మెయన్ ఫీచర్

సమాఖ్య విధానం మారాలా? ఎన్నికల ప్రక్రియ మారాలా ??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని ఆ మధ్య కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యానించినా అందులో చాలా లోతైన విష యం ఉంది. 68 ఏళ్ల క్రితం అప్పటి ప్రజల ఆకాంక్షలను, కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. ఎన్నో దేశాలు కాలమాన పరిస్థితులను బట్టి తమ విధానాలను, రాజ్యాంగాన్ని మార్చుకున్నాయి. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా కొన్ని దేశాలు కలిసి సమాఖ్యగానూ ఏర్పడ్డాయి, మరికొన్ని విడిపోయాయి.
చైనాని ఉదాహరణగా చూపిస్తూ అంత పెద్ద దేశం విధానాల్ని మార్చుకుని ముందుకి వెళ్ళగా లేనిది మనం వెళ్ళలేమా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నిజమే.. అభివృద్ధిలో చైనాని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. దానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తీసుకొచ్చిన సంస్కరణలే. కానీ జీవితకాలం అధ్యక్షుడుగా జిన్ పింగ్ కొనసాగుతారని చైనా పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మన దేశానికి అన్వయించాలనుకోవటం దుస్సాహసం. చంద్రబాబు కూడా ప్రభుత్వాలు స్థిరంగా కొనసాగినప్పుడే అభివృద్ధి సాధ్యమని, దానికి ఉదాహరణగా దుబాయ్ , సింగపూర్ లని చెబుతూ ఉంటారు. దుబాయ్,సింగపూర్‌లలో కూడా అభివృద్దికి కారణం ఆయా దేశాల పాలకులే. కాని అవి ప్రజాస్వామ్య దేశాలు కాదు. రాచరికంతో సుదీర్ఘంగా ఏక వ్యక్తి పరిపాలనలో ఉన్న దేశాలవి. మనం వారి విధానాలని అన్వయించుకోవాలి తప్ప రాజకీయ వ్యవస్థ ని కాదు.
మన దేశంలో ఇప్పుడు విధానాల అమలుకు పెద్ద అడ్డంకి మన రాజకీయ వ్యవస్థ, ఫెడరల్ రాజ్యాంగం. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, పాలన కంటే ఏటా ఏదో ఒక రాష్ట్రంలో వచ్చే ఎన్నికల మీద దృష్టి పెట్టడం తోనే సరిపోతోంది. జిఎస్‌టి అమలుతో రాష్ట్రాల మీద కేంద్రం అజమాయిషీ ఎక్కువైంది. రాష్ట్రంలో కట్టిన పన్నులన్నీ కేంద్రానికి వెళ్ళటం, మళ్ళీ అవన్నీ తిరిగి రాష్ట్రానికి రావటం అంతా ఒక ప్రహసనం అయితే , అందులో మళ్ళీ జనాభా ప్రాతిపదికగా పన్నుల్లో వాటా నిర్ణయించటం మీద కొన్ని రాష్ట్రాలకి తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అంటూ ఎక్కడో మారుమూల గ్రామాల్లో వేసే సిమెంట్ రోడ్లకి ప్రధానమంత్రికి ఏమిటి సంబంధం? అని కేసీఆర్‌గట్టిగానే ప్రశ్నించారు.
కేంద్రం మిధ్య అని ఎన్టీఆర్ ఎప్పుడో వ్యాఖ్యానించినా, ఆ ప్రభావం గత 25 సంవత్సరాల్లో ప్రజలమీద పడలేదు. ఇప్పుడు రాజకీయాలు ప్రజల జీవితంలో భాగమై పోయాయి. కేంద్రం అవలంబించే విధానాలపై సామాన్యుడికి కూడా అవగాహన వచ్చేసింది. రాష్ట్రాల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై ప్రతి ఒక్కరికి విసుగు, కోపం వస్తోంది. ఇంకొన్ని సంవత్సరాల్లో మేము దేశం నుండి విడిపోతాం అనే ఉద్యమాలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. దేశం అంతా అభివృద్ధి పథంలో కొనసాగాలంటే కేంద్ర రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. దేశ, రాష్ట్ర స్థాయిలో ఉత్సవ విగ్రహాలుగా ఉండే రాజకీయ పదవులు పోవాలి. పన్నుల వసూళ్ళ మీద, అభివృద్ధి పథకాలు , పారిశ్రామిక విధానాల మీద రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉండాలి.
కొన్ని సమాఖ్య దేశాల్లో పాలనా వ్యవస్థలను పరిశీలిస్తే- దుబాయ్ ఒక దేశం అయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే సమాఖ్యలో ఒక భాగస్వామ్య దేశం. మరో ఆరు దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. వీళ్ళందరికీ పెద్దన్న అబుదాబి రాజు. దుబాయ్ రాజు అందరికీ ప్రధానమంత్రి. ఈ ఏడు దేశాల స్థానిక అధికారాలన్నీ అంతా ఆయా దేశాల పాలకుల చేతిలోనే ఉంటాయి. పారిశ్రామిక విధానాలన్నీ ఎవరికీ వారే నిర్ణయించుకుంటారు. ఒక దేశంలో మద్యం నిషేధం, పక్కన 5 కిలోమీటర్ల దూరంలో మరో దేశానికీ వెళితే అక్కడ అన్నీ ఓపెన్. ఈ ఏడు దేశాల్లో ప్రజలు ఎక్కడైనా ఉండచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. కేవలం విదేశీ సంబంధాలు, దేశ రక్షణ, రిజర్వు బాంక్, సైన్యం వంటివి అబుదాబి నిర్వహణలో ఉంటాయి. సమాఖ్యలో ఉన్న ఏ దేశమైనా వీటిని ఉల్లంఘిస్తున్నపుడు మాత్రమే అబుదాబి కలుగచేసుకుంటుంది. మిగతా అధికారాలన్నీ స్థానిక పాలకుల చేతిలోనే ఉంటాయి. నేషనల్ హైవేలు, వనరులు తక్కువగా ఉన్న దేశాలకి ఆర్థిక సాయం అంతా ఫెడరల్ ప్రభుత్వమే చేస్తుంది. కాని ఎవరిమీదా పెత్తనం ఉండదు.
యురోపియన్ సమాఖ్య 1995లో ప్రారంభమై, నేటికి 26 దేశాలతో కలిసి కొనసాగుతున్న ఫెడరల్ వ్యవస్థగా పేరొందింది. ఇందులో కూడా ఎవరి పాలన వాళ్ళదే, ఎవరి కరెన్సీ వారిదే. కొన్ని ముఖ్యమైన విధానాలపై మాత్రమే యూరోపియన్ పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి దేశం నుండి ప్రతినిధులు పార్లమెంట్‌కి పంపబడతారు. సమాఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు, బిల్లులు ఆమోదించేటప్పుడు తమ దేశ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని ఓటు వేస్తారు. ఈ సమాఖ్యకి అధ్యక్షుడు ఉంటాడు తప్ప సమాఖ్య దేశాల్లో అంతర్గత విషయాల్లో పార్లమెంటు జోక్యం ఉండదు. కేవలం ఉమ్మడి విధానాల కోసమే పార్లమెంట్ ఉంటుంది.
ఇప్పుడు మన ఎన్నికల వ్యవస్థకి వద్దాం. పైన పేర్కొన్న దేశాల విధానాలని మనం యథాతథంగాగా అన్వయించుకోలేకపోయినా మనకి అనుకూలంగా ఉండే వ్యవస్థని మనం తీసుకోవచ్చు. మన దేశంలో ప్రతి 6 నెలలకి ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. జాతీయ పార్టీలన్నీ తమ బల నిరూపణకి వేదికగా వాటిని వాడుకోవటం, ఆ సమయంలో పాలనా వ్యవస్థ స్తంభించటం పరిపాటి. రాష్ట్రాల్లో పాగా వెయ్యాలనే జాతీయ పార్టీల అత్యాశ- ఆయా రాష్ట్రాల ఆత్మగౌరవ సమస్యగా మారింది. 30 కోట్ల జనాభా ఉన్నపుడు పెట్టుకున్న ఎన్నికల వ్యవస్థ ఇప్పుడు 130 కోట్లమంది ఉన్న భారత ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా తయారైంది.
మనం దుబాయ్ , సింగపూర్‌లా రాచరికం వైపు వెళ్ళాలనుకోము. అలా అని చైనా లాగా నియంతృత్వాన్ని సమర్ధించం. ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థని రాష్ట్రాలస్థాయిలో యథావిధిగా కొనసాగిస్తూనే కేంద్ర స్థాయిలో ఎన్నికల వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకి పూర్తి అధికారం ఇచ్చి కేంద్రం కేవలం పర్యవేక్షణ చేస్తే తప్ప దేశం అభివృద్ధి చెందదు, ఈ ఆత్మగౌరవ సమస్య చల్లారదు. ముఖ్యంగా రిజర్వేషన్లు , ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక విధానాలపై అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉంటే ఆయా ప్రాంతాలని బట్టి, జనాభాని బట్టి స్థానిక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. అసలు పార్లమెంట్‌కి ఎన్నికలే లేకుండా నేరుగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిపితే మధ్యలో ఈ అవిశ్వాసం, ఎన్నికల ఖర్చు లేకుండా ఐదేళ్ళ పాటు దేశాధ్యక్షుడు ఉంటాడు. ప్రతి రాష్ట్రం నుండి ఇప్పుడున్న మాదిరిగా ఆరుగురు ఎంఎల్‌ఏ లకి ఒక ఎంపీ చొప్పున అధికారపక్షం, విపక్షాలు పార్లమెంట్‌కి నామినేట్ చేస్తే సరిపోతుంది. దేశానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, ఆయా పార్టీల అభ్యర్దులకు ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. అధ్యక్షుడిని ప్రజలే నేరుగా ఎన్నుకోవటం వల్ల పదవి పోతుందనే భయం ఉండదు. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగుతాయి. దేశరక్షణ, రిజర్వ్ బాంక్ , విదేశీ విధానాలు, దౌత్య సంబంధాలు ,సిబిఐ తదితర దేశ స్థాయి వ్యవస్థలన్నీ అధ్యక్షుడి నిర్వహణలో ఉంటాయి. ఉమ్మడి ఒప్పందాలన్నీ పార్లమెంట్ వేదికగా మెజారిటీ సభ్యుల మద్దతుతో జరుగుతాయి. అసలు రాజ్యసభ, లోక్‌సభ అంటూ రెండు సభలు అవసరం లేదు , రాష్టప్రతి, గవర్నర్ వ్యవస్థలు అవసరం లేదు. పరిమిత అధికారాలు ఉండటం వల్ల దేశ స్థాయిలో అవినీతి తగ్గిపోతుంది. ప్రతి రాష్ట్రం నుండి నామినేట్ అయిన ఎంపీలు కేవలం ఉద్యోగులుగా పరిగణించబడతారు తప్ప వారికి అధ్యక్షుడిని దించే అధికారం కాని, ఎన్నుకునే అధికారం కాని ఉండదు. అధ్యక్షుడు ఏదైనా నచ్చని నిర్ణయాలు తీసుకుంటే పార్లమెంట్‌లో తమ ఓటు ద్వారా బిల్లులను నియంత్రించే అధికారం మాత్రమే ఉంటుంది. ప్రజలేఅధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నా ప్రాంతీయపార్టీల మద్దతు పోటీ లో ఉన్న వారికి ఉంటుంది. అలాతనకి మద్దతు ఇచ్చిన పార్టీల ఎంపీలని మంత్రులుగా నియమించుకోవచ్చు.
ఇక జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించుకోవలసిన అవసరం ఉండదు , కప్పల తక్కెడ లాగా ఫ్రంట్ లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రాజకీయం అంతా ఆయా రాష్ట్రాల స్థానిక పార్టీల చేతుల్లో ఉంటుంది. పూర్తి అధికారం ఉండటం వల్ల రాష్ట్రాలు ప్రగతి లో పోటీ పడతాయి. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది , రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందుతాయి. ప్రతి రాష్ట్రం తమ జనాభా ప్రాతిపదికన తిరిగి ఇచ్చేవిధానం లేకుండా పన్నులు కేంద్రానికి చెల్లిస్తే సరిపోతుంది. దేశ నిర్వహణకి, జాతీయ విపత్తులు వచ్చినపుడు ఆదుకోవటానికి ఆ మొత్తం వెచ్చిస్తారు. ఇక రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఆయా రాష్ట్రాలు కూర్చుని చర్చించుకుంటే సరిపోతుంది. సమస్యలు పరిష్కారం కానప్పుడు సుప్రీం కోర్టు ఎలాగూ ఉంది. అన్నిటినీ మించి ఈ పార్లమెంటులో రాజకీయ నాయకులు పోయి ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులు వస్తారు. భవిష్యత్తులో దేశం కలిసి ఉండాలంటే మాత్రం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థని మార్చుకోవటం అవసరం. లేదంటే రాజకీయ అనిశ్చితితో పార్లమెంటులో- డ్రామాలు తప్ప అభివృద్ధిని చూడలేం.

-రాజేష్ వేమూరి