మెయన్ ఫీచర్

గొప్పలు చెప్పడంలో ఎవరికి వారే సాటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి తీవ్రతరమై సెగలు, పొగలు చుట్టుముడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, విపక్ష పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెరాసలో టిక్కెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అధికార పక్షాన్ని ఢీకొనేందుకు కాంగ్రెస్, తెదేపా, తెలంగాణ జన సమితి, సీపీఐ ఏర్పాటు చేసిన ‘మహాకూటమి’ ఇంకా స్పష్టమైన రూపుదాల్చలేదు. కాగా, కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తాము మొదటి నుంచీ పార్టీలో నిరాదరణకు గురవుతున్నట్లు భావిస్తున్నారు. వి.హనుమంతరావు వంటి నేతలు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రచార కమిటీలో తనకు స్థానం కల్పించలేదని ఆయన మండిపడ్డాడు. ఒకప్పుడు రాజీవ్ గాంధీకి విహెచ్ చాలా సన్నిహితుడు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారనేది కొందరు నేతల ఆవేదన.
సీట్ల కేటాయింపు విషయమై ‘మహాకూటమి’ ఇంకా మల్లగుల్లాలు పడుతున్నది. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ నుండి టిఆర్‌ఎస్ పక్షాన మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ టిక్కెట్టుపై విష్ణువర్ధన్‌రెడ్డి పోటీచేస్తే బిజెపి నుంచి పరిపూర్ణానంద స్వామి రంగంలోకి దిగుతారన్న ఊహాగానాలు వినిపించాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సు మారు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సాగర్ తీరం నుండి వచ్చినవారే ఎక్కువ. ఇది పరిపూర్ణానంద స్వామికి కలిసివచ్చే అంశం అన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసేందుకు వివిధ సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో 26 వెనుకబడిన కులాల వారు పోరుబాట పట్టారు. లోగడ వీరు బిసి-డీలో ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వీరిని రిజర్వేషన్లకు దూరం చేసింది. ఫలితంగా వీరు విద్య ఉద్యోగావకాశాలు కోల్పోయారు. వీరి సంఖ్య శేరి లింగంపల్లి, మల్కాజ్‌గిరి, భద్రాచలం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఆగ్రహంతో ఉన్న వీరంతా ‘కారు’ గుర్తుకు ఎదురుతిరిగి కాంగ్రెస్, తెదేపాలను ఆశ్రయించారు. ఇది తెరాస అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవరపరిచే విషయమే.
ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు భారీగానే పేలుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిఆర్‌ఎస్ తీరుపై నిప్పులు చెరిగారు. గత మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయకుండా కేసీఆర్ కొత్త మానిఫెస్టో ఎట్లా విడుదల చేస్తారని ఆయన నిలదీశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, లక్ష ఉద్యోగాలు వంటి హామీలను నెరవేర్చలేదని అన్నారు. తాము అధికారంలోకి రాగానే- కేసీఆర్ 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రగతిభవన్‌ను పేదల ఆస్పత్రిగా మారుస్తామని, ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రుణాన్ని గృహనిర్మాణం కోసం ఇస్తామని, రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకూ రుణమాఫీ చేస్తామన్నారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఎడాపెడా హామీలిస్తున్నందున ఎవరిని నమ్మాలో తెలియక జనం అవస్థలు పడుతున్నారు.
ఎన్నికల ప్రచారం ఇంకా ఊపందుకోకముందే తెలంగాణలోని పలు చోట్ల కరెన్సీ కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈనెలలో ఇప్పటివరకూ దాదాపు 20 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా ఏ పార్టీకి చెందిందో వారు ప్రకటించలేదు. ‘విచారణ జరుగుతున్నది’ అని మాత్రమే చెప్పారు. ‘ప్రాణాలకు తెగించి పోరాడండి.. కేసీఆర్‌ను గద్దె దించండి’-అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికలు కెసిఆర్-కెటిఆర్-చంద్రబాబు-ఉత్తమ్‌ల ప్రతిష్టకు సవాల్‌గా మారబోతున్నాయి. ‘సింహం ఒంటరిగానే వస్తుంది’ అన్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్. అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలకూ తాము ఒంటరిగానే పోటీచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, తెరాస-కాంగ్రెస్‌ల కంటే భాజపా ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందనడం అతిశయోక్తి అవుతుంది. రాజధానిలోని కొన్ని నియోజకవర్గాల్లో భాజపా ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పొత్తు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకున్నదని వ్యూహకర్తల సమాచారం. భాజపా సైతం కొత్తవారిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తోంది. తాజాగా భాజపాలో చేరిన స్వామి పరిపూర్ణానంద ధార్మికుడు. కాకినాడ శ్రీపీఠం అధిపతి. జనాకర్షణ గల వ్యక్తి. ఇటీవల స్వామీజీని కంచె ఐలయ్య తీవ్రంగా అవమానించాడు. టిఆర్‌ఎస్ పార్టీ స్వామీజీపై నగర బహిష్కరణ విధించింది. ఇది స్వామీజీకి తీవ్ర మనస్తాపం కలిగించింది. దక్షిణ భారతంలో బిజెపి మరో యోగి ఆదిత్యనాథ్ కోసం అనే్వషిస్తున్నది. ఈ దశలో స్వామి పరిపూర్ణానంద ఆ పార్టీకి ఆశాజ్యోతిగా కన్పించారు. అయితే, ఆయన ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం.
మరోసారి తాము గెలవడం ఖాయం అన్న ధీమాతోనే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయించారు. 104 స్థానాలు తమ ఖాతాలో పడతాయని ఆయన పదే పదే చెబుతున్నారు. కాగా, ఇది జరిగేపని కాదని, ‘104 డిగ్రీల జ్వరం కేసీఆర్‌కు వస్తుంది’ అని కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి విజయశాంతి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 12వ తేదీన ఉత్తమకుమార్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఆయన తొలి సంతకం చేస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం ఎంత? ‘మహాకూటమి’ని జనం విశ్వసించే పరిస్థితి లేదని కేసీఆర్ ఎదురుదాడి ప్రారంభించారు. మహాకూటమి ‘మహా కాలకూట విషం’ తెరాస నేతలు విమర్శించారు.
ప్రొఫెసర్ కోదండరాంకు ఓటువేస్తే మావోయిస్టులకు ఓటు వేసినట్లేనని మరో ప్రచారం జరుగుతున్నది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్నాయి కాబట్టి సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఎన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల ఇస్తారో తేల్చండి- అని కొందరు నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ పొత్తుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉంటుందో తెలియదు. తెలంగాణలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు గనుక, తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నట్లు టీటీడీపీ నాయకులు అంటున్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న చోట్ల తెదేపా ఆధిపత్యం కనిపించే అవకాశం ఉందంటున్నారు. సెటిలర్లు ఉన్న నియోజకవర్గాల్లో తెదేపా టిక్కెట్ల కోసం పోటీపోటీ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే శేరి లింగంపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. మువ్వా సత్యనారాయణను కాదని వెనిగళ్ల ఆనందప్రసాద్‌కు టిక్కెట్ ఇస్తే సహించేది లేదంటూ ఎన్‌టిఆర్ భవన్ వద్ద కొందరు రభస సృష్టించారు.
కాగా, తమ వారసులను రంగంలోకి దింపేందుకు వివిధ పార్టీల్లో నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు స్టేషన్ ఘనపూర్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు. అయినప్పటికీ అక్కడ తెరాస అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక- ప్రచారం సందర్భంగా కొన్ని చోట్ల అధికార పార్టీకి నిరసన సెగలు తగులుతున్నాయి. కొన్ని గ్రామాల్లోకి జనం టిఆర్‌ఎస్ ప్రచార రథాన్ని రాన్విటం లేదు. ఖాళీ బిందెలతో అభ్యర్థులకు నిరసన తెలుపుతున్నారు. పా ర్టీలో, ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి కనిపిస్తున్నందున 104 సీట్లలో తెరాస గెలుస్తుందనడం- గొప్పలు చెప్పుకోవడం తప్ప వాస్తవం కాదు. ఎవరు అధికారంలోకి వచ్చినా బొటాబొటి మెజారిటీ ఖాయమన్న అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్ 9 స్థానాలు, కాంగ్రెస్ 6, బిజెపి 1, ఎంఐఎం 1 స్థానం గెలిచే అవకాశం ఉందని విశే్లషకులు జోస్యం చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘మహాకూటమి’లో భాగస్వామి అయిన సీపీఐ కనీసం 9 స్థానాలు ఆశించింది. కానీ మూడు సీట్లకు మించి ఇచ్చేదిలేదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. దీంతో కమ్యూనిస్టు కార్యకర్తలు తమ పార్టీ అగ్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ‘ముష్టి మూడు సీట్లు నన్నడిగితే నేను ఇవ్వనా?’ అని టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరిహసించాడు. మరోవైపు కమ్యూనిస్టులలో కూడా కులభేదాలు ప్రవేశించాయి. చాడ వెంకటరెడ్డి, కోదండరామ్‌లు ఒకే సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి మహాకూటమిలో చేరారు. సీమాంధ్రలో రెడ్డి-కమ్మ-కాపుకులాల మధ్య పోరు సాగుతున్నట్లే తెలంగాణలో వెలమ-రెడ్డి కులాల మధ్య రాజ్యాధికారం కోసం సంగ్రామం నడుస్తున్నది. సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండాలు వంటివన్నీ కులం తర్వాతే!
ఎన్నికల్లో తాము గెలిచి స్వీట్లు పంచుకునే సమయానికి కూడా ‘మహాకూటమి’లో ‘సీట్లు’ పంచుకోవడం కొనసాగుతూనే ఉంటుందని మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘టిఆర్‌ఎస్‌ను బొందపెట్టి గోరీకట్టి డిసెంబరు 12న మేము ప్రమాణ స్వీకారం చేస్తాము’ అని ప్రకటించారు. బిజెపి నాయకుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ‘దొందూ దొందే’ అన్నారు. ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్న నేతల్లో జనం ఎవరిని విశ్వసిస్తారు? ఎవరికి పట్టం కడతారు? ‘్ఫలితాలు’ వచ్చే దాకా వేచి ఉండాల్సిందే..! ఇక, ఓటర్ల జాబితాలో అవకతవకలుంటే ఎన్నికల ఫలితాలు తారుమారు కావటం ఖాయం. ప్రధాన ఎన్నికల కమిషనర్ రావత్ మాత్రం ఓటర్ల జాబితాలో లోపాలను అరికడతామని భరోసా ఇస్తున్నారు. ఆ పనులన్నీ పోలింగ్ తేదీ నాటికి పూర్తవుతాయా? ఇంతకూ... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎం దుకు వచ్చినట్టు? ప్రజలంతా తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని చెబుతున్న కేసీఆర్- లోక్‌సభతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరపరాదని ఎందుకు కోరుకున్నారు. లోక్‌సభకు ఏప్రిల్, మే నెలల్లో పోలింగ్ జరుగుతుంది. రెండుసార్లు జరిగే ఎన్నికల జాతరకు ఇన్ని వేల కోట్ల ధనం మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయాల్సిందే. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్