ఎడిట్ పేజీ

ఎన్నికల్లో అక్రమాలకు చట్టంతో కళ్లెం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ‘మినీ మారథాన్’ మొదలైంది. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, పలు శాసనసభ ఎన్నికలపై పడుతుందని కొందరు, అలాంటిదేమీ ఉండదని ఇంకొందరు వాదిస్తున్నారు. ఫలితాల ప్రభావం సంగతి పక్కన పెడితే, ఎన్నికల కోలాహలం ఇప్పటికే మిన్నంటింది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సామదాన బేధ దండోపాయాలను ప్రయోగిస్తునే ఉంటాయి. ఎన్నికలు నిష్పాక్షికంగా, సజావుగా జరిగేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ భారత ఎన్నికల కమిషన్. మిగిలిన రాజ్యాంగ సంస్థల మాదిరి సంపూర్ణ అధికారాలను ఎన్నికల కమిషన్‌కూ కట్టబెట్టారు.
దేశ రాజకీయాల్లో ప్రవేశించిన అవాంఛిత పరిణామాల దృష్ట్యా ఎన్నికలను ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. ఎన్నికల్లో లోపాలను సరిదిద్దేందుకు స్వతంత్ర సంస్థకు రాజ్యాంగంలో రక్షణ కల్పించారు. రాజ్యాంగంలోని 15 వ భాగం 324 నుండి 329వ ప్రకరణం వరకూ, అ ధ్యాయం-3లో ప్రకరణం 169 నుండి 212 వరకూ, శాసనసభల రద్దుకు సంబంధించి అధ్యాయం-4లో గవర్నర్ల విశేషాధికారాలను నిర్వచించారు. 1972లో సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక, 1974లో తుర్కుండే కమిటీ నివేదిక, 1990లో దినేష్ గోస్వామి కమిటీ, 1993లో వోహ్రా కమిటీ నివేదిక ప్రాతిపదికగా అనేక సంస్కరణలు అమలులోకి వచ్చాయి. 1998లో ఇంద్రజిత్ కమిటీ, 1999లో లా కమిషన్ నివేదిక, 2000లో జస్టిస్ వెంకటాచలయ్య అధ్యక్షతన రాజ్యాంగ సమీక్ష కమిషన్, 2007లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సూచనలు కూడా ఎన్నికల సంస్కరణలకు దోహదం చేశాయి. టిఎన్ శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నపుడు సంపూర్ణ అధికారాలను వినియోగించుకున్న తీరును దేశం గమనించింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలిసారి 1989- 90లో ఉపయోగించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వీటిని తొలుత ఉపయోగించారు. 2013లో పీపుల్స్ యూనియన్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ‘నోటా’ను ప్రవేశపెట్టారు. భారత రాష్టప్రతి ఎన్నిక మొదలు, గ్రామ పంచాయితీ ఎన్నికల వరకూ నిర్దిష్ట పద్ధతిని, నియమ నిబంధనలను స్పష్టంగా రూపొందించారు. 1950 జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటుకు ముందే దేశంలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత గణతంత్ర దేశంలో ఎన్నికలకు ఒక స్వరూపాన్ని ఇచ్చారు. ఎప్పటికపుడు సర్వోన్నత న్యాయస్థానం ఇస్తున్న ఆదేశాలు, లా కమిషన్ చేస్తున్న సిఫార్సులు, పౌరుల నుండి వస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల నిర్వహణను మరింత సులువుగా, తేలికగా, ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలను పౌరుల వద్దకే తీసుకువెళ్లేందుకు అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కొండ శిఖరాలపై ఉన్న ఒకరిద్దరు ఓటర్లకు సైతం ఐదుగురు సిబ్బంది, భద్రతా సిబ్బందితో కూడిన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సందర్భాలు ప్రతిసారీ చూస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని కూడా రూపొందించారు. 1950లో అమలులోకి వచ్చిన ఆ చట్టాన్ని 1951లో సవరించారు. 1966లో, 2013 , 2016లో కీలకమైన సవరణలను తీసుకువచ్చారు. ఈ సవరణలు అన్నీ ఎన్నికలు సజావుగా సాగేందుకు, అక్రమాలను అరికట్టేందుకే అనేది నిస్సందేహం.
ఎన్ని నిబంధనలు ఉన్నా, అక్రమాలు నిరాటంకంగా సాగుతునే ఉన్నాయి. ఎన్నికల చట్టాల్లో కఠిన నిబంధనలు ఉన్నా వాటిని గాలికొదిలేసి, అభ్యర్థులు తమ ఇష్టారాజ్యంగా డబ్బు వెదజల్లి, ఓటర్లను ఆకర్షించేందుకు వేయని ఎత్తు లేదు. ప్రలోభాలకు గురికాకుండా చూడటంతో పాటు, అందుకు బాధ్యులైన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు చాలా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. తెలంగాణలో 47 మందిని, ఆంధ్రాలో 40 మందిని ఎన్నికల కమిషన్ పోటీ నుండి బహిష్కరించింది. అదే తీరున ప్రతి రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిన వారిని బహిష్కరించింది. ఎన్నికల వ్యయంపై నిఘా పెట్టడంతో పాటు ప్రచారంలో ఉల్లంఘనలు, నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన నిధుల అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలకు దిగుతోంది. పార్టీల పరంగా ఆడిటింగ్, నేరచరితులకు బీ-్ఫరాలు ఇవ్వడం, మేనిఫెస్టో రూపకల్పనలో నిబంధల ఉల్లంఘనపై కూడా ప్రత్యేకంగా పరిశీలకులను నియమించి సంబంధిత పార్టీలపై చర్యలు తీసుకునే వీలు రాజ్యాంగం కల్పించింది.
భారతీయ శిక్షా స్మృతిలో ఎన్నికలకు సంబంధించిన నేరాలకు కచ్చితమైన శిక్షలను రూపొందించారు. సెక్షన్ 171-ఎ లో అభ్యర్థి, ఎన్నికల హక్కు అనే పదాలకు నిర్వచనం చెప్పగా, 171-బీలో ఎన్నికల్లో లంచగొండితనం, 171-సీలో ఎన్నికల ప్రక్రియలో అనుచిత ప్రభావం లేదా జోక్యం, 171- డీలో దొంగఓట్లు, 171-ఈలో లంచగొండితనంపై చర్యలు, 171-ఎఫ్‌లో అనుచిత జోక్యం, 171-జీలో అభ్యర్థుల గురించి తప్పుడు ప్రచారం, 171-హెచ్‌లో అభ్యర్థి అనుమతి లేకుండా డబ్బు వెచ్చించడం, 171-ఐలో ఎన్నికల జమా ఖర్చులు తయారు చేయకపోవడం వంటి విషయాలపై వివరణలున్నాయి. మిగిలిన సెక్షన్లలో కూడా ఎన్నికలకు అనుబంధంగా శిక్షలను నిర్వచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజాప్రతినిధి పదవికే గండం వచ్చే ప్రమాదం ఉంది. ప్రవర్తన ఆధారంగా నేతలు తమ పదవులను కోల్పోయిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చూశాం. సెక్షన్ 171లోని సబ్ క్లాజ్‌ల కింద కేసులు నమోదు చేస్తారు. అవి రుజువు అయితే జైలు శిక్ష, కొన్ని సార్లు జరిమానా, మరికొన్ని సందర్భాల్లో రెండూ కలిపి విధించే వీలుంది. ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించి ప్రతి అభ్యర్థికీ రిటర్నింగ్ అధికారి ఒక మాన్యువల్‌ను అందజేస్తారు. దానిని వారు తప్పనిసరి అనుసరించాల్సి ఉంటుంది.
మత, జాతి, భాష తదితర విబేధాలను ఆధారంగా చేసుకుని విభిన్న వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని భగ్నం చేయడాన్ని చట్టరీత్యా నేరంగా ఐపీసీ సెక్షన్ 153ఎ పేర్కొంటోంది. దీనిని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష ఉంటుంది. ఆర్పీఏ సెక్షన్ 126 కింద నిర్దేశించిన సమయానికి మించి ప్రచారం చేస్తే రెండేళ్ల వరకూ శిక్ష విధించే వీలుంది. బహిరంగ సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సెక్షన్ -126 కింద ఆరు నెలల జైలు విధించవచ్చు. అపరిమితంగా వాహనాలు వాడినా, ఓటర్లు ఎవరికి ఓటు వేశారో బహిరంగ పరిచినా సెక్షన్ 133, 128 కింద మూడు నెలల జైలు శిక్ష విధించవచ్చు. 130, 131, 132, 134, 135 సెక్షన్లు వివిధ ఉల్లంఘనలకు శిక్షలను నిర్ధారిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడితే సెక్షన్ 171 కింద ఏడాది పాటు జైలు శిక్ష విధించవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను బహిరంగ పరచాలని, ఆస్తిపాస్తులను వెల్లడించాలని, కేసులున్న నేతలకు టిక్కెట్లు ఇస్తే వారి గురించి పత్రికల్లో ప్రకటించాలని కూడా ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తోంది. ఓటర్లు చైతన్యవంతులై ప్రశ్నించనంత కాలం పరిస్థితులు మారవు.
అన్నీ తెలిసినా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి సా చివేత ధోరణి ప్రదర్శించడం కూడా ఒక కారణం. దేశంలో సగటున 45 నుండి 55 శాతం మంది మాత్రమే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 20 నుండి 25 శాతం ఓట్లు వచ్చిన వారు విజేతలుగా నిలుస్తున్నారు. మిగిలిన 75 శాతం మంది అభిప్రాయాలకు తావులేని పరిస్థితి ఏర్పడింది.
ఎన్ని చేసినా ఎన్నికల వ్యవస్థ మేడిపండులా మారిపోయింది. చట్టాలు చూస్తుంటే నేతి బీరకాయలోని నేతి మాదిరి కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో మరిన్ని సంస్కరణలు రావల్సిన సమయం ఆసన్నమైంది. తద్వారా భారత ప్రజాస్వామ్యంలో పకడ్బందీ ఎన్నికల వ్యవస్థ మిగిలిన ప్రపంచానికి ఆదర్శప్రాయంగా రూపుదిద్దాల్సి ఉంది. అపుడే భారత స్వాతంత్య్రానికి పరమార్థం దక్కుతుంది. ఈ దిశగా అన్ని రాజకీయ పార్టీలూ నడుం బిగించి తమకు తోచిన సూచనలు చేయాల్సి ఉంది. అన్నింటికీ మించి ప్రతి పౌరుడూ నిర్బంధంగా ఓటు వేసే చట్టం రావాలి. ప్రతి రాజకీయ పార్టీ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పదవిలో ఉండగానే కాదు, తదనంతరం కూడా ప్రజలకు జవాబుదారీగా చట్టం రావల్సి ఉంది. ఐదేళ్లలో వారు చెప్పింది ఏమిటో, చేసిందేమిటో తేల్చే రాజకీయ ఆడిటింగ్ అస్త్రం సామన్యుల చేతుల్లో పెట్టాలి. అది కేవలం ఓటు వేసేందుకే పరిమితం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాజ్యాంగంలో సవరణలు చేయాలి. అపుడే ఎన్నికలు అర్థవంతంగామారుతాయి.

-బీవీ ప్రసాద్ 98499 98090