మెయిన్ ఫీచర్

జాతి గుండెలో చెరగని ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర భారతావనికి మూడో ప్రధానిగా పగ్గాలు చేపట్టి, యావత్ జాతిని ‘ప్రజాస్వామ్య సోషలిజం’ పంథాలో నడిపించిన దిగ్గజ నేత ఇందిరా ప్రియదర్శిని వ్యక్తిత్వం మాటలకు అందనిది. మహిళా శక్తికి ప్రతీకగా అసదృశధీమంతమైన విశిష్టమైనది, విలక్షణమైనది ఆమె వ్యక్తిత్వం. దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్ర పోరాట కాలంలోనే తన కుమార్తె అయిన ఇందిరను ‘చైల్డ్ ఆఫ్ ది రివల్యూషన్’గా పేర్కొన్నారు. 1917 నవంబర్ 19వ తేదీన జన్మించిన ఇందిర 19 ఏళ్ళ వయసులో తల్లిని కోల్పోయారు. తల్లి చరమాంకంలో లభించిన ఆశీస్సుల కారణంగా 1942లో ఫిరోజ్‌తో సాన్నిహిత్యం వివాహబంధంగా మారింది. జాతిపిత గాంధీజీకి నెహ్రూ కుటుంబంతో వున్న బాంధవ్యం వలన ఫిరోజ్ పేరు చివర ‘గాంధీ’ చేరింది. ఈ కారణంగా ఇందిరాప్రియదర్శిని పేరు ఇందిరా గాంధీగా మారడం, ఆ రాజకీయ వారసత్వం రాహుల్ గాంధీగా నేటికీ కొనసాగటం భారత రాజకీయాలలో ఒక విచిత్ర పరిణామం.
ఏడు దశాబ్దాలకు పైగా.. నాడు గాంధీజీ ఆశించకపోయినా అనూహ్య రీతిలో ఆయన పేరు అందులోనూ ఇంటిపేరు నెహ్రూ వారసత్వ కుటుంబంతో మిళితమై కొనసాగుతుండటం విధి లిఖితమైంది. ఇందిరకు దేశాధికారం రాజకీయ వారసత్వంగా లభింపజేయాలని జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నడూ ఆశించిన దాఖలాలు లేవు. స్వాతంత్య్ర పోరాట కాలంలో నెహ్రూ కుటుంబం బ్రిటీష్ ప్రభుత్వాన్ని పారద్రోలే ఉద్యమ పోరాటాలలో నిమగ్నం కావటంతో, అలహాబాద్‌లోని ‘ఆనంద భవన్’ ఆమె బాల్య స్మృతులకు నిలయమైంది. 1952 ఎన్నికలలో ఫిరోజ్ యువ పార్లమెంటు సభ్యునిగా నాటి ప్రధాని నెహ్రూ సారథ్యంలోని ప్రభుత్వ వైఖరిని, ప్రతిపక్ష నేతగా తీవ్రంగా విమర్శించేవారు. 1944లో రాజీవ్, 1946లో సంజయ్ జన్మించటంతో పిల్లల ఆలనా పాలనతో ప్రధాని నివాసంలో ఉంటూ ఇందిర తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించేవారు. 1960లో 48వ పుట్టినరోజు రాకుండానే ఫిరోజ్ గుండెపోటుతో మరణించాడు. 1950 నుంచి 1964లో తండ్రి మరణించేవరకు ఇందిర ఇంటి బాధ్యతలకు పరిమితమై, ప్రధాని పదవిలో ఉన్న నెహ్రూకు చేదోడు వాదోడుగా వుండేవారు. తదనంతర భారతీయ రాజకీయాలలో, ఇందిర కుటుంబంలో కోడళ్ళు సోనియా, మేనకా గాంధీలయినా రాజకీయ వైరుధ్యం కలిగివుండటం, అటువంటి స్థితిగతుల రాజకీయాలు బహుశా మన దేశంలోనే సాధ్యం కావచ్చు.
భారత ద్వితీయ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మంత్రివర్గంలో ఇందిర అంతగా ప్రాధాన్యత లేని సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1966లో తాష్కెంట్‌లో శాస్ర్తిజీ ఆకస్మిక మరణంతో ఇందిరాగాంధీ 48వ ఏట ప్రధాని బాధ్యతలను అనూహ్య పరిస్థితులలో స్వీకరించారు. అప్పటికే కాంగ్రెస్‌లో అంతర్గత నాయకత్వ వైరుధ్యాలు ఆరంభమయ్యాయి. 1969లో ఇందిరా గాంధీ కాంగ్రెస్‌కు జీవం పోశారు. ప్రధానిగా సమర్ధవంతంగా పనిచేస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలను, సంస్కరణలను అమలు చేశారు.
బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, భూ సంస్కరణలు వంటి నిర్ణయాలను తీసుకొని పేదరికాన్ని పారద్రోలే దిశలో సమ సమాజ నిర్మాణానికి ఆమె బాటలు వేశారు. జాతీయ, అంతర్జాతీయ రంగాలలో బంగ్లాదేశ్ ఆవిర్భావంతో ‘విజయేందిర’గా కీర్తిబావుటా ఎగురవేశారు. సుమారు 15 సంవత్సరాలు దేశ ప్రధానిగా ఎన్నో ఘన విజయాలతో ‘ఇందిరమ్మ’గా అశేష భారత జనావళి హృదయాలను దోచుకొన్నారు. ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చి, పేద ప్రజల ఆశాజ్యోతిగా జాతిని పురోగమింపజేశారు. అంతర్జాతీయంగా ఆమె రాజకీయ నీతిజ్ఞత, ప్రతిభావంతమైన సారథ్యంతో శాంతి, సౌభ్రాతృత్వం, అలీన రాజ్యాల ఐక్యత సువర్ణ్ధ్యాయాన్ని సృష్టించింది.
1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు రాయ్‌బరేలీ ఎన్నికపై తీర్పు వ్యక్తిగతంగా ఇందిరాగాంధీకి అశనిపాతమైంది. అప్పటికే రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పాలనలో అంతర్గత విభేదాలు, అధికార వ్యామోహం కోసం కుమ్ములాటలు తారస్థాయి చేరుకొన్నాయి. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవానికి పిలుపు ఇచ్చి, ప్రతిపక్షాల ఐక్యతారావంగా జనతా పార్టీ ఆవిర్భవానికి కారకులయ్యారు. ఇందిరే ఇండియాగా, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే నియంతృత్వ పోకడల పాలన ఆరంభమైంది. దీనికితోడు జూన్ 25న ఇందిర దేశంలో విధించిన ఎమర్జెన్సీ అగ్నికి ఆజ్యం పోసింది. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆవిర్భవించిన జనతా పార్టీ ఒక ప్రభంజనంగా కాంగ్రెస్‌ను తుడిచిపెట్టింది.
కేంద్రంలో తాను అధికారాన్ని కోల్పోయినా దెబ్బతిన్న బెబ్బులిలా ఇందిర ఎదురు తిరిగింది. తెలుగు ప్రజకు ఇందిరమ్మ అంటే ఎనలేని ప్రేమాభిమానాలు. అందుకే ఆమెకు బాసటగా ఆపదలో ఆదుకొన్నారు. 1977 నాటి కలగూరకంప పార్టీల ‘కప్పల తక్కెడ’ రాజకీయాలతో విపరీత అనైక్యతతో జనతా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 1980 జూన్ 23న సంజయ్ మరణం ఇందిరను కుంగగదీసింది. 1980 మధ్యంతర ఎన్నికలలో దెబ్బతిన్న బెబ్బులిలా విజృంభించి ఇందిర మళ్లీ ప్రధాని కావటం చరిత్రాత్మకం. ఆర్థిక అసమానతలు రూపుమాపటానికి ప్రధాని ఇందిర రూపొందించిన ‘ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళిక’ ఏ పార్టీ అధికారం చేపట్టినా పేర్లు మార్చి అనుసరించవలసినదే.
మధ్యయుగంలో సుల్తానా రజియా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మహోన్నత వైభవం ఇందిరను వరించింది. భారత ప్రజాస్వామ్య అధినేత్రిగా ఆమె ఒక మహోజ్వల పురోగమన శక్తి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలలలోనే ఒక మతోన్మాది తుపాకీ కాల్పులకు మహాత్మా గాంధీ బలి అయినట్టే, దేశ ఐక్యతా, సమగ్రత పరిరక్షణ కోసం ప్రధాని ఇందిర ప్రాణాలు అర్పించవలసి వచ్చింది. నిరంతరం కంటికి రెప్పలా అప్రమత్తతో ఆమెను రక్షించవలసిన సొంత సెక్యూరిటీ గార్డులే ఆమె స్వగృహంలో తుపాకీ కాల్పులతో నిస్సహాయంగా వున్న ఆమెను అమానుషంగా కాల్చి చంపటం అత్యంత విషాద ఘట్టం. ప్రాణరక్షకులుగా తాను అనుక్షణం నమ్మినవారే హంతకులై ఆమె శరీరంపై 1984 అక్టోబర్ 31న తూటాలు కురిపించారు. వారు మొత్తం 31 బుల్లెట్లు కాల్చగా 23 బుల్లెట్లు ఆమె శరీరం నుంచి దూసుకుపోగా, 7 బుల్లెట్లు దేహంలో చిక్కుకొని ఆమె మృత్యువు ఒడికి చేరింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు మతోన్మాదం ముసుగులో అమృత్‌సర్ స్వర్ణదేవాలయం స్థావరంగా జాతి సమైక్యత, సమగ్రతలకు పెను ప్రమాదం సృష్టించే విపత్కరతలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరిట ఇందిరమ్మ ప్రభుత్వం సైనిక చర్య తీసుకోవడం ఆ ఉగ్రవాదులను ఈ దురాగతానికి పురికొల్పింది. వికృత విద్వేషం పడగవిప్పి, ఆ ప్రతీకార జ్వాలలో ఇందిరాగాంధీ బలి అయింది. అప్పుడు ఆమె వయసు 67 సంవత్సరాలు. ఆమె స్మృతి చిహ్నంగా 156 అడుగుల శక్తిమాతృక చిహ్నం ఆమె వ్యక్తిత్వానికి ప్రతీక.

-- జయసూర్య 94406 64610