ఎడిట్ పేజీ

మాయం కానున్న మావోయిజం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ మన్యంలో ఇటీవల ఇద్దరు ప్రజానాయకులను హత్యచేసిన మావోయిస్టులకు సహకరించిన నలుగురిని పోలీసులు గుర్తించారు. డుంబ్రిగూడకు చెందిన యేడేల సుబ్బారావు, అతని భార్య ఈశ్వరి, ఆంత్రాగూడకు చెందిన గెమ్మిలి శోభన్, తడ్డకు చెందిన కొర్రా కమల మావోయిస్టులకు సంఘటన జరిగిన రోజున సహకరించినట్టు విచారణలో వెల్లడైంది. ‘గ్రామదర్శిని’ కార్యక్రమం ఖరారైనప్పటి నుంచి మావోయిస్టులకు వీరు తెదేపా నేతలకు సంబంధించిన సమాచారం అందిస్తూ వచ్చారని, సంఘటనకు రెండు రోజుల ముందు ముగ్గురు మావోలు రెక్కీ నిర్వహించారని, వారికి సుబ్బారావు, శోభన్‌లు భోజనం పెట్టి ఆశ్రయం కల్పించారని తేలింది. ఘటనకు ఒక రోజుముందు సుమారు 50 మంది మావోయిస్టులు వచ్చారని, వారిలో కోరాపుట్ (ఒడిశా) డివిజన్ కమిటీకి చెందిన నందాపూర్, నారాయణపట్నం దళాలకు చెందిన వారున్నారని విచారణలో వెల్లడైంది. ఈ దాడికి మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ రూపకల్పన చేశాడని, చలపతి, అరుణ అమలు జరిపారని కూడా తెలిసింది.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మీనా ఈ హత్యాకాండ కుట్రలో పాల్గొన్నదని తేలింది. అరకు తెదేపా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు కాల్చి చంపేముందు డుంబ్రిగూడ ‘క్వారీ’ గూర్చి, నియోజకవర్గం అభివృద్ధిపై కొన్ని ప్రశ్నలు సంధించి తుపాకీ గుళ్లు కురిపించారని వెల్లడయింది. ఇద్దరు నేతలను చంపిన తర్వాత మావోయిస్టులు సరిహద్దులు దాటి ఒడిశా అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఈ సంఘటన అనంతరం ఓ వైపు విచారణ జరుగుతుండగా మరోవైపు పోలీసులు గాలింపుచర్యలు ముమ్మరం చేయడంతో ఏఓబీలో అక్టోబర్ 12న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ మావోయిస్టు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్ మీనా మరణించింది. మరో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి మరింత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ క్రమంలో కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలు విశాఖ మన్యం దాడిలో పాల్గొన్న మావోలవి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. మరుసటి రోజు మావోయిస్టులు ఏఓబీలో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదు, గాయపడనూ లేదు. కాని మావోలు తమ ప్రతిఘటనను వ్యక్తం చేశారు.
కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని తోంగుపాల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కొవ్వాసి దేవా అనే మావోయిస్టు మరణించాడు. ఈ ఘటన ఒడిశా- -ఆంధ్ర-్ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో జరగడం విశేషం. ఇద్దరు ప్రజానాయకుల హత్యల అనంతరం పోలీసులు మావోయిస్టులను గాలిస్తూ అనేక చర్యలు చేపట్టి కొంత విజయం సాధించారు. ఇదే సమయంలో సుకుమా జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఒక్కొక్కరిపై రూ.8 లక్షల రివార్డు ఉంది. దాంతో వారు కీలకమైన మావోయిస్టులేనన్న సంగతి తెలుస్తోంది.
మావోయిస్టుల ఆర్థిక మూలాలపై దాడిచేసే పనిలో దర్యాప్తు సంస్థలు పడ్డాయి. ఖనిజ సంపదతో వ్యాపారం చేసే కంపెనీల లావాదేవీలను జాతీయ దర్యాప్తుసంస్థ (ఎన్‌ఐఏ) పరిశీలిస్తోంది, సోదాలు జరుపుతోంది. విశాఖ ఏజెన్సీలో జంటహత్యల అనంతరం భువనేశ్వర్‌లో ఆంధ్ర-ఒడిశా డీజీపీల సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాలూ మావోయిస్టులకు సంబంధించిన సమాచారం పరస్పరం మార్పిడి చేసుకోవాలని మరోసారి నిర్ణయించారు. నిఘాలోనూ సమాచారం పంచుకోవాలని తీర్మానించారు. అక్టోబర్ ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా-దంతెవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఇది ప్రజాప్రతినిధుల హత్య అనంతరమే జరిగింది. కొందరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన జరిగిన స్థలం నుంచి పోలీసులు ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు వారం రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లో రూ.3 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఒడిశాలో ఒక బొగ్గు గనిని జాతికి అంకితమిచ్చారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో జరిగిన సభల్లో ప్రధాని ప్రసంగించారు. ఝుర్సుగూడ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఇలా ఛత్తీస్‌గఢ్‌ను ఇప్పుడు ఆకాశమార్గంతో కలిపే పనులు వేగంగా జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం బస్తర్‌లోనూ విమానాశ్రయాన్ని ప్రధాని జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. బస్తర్ తదితర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని పర్యటనలు జరుపుతూ యువతకు ఉపాధి కల్పించే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతున్నారు. బస్తర్‌లో ఓ స్టీల్ ఫ్యాక్టరీ సైతం రాబోతోంది. బస్తర్‌లో ఇప్పుడు ‘అభివృద్ధి విప్లవం’ రెక్కవిప్పుకుంటోంది.
శాంతిభద్రతలను కాపాడేందుకు కొత్తగా 15 సీఆర్‌పీఎఫ్ క్యాంపులను ప్రారంభిస్తున్నట్టు ఆ దళాల డైరెక్టర్ జనరల్ ఆర్.ఆర్.్భట్నాగర్ ఇటీవల తెలిపారు. దండకారణ్య మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న హిడ్మాను తుదముట్టించడం తమకో సవాల్‌గా నిలిచిందని చెబుతూనే, క్రమంగా మావోల ప్రభావం తగ్గుతోందని ఆయన అన్నారు. సెప్టెంబర్ ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతోపాటు నలుగురు మావోయిస్టులు మరణించారు. మరికొందరు పారిపోయారు. ఘటన స్థలంలో పోలీసులకు కొన్ని ఆయుధాలు లభ్యమయ్యాయి. అందులో ఒక ఇన్నాస్ రైఫిల్ ఉంది. మావోయిస్టులకు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న నష్టం, ఎదురుదెబ్బల నేపథ్యంలోనే మన్యంలో గిరిజన ప్రజాప్రతినిధులైన కిడారి సర్వేశ్వరరావు, సోమల హత్యతో తమ ఉనికి చాటుకునే ప్రయత్నం వారు చేశారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ హత్యల వల్ల మావోయిస్టు పార్టీ పట్ల జనంలో ఉన్న కాస్త సానుభూతి కరిగిపోయిందని, చెడ్డపేరు వచ్చిందని విశే్లషకుల అభిప్రాయం.
ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు మావోయిస్టు నాయకుడు కోటి పురుషోత్తం, అతని భార్య వినోదిని లొంగిపోయారు. ఆ సందర్భంగా వారు తమ పార్టీపై వెల్లడించిన అభిప్రాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మావోయిస్టు పార్టీలో స్వార్థం పెరిగిపోయిందని, కులతత్వం పెచ్చరిల్లిందని, మానవ సంబంధాలు లుప్తమయ్యాయని చెప్పడంతో ఆ పార్టీ ఎంత బలహీనంగా కొనసాగుతున్నదో ఇట్టే అర్థమవుతోంది. ‘వాపు’ను బలంగా భ్రమసి మావోయిస్టులు పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నప్పటికీ అంతిమంగా సాంకేతిక పరిజ్ఞానం సమాజమంతటా విస్తరించిన నేపథ్యంలో, జీవన విధానం సంపూర్ణంగా మారిన సందర్భంలో అనేకానేక కొత్త ఆవిష్కరణలు సాధారణ ప్రజల ముంగిళ్ళలోకి చేరుకుంటున్న తరుణంలో సాయుధ విప్లవానికి, మావోయిస్టులు చెప్పే నూతన, ప్రజాస్వామిక విప్లవానికి ఇక తావెక్కడిది? ఆర్థిక రంగంలో అనూహ్య మార్పులొచ్చాయి. ఆవిష్కరణలకు ప్రతిబింబంగా ఆర్థిక రంగం నిలుస్తోంది, ఈ నూతన సంధ్యాసమయంలో మావోయిజం మటుమాయం కావడం ఖాయం.
అంతర్యుద్ధానికి ఆజ్యం...
వరవరరావు సహా మరో నలుగురు హక్కుల నాయకులను వెంటనే విడుదల చేయాలని ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ మరి కొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసింది. నిందితుల గృహ నిర్బంధం గడువును పొడిగించింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు, అక్కడి ప్రభుత్వం విజయం సాధించినట్టయింది. ఆ ఐదుగురిని ఆషామాషీగా అరెస్టు చేయలేదని, తగిన సాక్ష్యాలు ఉన్నందువల్లనే అరెస్టు చేశామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సుప్రీం తీర్పు అనంతరం అభిప్రాయపడ్డారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టు విషయంలో లభించిన సాక్ష్యాల కన్నా ఎంతో ఎక్కువస్థాయిలో నిర్దిష్టమైన సాక్ష్యాలు ఉన్నందువల్లనే వారిని అరెస్టు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారివద్ద ‘హార్డ్‌డిస్క్’లు లభించాయి. మరింత సమాచారం లభ్యమైంది. అదంతా పత్రికల వారికి అందజేయడం వీలుకాదు. సంబంధిత కోర్టుల ముందు పెడతామన్నారు. దర్యాప్తు సంస్థలు ఎంతో పరిశోధన చేసి విలువైన సమాచారం ప్రోదిచేశాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం పిటిషన్‌దారులు- రొమిలా థాపర్ మరికొందరు ప్రధాన న్యాయమూర్తి తీర్పును ఖండిస్తూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. అది వారి వైఖరిని చాటుతోందన్నారు. మావోల మాదిరి వీరికి సైతం వివిధ చట్టబద్ధ సంస్థలపై విశ్వాసం లేదన్న రీతిలో వ్యవహరించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకుముందు ముంబయ్‌లో కొందరు ‘నేను సైతం అర్బన్ నక్సల్’- అన్న మాటను విస్తృతపరిచారు. అలాంటి చేష్టలన్నీ దేశ వ్యతిరేకమని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నారన్న అంశంపై కట్టుకథ అల్లి ప్రభుత్వం ప్రచారం చేసిందన్న విమర్శపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ నిందితుల దగ్గర లభ్యమైన ‘హార్డ్‌డిస్క్’లు, ఇతర సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు శాస్ర్తియంగా అధ్యయనం చేశాయన్నారు. సుప్రీం తీర్పుతో తమ వాదన నిజమని తేలిందన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టుకు కారణమైన సమాచారం, సాక్ష్యాల కన్నా ప్రస్తుతం ఎంతో ఎక్కువ సమాచారం, సాక్ష్యాలు లభ్యమైయ్యాయని అందుకే సుప్రీంకోర్టు సరైన రీతిలో స్పందించిందని ఫడ్నవీస్ అన్నారు.
అర్బన్ మావోయిస్టులు అరణ్యంలోని మావోయిస్టులతో ఏ విధంగా సంబంధాలు కలిగి ఉన్నారో, ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో పుష్కలమైన ఆధారాలున్నాయన్నారు. అర్బన్ మావోయిస్టులు సమాజంలోని వివిధ వర్గాల మధ్య తంపులు సృష్టించి, అంతర్యుద్ధంగా మార్చేందుకు పథకం రచించారని అందుకు తగిన సాక్ష్యాధారాలు లభించాయని కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కుహనా మేధావులు, లిబరలిస్టులు అర్బన్ మావోయిస్టులకు మద్దతు పలకడం దేశద్రోహమన్నారు.
ఏ రకమైన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయో తెలియకుండానే కొంతమంది అరెస్టులను వ్యతిరేకిస్తున్నారు... ఇది సరైన పద్ధతి కాదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ప్రోదిచేసిన సమాచారం- సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించిన సాక్ష్యాలు తమవద్ద ఉన్నాయని, వాటి గురించి తెలియకుండా గుడ్డిగా వ్యాఖ్యానించడం, తప్పుడు కేసులో ఇరికించారని పేర్కొనడం తగదని కూడా ఆయన అన్నారు. పోలీసుల స్వాధీనంలో ఉన్న హార్డ్‌డిస్క్‌లో ఎంతో ప్రమాదకర సమాచారమున్నదని, ప్రధాని మోదీ హత్యకు సంబంధించిన అంశంతోపాటు పలు అంశాలున్నాయని, అందులో అంతర్యుద్ధానికి ఆజ్యంపోసే వైనం కూడా దాగుందని ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కుహనా మేధావులు, లిబరల్స్ పేర ప్రచారం చేసుకునే కుహనా లిబరల్స్ వాదనలన్నీ సుప్రీం కోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయని, మహారాష్ట్ర ప్రభుత్వ, పూణె పోలీసుల వాదన సుప్రీం కోర్టులో నిజమని తేలిందన్నారు. అరణ్యంలోని మావోలకు, నగర-పట్టణ మావోలకు తేడాలేదని ఇరువురు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని రాజ్యాన్ని కూలదోసే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారని ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఇలాంటి కుట్రలను అందరు గమనించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సమాజంలో సూడో లిబరల్స్ సంఖ్య తక్కువని వారిని గుర్తించాల్సిన అవసరం లేదని, జాతికి వ్యతిరేకంగా కుట్ర పనే్న శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఫడ్నవీస్ చెప్పారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిగిందన్న అంశంపై తాము కట్టుకథ అల్లలేదని, ఆ విషయం సుప్రీం కోర్టుద్వారా వెల్లడైందన్నారు.
హత్యలు వారికి అలవాటే...
విశాఖ మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా మావోలు హత్యచేసి తమ నైజాన్ని చాటుకున్నారు. దీంతో మావోలు ప్రధాని హత్యకు కుట్ర పన్నారనడంలో ఆశ్చర్యమేముంది? పట్టపగలు అధికార పార్టీ ఎమ్మెల్యేను ఎంతోమంది చూస్తుండగా హతమార్చి పారిపోయిన సాయుధ మావోల తెగింపు ఎలాంటిదో ఇట్టే అర్థమవుతోంది. రోడ్‌షోలలో పాల్గొనే ప్రధానిని హతమార్చడం మావోలకు ‘పెద్ద సమస్య’ కానేకాదని వారి ట్రాక్ రికార్డుబట్టి తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాల్ని ప్రోత్సహిస్తున్నారని, తవ్వకాలలో భాగస్వామ్యం ఉందనే నెపంతో ఇద్దరు ప్రజాప్రతినిధులను క్రూరంగా కాల్చిచంపారు. మొత్తం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు ప్రణాళికలు రచించి, ఆచరణలో పెడుతున్న ప్రధానిపై కక్ష పూనడం విడ్డూరం కాదు. కిడారిని, సోమలను కాల్చిచంపిన దళంలో మహిళా మావోలు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. అలనాడు రాజీవ్ గాంధీని హత్యచేసిన వారిలోనూ మహిళలున్నారు. రాజీవ్‌గాంధీ తరహాలో మోదీని హత్యచేసే కుట్రలో మహిళల్ని నియమించే ఆలోచనను మావోయిస్టులు చేసినా ఆశ్చర్యపోనవరం లేదు. ఆ రకంగా అర్బన్ మావోయిస్టులపై తప్పుడు కేసులు పెట్టారన్న వాదనలోనూ ఏమాత్రం ‘పస’ లేదు. సంపూర్ణ సాక్ష్యాలతో ముందుకొచ్చిన వారిని ఎలా తిరస్కరిస్తారు? మావోల ట్రాక్ రికార్డు సైతం అదే విషయాన్ని వెల్లడిస్తోంది కదా?
దేశంలో అంతర్యుద్ధం జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మలచుకుని రాజ్యాధికారం చేపట్టాలనే ‘కల’ను మావోలు చాలాకాలంగా కంటున్నారు. మరి ఇది సమ్మతమా? మావోయిజమే మటుమాయవౌతున్నవేళ- ఇలాంటి ‘కల’కు ప్రాధాన్యమేముంటుంది?

-వుప్పల నరసింహం 99857 81799