మెయిన్ ఫీచర్

అంతర్గత చైతన్యమే స్వేచ్ఛ (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ, వారికి కావలసినది అసలైన స్వేచ్ఛకాదు, బాధ్యతా రాహిత్యం. వారు స్వేచ్ఛ కావాలంటారు. కానీ, లోలోపలవారు అచేతనంగా కోరుకునేది బాధ్యతా రాహిత్యం. విచ్చలవిడి తనానికి అనుమతి పత్రాలే. అది మరీ పిల్లచేష్ట.
పరిణతి చెందడమే స్వేచ్ఛ. బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగాఉన్నప్పుడే స్వేచ్ఛ లభిస్తుంది. ప్రపంచం స్వేచ్ఛగా లేదు. ఎందుకంటే, మనుషులు పరిణతి చెందలేదు. విప్లవకారులు అనేక శతాబ్దాలుగా అనేక విషయాలపై చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆదర్శవాదులందరూ ‘‘మనిషికి ఎలా స్వేచ్ఛ కలిగించాలి?’’అని ఎప్పుడూ ఆలోచిస్తుంటే, దాని గురించి ఎవరూ ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే, అన్నీ ఏకమైతే తప్ప మనిషి స్వేచ్ఛగా ఉండలేడు. బుద్ధుడు, మహావీరుడు, క్రీస్తు, మహమ్మద్, జరతూష్టల్రు మాత్రమే స్వేచ్ఛగా ఉండగలరు. ఎందుకంటే, వర్తమానంలో ఎరుకతో ఉండడమే స్వేచ్ఛ. ఎరుక లేనివారికే ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానాలు అవసరమవుతాయి. అప్పుడు స్వేచ్ఛ తగ్గిపోతుంది. అంటే, కేవలం పేరుకుమాత్రమే స్వేచ్ఛ ఉంటుంది తప్ప, నిజానికి అది ఎప్పుడూ ఉండదు. ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్వేచ్ఛ ఎలా ఉంటుంది? అది అసంభవం. అయితే స్వేచ్ఛకోసం ఏం చెయ్యాలి?
ప్రభుత్వాలు లేకపోతే అరాచకత్వముంటుంది. అది స్వేచ్ఛకాదు, పిచ్చి. ఇప్పుడున్న దానికన్న అది మరీ అధ్వాన్నంగా ఉంటుంది. మీరు అప్రమత్తంగా ఉండరు కాబట్టి, పోలీసులు అవసరం. లేకపోతే, రహదారుల కూడలిలో వారు ఉండవలసిన అవసరమేముంది? ప్రజలందరూ అప్రమత్తులైతే పోలీసుల అవసరముండదు. కాబట్టి, వారిని తొలగించవచ్చు. కానీ, ప్రజలు చైతన్యవంతులుకారు. అందుకే పోలీసులు అవసరమయ్యారు.
కాబట్టి, నేను స్వేచ్ఛ గురించి చెప్తున్నానంటే అర్థం బాధ్యతాయుతంగా ఉండమని. మీరు ఎంత ఎక్కువ బాధ్యతతో ఉంటారో అంత ఎక్కువ స్వేచ్ఛగా ఉంటారు. అలాగే, మీరు ఎంత ఎక్కువ స్వేచ్ఛగా ఉంటారో అంత ఎక్కువ బాధ్యతతో ఉంటారు. అప్పుడు ‘‘మీరుచేసే పని పట్ల, మీరు మాట్లాడే మాట పట్ల’’ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. చివరికి మీ హావభావాలపట్ల కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, మిమ్మల్ని నియంత్రించేందుకు ఎవరూ ఉండరు.
‘‘మీరు స్వేచ్ఛగా ఉన్నారు’’అని నేనంటున్నానంటే అర్థం ‘‘మీరే దేవుడు’’అని. అంతేకానీ, ‘‘స్వేచ్ఛ’’ విచ్చలవిడి తనానికి ఇచ్చే అనుమతి పత్రంకాదు. అదొక అద్భుతమైన క్రమశిక్షణ.
నలభైయ్యైదేళ్ళుగా నేను నిర్మించుకున్న జైలులోనే చాలాకాలం జీవించాను. అయితే మరింత స్వేచ్ఛగా ఉండొచ్చని ఇప్పుడు నాకు తెలిసింది. కానీ, సురక్షితమైన ప్రదేశంతోపాటు మంచి వాతావరణం కూడా ఎదిగేందుకు అవసరమని మీకనిపిస్తే, అప్పుడేం చెయ్యాలి? ఎప్పుడైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండేదెలా? దాని గురించి నాలో తిరుగుబాటు కలుగుతోంది. అందుకు నేను బాధపడుతున్నాను.
స్వేచ్ఛకు బాహ్యంతో ఎలాంటి సంబంధంలేదు. అది అంతర్గత చైతన్యానికి సంబంధించినది. మీ చైతన్యం స్వేచ్ఛగాఉంటే ఎప్పుడైనా, ఎక్కడైనా-చివరికి సంకెళ్ళతో బంధించి జైలులోపెట్టినా- మీరు స్వేచ్ఛగా ఉండగలరు. అలాగే మీ చైతన్యానికి స్వేచ్ఛలేకపోతే మీకు సంకెళ్ళులేకపోయినా, మీరు జైలులో లేకపోయినా, చివరికి మీరు మీ సొంత ఇంట్లోనే ఉన్నా మీరు ఖైదీయే.
మీరు బాహ్యస్వేచ్ఛ, అంతర్గత స్వేచ్ఛలతో తికమక పడుతున్నారు. బాహ్య స్వేచ్ఛకు సంబంధించినంతవరకు మీరు ఎప్పటికీ పూర్తిగా స్వేచ్ఛగా ఉండలేరు.
ఎందుకంటే, మీరు ఒంటరివారు కాదు. మీ చుట్టూ అనేకమంది ఉంటారు. అందువల్ల మీరు జీవితంలో రాజీపడవలసి వస్తుంది. ఈ భూమిపై మీరొక్కరే ఉన్నట్లైతే మీకు పూర్తిస్వేచ్ఛ దక్కేది. కానీ, మీరు ఒంటరి వారు కాదుకదా!
రహదారిలో మీరు ఎడమవైపే నడవాలి. అది ఒక నిబంధన. దానినే మీరు బానిసత్వమని, బలవంతపెడుతున్నారని అనుకుంటే ఎలా? ఏ దేశంలో అయినా మీరు అక్కడి నిబంధనల ప్రకారమే రహదారిలో నడవాలికానీ, మీ ఇష్టమొచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ నడవకూడదు.
ఒక్క భారతదేశంలో మాత్రమే మీరు అలాచెయ్యగలరు.
ఇంకావుంది...
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్