మెయన్ ఫీచర్

కాంగ్రెస్ పునరుజ్జీవానికి చంద్రబాబు దీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం జరుపుతున్న పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఒక్కరే అని చెప్పవచ్చు. మిగిలిన పార్టీలన్నీ ఏదో ఒక విధంగా అవకాశవాద ధోరణినే ప్రదర్శిస్తున్నాయి. వాటికి తమ సొంత రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యం. మోదీని సాగనంపి, ఆ స్థానంలో రాహుల్‌ను గద్దె ఎక్కించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల కాలంలో వలే పార్లమెంట్‌లో ఏ కూటమి కూడా స్పష్టమైన ఆధిక్యతను పొందలేని పక్షంలో, బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆధిక్యతను సమకూర్చుకోలేని పక్షంలో తాము రంగ ప్రవేశం చేసి ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని ఇప్పుడు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. కేవలం 40 నుండి 50 మంది ఎంపీల మద్దతు కూడదీసుకొంటే, హంగ్ పార్లమెంట్ ఏర్పడిన సమయంలో అధికారం చేపట్టవచ్చని నలుగురైదుగురు నేతలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ వంటి వారు కూడా ఇవే తమకు చివరి ఎన్నికలని చెబుతున్నారు. అంటే పరోక్షంగా ప్రధాన మంత్రి పదవిని మరోసారి చేపట్టడానికి చివరి ప్రయత్నంగా సంకేతం ఇస్తున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు ముందుగా రాష్ట్రాలలో పొత్తులు ఏర్పర్చుకొనే, ఎన్నికల తర్వాత ఢిల్లీలో కూర్చొని ఎవరికి లేదా ఏ కూటమికి ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉంటే వారినే ప్రధాన మంత్రిగా ఎన్నుకొందామని ప్రతిపాదిస్తున్నారు.
అందుకనే ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో ఒక కూటమి ఏర్పాటుకు గాని, ముందుగా ప్రతిపక్షాల నుండి ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించడం పట్ల గాని ఎవరూ ఆసక్తి చూపడం లేదు. తగినంతమంది మద్దతు సమకూరితే ప్రధాని పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన రాహుల్ సైతం ఇతర ప్రతిపక్షాల ఎత్తుగడలను గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రాహుల్‌ను ప్రధాని అభ్యర్థి అని చెప్పలేదని పి.చిదంబరం చేత ప్రకటన ఇప్పించారు. ఈ పరిస్థితులలో రాహుల్ గాంధీ సారధ్యంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. ఈ విషయమై పలు రాజకీయ పార్టీల అధినేతలను కలుస్తూ, ఈ నెల 22న ఢిల్లీలో ప్రాథమికంగా నేతలందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
రాహుల్ తనకన్నా చాలా జూనియర్ అని బహిరంగంగానే చెప్పిన మమతా బెనర్జీ ఇప్పటి వరకు ఆయన ఆధ్వర్యంలో జరిపే ఎటువంటి సమావేశానికి హాజరు కావడం లేదు. శరద్ పవార్ కూడా ఇటువంటి విధానమే అనుసరిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ దయతో తన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో దేవెగౌడకు రాహుల్ గాంధీని సమర్ధించక తప్పక పోవచ్చు. ఇటువంటి సమయంలో చంద్రబాబు కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయి చూడవలసి ఉంది. ఎన్డీయే నుండి బైట పడిన తర్వాత తనను బిజెపి నేతలు బతిమిలాడి, ఇముడ్చుకొనే ప్రయత్నం చేస్తారని చంద్రబాబు ఎదురు చూసారు. కేవలం స్వరాష్ట్రంలో పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వేసిన ఎత్తుగడగా గ్రహించిన బిజెపి నేతలు తాము లేకుండా ఏపీలో చంద్రబాబు తిరిగి ఎట్లా అధికారంలోకి వస్తారో చూస్తాం అంటూ గర్జనలు చేస్తూ ఉండడంతో, చంద్రబాబు ఒక విధంగా బెదిరిపోయి ఇప్పడు కాంగ్రెస్ పంచన చేరినట్లు స్పష్టం అవుతోంది.
మోదీని ఢీకొనడానికి సిద్ధపడుతున్న రాహుల్ ఒక ఆలంబనగా చంద్రబాబుకు కనిపిస్తున్నారు. తెలంగాణలో ఉనికి కోల్పోతున్న తన పార్టీని బతికించు కోవడంతో పాటు, రాజకీయంగా పట్టు కోల్పోతున్న సమయంలో కొంత రక్షణ కోసం కూడా కాంగ్రెస్‌తో ఆయన పొత్తు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. బిజెపి,పవన్ కళ్యాణ్ మద్దతుతో 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు గ్రహించారు. అందుకనే కనీసం ఐదారు శాతం ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ అండ కూడా అవసరం అని భావిస్తున్నారు. ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ఓట్లు ఏ మాత్రం బదిలీ కాగలవో అని ప్రయోగం చేస్తున్నారు. రాజకీయాలలో అవసరాలే విధానాలకు దారితీస్తాయి. శాశ్వత శత్రువులు ఉండరు గదా. అందుకనే కాంగ్రెస్ పారీని బంగాళా ఖాతంలో విసిరేయాలని గర్జించిన ఎన్‌టి రామారావు నెలకొల్పిన తెలుగు దేశం పార్టీ 36 ఏళ్లుగా అనుసరిస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలను సమాధి చేసి, చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతో చేతులు కలిపారు. మొదట్లో ఇది కేవలం స్థానిక పరిస్థితుల దృష్ట్యా, తెలంగాణలోని పార్టీ నాయకుల ఇష్టానికి వదిలి వేస్తున్నట్లు, తనకు ఈ పొత్తుతో ఏమీ సంబంధం లేన్నట్లు చంద్రబాబు నటించారు. ఎన్టీఆర్ ఏ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలించి పారవేయడం కోసం ఆహర్నిశలు పాటుపడ్డారో ఆ పార్టీకి ప్రాణం పోయడానికే చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. వివిధ ప్రతిపక్ష నేతలతో ఆయన జరుపుతున్న సమావేశాలు కాంగ్రెస్ ప్రతినిధిగా, రాహుల్ గాంధీకి వకాల్తా పుచ్చుకున్నట్లు ఉంటున్నది.
ఇప్పటి వరకు చంద్రబాబు కలుస్తున్న నేతలు ఏదో విధంగా కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నవారే. అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ లో గత ఏడాది తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను కాదని కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పరచుకొని బోల్తా పడ్డారు. శరద్ పవార్ మహారాష్టల్రో ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దమై, సీట్ల సర్దుబాటు విషయంలో చాలావరకు అవగాహనకు వచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతోనే కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తమిళనాడులో గత ఎన్నికల సమయం నుండే డిఎంకె తో కాంగ్రెస్ పొత్తు కొనసాగుతున్నది. బిఎస్పీ అధినేత్రి మాయావతి సూత్రప్రాయంగా కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్దపడినా, ఆ తర్వాత దళితుల్లో తన ఉనికి కోల్పోవాల్సి వస్తుందనే భయంతో ఇప్పుడు అడ్డం తిరిగారు. రాహుల్ నేతృత్వంలో కూటమి ఏర్పాటుకు గాని, ఆయనను ప్రధాని అభ్యర్ధిగా అంగీకరించడం సాధ్యం కాదని శరద్ పవార్, మమతా బెనర్జీ వంటి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో చంద్రబాబు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమని, ఆ పార్టీ లేకపోతే విపక్ష కూటమి ఉండబోదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కూటమికి ఎవరు నేతృత్వం వహించాలనే అంశంపై విపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి రానప్పటికీ, చంద్రబాబు కాంగ్రెస్‌ను నాయకత్వ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నించడం గమనార్హం.
రాహుల్‌కు బాబు కితాబు కుడా ఇస్తున్నారు. రాహుల్ స్వతహాగా నాయకుడు, బీజేపీకి వ్యతిరేకంగా పోరా డుతున్న జాతీయపార్టీ కాంగ్రెస్ ఒక్కటే. మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలే. అలాంటి కాంగ్రెస్ లేకపోతే మహాకూటమి ఎలా సాధ్యం? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రాయబారిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గేహ్లాట్ ప్రత్యేకంగా అమరావతికి వచ్చి చంద్రబాబును కలవడం, ఈ నెల 22న ఢిల్లీలో ప్రతిపక్ష నేతల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చూస్తుంటే కాంగ్రెస్ ఎజెండా అమలు బాధ్యతను చంద్రబాబు చేపట్టిన్నట్లు భావించాలి. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ సీపీఐ వలే సీట్ల కోసం అంతగా పట్టు పట్టకపోవడం గమనార్హం.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగితే తన హయంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి చర్యలకు బాధ్యత వహించ వలసి ఉంటుందని, చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవలసి వస్తుందనే దిగులు తెలుగు దేశం పార్టీ నేతలలో స్పష్టంగా కనిపిస్తున్నది. తమ ఆత్మరక్షణ కోసమైనా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండరాదని పట్టుదల చూపుతున్నారు.ఒకవేళ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కేంద్రంలో అయినా అనుకూల ప్రభుత్వం ఉంటే ఆలంబనగా ఉంటుందనే అభిప్రాయం కావచ్చు. తమను కాపాడ గలిగేది కాంగ్రెస్ అనే అభిప్రాయం వారి ధోరణిలో వ్యక్తం అవుతున్నది. అందుకనే తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావడం పట్ల ఆ పార్టీ నాయకత్వం కన్నా చంద్రబాబు ఎక్కువ పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తమ చెప్పుచేతలలో ఉండేటట్లు చేసుకొనే ప్రయత్నం కూడా చేస్తారు. కర్ణాటకలో కేవలం 36 సీట్లతో కుమారస్వామి ముఖ్యమంత్రి కావడంతో- 10, 12 సీట్లతో కూడా తెలంగాణ ప్రభుత్వంలో నిర్ణయాత్మక పాత్ర వహించవచ్చని తెదేపా నేతలు అంచనాలు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ తెలంగాణపై దృష్టి సారించారు. ఒక దశలో తెలంగాణ నుండే తాను పోటీ చేయవచ్చనే సంకేతాలు పంపారు. అయితే, ఆయన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సారథ్యం వహించగా పార్టీని గెలిపించలేక పోవడంతో ఇక తెలంగాం వైపు చూడటం లేదు. ఎమ్యెల్యే కూడా కాకుండానే ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గంలో చేరిపోయారు. ఇప్పుడు ఎన్టీ రామారావు పట్ల గల అభిమానాన్ని ఆసరా చేసుకోవడానికి ఒకవంక నందమూరి బాలకృష్ణను ప్రచారంలోకి దింపడంతో పాటు, మరోవంక నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి నుండి తెలంగాం అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేయించే ప్రయోగం చేస్తున్నారు.
గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర వహించడంతో పాటు దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌ను ప్రధానులుగా చేసింది చంద్రబాబు అని, ఇప్పుడు ఆయన చొరవ తీసుకొని కూటమి ఏర్పాటు చేస్తే రాహుల్ ప్రధాని అవుతారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే గుజ్రాల్ సంగతి ఏమో గాని, చంద్రబాబు తనను ప్రధానిగా చేసిన్నట్లు దేవెగౌడ ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పనే లేదు. పైగా ఈ మధ్య డీఎంకే అధినేత కరుణానిధి మరణించిన సందర్భంలో ఆయన పట్టుబట్టిన కారణంగానే తాను ప్రధాన మంత్రి పదవి చేపట్టానని స్పష్టంగా చెప్పారు.
2019 ఎన్నికల అనంతరం ఏర్పడే రాజకీయ పరిస్థితుల గురించి ఇప్పుడే ఊహాగానాలు చేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్ కనీసం 200 సీట్లు తెచ్చుకొంటే గాని రాహుల్ ప్రధాని కాలేరు. బిజెపి కనీసం 240 సీట్లు తెచ్చుకొంటే గాని మోదీ తిరిగి ప్రధాని కాలేరు. బిజెపి 200కు పైగా సీట్లు తెచ్చుకొంటే ఆ పార్టీ నుండే మరొకరు ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు రాజకీయ పునరేకీకరణ తప్పక పోవచ్చు. మోదీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారే అప్పుడు బిజెపికి దగ్గర కావచ్చు. అందుకనే రఫెల్ డీ ల్ గురించి కాంగ్రెస్ ప్రతి రోజూ గొంతు చించుకొంటున్నా మిగిలిన పక్షాలు అప్పుడప్పుడు ఏవో కొన్ని వాఖ్యలు చేయడం మినహా పెద్దగా పట్టించు కోవడం లేదు. కనీసం ఈ విషయమై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రతికూల వాఖ్యలు చేస్తే గాని, ఈ విషయమై మరింతగా ముందుకు వెళ్లే అవకాశం కాంగ్రెస్‌కు ఉండక పోవచ్చు. బోఫోర్స్, 2జి స్పెక్ట్రమ్, బొగ్గు గనులు వంటి అంశాలలో వలే రఫెల్ విషయంలో ఇప్పటి వరకు చట్టబద్ధ సంస్థలు ఏవీ ప్రతికూలంగా వాఖ్యలు చేసిన సందర్భం లేదు. ఎన్ని ఆరోపణలు చేసినా, ప్రభుత్వ పనితీరుపట్ల ఎన్ని విమర్శలు చెలరేగుతున్నా ఇంకా సాధారణ ప్రజలలో మోదీ అంటే నిజాయతీ పరుడనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా ఒక్క బృందంగా ఏర్పడాలని ప్రయత్నం చేస్తున్న నేతలు చాలామంది ఈ విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. చంద్రబాబు చేస్తున్న కూటమి ప్రయత్నాలు రాజకీయంగా ఆయనను ఏమాత్రం ఆదుకోగలవో చూడవలసి ఉంది.

-- చలసాని నరేంద్ర సెల్ : 98495 69050