మెయిన్ ఫీచర్

స్వేచ్ఛలో నియంత్రణ? (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీలో వేడి ఉంటే, భయం కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఏదో ఒకటి చెయ్యక తప్పదు. అందుకే నియంత్రించుకోవడమనే విషప్రయోగంతో ఎవరినివారే చంపుకుంటారు.
‘‘ఎప్పటికీ హాయిగా జీవించకూడదు’’అనేది నియంత్రణలో ఉన్నవారికి తెలిసే ఏకైక జీవిత పరిష్కారం. కాబట్టి, బుద్ధవిగ్రహంలా ఉండండి. అప్పుడు మీరు క్రమశిక్షణ పొందిన సహనశీలిగా నటించగలరు.
కానీ నేను ఇక్కడ బోధించేది అది కాదు. విచ్చలవిడి తనాన్ని విడిచిపెట్టినట్లే నియంత్రణను కూడా మీరు విడిచిపెట్టాలంటాను. అంటే మీరు చిక్కులో పడినట్లే. ఎందుకంటే, విచ్చలవిడితనం, నియంత్రణలలో ఏదో ఒక దానిని మాత్రమే మీరు ఎంచుకోగలరు. ఎలాగంటే, ‘‘నియంత్రణను వదిలి విచ్చలవిడిగాను, విచ్చలవిడిని విడిచిపెట్టి నియంత్రణలోను ఉండొచ్చు’’ కదా!’’అని మీరు అడగవచ్చు. నిజమే. కానీ, మీరు ఎరుకలో ఉన్నట్లైతే నియంత్రణ, విచ్చలవిడితనాలు మీనుంచి వాటంతటవే తొలగిపోతాయి. ఎందుకంటే, అవి రెండూ ఒకే విషయానికి సంబంధించిన రెండు అంశాలు. ఎరుకలో ఉంటే వాటి అవసరముండదు.
పద్దెనిమిదేళ్ళ కుర్రాడు ఒకరోజు తన తండ్రితో ‘‘ఇంతకాలం మీ నియంత్రణలో నలిగిపోయాను. నా వయసు కుర్రాళ్ళందరూ చక్కగా తాగుతూ, అమ్మాయిలతో తిరుగుతూ హాయిగా ఆనందిస్తున్నారు. నేను కూడా అలాంటి సాహసాలుచేసి, వాటి అనుభూతిని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇల్లువిడిచి వెళ్తున్నా. నన్ను ఆపేందుకు ప్రయత్నించకండి. వెళ్ళొస్తా’’అన్నాడు. వెంటనే అతని తండ్రి ‘‘ఉండరా బాబూ! నేను కూడా నీతో వస్తాను. ఇంతకాలం నేనుకూడా నా తల్లిదండ్రుల నియంత్రణలో అలాంటి సాహసాలు చెయ్యలేదు’’ అన్నాడు కొడుకుతో.
నియంత్రించబడిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారు లోలోపల రగిలిపోతూ, విచ్చలవిడిగా తిరిగే అవకాశంకోసం నిరంతరం నిరీక్షిస్తూ ఉంటారు.
భారతదేశం మఠాలలో ఉండే సన్యాసులను గమనించండి. వారందరూ కామదాహంతో రగిలిపోయే మానసిక రోగులే. కానీ, వాస్తవ పరిస్థితిని సరిగా అర్థంచేసుకోవాలి. ఎందుకంటే, మీరు కామోద్రేకాన్ని అణిచేస్తే మానసిక రోగులవుతారు. మానసిక రోగాన్ని అణిచేస్తే కామోద్రేకులవుతారు. అలా మీరు ఏదో ఒకటి అవాల్సిందే. అయితే అవి రెండూ పిచ్చికి సంబంధించిన రోగాలే. కాబట్టి, ఎవరూ కామోద్రేకులుగా, మానసిక రోగులుగా అవకూడదు.
అందరూ తమకు తాముగా ఉంటూనే, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను మనస్ఫూర్తిగా అంగీకరించేందుకు, అనుభవించేందుకు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే మీరు ఎప్పుడూ పరిపూర్ణ చైతన్యంతో కూడిన ఎరుకతో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఎప్పుడూ ఆత్మస్మృతిలోనే ఉండాలి. ఇదే మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం. మిమ్మల్ని మీరు ఎప్పుడూ మరచిపోకూడదు. అలాగే మీరు ఎప్పుడూ మీ ఉనికి అంతర్గత కేంద్రంనుంచే ముందుకు కదలాలి. మీరుచేసే పనులన్నీ అక్కడినుంచే జరగాలి. అప్పుడు మీరుచేసే ప్రతి పని ధర్మమవుతుంది.
ఎరుకచేసే పనులలో ఒకటి ధర్మం. పైపైన మీరుచేసే పని పైకి పాపకార్యంలా కనిపించకపోవచ్చు. అందువల్ల అది సమాజానికి నచ్చవచ్చు. సమాజం మిమ్మల్ని కీర్తించవచ్చు. అయినా అది పాపకార్యమే. ఎందుకంటే, మీకు తెలుసు ఆ పని చేసినందువల్ల అనవసరంగా మీరు మీ జీవితాన్ని కోల్పోయారని. అందువల్ల మీలోమీరు మిమ్మల్ని నిందించుకుంటూనే ఉంటారు. కాబట్టి, మీలోమీరు సంతోషంగా ఉండలేరు.
సమాజం మిమ్మల్ని సన్యాసిగా కీర్తించడంలో అర్థమేముంది, అందువల్ల మీకు దక్కేదేముంది? అన్నీ సొల్లుకబుర్లే. వాటికోసం, మీచుట్టూ ఉన్న మూర్ఖుల మెప్పుకోసం మీరు మీ జీవితంతోపాటు దివ్యత్వాన్నికూడా కోల్పోయారు. అందువల్ల అవి ముఖ్యవిషయాలు ఎలా అవుతాయి? జీవితాన్ని మీ అంతర్గత కేంద్రంనుంచి జీవించడం ప్రారంభించండి. ధ్యానమంటే అదే.
ఇంకావుంది...
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్