మెయన్ ఫీచర్

లక్ష్యం చేరని సమానవిద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యంలో సంక్షేమ సమాజ నిర్మాణం, విద్యావంతులైన పౌరులచేతనే సాధించబడుతుంది. అలాం టి సమాజంలో శాంతి, సుస్థిరత, సౌభా గ్యం హోదా నెలకొని ఉంటాయి. మారుతున్న సమాజంలో శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక రంగాలలో ప్రగతిని సాధించాలంటే ప్రతివారు సర్వసంపూర్ణమైన మూర్తిమత్వాభివృద్ధిని పొందాలి. విద్యా ప్రయోజనాలను, లక్ష్యాలను అవగాహన చేసుకొని గమ్యాలను చేరుకోవడానికి నిరంతర ప్రయత్నం చేయాలి. మనిషి మనిషిగా జీవించడానికి మానవ జీవిత సార్ధక్యానికి విద్య చాలా అవసరం. ఈనాడు ప్రపంచలోని స్ర్తి పురుషులందరికీ వయసుతో నిమిత్తం లేకుండా విద్య ఒక ప్రాథమిక హక్కుగా, సురక్షితమైన ఆరోగ్యకరమైన అభివృద్ధితో కూడుకున్న వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సాధనంగా గుర్తించబడింది. సాం ఘిక, ఆర్థిక, సాంస్కృతికాభివృద్ధికి సహనం శాంతి సుస్థిరతలను పెంపొందించుకొని అంతర్జాతీయ సహకారాన్ని కలిగివుండేందుకు అవసరమై ఉంది. వ్యక్తి, వ్యక్తిగత, సామాజిక, సాంఘిక అభివృద్ధికి విద్య మూలాధారమై, సాంప్రదాయకమైన మాన వ విజ్ఞాన నిధిని, సాంస్కృతిక పరంపర విలువల్ని, యోగ్యతల్ని గుర్తించి నిర్వచించి, పెంపొందించి సామర్ధ్యాలను, నైపుణ్యాలను, నిపుణతల్ని కలిగించేందుకు ప్రబల సాధనంగా ఉంది. అంటే మానవ జీవిత గుణాత్మకతను పెంపొందించడానికి, సక్రమ పౌర ధర్మ నిర్వహణకు సచ్ఛీలంగల, సత్ప్రవర్తనగల పౌరులుగా తయారవడానికి విద్య అవసరం చాలా ఉంది. సక్రమమైన సర్వజనాంగీకారమైన నైతిక పద్ధతులను తెలుసుకోవడానికి, ధార్మిక శక్తిని పొందడానికి, సాంఘిక వ్యవస్థను అవగాహన చేసుకొని, సాంఘిక విధి నిర్వహణా సామర్ధ్యాన్ని పొందేందుకు మంచి సాధ నం విద్య. మానవుడు జీవిత సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించడానికి, సర్దుబాటు చేసుకోవడానికి మానవ హక్కుల్ని, మానవతా విలువల్ని గుర్తెరగడానికి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి చివరకు విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనకు విద్య ప్రమేయం చాలా అవసరం.
ఇలాంటి విద్య అవసరాన్ని గుర్తించి మన రాజ్యాంగం విద్యను, ప్రాథమిక మా నవ హక్కుగా గుర్తించి అధికరణ 15(1), 16(1) ప్రకారం జాతి, మత, కుల, స్ర్తి పురు ష భేదం లేకుండా అందరూ విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పించింది. 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకోసం 45వ అధికరణ ప్రకారం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. లక్ష్య సాధనకు పంచవర్ష ప్రణాళికల ద్వారా విద్యాపథకాలను రూపొందించి అమలు పరచేందుకు తగిన అవకాశాలు కల్పించింది. అందరికీ చదువుకునే అవకాశాలు కలిగించడం తేలిక కాని అందరికీ చదువుమీద ఆసక్తి, అనురక్తి, ఆకర్షణ కల్గించడం కష్టం. ఈ రెండవ ఘట్టంలోనే మన విద్యావిధానం పరాభూతమై పోతున్నది. అందుకే విద్యాలయాలు, పాఠశాలలు పెరుగుతున్నా విద్యాస్థాయి, విద్యా ప్రమాణాలు, అక్షరాస్యత రేటు పెరగడంలేదు. విద్య ఆశయాలు, ధ్యేయాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు, ప్రయోజనాలు ఎంత ఉన్నతమైనప్పటికీ గమ్యాలు సాధించలేకపోతున్నాం. అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. అమలు, ఆచరణకు నోచుకోవడంలేదు. ఏ అంశం గురించైనా మన తాత్విక సిద్ధాంతాలు బాగుంటా యి. వాటిని చట్టాలుగా శాసనాలుగా రూ పొందించుకుంటాం. ప్రణాళికలను తయా రు చేసుకుంటాం. పథకాలను సిద్ధం చేసుకుంటాం. కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటాం. వాటిని అమలు పరచడంలో అలసత్వం, నిరాసక్తత, ప్రయత్నలోపం మనల్ని వెన్నాడుతుంటుంది. యాం త్రికత చోటు చేసుకుంటుంది. తాత్వికత మరుగున పడుతుంది. విధానాలు పక్కదారి పడతాయి. పాత సారా కొత్తసీసాలోపోసినట్టు కొత్తపద్ధతిని అమల్లో పెట్టడంకోసం పరుగులు తీస్తాం. ఇది అనాదిగా విద్యారంగంలో జరుగతున్న తతంగమే. ముఖ్యంగా బాలికలు వెనుకబడిన వర్గాల విద్యా విషయంలో ఇది కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
ఉడ్స్‌డిస్పాచ్ మొదలుకొని కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ నివేదిక వరకు స్ర్తి సమానత్వాన్ని బాలికల సమాన విద్యావకాశాల్ని గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. తుదకు జాతీయ విద్యావిధానం 1986, ఆచరణ పథకం 1992 కూడ బాలికల విద్యాభివృద్ధిని, బాలబాలికల విద్యావకాశాల సమానత్వాన్ని గూర్చి నొక్కి చెబుతూనే ఉన్నా యి. తేడాలను తొలగించే యత్నం కొనసాగిస్తూనే ఉన్నాయి. అయినా ఫలితం అంతంత మాత్రమే. బాలికల విద్యా విషయంలో ఆశించినంతగా, అనుకున్నంతగా అభివృద్ధి జరుగలేదు. బాలికల అక్షరాస్యతా శాతం నిరుత్సాహంగానే ఉంది. మన విశ్వజనీన ప్రాథమిక విద్య, అనే అం శం అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఉపాధ్యాయినుల ప్రాతినిధ్యం ఇంకా తక్కువే. పాఠశాలలో బాలికలకు సరైన వసతులు ఇంకా కొరవడి ఉన్నాయి. అరవై తొమ్మిదేళ్ల స్వతంత్ర భారత పాఠశాలల్లో ఇంకా ఆడపిల్లలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవంటే ఆశ్చర్యకరమే.
ఈనాడు మానవ సమాజంలో అందరికీ విద్య, అందరూ పొందలేకపోతున్నారు. ఎన్నో సమస్యలు దీనికి కారణమవుతున్నాయి. అప్పుల బాధలు, ఆర్థిక క్షీణత ఉధృతంగా పెరుగుతున్న జనాభా, విస్తృతమవుతున్న ఆర్థిక అంతరాలు, యుద్ధాలు, వృత్తి సంబంధమైన ఇబ్బందులు, హింస, నేరం మొదలైనవి. ఈ సమస్యలన్నీ విద్యాభివృద్ధికి ఆటంకాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి ఇరవై ఒకటవ శతాబ్దిలో కూడ ప్రజలు ప్రాథమిక అభ్యసన ఉపకరణాలను, విషయాలను గురించిన జ్ఞానం పొం దలేకపోతున్నారు. చాలామంది పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో చేరడంలేదు. చేరినవారు కూడ విద్యలో, పాఠశాలల్లో కొనసాగడం లేదు. ప్రత్యేకంగా బాలికలు, సాంఘికంగా వెనుకబడిన కులాల, వర్గాలవారు, గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలవారు,మురికి వాడల్లో నివసించేవారు, వికలాంగులు, మానసిక వికలాంగులు మొదలైనవారు, అభ్యసన అవకాశాలను, విద్యావకాశాలను వినియోగించుకోవడంలేదు. దానివల్ల వారికి సాంఘిక ఆర్థికావకాశాలు కూడా లేకుండా పోతున్నాయి.
అయినప్పటికీ దశాబ్దాల కృషి కారణంగా ప్రతి విద్యార్థి సులభంగా నడిచి వెళ్లేంత దూరంలోనే పాఠశాలు అందుబాటు వల్ల పాఠశాలల్లో 80 శాతానికి పైగా నమోదు సాధ్యపడింది. అయితే ఐదేళ్ల చదువు పూర్తి చేయకుండానే మధ్యలోనే చాలామంది పిల్లలు పాఠశాలనుంచి తప్పుకుంటున్నారు. వారిలో బాలికలు, షెడ్యూల్డు కులాలు, తెగల బాలబాలికల సంఖ్య అధికం. గ్రామీణ ప్రాం తాల్లో, మురికి వాడల్లో ఉన్నవారి సంఖ్య నమోదు ఎక్కువగా సాధ్యపడటం లేదు. అక్షరాస్యత దృష్ట్యా పరిశీలించి చూసినట్లయితే గ్రామీణ అక్షరాస్యతరేటు పట్టణ అక్షరాస్యత రేటు లో సగం ఉంది. ప్రత్యేకించి స్ర్తిల అక్షరాస్యత రేటు మూడోవంతు ఉంది. 99 శాతం పైగా గ్రామీణ ప్రజలకు ఒక కిలోమీటరు దూరంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సదుపాయం, ఉచిత దుస్తులు, ఉచిత పుస్తకాల పంపిణీ 33 శాతానికి పైగా పిల్లలకు అందజేస్తున్నారు. షెడ్యూల్డు తెగల హాస్టళ్లలో పదవ తరగతి చదివే బాలికలు ఐదుశాతం, బాలురు పదిశాతం ఉన్నారు. దీన్ని బట్టి బాలికల శాతం చాలా తక్కువని స్పష్టమవుతోంది. సంఘటిత విద్య అభ్యసన పరికరాలను, రవాణా సౌకర్యాలను కలిగించినప్పటికీ బాలికల శాతం తక్కువే. మన రాష్ట్రంలో 1/4వ వంతు పట్టణ జనాభా మురికివాడల్లో నివసిస్తున్నారు. వీరిలో 5 సంవత్సరాలు పైబడినవారిలో 60 శాతం నిరక్షరాస్యులు. పురుషులకంటే స్ర్తిలు మరీ ఎక్కువగా చదువురానివారు. మురికివాడల్లో ముఖ్యంగా ఐదుశాతానికి పైగా జనాభాకు మాత్రమే కనీస జీవన సదుపాయం ఉంది.
మురికివాడల్లో 80 శాతానికి పైగా పేదవారు. 78 శాతం నైపుణ్యం లేని పనితనం కలిగినవారు. అందులో స్ర్తిలు చాలా ఎక్కువ. దీనికి కారణం గ్రామీణ నేపథ్యం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత. మురికివాడలనుంచి వచ్చే విద్యార్థుల పాఠశాల హాజరు చాలా తక్కువ. బాలనేరస్థుల సంఖ్య ఎక్కువ. మురికివాడల్లో పిల్లలు పాఠశాలల్లో నమోదు కాకపోవడానికి కారణాలు అనేకం. ఆర్థికంగా వెనుకబడినతనం, పేదరికం, విద్యపట్ల సరైన అవగాహన లేకపోవడం, భేదభావం, పౌరసౌకర్యాలు లేకపోవడం, అనారోగ్య పరిస్థితులు బాలికలు ఎక్కువగా ఇంటిపనికి పరిమితం కావడం, బాలకార్మికుల సంఖ్య పెరగడం మొదలైనవి. సాధారణ కుటుంబాలనుంచి కూడ ప్రాథమికస్థాయిలో బాలికలు నమోదు కాకపోవడానికి, మధ్యలోనే బడిమానివేయడానికి కూడ కారణాలు చాలానే ఉన్నాయి. ఆడపిల్లలు పెండ్లి చేసుకొని వేరే కుటుంబానికి వెళ్లిపోవడం, బాలికలు, స్ర్తిలు రెండవ శ్రేణి పౌరులుగా లెక్కించబడటం, తల్లిదండ్రులు సహవిద్య పాఠశాలల్లో బాలికల్ని చదివించడానికి సంకోచించడం, సహవిద్య పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడం, కుటుంబ ఆచారాలు, కట్టుబాట్లు, కుటుంబ పనిభారం, తప్పనిసరి పనులు వంటివి. ఇలాంటి పరిస్థితులవల్ల నేడు పాఠశాలల్లో నమోదుకాని పిల్లల్లో బాలికలే అధికం.
పాఠశాలకు పోయే వయసుగల పిల్లలో ముగ్గురిలో ఇద్దరు బాలికలే. చాలామంది ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి బాలకార్మికులుగా తయారవుతున్నారు. వెట్టి చాకిరికి బలవుతున్నారు. బాలకార్మిక నిషేధచట్టం అమల్లో ఉన్నప్పటికి బాల కార్మికుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో అందరికీ చదువు, అందనిఫలంగానే మిగిలిపోయింది. పట్టణీకరణ, ప్రైవేటీకరణతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల నమోదు లేక వెలవెల బోతున్నాయి. విద్యావ్యవస్థ వ్యాపార సరళితో విలవిల్లాడుతోంది. సంక్షో భం నుంచి బయటపడాలంటే బాలికలు, బాలకార్మికులు వెట్టిచాకిరి చేసే పిల్లలు, మురికివాడల్లో నివసించే పిల్లలు, షెడ్యూల్డు కులాలు తెగల పిల్లలను, వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లల్ని నిర్దిష్ట జనాభాగా తీసుకొని వారి విద్యాభివృద్ధికి, విద్యాధికులుగా మనం సమాజంలో వారిపట్ల గల ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు ప్రయత్నించాలి. సమానవిద్యాహక్కు కలిగి ఉండటానికి ప్రోత్సహించాలి. అంతేకాకుండా వారిని కుటుంబంలో, సమాజంలో సమాన సభ్యులుగా గుర్తించడానికి నిరంతర ప్రయత్నం చేయాలి. అందరికీ విద్యను సాధించాలి. సంక్షేమ సమాజ నిర్మాణానికి దోహద పడాలి.

-డాక్టర్ సరోజన బండ (విశ్రాంతాచార్యులు, ప్రభుత్వ ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ)