మెయిన్ ఫీచర్

ట్రెండీ.. ట్రెండీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా కట్టగలదు.. అనేది అలనాటి ఓ సామెత.. కానీ జుట్టు లేనమ్మ కూడా నచ్చినన్ని కొప్పులేసుకోగలగడం నేటి సంగతి.. ఒక్క కొప్పులేం ఖర్మ.. పోనీలు, జడలు, రకరకాల హెయిర్ స్టైల్స్.. ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా కొప్పులు వేసుకోవచ్చు. ఎలా..? అనుకుంటున్నారా.. ఏముంది సింపుల్.. హెయిర్ ఎక్స్‌టెన్షన్లతో అని సమాధానం చెప్పేస్తారు నేటి తరం అమ్మాయిలు. వేసుకున్న మోడ్రన్ డ్రెస్‌కి తగినట్లుగా కొత్త హెయిర్‌స్టైల్ ప్రయత్నించాలి అనుకున్నారనుకోండి.. దానికోసం జుట్టును కత్తిరించాలి.. మళ్లీ సాయంత్రం పార్టీకో, మరెక్కడికో వెళ్లాలంటే ఆ హెయిర్ స్టైల్‌తో వెళ్ళలేం.. ఆఫీసుకు వెళ్లాలంటే ఫంకీ స్టైల్ పనికిరాదు.. ఇలాంటప్పుడు అనిపిస్తుంది.. జుట్టుని మనకు నచ్చినట్లు వేసుకుని మళ్లీ మామూలుగా మన జుట్టు మనకు ఉండేలా ఏదైనా మ్యాజిక్ చేస్తే బాగుండు అని.. ఇలాంటి మాయాజాలానికి ప్రతిరూపమే హెయిర్ ఎక్స్‌టెన్షన్లు..
అమ్మాయిలు డ్రెస్‌కు తగ్గట్టుగా గాజులు, జూకాలు పెట్టుకున్నట్లే జుట్టునీ రకరకాలు మార్చుకోవచ్చు. పూటకోరకంగా దాన్ని మెరిపించేయొచ్చు. కావాలంటే కొప్పుని సింగారించొచ్చు. అంతలోనే పొడవాటి జుట్టును హాయిగా అలా అలా విరబొయ్యొచ్చు.. అలాగని ఇవి విగ్గులో, సవరాలో కాదు. మన జుట్టుని, మనలాగే కనిపించేలా చేసి దాన్ని ఇంకొంచెం మందంగానో, మరికాస్త పొడవుగానో, రకరకాల రంగుల్లోనో కనిపించేలా చేసే రకరకాల హెయిర్‌క్లిప్పులివి. అచ్చంగా చెప్పాలంటే పాతకాలపు సవరాలకు అప్‌డేటెడ్ వర్షన్లు. ఇన్ని రోజులు చిన్న జుట్టు ఉన్నవారు లంగావోణీ వేసుకున్నప్పుడో, పెళ్లిళ్లు, పేరంటాల్లో కుచ్చుల జడ వేసుకోవాలంటే సవరాన్ని వేసుకునేవారు. దీనికి జడగంటలు, జడ బిళ్లలను పెట్టి ఎక్కువ పూల పెట్టుకుని అందంగా వాలుజడా.. మల్లెపూల జడా.. అని అబ్బాయిలు పాడుకునేటట్లు వయ్యారాలు పోయేవారు. దాంతో పెద్ద జడ లేదు అన్న లోటు తీరిపోయేది. కానీ సవరం పెట్టుకోవాలంటే జడే వేసుకోవాలి. జుట్టు విరబోసుకోవడానికి, క్లిప్ పెట్టి వదిలేయడానికి ఇది పనికిరాదు. అలాంటప్పుడు ఈ హెయిర్ ఎక్స్‌టెన్షన్లు భలేగా పనికొస్తాయి. వేడుకను బట్టి, డ్రెస్సును బట్టి హెయిర్‌స్టైల్‌ను మార్చేసుకునేందుకు ఇవి సహకరిస్తాయి.
జుట్టుని సహజంగా కనిపించేలా చేస్తూ, దానికి మరింత అందాన్ని తీసుకొచ్చేలా తయారవుతున్న ఈ హెయిర్ ఎక్స్‌టెన్షన్లు మార్కెట్లో చాలా ఉన్నాయి. పంజాబీ డ్రస్, గాగ్రాల్లాంటివి వేసుకున్నప్పుడు జుట్టు విరబోసుకుంటేనే అందం. అలాంటి సందర్భాల్లో జుట్టుని ఒత్తుగా కనిపించేలా చేసేందుకు ‘ఇన్‌స్టంట్ వాల్యూమ్ అండ్ థిక్‌నెక్ హెయిర్ క్లిప్’లు బాగా పనికొస్తాయి. మన జుట్టుని విరబోసి పై సగభాగాన్ని ముడివేసి మిగతా భాగానికి ఈ హెయిర్ క్లిప్ పెట్టేసి మళ్లీ ముడివేసిన జుట్టుని దీని మీదుగా వదిలేస్తే మన జుట్టే ఎంతో మందంగా ఉన్నట్లు కనిపిస్తుంది. స్ట్రెయిట్ హెయిర్‌తో పాటు కర్లీ హెయిర్ వారికీ నప్పేలా ఈ రకం ఎక్స్‌టెన్షన్లు కూడా దొరుకుతున్నాయి. స్టైల్ పోనీ కోసం అయితే ‘టై ఇన్ పోనీ టెయిల్ ఎక్స్‌టెన్షన్లు’ దొరుకుతున్నాయి. మామూలుగా పోనీటెయిల్ వేసుకున్నాక దీన్ని రిబ్బనులా ముడి వేసుకుంటే సరి. పోనీటెయిల్ చుట్టూ మరో వరుస జుట్టు చేరిపోతుంది. ఈ పోనీటెయిల్స్‌లో నచ్చినట్టు వేసుకునేలా పొడవాటివి, పొట్టివీ, మధ్యరకానివి దొరుకుతున్నాయి. పైగా కొన్నింటికి ఇప్పటి ట్రెండ్‌ను అనుసరించి రకరకాల రంగులు వేస్తున్నారు. జుట్టుకి హైలెట్స్ చేసినట్టుగా కనిపించేవీ వీటిలో వస్తున్నాయి. వీటితో జుట్టుని ఏమాత్రం ముట్టుకోకుండానే ట్రెండీ హెయిర్ కలర్ పోనీస్‌లో అమ్మాయిలు ప్రత్యక్షమవ్వచ్చు. పోనీకే క్లిప్పులు పెట్టినట్లుగా పెట్టుకునే ‘క్లా క్లిప్ పోనీస్’ తయారవుతున్నాయి. జుట్టు మొత్తం చిన్న చిన్న జడల్లా అల్లే పోనీలూ వీటిలో ఉంటున్నాయి. వీటితో క్షణంలో అందంగా తయారవచ్చు. ఇంతేకాదండోయ్.. ముందువైపు ఫంక్‌లా కత్తిరించుకోవాలంటే చాలామందికి బెరుకు.. మళ్లీ ఆ జుట్టు పెరగాలంటే చాలా సమయం పడుతుందని.. మరికొందరికి అంత జుట్టు ఉండదు. అలాంటివారందరికీ చిన్న హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నట్టో, చిన్న క్లిప్ పెట్టుకున్నట్టో ఫంక్‌నీ పెట్టేసుకునే వీలుంది. దీన్ని ‘క్లిప్ ఇన్ ఫ్రంట్ హెయిర్ ఎక్స్‌టెన్షన్’ అంటారు. ఇక ముడి సంగతి తెలిసిందే.. ఎప్పటినుంచో రకరకాల ముడులు మార్కెట్లో ఉంటున్నాయి. క్లిప్ ఇన్ హెయిర్ బన్‌లుగా పిలిచే వీటిలో రకరకాల జడ అల్లికలు, పువ్వులు అద్దిన ముడులు, జుట్టునే రకరకాలుగా ముడిచిన ముడులు.. ఇలా బోలెడు రకాలుగా కనిపించే ముడులు మార్కెట్లో ఉన్నాయి. బోలెడన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో కూడా ఇవి అమ్ముడవుతున్నాయి.. ఇంకెందుకాలస్యం.. వెంటనే ప్రయత్నించండి మరి!