మెయిన్ ఫీచర్

‘అడవితల్లి’కి అతివల అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిపిల్లలను కన్నతల్లులు కంటికి రెప్పలా కాపాడుకోవడం అందరికీ తెలిసిందే.. కానీ, ఆ పల్లెలోని తల్లులందరూ ‘అడవితల్లి’కి అండగా నిలిచి, కలప దొంగలను తరిమికొడుతున్నారు.. అడవిలోని చెట్లను కాపాడుకునేందుకు అక్కడి మహిళలు నిరంతరం నిఘా పెడుతున్నారు.. ప్రతి ఇంటి నుంచి పురుషులను రాత్రివేళ అడవికి పంపుతూ చెట్లను ఎవరూ నరికేయకుండా మహిళలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అడవిని కాపాడుకునేందుకు ఈ మహిళలు చేస్తున్న కృషి ఇపుడు ఇతర ప్రాంతాల వారికి స్ఫూర్తిదాయకమైంది..

ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లా బలరామ్‌పూర్ మహిళలు అటవీ పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న ‘ఝింకార్గడి’ అడవి తమ జీవనాధారంగా ఆ మహిళలు చిరకాలంగా భావిస్తున్నారు. ఆ ఊళ్లో ప్రతి మహిళ పోరాటం వెనుక ఓ కథ ఉంటుంది. పగటిపూట మహిళలంతా అడవిలోనే ఉంటూ కలప దొంగలు అడుగుపెట్టకుండా ఆయుధాలను, వాయిద్యాలను చేతబట్టి తిరుగుతుంటారు. రాత్రి వేళ మాత్రం ప్రతి ఇంటి నుంచీ ఒక పురుషుడిని విధిగా అడవిలోకి పంపుతుంటారు. 70 ఏళ్ల వయసులోనూ చాతురి సాహూ అడవికి వెళుతూ తాను పెంచిన చెట్లు ఎలా ఉన్నాయో చూసుకుని మురిసి పోతుంటుంది. నాలుగు దశాబ్దాలుగా ఆమె మామ, భర్త, కుమారుడు రాత్రివేళ అడవిలో సైనికుల్లా కాపలా కాశారు. ఇప్పటికీ ఆమె ఇంటి నుంచి సమీప బంధువు ఒకరు అడవికి వెళ్తూ రాత్రివేళ నిఘాలో పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
పునా కుంతియాకు 70 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అడవిపై మమకారం తగ్గలేదు. భర్త మరణించడం, ఇంట్లో పురుషులెవరూ లేకపోవడంతో కుంతియా ఓ గనిలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తన తరఫున ఓ యువకుడికి నెలనెలా కొంత డబ్బు ఇస్తూ అడవికి కాపలాగా పంపుతోంది. ఇదే తపన గ్రామ మహిళలందరిలోనూ కనిపిస్తుంది. అడవి వైపు ఇతరులు కనె్నత్తి చూస్తే వారు ఏ మాత్రం సహించరు. బీరు ఫ్యాక్టరీ కోసం అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసేందుకు కొందరు ప్రయత్నించగా బలరామ్‌పూర్ మహిళలంతా ఐక్యతతో అడ్డుకొని సంచలనం సృష్టించారు. చెట్లను నరికేందుకు ఎవరూ అడవిలో ప్రవేశించకుండా మహిళలు డప్పులు మోగిస్తుంటారు. చాతురి సాహూ సహా మరికొంత మంది మహిళలు ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ‘బ్యాండ్ బృందాన్ని’ ఏర్పాటు చేసుకున్నారు. పగలంతా వీరు డప్పులు మోగిస్తూ, ఆయుధాలు పట్టుకొని అడవిలో తిరగడంతో కలప దొంగలు అక్కడికి రావాలంటేనే భయపడుతుంటారు.
అడవిని కాపాడుకునేందుకు బలరామ్‌పూర్ మహిళలు చేస్తున్న దీక్షను చూస్తుంటే- 1973 నాటి ‘చిప్కో’ ఉద్యమం ఎవరికైనా గుర్తుకొస్తుంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా రెనీ గ్రామ మహిళలు చెట్లను నరికేయవద్దని చేపట్టిన ‘చిప్కో’ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 2014 వరకూ అందరిలాగే బలరామ్‌పూర్ గ్రామస్థుల్లో చాలామంది అడవిని ఓ ఆదాయ వనరుగా భావించేవారు. ఆ తర్వాత వారి ఆలోచనా ధోరణి పూర్తిగా మారింది. భావితరాల కోసం, పర్యావరణం కోసం అడవిని కాపాడుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. మొదట్లో ఇద్దరు పురుషులు మాత్రమే సుమారు 600 ఎకరాల విస్తీర్ణం ఉన్న అడవిని కాపాడేందుకు నిఘా బాధ్యతలు చేపట్టేవారు. ఆ తర్వాత ప్రతి కుటుంబం నుంచి ఒక పురుషుడు విధిగా రాత్రివేళ అడవిలో ఉండాలని గ్రామస్థులు తీర్మానించుకున్నారు. పర్యావరణాన్ని, పచ్చదనాన్ని కాపాడుకునేందుకు, కలప దొంగలు, వేటగాళ్లు అడవిలోకి రాకుండా మహిళలు ఉద్యమం ప్రారంభించారు. పరిశ్రమల కోసం అటవీ ప్రాంతాన్ని కేటాయించాలని ప్రయత్నించిన అధికారులను వారు అడ్డుకుంటున్నారు. విస్తారంగా ఉన్న అటవీ భూముల్లో కొంత భాగాన్ని పరిశ్రమలకు కేటాయించాలని ఒడశా పారిశ్రామిక వనరుల కల్పన సంస్థ, ఢెంకనాల్ జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలను బలరామ్‌పూర్ వాసులు తిప్పికొట్టారు. అటవీ స్థలాలను పరిశ్రమలకు కేటాయించడం చట్టరీత్యా నేరమని ‘బలరామ్‌పూర్ గ్రామ్య పరిచాలనా పరిషత్’ కార్యదర్శి సుశాంతకుమార్ ధాలా నేతృత్వంలో గ్రామస్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇటీవల బీరు ఫ్యాక్టరీ విషయమై అధికారుల ధోరణి మారకపోవడంతో గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. అధికారుల నిర్వాకం వల్ల పలు గ్రామాల సమీపంలో అటవీ ప్రాంతం ధ్వంసమైందని, తాము మాత్రం అడవిని కాపాడుకుంటున్నామని గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు.
గ్రామ కమిటీ అనుమతి లేనిదే అడవిలో ఒక్క చెట్టును కూడా ఎవరూ తాకలేరు. అయితే, వంట చెరకు కోసం అడవిలో కొంత భాగాన్ని కేటాయించారు. దహన సంస్కారాలకు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైతే కమిటీ అనుమతితో కలపను తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దశాబ్దాలుగా అడవిని కాపాడుకోవడంతో ప్రస్తుతం ఏనుగులకు ఈ ప్రాంతం ఆలవాలంగా మారింది.
ఇటీవల ఓ బీరు ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన 12 ఎకరాల స్థలాన్ని ఒడిశా ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో చెట్లను నరికివేయడానికి తాము అంగీకరించమని మహిళలు అడ్డుకున్నారు. చెట్లను గట్టిగా ఆలింగనం చేసుకుని వారు తమ నిరసన వ్యక్తం చేశారు. అటవీ స్థలాన్ని పరిశ్రమలకు కేటాయిస్తే తమ ప్రాణాలనైనా పణంగా పెట్టి అడ్డుకుంటామని, ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీచేయాలని గ్రామస్థులు ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లో ఫిర్యాదు చేశారు.
అటవీ సంరక్షణ చట్టం- 1980లోని సెక్షన్-2 ప్రకారం అటవీ భూములను ఇతర అవసరాలకు వినియోగించడం నేరమని వారు గుర్తుచేస్తున్నారు. బీరు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసేందుకు కొద్ది రోజుల క్రితం బలరామ్‌పూర్‌కు వచ్చిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దృష్టికి గ్రామస్థులు తమ డిమాండ్లను తీసుకొచ్చారు. ఎంతటి న్యాయ పోరాటం చేసైనా అటవీ భూములను కాపాడుకుంటామని గ్రామస్థులు దృఢ నిశ్చయంతో చెబుతున్నారు. చెట్లను నరికేస్తే తాము వౌన ప్రేక్షకులుగా ఉండే ప్రసక్తే లేదని బలరామ్‌పూర్ మహిళలు హెచ్చరిస్తున్నారు.

-శ్రీ