మెయన్ ఫీచర్

ఉత్తరాంధ్రపై ఎందుకింత నిర్లక్ష్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయాలే..నవ్యాంధ్రలో కూడా కొనసాగుతున్నాయి. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడి సాగునీటి వనరులను మెరుగుపరిచి భూమిని సాగులోకి తేవాలి. అయితే వెనుకబడిన ఉత్తరాంధ్రలో సాగునీటి రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైం ది. దాని పర్యవసానమే ఈ ప్రాంతంలోని ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతూ పొట్ట చేతపట్టుకుని పొరుగు జిల్లాలకు, పొరు గు రాష్ట్రాలకు, సుదూర ప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాలకు, అండమన్ నికోబార్ తదితర దీవుల ప్రాంతాలకు వలసపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంపై తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని చెబుతూ ఆరు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి రెండేళ్లలో పూర్తి చేయనున్నట్టు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే ఆయన ప్రాధాన్యతాపరంగా ప్రకటించిన ఆరు ప్రాజెక్టులలో ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు కూడా స్థానం లభించలేదు. దీన్నిబట్టే ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి ప్రాజెక్టుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్నది. నీటివనరుల విషయంలో ఉత్తరాంధ్ర మొత్తం రాష్ట్రంలోనే అట్టడుగున వుంది. సాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో ఉత్తరాంధ్రలో వ్యవసాయ ఉత్పాదకత చాలా తక్కువగా వుంటోంది. రాయలసీమలో వలె నీటి లభ్యత, వర్షపాతం తక్కువగా వుండడంవల్ల ఈ దుస్థితి ఏర్పడడంలేదు. కేవలం అందుబాటులో వున్న నీటి వనరులను సాగుకు అనుకూలంగా మలచేందుకు సేద్యపు నీటి ప్రాజెక్టులను చేపట్టడంలో ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణం.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా పేర్కొంటున్న ఉత్తరాంధ్రలో అత్యధిక ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. శ్రీకాకుళంలో 78.16 శాతం, విజయనగరంలో 74.72 శాతం, విశాఖపట్నంలో 62.23 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తుండగా వీరికి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రధాన జీవనాధారం. అయితే వ్యవసాయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరంలు 13వ స్థానంలో వుండగా విశాఖపట్నం 11వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో చిన్న కమతాల భూములు వున్న చిన్న సన్నకారు రైతులు అత్యధికంగా వున్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఐదెకరాల కన్నా తక్కువ భూములు వున్న కుటుంబాల సంఖ్య శ్రీకాకుళంలో 77.53 శాతం, విజయనగరంలో 91.28 శాతం, విశాఖపట్నంలో 97.74 శాతం వున్నా య. కమతాలు తక్కువగా వుండడంతో ప్రభు త్వం ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నా పేదరికం కారణంగా బోర్లు వేసుకుని పంటలను పండించుకోలేకపోతున్నారు.
ఉత్తరాంధ్రలో మొత్తం 23.24లక్షల ఎకరాల సాగుభూమి వుంది. అందులో మూడోవంతు 8 లక్షల ఎకరాలకు మించి సాగునీటి సదుపాయం లేకపోవడం గమనార్హం. ఉత్తరాంధ్రలో 16 చిన్న, మధ్యతరహా నదులు వున్నా యి. వీటిల్లో ఏటా 207 టిఎంసిల నీటి లభ్యత వుంది. అందులో కేవలం వంద టిఎంసి నీటిని మాత్రమే వినియోగించుకుంటుండగా మిగిలిన నీరు సముద్రం పాలవుతున్నది. చేపట్టినసాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడమే ఇందుకు కారణం.
అంగట్లో అన్నీ వున్నా అల్లుడినోట్లో శని అన్నట్టు ఉత్తరాంధ్రలో సాలీనా 1050 మి.మీ పైనే వర్షపాతం నమోదవుతున్నా ఈ ప్రాంతంలోని కోటిమంది ప్రజలు తాగునీరు, సాగునీరు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించడం తప్ప మరో మార్గం లేదు. ముఖ్యంగా గోదావరి జలాల ద్వారా నిర్మించతలపెట్టిన బాబు జగ్జీవన్‌రాం సుజల స్రవంతి ప్రాజెక్టును తక్షణం చేపడితేనే ఈ ప్రాంత కరువు కాటకాలను పారదోలవచ్చు. ఈ ప్రాజెక్టువల్ల ఈ ప్రాంతంలోని ఎనిమిది లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించవచ్చు. 1200 గ్రామాల్లో 30 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో కాలువల ద్వారా 5.38 లక్షల ఎకరాలు సాగవుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా రెట్టింపు ఎకరాల సాగుకు వీలు కల్పించవచ్చు.
తెలుగుదేశం పార్టీ తమ 2014 ఎన్నికల ప్రణాళికలోని 14వ పేజీలో సుజల స్రవంతి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రాజెక్టు పనులు ఒక్కడుగు కూడా ముందుకు సాగడంలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.7,500 కోట్లు అవసరం కాగా, 2016-17 బడ్జెట్‌లో కేవలం రూ.3 కోట్లు కేటాయించారు. ఈమొత్తం ప్రాజెక్టు సర్వేకు కూడా సరిపోదు. ఈ విషయమై తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని విస్మరిస్తున్నారని అర్ధం అవుతుంది. ఉత్తరాంధ్రలోని ఇతర సేద్యపు ప్రాజెక్టులకు సైతం ఇదేవిధంగా నామమాత్రపు నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది.
సాగునీరు అందుబాటులో లేకపోవడంతో ఉత్తరాంద్రలో వ్యవసాయ ఉత్పత్తులు చాలా తక్కువగా వుంటున్నాయి. సేద్యపు ప్రాజెక్టులు లేకపోవడంతో వర్షాధారంపై ఆధారపడాల్సి వస్తున్నది. దానితో రైతులు అనావృష్టి, అతివృష్టిలతో సతమతమవుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు తోటపల్లి, వంశధార ఫేజ్-2 ప్రాణాధారమైన ప్రాజెక్టులు. అదేవిధంగా అప్‌సోర్, బహుదా, వరహాలగెడ్డ, పెద్దవాగు తదితర శ్రీకాకుళం జిల్లాలోని ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టి పూర్తి చేస్తే రెండు జిల్లాలకు ఎంతో ఉపయోగం. 1976లో ప్రారంభించిన జంఝావతి ప్రాజెక్టు నేటికీ పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒడిషా భూభాగంలో 180 మంది నిర్వాసితులు అవుతారనే ఒకే ఒక కారణంతో ప్రాజెక్టు పూర్తి కావడంలేదు.
విశాఖపట్నం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు తాండవ రిజర్వాయర్. దీని ఆధునీకరణ పనులుపూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఆధునీకరణ పనులు పూర్తి కావాలంటే రూ.14 కోట్లు అవసరం కాగా ఈ సంవత్సరం బడ్జెట్‌లో కేవలం 3.5 కోట్లు మాత్రమే కేటాయించారు. పెద్దేరు ప్రాజెక్టు కాలువ తవ్వకం, సిమెంట్ లైనింగ్ పనులకు రూ. 29 కోట్లు అవసరం కాగా కేవలం ఇప్పటివరకు రూ. 76 లక్షలు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు జలాశయం నిర్వహణకు కూడా సరిపోవు. కల్యాణలోవ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేవలం రూ.30 లక్షలు కేటాయిస్తే పనులు పూర్తవుతాయి. అయితే ఈ ప్రాజెక్టుకు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా గొర్రిగెడ్డ, తావేరు, పాలగెడ్డ, ఉరకగెడ్డ ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించలేదు. ఈప్రాంతంపట్ల నిర్లక్ష్యం చూపుతున్నారనడానికి వీటికి కేటాయిస్తున్న నిధులే చక్కటి తార్కాణం.
సాగునీటి సదుపాయం లేక ఒక వంక వ్యవసాయం దీనావస్థను ఎదుర్కొంటుంటే మరోవంక అంతర్‌రాష్ట్ర సమస్యలు కూడా మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒడిషా ప్రభుత్వం వైఖరి కారణంగా చట్టబద్ధంగా నిర్మించుకుంటున్న సేద్యపు నీటి ప్రాజెక్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తమ రాష్ట్రంలో అక్రమంగా పలు ప్రాజెక్టులను నిర్మిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజానీకానికి తీరని హాని తలపెడుతున్నది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి పొరుగున వున్న రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరపడం ద్వారా గానీ, కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని కోరడం ద్వారా కానీ ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
వంశధార ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఒడిషా రాష్ట్రాల మధ్య 1961 నుండి 1991 వరకు నాలుగుసార్లు జల ఒప్పందాలు జరిగాయి. వంశధారలో లభ్యమయ్యే 115 టిఎంసిల నీటిని చెరి సగం వాడుకోవాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఒప్పందం చేసుకున్నాయి. అయినా ఈ ఒప్పందాలను వమ్ము చేస్తూ ఈ ప్రాజెక్టులో భాగమైన నేరడి బ్యారేజి నిర్మాణంపై ఒడిషా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ మన రైతాంగానికి తీరని నష్టం కలిగిస్తున్నది. ప్రస్తుతం ఈ వివాదం వంశధార ట్రిబ్యునల్ పరిధిలో వుంది. ఇదేవిదంగా ఒడిషా ప్రభుత్వం నదీ జలాల ఒప్పందం కుదిరిన ఇతర ప్రాజెక్టులకు కూడా ముంపు, ఇతర సమస్యల పేరుతో ఆటంకాలు కలిగిస్తూ ఉత్తరాధ్ర ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తున్నది. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ వుండడం దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎటువంటి ఒప్పందాలు లేకుండానే నదులపై ఒకపక్క కొత్త నిర్మాణాలు చేపడుతున్న ఒడిషా ప్రభుత్వం మన రాష్ట్రంతో చేసుకున్న జల ఒప్పందాలకు మరోపక్క తిలోదకాలిస్తోంది. బహుదా నదిపై నిర్మిస్తున్న భాగాలుట్టి డ్యామ్ ఎత్తు పెంచడం, మహేంద్రతనయ నది ఎగువన పురియాషాహి గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణం, నాగావళి రుషికుల్యా నదుల అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలను ఈ సందర్భంగా ప్రస్తావించవచ్చు.
1941లోనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పోలవరం నుండి శ్రీకాకుళం జిల్లా బహుదా వరకు సాగునీరు అందించడం కోసం ప్రణాళికలు రూపొందించింది. దీనిద్వారా 831 టిఎంసిల నీటిని సాగు అవసరాలకోసం ఉపయోగించుకోవచ్చునని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే స్వాతంత్య్రానంతరం వివిధ ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రణాళిక మరుగున పడింది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎడమకాలువ ద్వారా గోదావరి నీటిని తాటిపూడి రిజర్వాయర్‌కు, జంఝావతి కాలువను పొడిగించి తాటిపూడి రిజర్వాయర్‌తో, శారదా నీటిని విజయరాం సాగర్, నాగావళి, వంశధారలను ఓనిగడ్డ ద్వారా అనుసంధానం చేయాలి. ఈ బృహత్తర నదుల అనుసంధానం కార్యక్రమాల ద్వారా ఉత్తరాంధ్రలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలు కలుగుతుంది.
పోలవరం ప్రాజెక్టులో ఉత్తరాంధ్రకు న్యాయబద్ధమైన వాటా లభించాలనేది ఈ ప్రాంత వాసుల ప్రధాన డిమాండ్. ఉత్తరాం ధ్రలోని సీలేరు, శబరి నదులు గోదావరిలో కలుస్తున్నాయ. నిజానికి గోదావరిలో నీటిమ ట్టం ఎప్పుడు తగ్గినా సీలేరు డ్యామ్ నుంచే గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. అందువల్ల గోదావరి జలాల్లో ఉత్తరాంధ్ర వాసులకు న్యాయమైన వాటా లభించాలి. పట్టిసీమ ప్రాజెక్టు, కృష్ణానదిపై ఆధారపడిన ప్రాజెక్టులపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చూపడం లేదు. ఈ విధంగా చేయడం, ప్రభుత్వమే ప్రాంతీయ విభేదాలకు అవకాశం కల్పించినట్లవుతుంది. ఇది ప్రభుత్వానికి, ప్రజలకు మంచిది కాదు.

-కొణతాల రామకృష్ణ (మాజీ ఎంపి, మాజీ మంత్రి)