మెయిన్ ఫీచర్

తెలంగాణ పండిత మాణిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ, బిరుదురాజు రామరాజు, బి.యన్. శాస్ర్తి లాంటి పరిశోధక దిగ్గజాల సరసన చెప్పుకోదగిన పేరు డా. కపిలవాయి లింగమూర్తి. ఇక్కడ పేర్కొన్న దిగ్గజాల్లో కొందరిలో ఎక్కువభాగం చారిత్రక దృష్టి, మరికొందరిలో ఎక్కువ భాగం గ్రంథ పరిష్కరణ దృష్టి ఉంటూ ముఖ్యంగా కావ్యరచన, ప్రాంతీయకవిపండిత వంశచరిత్ర నిర్మాణం లాంటి తక్కిన రంగాలు ఆనుషంగికమయ్యాయి. బ్రతికినంతకాలమూ స్ఫూర్తిప్రదంగా వెలుగొందుతూ అవిశ్రాంతంగా రచనలు చేసిన డా. కపిలవాయి లింగమూర్తి 90 ఏళ్ళ పరిణత వయస్సులో తొడిమ నుండి బాగా పండిన దోసకాయ రాలిపోయినట్లుగా నరకచతుర్దశి సాయంకాలం (6 నవంబరు, 2018) దేహాన్ని వదిలేశారు. అనువం శికమైన స్వర్ణకార వృత్తి మొదట్లో చేశారు. తర్వాత సాహిత్య సువర్ణ సృష్టిని వృత్తిగా, ప్రవృత్తిగా మలచుకొని నిరూపమానంగా జీవిత జైత్రయాత్ర కొనసాగించారు. కపిలవాయి లింగమూర్తిగారు ఏదో పాతకాలం వారు, సాంప్రదాయకులు అని కాదు. కాలపరిణామాన్ని గుర్తించిన వారు. ప్రమాణాలను ప్రయోజనాలకు బలిపెట్టనివారు. ఆధునికుల్లో సంప్రదాయకుడు. సంప్రదాయకుల్లో అధునికుడు. ఎవరో ఉల్లేఖించిన వాటితో వ్యాసాలను అల్లకుండా మూలాధారాలను గవేషించి నిర్ధారించుకొని తదనుగుణంగా రాసే చారిత్రక సత్యతత్త్వశీలి కపిలవాయి లింగమూర్తి.
1928 మార్చి 31న సంస్థానాల ఖిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో లింగమూర్తి జన్మించారు. ఈ పండితమాణిక్యాన్ని కన్న తల్లిదండ్రుల పేర్లు మాణిక్యమ్మ వెంకటాచలం. బాల్యంలోనే కన్నతండ్రి అస్తమయం. మేనమామ చేవూరు పెద్దలక్ష్మయ్య అంతేవాసిత్వం. స్వర్ణకారవృత్తి, వాస్తు జ్యోతిష్యం, పౌరోహిత్యాదులు నేర్చుకొన్నారు. నాలుగవతరగతి వరకు బండి నెట్టుకొచ్చారు. ఆ తర్వాత పాఠశాలకు, పై చదువులకు అవకాశాలు మృగ్యమయ్యాయి. 15 ఏళ్ళ పాటు కులవృత్తి సాగిస్తూనే ప్రైవేటుగా ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించే తెలుగు పరీక్షలు రాశారు. 1954లో నాగర్ కర్నూల్ నేషనల్ స్కూలులో అధ్యాపకులుగా నెలకు 30 రూ.ల జీతంతో కుదురుకున్నారు. ఆ తర్వాత 1972లో పాలెం ప్రాచ్య కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా చేరి 1983లో పదవీ విరమణం చేశారు. నాగర్‌కర్నూల్ నేషనల్ హైస్కూలు లో 1954లో తొలి బ్యాచ్ విద్యార్థులు వై. రుక్మాందరెడ్డి, మల్లేపల్లి శేఖర రెడ్డిలు కాగా పాలెం ప్రాచ్య కళాశాలలో రిటైర్‌మెంట్ నాటి బ్యాచ్ 1983లో చిట్టచివరి విద్యార్థిని నేను. నాతో సహా ఎంతోమంది ఆయన శిక్షణలో కవులుగా, తెలుగు అధ్యాపకులుగా వెలిగి మరెన్నో దీపాలను వెలిగించారు. ప్రత్యేకించి నేను గురువు గారింట్లో ఐదేళ్ళపాటు ఉండి చదువుకొన్నవాడిని. గురువుగారు, నేను ఎంతో ఆత్మీయంగా మెలిగే వాళ్ళం. ఆరోజుల్లో గురువుగారి అమ్మగారు, వారి జీవన సహచరి కూడా వుండేవారు. నిత్యవైవిధ్యం అనే నా పరిశోధనాత్మకవ్యాస సంపుటికి గురువుగారు పీఠిక రాస్తూ మా ఆత్మీయతానుబంధాన్ని రికార్డ్ చేశారు. ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యునిగా, ఒక రచయితగా ప్రసిద్ధి గడించానంటే ఆనాటి (1978 నుండి 1983 వరకు) పాలెం ఓరియంటల్ కాలేజి ఆదర్శ గురువులందరి ఆశీస్సులే అని బలంగా విశ్వసిస్తాను. అంతేగాదు, మా నాన్నగారు స్వర్గీయ వెలుదండ రామేశ్వరరావు రాసిన శ్రీనివాస నివేదనం శతకంలో మా వంశచరిత్రను, మా గ్రామ చరిత్రను రాశారు. మా అన్నగారు వెలుదండ సత్యనారాయణ లింగమూర్తి పేరిట ఒక శతకాన్ని, నారదగిరి పేరుతో ఒక మహాకావ్యాన్ని రాసి గురువుగారికి అంకితమిచ్చారు. ఆంధ్రభూమి తరపున ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా కలిగింది. ఆ సమయంలో తెలంగాణ భాషా సాహిత్యాల గురించి నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను చెప్పారు. డిగ్రీలో, ఇంటర్మీడియట్‌లో వారి పాఠాలు పెట్టే అవకాశం నాకు కలిగింది. వారి మీద వ్యాసం, సన్మానపత్రం రాసే భాగ్యం పొందాను.
కపిలవాయి లింగమూర్తి గారి సాహితీ స్రవంతిని గమనిస్తే రెండు మూడు పాయలుగా సాగిందని చెప్పవచ్చు. మహబూబ్‌నగర్ జిల్లా దేవాలయాల, కవి పండిత వంశాల, గ్రామ నామాల చరిత్రను పరిశోధించడం, ఆ చారిత్రక విశేషాలను కావ్యాలుగా మలచడం ఒకటి. కావ్యాలను, కావ్యాంశాలను విశే్లషిస్తూ లెక్కకు మిక్కిలి వ్యాసాలుగా, గ్రంథాలుగా ప్రకటించడం మరొకటి. సృజనాత్మకంగా కవిత్వం, నవల నాటకం మొదలగు ప్రక్రియల్లో కృషి చేయడంగా చెప్పవచ్చు. ఏది చేసినా సాధికారికంగా చేయడం వీరి ప్రవృత్తి. నూటికి పైగా పుస్తకాలను ప్రకటించారు. కావ్యగణపతి అష్టోత్తరం 108 కావ్యాలలోని గణపతి పద్యాలను, గణపతి ప్రతిమలను శాస్త్రోకంగా వివరించేది. గణపతి ఉత్సవాల సందర్భంగా సాగే ప్రసార మాధ్యమాల ప్రత్యక్ష వ్యాఖ్యానాలకు ఈ గ్రంథం ఒక కరదీపికగా ఉపయోగపడడం గమనార్హం. చక్రతీర్థ మాహాత్మ్యం, శ్రీమత్ ప్రతాపగిరిఖండం, ఇంద్రేశ్వర చరిత్రలాంటి కావ్యాలు స్థానిక చారిత్రకాంశాలకు కావ్యత్వాన్ని కల్పించినవి. మామిళ్ళపల్లి మహాక్షేత్రం, ఉప్పునూతల కథ, పాలమూరు జిల్లా దేవాలయాలులాంటి గ్రంథాలు మహబూబ్‌నగర్ జిల్లా చరిత్రకు ఎన్నో అంశాలు వివరించేవి. పాలమూరు జిల్లా కవి పండిత వంశాలు, పాలమూరు జిల్లా చారిత్రక గ్రంథాలు ఇంకా వెలుగులోకి రావలసి ఉన్నవి.
సాలగ్రామ శాస్త్రం, విశ్వబ్రాహ్మణుల సంస్కృతి- అనుకరణం, 90 కావ్యాల్లోని ప్రశస్తమైన ఆభరణాల రూపురేఖలు వివరించే స్వర్ణశకలాలు గ్రంథం, శ్రీమదాంధ్ర పూర్ణచార్యుల చరిత్ర, వీరబ్రహ్మచరిత్ర, శివరామ బ్రహ్మం చరిత్ర, విశ్వకర్మ పురాణంలాంటి రచనలు విశ్వబ్రాహ్మతత్త్వాన్ని తెలిపేవి.
తెలుగులో తొట్ట తొలి అచ్చతెనుగు కావ్యం పొనె్నగంటి తెలుగన్న యయాతి చరిత్ర. దీనికి విస్తారంగా గురువుగారు రాసిన వ్యాఖ్యానాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించింది. అచ్చతెనుగు పదాల స్వరూప స్వభావాలను అధ్యయనం చేయాలనుకునే జిజ్ఞాసువులకు ఈ వ్యాఖ్యాన గ్రంథం దారిదీపంగా ఉపయోగపడుతుంది. యతి ప్రాసాది విశేషాలను, అలంకారాలను వివరిస్తూ ఆర్యశతకం, దుర్గ్భార్గశతకం మొదలైనవి రాశారు. ఎల్లూరి నరసింగకవి, బోయపల్లి వేంకటాచార్యులు, వేముల రామాభట్టు, పెన్గలూరి వెంకటాద్రి, మండ జానకి రామయ్యలాంటి కవుల రచనలను లింగమూర్తి గారు వెలుగులోకి తెచ్చారు.
వీరి రచనలను, ప్రతిభా సామర్థ్యాలను గుర్తించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, 1995లో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ సత్కారం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్టస్థ్రాయి పురస్కారం, తెలంగాణ ఎన్.ఆర్.ఐ సంఘంవారి పురస్కారం సహా మరెన్నో సత్కారాలను, సన్మానాలను అందుకున్నారు. ఈ సత్కారాలన్నీ వారిని మరింత ఉత్తేజితుల్ని చేశాయి. వారి శారీరక మానసిక సమస్యలకు ఓదార్పు పలికాయి. కాస్త ఊరట కలిగించాయి.
పాలమూరు జిల్లా మాండలికాలను, సామెతలను ఎన్నో సేకరించారు. నిరంతరం అధ్యయనం, ఇంటికి వచ్చిన వారికి సందేహాలను నివృత్తి చేయడం, ఓపికున్నంత వరకు రాయడం గమ్యంగా సాగింది లింగమూర్తి జీవితం. తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే తెలంగాణ రచయతల రచనలను సంపుటాల రూపంలో పునర్ముద్రించి కారుచౌకగా అమ్మి ప్రజల్లోకి తీసుకొనిరావాలి. సాహిత్యం పట్ల, పద్యం పట్ల అభిరుచి పెంచాలి. మాండలికం పేరుతో జీవితంలో నుండి తొలిగిపోయిన వాటిని తీసుకొని రావడం కాదు. ఉన్నవాటినీ, అందరికి అలవాటయిన వాటితో వాటిని కలుపుకుంటూ పెంచుకొని పోవాలి. వరదలా వచ్చిన నీరు బురదలా ఉంటుంది. ప్రశాంతంగా పారేనీరు స్వచ్ఛంగా ఉంటుంది. బంగారు తెలంగాణలో వచ్చే రచనలు వ్యాకరణబద్ధంగా సర్వజనా మోదంగా, ప్రామాణికంగా రావాలని ఆంధ్రభూమికి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాంక్షించారు డా. కపిలవాయి లింగమూర్తి గారు.
సహధర్మచారిణి ఏనాడో గతించింది. కావలసిన పుస్తకాన్ని చిటికెలో అందిస్తూ లింగమూర్తి గారి సాహిత్య వ్యాసంగానికి తోడునీడగా నిలిచిన పెద్దకుమారుడు కె. కిశోర్ బాబు అకస్మాత్తుగా అస్తమించడం జీవితంలో కోలుకోలేని దెబ్బ. రెండవ కుమారుడు కె. అశోక్ బాబు, వారి శ్రీమతి, మనుమడు అనందవర్థన్‌లు మూర్తిగారిని కంటికి రెప్పలా కాపాడు కున్నారు. అయినా మా గురువుగారు డా. కపిలవాయి లింగమూర్తి గారు అంపశయ్యమీది భీష్మునిలాగా ఉండేవారు. మానసిక వికలాంగురాలైన మనుమరాలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్నో పీడించాయి. ఆయన తరం వాళ్ళంతా దాటుకున్నారు. ఆయన కళాశాల అధ్యాపకునిగా మాకు పాఠాలు చెప్పిన కాలానికీ నేటికీ పూర్తిగా కాలం మారిపోయింది. సాహిత్య సామాజిక రాజకీయ రంగాల్లో నూతన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. నాగర్ కర్నూలులో వారి అంత్యక్రియలకు నేను మాగురువుగారు శ్రీరంగాచార్యులవారు వెళ్ళి చివరిసారి అంజలి ఘటిస్తూ అక్షయపుణ్యలోక ప్రాప్తిరస్తు అని కోరుకున్నాం.

- ఆచార్య వెలుదండ నిత్యానందరావు, 9441666881