మెయన్ ఫీచర్

జాతీయ రాజకీయాలపై మమత ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా రెండోసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాక మూడింట రెండువంతుల ఆధిక్యత సాధించడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ఒక కీలక నాయకురాలిగా మారారు. అదే సమయంలో ఎఐడిఎంకె జయలలిత కూడా తమిళనాడులో ఘనవిజయం సాధించినా ఆమె పాత్ర జాతీయ రాజకీయాల్లో పరిమితంగా వుండే అవకాశం ఉంది. మమత వలె ఆమె అధికార, ప్రతిపక్షాలతో సన్నిహిత సంబంధాలు దాదాపు సమంగా లేకపోవడమే ఇందుకు కారణం.
విద్యార్థి నాయకురాలిగా రాజకీయాలు ప్రారంభించి కేంద్ర రైల్వేమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆమె ఎదిగిన తీరు అపూర్వమైనది. నిత్యం ఘర్షణపూర్వక రాజకీయాలకు కాలుదువ్వడమే కాకుండా నిరాడంబరత నిజాయితీపరురాలిగా సామాన్యులతో కలిసి పోగలగడం ఆమె ప్రత్యేకత. ఆమె వలె జయలలిత ఇతరులతో కలిసిపోలేరు. రైల్వేమంత్రిగా, పార్లమెంటు సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లో మమత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పరిచయాలను ఆసరా చేసుకుని పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఆమె ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించడానికి సిద్ధపడుతున్నారు గత ఎన్నికల ముందే సమాఖ్య కూటమి ఆలోచనలను వ్యక్తం చేసినా కార్యారూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేసే అవకాశం ఉంది.
సంప్రదాయ రాజకీయాలను కాలదన్ని రాష్టస్థ్రాయి రాజకీయాల్లో వెలుగొందిన వారు జాతీయ రాజకీయాలలో ప్రభంజనం సృష్టించడం నరేంద్ర మోదీతో ప్రారంభమైంది. 2019లో ఆయనకు పోటీగా నిలబడాలని ప్రయత్నిస్తున్న నితీశ్‌కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి వారు రాష్టస్థ్రాయిలో తిరుగులేని నాయకులుగా వెలుగొందుతున్నవారే కావడం గమనార్హం. దేశ తూర్పు ప్రాంతంలో ప్రధానమైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సారధిగా ఉన్న మమతా బెనర్జీ ఇప్పుడు ప్రధానమంత్రి పదవిపై కన్ను వేయడం సహజంగా జరుగుతున్న పరిణామంగా భావించవచ్చు. పొరుగున వున్న త్రిపురలో కాంగ్రెస్‌కు చెందిన పదిమంది శాసనసభ్యులలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ రాష్ట్రంలో ఆమె పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అయితే నితీశ్‌కుమార్, కేజ్రీవాల్ వలె తన పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరింపచేసి జాతీయ పార్టీగా గుర్తింపు పొందే ప్రయత్నం ఆమె చేయడంలేదు.
అయితే సిపిఎంతో పొత్తును బలంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వర్గాలు ఇప్పుడు మమతా బెనర్జీవైపు చూస్తున్నారు. దానితో 2018 ఎన్నికలలో సిపిఎం ప్రభుత్వ ఆధిపత్యాన్ని సవాల్ చేసే రీతిలో ఆమె పార్టీ ఎదిగే ప్రయత్నం చేస్తున్నది.ఈశాన్య రాష్ట్రాలలో బలహీన పడుతున్న కాంగ్రెస్ స్థానంనుండి ప్రయోజనం పొందే ప్రయత్నం కూడా ఆమె చేస్తున్నారు. అయితే ఆ రాష్ట్రాల్లో అందుకు అవకాశాలు పరిమితంగా వున్నట్టు ఆమెకు తెలుసు. పైగా బిజెపి కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నది. పలువురు ప్రాంతీయ నాయకులు తమ తమ రాష్ట్రాల్లో బలమైన నాయకులుగా మారుతుండడంతో కాంగ్రెస్, వామపక్షాల నుండి కన్నా ఇప్పుడు ప్రాంతీయ నాయకులనుండే బిజెపి పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కారణాలు ఏవైనా కేంద్రంలో ఘర్షణపూర్వక వైఖరికి పలువురు ప్రాంతీయ నాయకులు ఇప్పుడే సిద్ధపడడం లేదు. అంశాలవారి మద్దతు విధానాన్ని అవలంబిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తన పరిమితులను గుర్తించారు. అందుకనే స్థానిక బిజెపి నాయకులనుండి ఎన్ని వత్తిడులు వస్తున్నా ప్రాంతీయ నాయకులతో సామరస్యంగానే వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీతోపాటు నవీన్ పట్నాయక్, జయలలిత ప్రభుత్వంపై సిబిఐ దర్యాప్తులో చెప్పుకోదగిన పురోగతి సాధించడంలేదు.
వారిపై రాష్టస్థ్రాయిలో బిజెపి నాయకులు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నా వాళ్లు జైళ్లకు వెళ్లడం ఖాయం అని అంటున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. 2019 ఎన్నికల అనంతరం అనూహ్యమైన రాజకీయ సమీకరణలకు అవకాశం ఉండవచ్చన్న ఉద్దేశంతో నరేంద్రమోదీ ఇప్పటినుండే జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తున్నది.
మరోవంక రాజ్యసభలో ఇప్పటివరకు ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పలు బిల్లులు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుకోగలిగింది. ఇప్పుడు కాంగ్రెస్ బలం తగ్గడంతో టిఎంసి, బిజెపి, అన్నాడిఎంకె వంటి పార్టీల మద్దతుతో ఆయా బిల్లులను ఇప్పుడైనా ఆమోదింపచేసుకోవాలని బిజెపి యత్నిస్తున్నది. అందుకోసం కూడా ఆయా పార్టీలతో సామరస్యంగా వుండక తప్పడంలేదు. ప్రాంతీయ పార్టీలు సైతం బిజెపి, కాంగ్రెస్‌తో సంబంధాలు విషయంలో విచిత్రంగా వ్యవహరిస్తున్నాయి. రాష్టస్థ్రాయిలో ఆయా పార్టీలను శత్రుపక్షాలుగా తీసిపారేస్తూ ఆయా పార్టీలు జాతీయ నాయకులతో మాత్రం సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుంటున్నారు. ఇటువంటి ప్రాంతీయ పార్టీల నేతలతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రధాన మంత్రితో ఎటువంటి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారో, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సైతం అంతటి సాన్నిహిత్యం ప్రదర్శిస్తూ వుండడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు ముందు హాజరుకమ్మని సమన్లు పంపిన సమయంలో స్వయంగా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీకి.. మమత సానుభూతి, సంఘీభావం ప్రదర్శించారు. అందుకే ఆమెకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో సిపిఎంతో చేతులు కలపడానికి సోనియాగాంధీ రాహుల్ గాంధీ తొలుత సుముఖత చూపలేదు కానీ, రాష్ట్ర నాయకత్వం పట్టుపట్టడంతో సిపిఎంతో కలవక తప్పలేదు.
ఒకవంక బిజెపి కాంగ్రెస్‌లతో సమదూరం పాటిస్తూ మరోవంక ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులతో మమతా బెనర్జీ మంచి సంబంధాలను ఏర్పరుచుకోగలుగుతున్నారు. నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్, అరవింద్ కేజ్రీవాల్, ఫరుఖ్ అబ్దుల్లా వంటి నాయకులతో ఆమెకు మంచి సంబంధాలు వున్నాయి. వారితోపాటు అవసరాన్ని బట్టి శరద్‌పవార్, చంద్రబాబునాయుడు, కెసిఆర్, జయలలిత వంటి వారి మద్దతు సమీకరించుకోవడానికి కూడా ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రెండేళ్లుగా జిఎస్‌టి బిల్లుపై రాజ్యసభలో ప్రతిష్ఠంభన ఏర్పడుతుండగా మొదటినుండి బేషరతు మద్దతు ఇస్తున్నది ఆమే కావడం గమనార్హం. మరో వంక సొంత రాష్ట్రంలో ముస్లింల మద్దతు కోసం పలు అంశాల్లో నరేంద్ర మోదీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. తద్వారా ఆమెతో చేతులు కలపడం ద్వరా ముస్లింల మద్దతు పొందవచ్చనే సంకేతం ఇస్తున్నారు.
2019 ఎన్నికలలో బిజెపి కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ పూర్తి ఆధిక్యతను పొందగలిగితే మరొకరికి ప్రధాన మంత్రి కాగల అవకాశం ఉండదు. కనీసం ఈ పార్టీల నాయకత్వంలోని ఎన్‌డిఎ, యుపిఎలలో ఎవరికి ఆధిక్యత లభించినా పరిస్థితులు పెద్దగా మారవు. అయితే ఏ కూటమికి ఆధిక్యత లభించని పక్షంలోనే ఇతర ప్రాంతీయ నాయకులకు ప్రధాన మంత్రి పదవి లభించే అవకాశం వుంటుంది. అటువంటి పరిస్థితుల్లో కనీసం 50మంది ఎంపీల మద్దతు కూడతీసుకోగలిగితే ప్రత్యర్థి కూటమిని ఆధికారంలోకి రాకుండా నివారించేందుకు ఏదో ఒక కూటమి వారికి మద్దతు ఇవ్వక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడగలవు. అటువంటి పరిస్థితులు ఏర్పడితే అవకాశంగా మార్చుకోవడానికి మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఇక ప్రధానమంత్రి కాగల అవకాశం రాదని స్థిరమైన నిర్ణయానికి శరద్ పవార్ వచ్చారు. అందుకు ఆయన ఇప్పుడు రాష్టప్రతి లేదా ఉప రాష్టప్రతి పదవులపై కనే్నశారు. ఏదోవంక రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాలని నవీన్ పట్నాయక్ దృఢ నిర్ణయంతో ఉన్నారు. పంజాబ్, గోవా, గుజరాత్‌లలో పాగా వేయాలని చేస్తున్న ప్రయత్నాలు విజయం సాధిస్తేనే అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రికి పోటీపడగలరు. నితీశ్‌కుమార్ సైతం రాష్ట్ర పరిధి దాటి తన బలాన్ని పెంచుకోగలిగితేనే ప్రధానమంత్రి సింహాసనం వైపు కనె్నత్తి చూడగలరు.
ఇటువంటి పరిస్థితుల్లో తమకు ప్రధాన మంత్రి పదవి దక్కలేని పరిస్థితుల్లో ప్రాంతీయ నాయకులంతా మమతా బెనర్జీ పట్ల మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువగా ఉండగలవు. ఆమె సైతం అటువంటి పరిస్థితుల కోసమే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

- చలసాని నరేంద్ర