మెయిన్ ఫీచర్

బంధనాలు లేనిది (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను అన్ని రకాల బాంధవ్యాలకు వ్యతిరేకిని. ఉదాహరణకు, ‘ఫ్రెండ్‌షిప్ (స్నేహబంధం)’అనే పదాన్ని నేను ఇష్టపడను. ఎందుకంటే, అది కూడా ‘‘రిలేషన్‌షిప్’’లాంటిదే. అంటే, ఒక రకమైన బాంధవ్యం లాంటిదే. అందుకే నేను ‘‘ఫ్రెండ్లీనెస్ (స్నేహభావన)’’ను ఇష్టపడతాను.
కాబట్టి, ప్రేమతో వచ్చిన చిక్కేమీ లేదు. అది చాలా విలువైనది. నిజానికి, ప్రేమ లేనిది ఏదైనా తప్పే. అందుకే అది ఏమాత్రం కలుషితం కాకుండా, విషతుల్యం కాకుండా కాపాడుకోవాలి. బాంధవ్యం ప్రేమను విషతుల్యం చేస్తుంది. కాబట్టి, ఈ ప్రపంచం స్వతంత్ర వ్యక్తులతో నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ‘‘కపుల్ (జంట)’’ అనే పద ప్రయోగం కూడా నన్ను చాలా బాధపెడుతుంది. ఎందుకంటే, మీరు ఇద్దరు వ్యక్తులను నాశనం చేశారు. ‘జంట’ అనేది ఏ మాత్రం అందమైన వస్తువు కాదు.
స్వేచ్ఛాయుత వ్యక్తులు మాత్రమే ఈ ప్రపంచంలో ఉండాలి. అప్రయత్నంగా ప్రేమ వికసించినప్పుడు దానితో ఆడుతూ, పాడుతూ జీవించండి తప్ప, ప్రేమ పేరుతో ఎలాంటి బంధనాలను సృష్టించకండి. అంతేకాదు, ఎవరినీ బానిసత్వంలో ఉంచేందుకు మీరు ఎప్పుడూ ప్రయత్నించకండి. అలాగే, మిమ్మల్ని బానిసత్వంలో ఉంచేందుకు ఎవరికీ ఎప్పుడూ అవకాశమివ్వకండి.
స్వేచ్ఛాయుత వ్యక్తులతో నిండిన ప్రపంచం మాత్రమే అసలైన స్వేచ్ఛా ప్రపంచం. మనిషికి కావలసిన ముఖ్యమైన అవసరాలలో అది అతి ముఖ్యమైన అవసరం. అందుకే ప్రేమ ఈ అస్తిత్వంలో ఉండదని నేనెప్పుడూ భావించలేను. మనుషులున్నంత వరకు వారి అత్యంత మధురానుభూతిగా ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అది ఈ భూమిపై లభించే భూమికి చెందని పదార్థం. ఆకాశంలో ఎగిరేందుకు అది మీకు రెక్కలనిస్తుంది. ప్రేమ లేకపోతే మీకు రెక్కలు లేనట్లే. అది అంత శక్తినిచ్చే అత్యంత అవసరమైనది కాబట్టే, దాని చుట్టూ అనేక సమస్యలు తలెత్తాయి.
మీ ప్రియుడో, ప్రియురాలో మీకు రేపు కూడా అందుబాటులో ఉండాలి. అందుకే పెళ్ళి వ్యవస్థ పుట్టుకొచ్చింది. మీరు ప్రేమించిన వ్యక్తి రేపు మిమ్మల్ని ఎక్కడ వదిలేస్తాడేమో అనే భయమే పెళ్ళికి ముఖ్య కారణం. అందుకే సమాజం ముందు, చట్టం ముందు దానిపై ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ, అది మరీ అసస్యకరమైన విసిగించే వ్యవహారం.
ప్రేమను ఒక ఒప్పందంగా కుదుర్చుకోవడమంటే చట్టాన్ని మీరు ప్రేమకు పైన ఉంచుతున్నట్లే. అంటే, మీరు మీ స్వంత వ్యక్తిత్వంపై అందరి మద్దతు అనే, పెద్ద బరువును వేస్తున్నట్లే. అంతేకాదు, మీరు మీ బానిసత్వాన్ని అందరి ముందు కచ్చితంగా ఒప్పుకుంటూ, దానికి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, పోలీసులు, సైన్యాల సహకారంతో పూర్తి రక్షణ కల్పించినట్లే. తరువాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.
పిల్లగాలిలా ప్రేమ వస్తుంది, పోతుంది. అది మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ ప్రేమ మళ్ళీ రాకపోయినా, కేవలం పెళ్ళి, చట్టాలు, సామాజిక బాధ్యతల కారణంగా బలవంతంగా కొనసాగుతున్న ప్రపంచంలోని దాంపత్యాలన్నీ దాదాపు వ్యభిచార స్థాయికి దిగజారినవే. రక్షణ, భద్రత, ఆర్థికపరమైన ఆలంబన- ఇలా ప్రేమ తప్ప ఏ ఇతర కారణాల కోసమో మీరు ప్రేమించని వారితో కలిసి జీవించడం వ్యభిచారమే అవుతుంది. అందుకే ఈ ప్రపంచం నుంచి వ్యభిచారం పూర్తిగా అదృశ్యమవాలని నేను కోరుకుంటున్నాను. అన్ని మతాలు వ్యభిచారం ఉండకూడదనే చెప్తున్నాయి. కానీ, అవే వ్యభిచారానికి ముఖ్య కారణం. ఎలాగంటే, అవి ఒకవైపు పెళ్ళిని సమర్థిస్తూనే వ్యభిచారాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదెలా సాధ్యం? మనుషుల మూర్ఖత్వం అలా తయారైంది.
అసలు పెళ్ళే ఒక వ్యభిచారం. నిజానికి, మీ ప్రేమపై మీకు నమ్మకముంటే మీరెందుకు పెళ్ళి చేసుకోవాలి? అలాంటి ఆలోచన రావడమే అపనమ్మకానికి సూచన. కాబట్టి, అపనమ్మకం నుంచి పుట్టినదేదైనా మీ ప్రేమ గాఢంగా, ఉన్నతంగా ఎదిగేందుకు ఏమాత్రం సహాయపడకపోగా, అది మీ ప్రేమను పూర్తిగా నాశనం చేస్తుంది.
స్వేచ్ఛను ఇచ్చేదే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమనే ప్రామాణికంగా తీసుకుని ప్రేమించండి. ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్