మెయన్ ఫీచర్

చెన్నై పాఠాలు మనకు వినిపించవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై తరహా వరదల ప్రమాదం ప్రతిపాదిత రాజధాని అమరావతికి సంభవిస్తే? ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అనూహ్యమైన వర్షపాతంతో ఇటీవల చెన్నై మహానగరమంతా ఒక పెద్ద సాగరంలా మారిపోయింది. ఏది ఊరో, ఏది ఏరో తెలియనంతగా సముద్రం విస్తరించినట్టుగా మారిపోయింది. కొన్ని లక్షలమంది వారం రోజులుపైగా విలవిల్లాడిపోయారు. అది ఎవరూ ఊహించని ప్రకృతి విలయం. కాలం కాని కాలంలో, వానాకాలం వెళ్లిపోయిన తర్వాత ఒకే రోజున దాదాపు 50 సెంమీ వర్షపాతం నమోదైందంటే అది పర్యావరణ వైరుధ్యమే కదా! ప్రకృతి పగబట్టినట్టే కదా! కొన్ని లక్షలమంది నగరవాసులు నిరాశ్రయులైతే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 50వేల కోట్లకు పైగానే సామాజిక నష్టం సంభవించినట్టు ప్రాధమిక అంచనా. ఆ నష్టం అంతకు మించి ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఎన్నో పరిశ్రమలు, నివాసాలు, చివరికి ఐటి కంపెనీలు కూడా రోజుల తరబడి వరద నీటిలో నానిపోయాయి. ఆ నష్టాన్ని అంచనా వేయడం కష్టమే. ఎంతమంది ఎన్ని విధాలుగా సాయం అందించినా తేరుకోవడానికి మళ్లీ చాలాకాలమే పడుతుంది. ఒక వంక నష్టం మరోవంక ఎంతో ఉత్పాదకతను కోల్పోవడం. దీనంతటికి కారణం ఆ వరదలు. ఆ వరదలకు కారణం పర్యావరణ హింస. ఒక ఆకాశ హర్మ్యాన్ని నిర్మించడం కోసం కొన్ని వందలు, వేల చెట్లను నరికి వేస్తున్నప్పుడు పర్యావరణ సమతుల్యం ఎక్కడ ఉంటుంది! ఆ సమతౌల్యం లోపించడంవల్లనే కదా ఇంతటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నది!
ఇప్పుడు అదే దృశ్యం మనకు ప్రతిపాదిత అమరావతిలో కూడా కనిపిస్తోంది. పర్యావరణ నిపుణులు ఎంత గగ్గోలు పెడుతున్నా సింగపూర్ ఆకాశహర్మ్యాల కలల్లో తేలిపోతున్న అధికార నేతలకు అది వినిపించడమే లేదు. ‘అసలు వాస్తవాలు’ పక్కనపెట్టి కలల సౌధాలను నిర్మించుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది? చెన్నైలో అంతటి విలయం అమరావతిలో సంభవిస్తే ఆ నష్టం దానికి పది, పనె్నండు రెట్లు అధికంగానే ఉండగలదని పర్యావరణ వేత్తలు అంటున్నారు. మరి మనం దానిని భరించగలమా? అంతటి ముప్పును ఎందుకు కొని తెచ్చుకోవాలి! గతంలో దివిసీమ ఉప్పెనను చూసాం. ఆ తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో 2009 పెను వరదలను చూశాం. తేలికపాటి వరదలు వస్తేనే ఎన్నో వేల కోట్లలో పెను నష్టం సంభవిస్తున్నట్టు మన ప్రభుత్వాలే అంచనా వేస్తున్నాయి. అటువంటప్పుడు అంతకు పదింతల నష్టాన్ని మనం తెలిసి కూడా ఆహ్వానిస్తున్నామంటే దానిని స్వార్ధ రాజకీయమనుకోవాలా, ప్రజా సంక్షేమమనుకోవాలా!
మన దేశంలో అన్ని మహానగరాల పరిస్థితి ప్రస్తుతం చెన్నై తరహాలోనే ఉంది. దేశంలోని ఐదు మెట్రోనగరాలు 2000 సంవత్సరంనుంచి ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాయి. ముంబయిలో ప్రతి సంవత్సరం వరదలే. సునామీ తరహా వాతావరణం చెన్నైలో ఏటా కనిపిస్తునే ఉంది. మన రాష్ట్రంలోను రుతుపవనాలు గతి తప్పి నడుస్తున్నాయి. వేసవి తాపం ఆ రుతువును దాటి పక్క రుతువుల్లోకి ఆక్రమిస్తోంది. ఆ కారణంగా వానలు గతి తప్పుతున్నాయి. తుపాను వల్ల తప్ప రుతువుల ద్వారా వర్షాలు ఎక్కడ కురుస్తున్నాయి? దీనంతటికీ కారణం పర్యావరణ వైరుధ్యమే. పర్యావరణంలో సమతౌల్యం లోపించి ఇలా వైపరీత్యాలు సంభవిస్తుంటే పాలకుల మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల ఆ వైపరీత్యాల నష్టం ప్రజలపై అనేక రెట్లు ఎక్కువగా పడుతోంది. చెన్నై ఉదాహరణనే చూస్తే అకాల భారీ వర్షాలవల్ల వర్షపాతం అధికంగా ఉన్నమాట నిజమే. కానీ పాలకులు నగర ప్రజల సౌకర్యాలను పట్టించుకోకపోవడంవల్లనే అన్ని డజన్ల కాలనీలు అలా కొన్ని రోజులపాటు 8,9 అడుగుల నీటిలో మునిగిపోయాయి. కోన్నిచోట్ల అపార్టుమెంట్ల రెండో అంతస్తు వరకు నీరు నిలిచిందంటే ఆ పాపం వర్షానిదా? వరదనీరు ప్రవహించడానికి అనువైన ఏర్పాట్లు చేయలేని పాలకులదా? చెరువులన్నిటినీ కబ్జా చేసి ఆకాశ హర్మ్యాలు నిర్మించకపోతే సిటీ బస్సులు తిరగాల్సిన రోడ్లపై పడవల్లో ప్రయాణించవసిన దుస్థితి కలిగి ఉండేది కాదు కదా! ప్రజా సంక్షేమమంటే ప్రజలను నట్టేట ముంచడం కాదు.
గంగ శుద్ధి, యమున శుద్ధి అంటూ ప్రకటనలు చేస్తుంటారు. శుద్ధి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మలినం చేయడం వల్లనే కదా! ఆ మలినం ఎవరు చేసారు. పాలకులే. పరిశ్రమలు పెట్టరాని చోటులో అనుమతి ఇచ్చి వాటి రసాయన వ్యర్ధాలను ఆయా నదుల్లోకి విడుదల చేస్తున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారు. నగరాలను కాంక్రీటు జనారణ్యాలుగా మార్చివేయడంవల్లనే వరదలు సంభవించినపుడల్లా ఇంతటి విపత్తుకు గురి కావాల్సి వస్తోంది. నిరోధించగలిగినా నిర్లక్ష్యం వహించడం వరదల వంటి విపత్తులకు మరో కారణం. చెన్నైలో ఇటీవల కనుచూపు మేరలో నీటి మధ్య ద్వీపాలుగా మారిన అసంఖ్యాక అపార్టుమెంట్‌లను గమనించినపుడు అక్కడ ప్రకృతి వైపరీత్యంతోపాటు పాలకుల నిర్లక్ష్యం కూడా నిలువెత్తున కనిపిస్తుంది. చెరువులు, నాలాలు, నదీ తీరాలు పెద్ద ఎత్తున కబ్జాలకు గురి అయినతీరు కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఇప్పుడు విజయవాడలోను ప్రతిపాదిత అమరావతిలోను కనిపిస్తున్న దృశ్యం కూడా అదే. పాలనా యంత్రాంగమంతా విజయవాడకు తరలించే నేపథ్యంలో అసలు ఈ చిన్న నగరం ఎంతటి వత్తిడిని భరించగలదన్నది విస్మరిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అభివృద్ధిపై పాలకులు చూపిన ఉత్సహం అదే స్థాయిలో మరో నగరం అభివృద్ధిపై చూపలేదు. ముఖ్యంగా సీమాంధ్రలో హైదరాబాద్ స్థాయిలో మరో నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ పాలకులకూ రాలేదు. ఆ కారణంగానే విజయవాడ కానీ, తిరుపతి కానీ, రాజమండ్రి కాని ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాయి. ఇవి పెద్ద పట్టణాలుగా కనిపిస్తాయే కానీ నగర స్వభావం చాలా తక్కువ. సరైన మురుగునీటి వ్యవస్థ చాలా తక్కువ శాతం ఉంది. విశాఖపట్నం కూడా ఇందుకు భిన్నం కాదు. సరైన రహదారి వ్యవస్థ లేని, ఇతర సౌకర్యాలు లేని విజయవాడపై ఇప్పుడు అధిక ఒత్తిడి పెంచడంవల్ల చెన్నై తరహాలో వరదలు సంభవిస్తే వందలు కాదు వేలల్లో ప్రాణనష్టం సంభవించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి ప్లాన్లు తయారు చేసుకుంటూ వెళ్తే నష్టపోయేది సాధారణ ప్రజలే. కృష్ణానదీ తీరాన్ని ఇప్పటికే చాలావరకు కబ్జా చేసారు. అమరావతి ప్రణాళికలో ఆ కబ్జా ఇంకా భారీగానే రచిస్తున్నారు.
చెన్నైకంటే పదిరెట్లు ఎక్కువ వైపరీత్యాలకు ఆలవాలమైన అమరావతికి అడుగుపెట్టబోయే ముందు పాలకులు తప్పక ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. 2009లో వచ్చిన వరదలు శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్, ప్రకాశం బ్యారేజి వరకు ఆ పొడవునా వున్న ప్రజలందరినీ ఎంతటి భయాందోళనలకు గురి చేసాయో అందరికీ తెలుసు. మళ్లీ అదే తప్పును ఇప్పుడు మళ్లీ అమరావతిలో కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. పంటపొలాలన్నీ చదును చేసి అక్కడ ఆకాశ హర్మ్యాలను నిర్మించడం వల్ల అది కూడా ఒక ఎకరమో, రెండు ఎకరాల్లో కాదు...30వేలకు పైగా ఎకరాల్లో నిర్మించడంవల్ల వాతావరణ మార్పులు పెరుగుతాయని , అనిశ్చిత వర్షపాతం, వరదలు, కొండ చరియల పతనం అమరావతి ప్రాంతాంలో ఎక్కువ అవుతాయని నిపుణులు చెపుతున్నారు. పర్యావరణ అసమతౌల్యంవల్ల విజయవాడ చుట్టు 150 కిలోమీటర్ల పరిధిలో హటాత్తుగా భూకంపాలు సంభవిస్తాయని కూడా చెపుతున్నారు. అయినా వాటిని లెక్కచేయడం లేదు. కృష్ణానది పక్కనే ఒక మహానగరాన్ని నిర్మిస్తున్నందువల్ల భవిష్యత్తులో వచ్చే పారిశ్రామిక వ్యర్థాలతో ఆ నది హైదరాబాద్‌లోని మూసీ నదిలా మారిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. మూసీ ఒకప్పుడు చాలా పెద్దనది అనీ, క్రమంగా జరుగుతూ వచ్చిన ఆక్రమణల వల్ల అలా పిల్లకాలువలా, మురుగు కాలువలా మారిపోయిందనీ వింటుంటాం. ఇప్పుడదే దుస్థితి కృష్ణానదికి కూడా పట్టబోతున్నదని అధికార నేతల ప్లాన్లను బట్టి అనుకోవాల్సి వస్తుంది.
అభివృద్ధి అవసరమే. కానీ అది అనర్ధంగా మారకూడదన్నది గ్రహించడం చాలా అవసరం. నిర్దేశిత అమరావతి ప్రాంతాంలో 7 శాతం తీవ్ర వరదలకు, 31 శాతం మధ్యస్థాయి వరదలకు, 43 శాతం ప్రాంతం సాధారణ వరదలకు ఆలవాలమై ఉన్నట్టు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అందుకే అమరావతిని భవిష్యత్తులో వరదల నగరంగా చూడవలసి వస్తుందేమో! అనే భయం ఆవహిస్తోంది. కొండవీటి వాగు, కృష్ణానదికి తీవ్రస్థాయిలో వరదలు సంభవిస్తే తొలుత మునిగిపోయేది అమరావతివాసులే. గ్రీన్ ట్రిబ్యునల్ వద్దంటున్నా లెక్కచేయని మనస్తత్వంతో పాలకులు ముందుకు వెడుతున్నప్పుడు ఇక ఏ దేవుడు ప్రజలను రక్షించగలుగుతాడు?
సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారమే చూసినా వారు కూడా కొన్ని హెచ్చరికలు చేసిన విషయం స్పష్టమవుతుంది. విస్తృత ప్రణాళిక ప్రకారం దాదాపు 41 వేల ఎకరాల్లో అమరావతి నగరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చివేస్తే వరదలు సంభవించినపుడు అది మహాసముద్రంలా మారుతుందని అందుకు కొండవీటి వాగు 60 శాతం కారణమైతే, కృష్ణానది 40 శాతం కారణమవుతుంది. ఆ వరదలను నిరోధించడం ఎవరి తరం కాదు. బంగాళాఖాతానికి 130 కిమీ దూరంలో ఒక మహానగరాన్ని నిర్మించదలచినపుడు తీసుకోవాల్సిన జాగత్తల్లో నిర్లక్ష్యం వహిస్తే దానివల్ల ప్రజలు కొన్ని తరాలపాటు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా వారు చెపుతున్నారు.
వాతావరణ మార్పుల ప్రభావం వల్ల అమరావతిలో నివసించబోయే ప్రజలకు దినదినగండమే అని కూడా పర్యావరణ వేత్తలు చెపుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులపై అధ్యయనం చేయడానికి డిసెంబర్ 11న జరిగిన ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో చెన్నై వరదలకు కల కారణాలను అంచనా వేస్తూ అటువంటి వైపరీత్యాలకు గురయ్యే నగరాలు భారత్‌లో ఇంకా 11 వున్నాయని, వాటిలో హైదరాబాద్‌తోపాటు కొత్త రాజధాని అమరావతి కూడా ఉందని చెప్పారు. అధికార నేతలు రియల్ ఆదాయం పెంచుకోవడానికి చూపే శ్రద్ధ ప్రజాసంక్షేమం పట్ల చూపకపోవడం అంటే పర్యావరణ పరిరక్షణకు శ్రద్ధ వహించకపోవడం వల్లనే అటువంటి పర్యావరణ ముప్పు ఎదురయ్యే ప్రమాదం ముంచుకు వస్తోందని అనిపిస్తుంది. హరిత సంహారం పెద్దఎత్తున చేస్తున్న పాలకులు అందుకే సంక్షేమం కంటే ‘సం క్షామా’నికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాద కంటే విలాసవంతంగా వుండే నగరాన్ని నిర్మించాలనే ఆలోచనలో అసలు వాస్తవాలను గాలికి వదిలేస్తున్న పాలకులు ప్రజలను చాలా పెద్ద ప్రమాదంలోకే నెట్టివేస్తున్నారని కూడా అనిపిస్తుంది. ప్రభుత్వాలు మారిపోవచ్చు., కానీ ప్రజలు ప్రమాదంలో పడకూడదు కదా!

- అడుసుమిల్లి జయప్రకాష్ సెల్: 98481-28844