మెయన్ ఫీచర్

నియంతృత్వానికి చెంపపెట్టు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియంతృత్వ పోకడలకు స్వస్తి పలికి ప్రజాకాంక్షే పరమావధిగా మరో ప్రజాస్వామ్య కుసుమం విరిసింది. ప్రజాహితాన్ని విస్మరించి అధికారమే అంతిమలక్ష్యంగా విడ్డూర పోకడలకు పోయే ఏ నాయకుడూ నిలువలేడనడానికి చరిత్రలో ఉదంతాలకు కొదవ లేదు. లంకలో రాజపక్స, మలేసియాలో నజీబ్ రజాక్, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్, ఈజిప్టులో హోస్నీ ముబారక్ పదవీచ్యుతులు కావడానికి వారి వ్యక్తిగత పదవీకాంక్ష, ప్రత్యర్థులకు నిలువనీడ లేకుండా చేయడంతో పాటు ప్రజాకాంక్షను విస్మరించే రీతిలో వ్యవహరించడమే ప్రధాన కారణాలని చెప్పక తప్పదు. ఇందుకు తాజా ఉదాహరణ మాల్దీవుల్లో ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధమైన పాలనకు తిరిగి ఊపిరిపోసిన తాజా పరిణామాలు. నియంతృత్వాలకు ఆధునిక సమాజంలో చోటులేదు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే, ఎంతటి విఘాతాలకైనా పాల్పడే నేతల్ని, నియంతలను భరించే పరిస్థితికి తావులేదు. ప్రజలు కోరుకునేది తాము ఎన్నుకున్న నేత తమ శ్రేయస్సుకు విరుద్ధంగా వ్యవహరించకూడదన్నదే. అలాగే దేశ క్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించే రీతిలో పాలన సాగాలనే ఆశిస్తారు.. అందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా సహించరు.. ఎంతోకాలం భరించరు.. మాల్దీవుల్లో అంతకు ముందువరకూ ఎవరో తెలియని ఇబ్రహీం మొహమ్మద్ సోలీ అనూహ్యరీతిలో సాధించిన విజయమే ఇందుకు నిదర్శనం. ఏ విధంగా చూసినా ఇది చారిత్రకం.ప్రతిపక్ష మాల్దీవుల ప్రజాస్వామ్య పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోలీ అనూహ్యరీతిలో యమీన్‌పై విజయం సాధించడం ఆధునిక ప్రజాస్వామ్య పథంలో.. విలువల ప్రాతిపదికగా మాల్దీవుల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రజాకాంక్షకు పట్టం కట్టేదే.
ఏ దేశ ప్రజలూ తమ భవితను పణంగా పెట్టి నియంతృత్వాలకు జేజేలు కొట్టరు. మాల్దీవుల విషయంలో భారత్ ఒకరకంగా పెద్దన్న పాత్రనే పోషించింది. ఇరుగు పొరుగు దేశాల్లో నిత్యం కల్లోలమే రాజ్యమేలితే ఏ దేశానికీ మనశ్శాంతి ఉండదు. ఇదేరకమైన పరిస్థితిని తన ఇరుగు పొరుగు దేశాల నుంచి దీర్ఘకాలంగా భారత్ ఎదుర్కొంటూనే వస్తోంది. తాజా సెగ మాల్దీవుల నుంచి తగలడంతో అక్కడి పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత భుజానకేసుకుంది. ఎన్నికల ఫలితాలు తనకు ప్రతికూలంగా వచ్చినా అధికారం రుచిమరిగిన యమీన్ వాటిని ఖాతరు చేయక పోవడంతో మాల్దీవుల్లో పరిస్థితి క్షీణించింది. జనం వద్దన్నా గద్దెదిగేది లేదంటూ మొండికేసిన యమీన్‌కు చెంపపెట్టులా సోలీ ఎన్నిక కావడం.. ఆయన పదవీ స్వీకార ప్రమాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం ఇరు దేశాల మధ్య భవిష్యత్‌లో మరింత సాన్నిహిత్యం పెరిగేందుకు దోహదం చేసే పరిణామాలు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన తర్వాత మాల్దీవుల్లో చోటుచేసుకున్న ఓ చారిత్రక ఘట్టాన్ని స్వయంగా వీక్షించిన ప్రధాని మోదీ ఆ సందర్భంగా అన్న మాటలు ఈ చిరుదేశ భవితకు కొండంత అండగా నిలిచేవే. మాల్దీవుల అభివృద్ధి ప్రాధాన్యతల్లో భారత్ క్రియాశీలకంగా పాల్గొంటుందన్న మోదీ హామీ అక్కడి రాజకీయ సంక్షోభాన్ని ఎగదోసి పబ్బం గడుపుకోవాలని చూసే ‘డ్రాగన్’ చైనాకు గట్టి హెచ్చరికేననడంలో ఎలాంటి సందేహం లేదు. భౌగోళికంగా మాల్దీవులు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన దీవి దేశం. ఈ దేశ అభివృద్ధి, ప్రగతిలో ‘సార్క్’ కూటమిలో పెద్ద దేశంగా భారత్‌కు ఎంతో బాధ్యత ఉంది. అందుకే యమీన్ ధిక్కార స్వరం వినిపించిన తరుణంలో భారత్ కనె్నర్ర చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాయొద్దని.. నిష్పాక్షిక రీతిలోనే ఎన్నికలు నిర్వహించి ఫలితాలనూ ప్రకటించాలని దాదాపుగా ఆదేశించింది. ఇంచుమించు మాల్దీవుల్లో భారత సైనిక జోక్యం వరకూ పరిస్థితులు వెళ్లడం, అమెరికా, ఐరోపా యూనియన్ కూడా ఆర్థిక ఆంక్షలను విధిస్తామని హెచ్చరిక స్వరాన్ని వినిపించడంతో యమీన్ వెనక్కి తగ్గారు. మాల్దీవుల్లో జనం మెచ్చిన, ప్రజాస్వామ్యం అందించిన నాయకుడే దేశాధ్యక్షుడయ్యాడు. ప్రపంచ ప్రజాస్వామ్య విలువలకు, మానవ హక్కులకు పెద్ద దిక్కుగా ఉన్న భారత్, అమెరికా వంటి దేశాలు జోక్యం చేసుకుని ఉండకపోతే.. మాల్దీవుల పరిస్థితి మరింత దిగజారి ఉండేదే!
తన అధికారాన్ని కాపాడుకునేందుకు యమీన్ అన్ని రకాల అడ్డదారులూ తొక్కారు. ఫలితాలను అనుకూలంగా మలచుకునేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మంటగలిపారు. ప్రతిపక్ష నేతల్ని బెదిరించారు. వారిలో కొందరు దేశాన్ని వదిలిపారిపోయేలా అన్ని రకాలుగానూ వత్తిడి తెచ్చారు. చివరికి సుప్రీం కోర్టు తీర్పునూ బేఖాతరు చేసి న్యాయమూర్తుల్ని జైలుపాలు చేశారు. ఈ పరిణామాలన్నీ ఒకనాటి క్యూబా, ఈజిప్టు తదితర దేశాల పరిణామాలనే గుర్తు చేశాయి. అరాచకం ఎంతోకాలం సాగదు. జనం మెచ్చని నేత ఎంతగా బరితెగించినా.. రాజ్యాంగ వ్యవస్థల్ని తుంగలోతొక్కినా అంతిమంగా గెలిచేది జనాభిమతమే. ఏ దేశానికైనా రాజ్యాంగం, సర్వోన్నత న్యాయస్థానాలే విలువలకు చుక్కాని అవుతాయి. వీటిని విస్మరిస్తే.. సంకుచిత ప్రయోజనాల కోసం, అధికార దాహార్తిని తీర్చుకునేందుకు విలువలకు పాతరేస్తే ప్రజలు తిరగబడతారు. తమ ఓటు హక్కు అనే బ్రహాస్త్రంతో ఎంతటి నియంతనైనా చిత్తు చేసి చిత్తుకాగితంగా మార్చేస్తారు. సోలీ విజయం ఆయనొక్కడే సాధించింది కాదు. దీని వెనుక గయూం, నషీద్ వంటి మాజీ అధ్యక్షులెందరి హస్తమో ఉంది. అన్నింటికీ మించి దేశాన్ని ప్రజాస్వామ్య పథంలో నడిపించాలన్న వీరి బలమైన ఆకాంక్ష ఉంది. వీరందరి బలంతో రాజకీయ సుస్థిరత దిశగా దేశాన్ని సోలీ నడిపించగలరన్న ధీమా కనిపిస్తోంది. చైనా కబంధ హస్తాల నుంచి మాల్దీవులు బయట పడి ప్రాంతీయ శాంతిలోనూ, సార్క్ కూటమి మరింత బలోపేతం కావడంలోనూ కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
చైనా ఎత్తుకు పైఎత్తు
ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ భారత పొడగిట్టని రీతిలో చైనా వ్యవహరిస్తోందని చెప్పడానికి గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవులు సహా అనేక భారత అనుకూల దేశాలకు అది కొమ్ముకాస్తూ వచ్చిన ఉదంతాలే నిదర్శనం. సంక్షోభం ఉన్న చోట దాన్ని మరింత రగిలించడం, లేని చోట సృష్టించి అక్కడి పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అందెవేసిన చేయిగా ఉన్న చైనా తాజాగా మాల్దీవుల్లో యమీన్‌ను అనువైన ఆయుధంగా మార్చుకుంది. తాయిలాలతో, బుజ్జగింపులతో, అనేక రకాల ద్వైపాక్షిక సహాయ ఎరలతో యమీన్‌ను లోబరచుకోవడమే కాకుండా అతడి అరాచకాలకు పరోక్షంగా ఊతాన్నిచ్చింది. మొదటి నుంచి భారత్‌కు అనుకూలంగా, బలమైన మిత్ర దేశాలుగా రాణిస్తున్న నేపాల్, మయన్మార్, శ్రీలంక.. ఇలా అనేక దేశాలను ఆకట్టుకునేందుకు చైనా వేయని ఎత్తులేదు. వాటిని అన్ని విధాలుగా ఆకట్టుకుంది. భారత్‌కు ప్రత్యర్థుల సంఖ్య పెంచేందుకూ ప్రయత్నించింది. నేపాల్‌లో ప్రచండ, మాల్దీవుల్లో యమీన్, శ్రీలంకలో రాజపక్స చైనాకు కొమ్ముకాయడానికి, ఉన్నట్టుండి భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి కారణాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాల్దీవులు యమీన్ హయాంలో చైనాతో కొత్తగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు లంక అధ్యక్షుడిగా రాజపక్స తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు, తన హయాంలో భారత్‌కు మొండిచేయి చూపి చైనా వైపు నేపాల్ నాటి అధినేత ప్రచండ పరుగులు పెట్టడం ఇవన్నీ తన ఆధిపత్యాన్ని విస్తరించుకోవడం కోసం ‘డ్రాగన్’ వేసిన వలేనని చెప్పక తప్పదు. చైనా కుట్ర పూరిత రీతిలో వ్యవహరించడం వల్లే లంక, మాల్దీవులు, నేపాల్‌లు ఒక దశలో భారత్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. ఏకకాలంలో పాకిస్తాన్ సహా అనేక దేశాలను భారత్‌కు వ్యతిరేకంగా మార్చేందుకు చైనా చేయని ప్రయత్నం లేదు. తన ఆధిపత్యాన్ని, అపారమైన రాజకీయ విస్తృతిని, అన్నింటికీ మించి వాణిజ్య ప్రలోభాలను ఇందుకు చైనా బలమైన ఆయుధంగా మార్చుకుంటోంది.
నిజానికి లంకలో తాజా సంక్షోభం వెనుకా చైనా హస్తం స్పష్టం. తనకు అనుకూలంగా వ్యవహరించిన రాజపక్సకు అప్రజాస్వామిక రీతిలో ఆ దేశ అధ్యక్షుడు సిరిసేన పట్టం కట్టడం, అది అంతిమంగా బెడిసి కొట్టి లంక సంక్షోభం రావణకాష్టంగా మారడమూ చైనా పుణ్యమే. సంక్షోభం ఉన్న చోట చైనా ఉంటుంది. భారత్‌కు అనుకూలంగా ఉన్న దేశాలను తనవైపుతిప్పుకునేందుకూ నిత్యం సిద్ధంగా ఉంటుంది. ఇందుకు భారత్ గండి కొట్టాలి. చైనా ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ తనపైన రీతిలో ప్రాంతీయంగా పావులు కదపాలి. లంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు వంటి చిరు దేశాలపై చైనా పెత్తనం సాగకుండా ఉండాలంటే.. అందుకు భారత్ దూరదృష్టితో వ్యవహరించాలి. దక్షిణాసియాలో భౌగోళిక విస్తీర్ణంలోనూ, సంపద, సైన్యం, పలుకుబడి విషయంలోనూ పెద్దదిక్కుగా ఉన్న భారత్ ఇప్పటికైనా చైనా దుష్ట వ్యూహాలను మొగ్గలోనే తుంచేయాలి. మాల్దీవుల్లో ప్రజాపాలన పునరుద్ధరణతో మొదలైన భారత్ ప్రమేయం దూరమవుతున్న మిత్ర దేశాలకూ మరింత చేరువయ్యేలా సాగాలి. అప్పుడే చైనాకు బుద్ధి చెప్పగలం. పెత్తందారి ధోరణి స్థానే స్నేహ పూర్వక సంబంధాలను అన్ని దేశాలతోనూ పదిలపరచుకోగలుగుతాం. ఇందుకు అవసరమైన బలమైన సంకేతాలను మాల్దీవుల్లో మోదీ అందించారు. దాన్ని అందిపుచ్చుకునే మిత్ర దేశాలకు భారత్ అభయ హస్తమందించాలి. ఇటు స్నేహంలోనూ.. అటు సాయంలోనూ చైనాకంటే మనమే ముందుండాలి.

చిత్రం..ప్రధాని మోదీతో మొహమ్మద్ సోలీ

-బి.రాజేశ్వర ప్రసాద్