మెయిన్ ఫీచర్

‘తలాక్’ రద్దుతో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం మహిళలకు శాపంగా పరిణమించిన ‘తలాక్’ విధానాన్ని రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, సాధికారతతోనే మహిళలు అన్ని రంగాల్లో అద్భుతాలు సాధించగలరని భోపాల్ నార్త్ నియోకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న ఫాతిమా రసూల్ సిద్ధిఖీ అంటున్నారు. హిందుత్వ పార్టీగా ముద్ర పడిన భారతీయ జనతాపార్టీ నుంచి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక ముస్లిం మహిళగా ఫాతిమా రికార్డు సృష్టించారు. రాజకీయ కుటుంబానికి చెందిన ఆమె సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగినప్పటికీ, ఇటీవల భాజపాలో చేరి టిక్కెట్ సాధించారు. కాంగ్రెస్ ప్రముఖుడు ఆరిఫ్ ఆఖ్వీల్‌పై ఫాతిమా పోటీ చేస్తున్నందున భోపాల్ నార్త్ నియోజకవర్గంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఫాతిమా తండ్రి రసూల్ అహ్మద్ కాంగ్రెస్ దిగ్గజనేత మాధవరావు సింధియాకు అనుచరుడిగా ఉండేవారు.
ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే భోపాల్ నార్త్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికల్లో అక్కడి నుంచి ఎలాగైనా విజయ కేతనం ఎగురవేయాలన్న సంకల్పంతో ముస్లిం వర్గానికి చెందిన 35 ఏళ్ల ఫాతిమాను భాజపా బరిలోకి దింపింది. భాజపాలో చేరిన కొద్ది గంటలకే ఫాతిమాకు అభ్యర్థిత్వం ఖరారైంది. ముస్లిం కుటుంబాలను ముఖ్యంగా మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న తపనతోనే తాను భాజపా చేరానని ఆమె చెబుతున్నారు. మూడుసార్లు ‘తలాక్’ అనడం ద్వారా ముస్లిం మహిళలకు వారి భర్తలు విడాకులు ఇవ్వడం అనాగరిమని, ఈ విధానాన్ని రద్దు చేస్తేనే తమ వర్గం మహిళలకు న్యాయం జరుగుతుందని ఫాతిమా అంటున్నారు. ‘తలాక్’ విధానాన్ని రద్దు చేయాలని ప్రధాని మోదీ ఎంతో సాహసంతో నిర్ణయం తీసుకున్నందున- ముస్లిం మహిళలు భాజపాకు అండగా నిలవాలని ఆమె ఎన్నికల ప్రచారంలో విజ్ఞప్తి చేస్తున్నారు. ముస్లిం వర్గానికి చెందిన ఆమె ఇలా పిలుపునివ్వడం భోపాల్‌లో సంచలనం కలిగించింది. గతంలో భోపాల్‌లో విషవాయువు సృష్టించిన విధ్వంసంలో బాధిత కుటుంబాలకు తన తండ్రి ఎంతగానో సేవలందించారని ఆమె వోటర్లకు గుర్తు చేస్తున్నారు. సుమారు నలభై శాతం ముస్లిం వోటర్లు ఉన్నందున భోపాల్ నార్త్‌లో తన గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హిందూ- ముస్లింల సఖ్యత కోసం తన తండ్రి ఎంతగానో కృషి చేసినందున ఇతర వర్గాల వారు సైతం తనకు ఈ ఎన్నికల్లో అండగా ఉంటారని ఫాతిమా భావిస్తున్నారు. లౌకికవాదిగా తన తండ్రికి మంచి గుర్తింపు ఉందంటున్నారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆఖ్వీల్ ఇదే నియోజకవర్గంలో 1990 నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ కాంగ్రెస్‌కు పెట్టనికోట అయిన భోపాల్ నార్త్‌లో ఈసారి తాను గెలుస్తానని ఫాతిమా అంటున్నారు. పాతికేళ్లుగా తన తండ్రికి ఓటమి ఎదురైన ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతోనే తాను భాజపాలో చేరానని ఆమె చెబుతున్నారు. హిందూ- ముస్లింల ఐక్యతే తన విజయానికి దోహదం చేస్తుందంటున్నారు. మధ్యప్రదేశ్‌లో గత 15 ఏళ్లుగా భాజపా ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకుల్లో మతం పేరిట చీలికలు తెస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శిస్తున్నారు. మతం పేరిట సెంటిమెంట్లను రగిలించడం సరికాదని ఫాతిమా అంటున్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ముందంజలో నడిపిస్తానని ఆమె మహిళా వోటర్లకు భరోసా ఇస్తున్నారు