతో కూడిన ప్రేమకన్నా ద్వేషం చాలా బలమైనది. ఎందుకంటే, ఆ స్థితిలోని మీ ప్రేమ కేవలం పైపైన మాత్రమే ఉండే భవిష్యత్తుకు సంబంధించిన విత్తన స్థాయి శక్తి మాత్రమే కానీ, వాస్తవమైనది కాదు. ఎందుకంటే, పూర్తిగా జంతు వారసత్వమైన మీ ద్వేషం చాలా లోతైనది. ఎందుకంటే, అది అనేక జన్మలనుంచి యుగయుగాలుగా, తరతరాలుగా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తున్న పూర్తిస్థాయికి ఎదిగిన ద్వేషం కాబట్టి.
ఈ మార్పు కేవలం మనిషిలోనే జరుగుతోంది. కాబట్టి, నన్ను ద్వేషించే వారిని నేను అడ్డుకోలేను. అలాగే నన్ను ప్రేమించే వారినీ నేను అడ్డుకోలేను. అందుకే, నేను చెప్పగలిగేది ఒక్కటే. ప్రేమ, ద్వేషం-ఇలా ఏదైనా బాంధవ్యంగా మారిన వెంటనే అది దాని స్వచ్ఛతను కోల్పోతుంది.
కాబట్టి, మీ ప్రేమనే మీ ఉనికిగా మారనివ్వండి. అంటే, మీరు ప్రేమలో పడతారని కాదు. మీరు ఎప్పుడూ ప్రేమలోనే ఉంటూ, అన్నింటినీ ప్రేమిస్తూ ఉంటారు. అంతే. అప్పుడు ప్రేమించడం మీ స్వభావమై, అదే మీ ఉనికి ఊపిరిగామారి, ఎప్పుడూ ప్రేమ సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి, మీరు ఒంటరిగా ఉన్నా, మీచుట్టూ ప్రేమ శక్తి నిండి ఉంటుంది. కానీ, పాతభావాల బాంధవ్యాలను వదిలించుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ స్థితిలో ఉండగలరు. అప్పుడు మీరు ‘కుర్చీ’లాంటి జీవంలేని దానిని తాకినా, మీ చేతులు దానిపై ప్రేమ కురిపిస్తాయి- ఆ స్థితిలో ‘ఎవరికి, ఏమిటి’అనేది మీకు ఒక విషయమే కాదు. ఎందుకంటే, అక్కడ ప్రేమ అనేది ఒక బాంధవ్యంగా ఉండదు. ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించుకుంటూ కలిసి ఉండగలరు. వారు ఎంత ఎక్కువగా ప్రేమించుకుంటే అంతగా వారిమధ్య బాంధవ్యం తగ్గిపోయి స్వేచ్ఛ పెరుగుతుంది. అందువల్ల ఆశించడాలు, శాసించడాలు, దబాయించడాలు తగ్గిపోతాయి. అప్పుడు సహజంగానే వారిమధ్య ఎలాంటి నిరాశలకు చోటుండదు. ఇంకావుంది...

అనువాదం: భరత్