మెయన్ ఫీచర్

జాతీయవాదమా? దేశభక్తా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేశభక్తిని జాతీయ వాదం వంచిస్తోంది. జాతీయ వాదం ముసుగులో పాత దయ్యాలు తిరిగి వస్తున్నాయి. అవి హింసను, ఉన్మాదాన్ని ప్రేరేపిస్తాయి’- అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా కొద్దిరోజుల క్రితం జరిగిన విశ్వనేతల సదస్సులో హెచ్చరించారు. ఆయన అన్నట్టు దేశ భక్తి, జాతీయవాదం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండు పదాలూ చూసేందుకు ఒకేలా ఉన్నా, ఇవి గందరగోళ పరుస్తుంటాయి. దేశభక్తి వేరు, జాతీయవాదం వేరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇటీవల ‘నేను జాతీయ వాది’ అని ప్రకటించారు.
భారత్ విషయానికొస్తే ఐరోపా, అమెరికా దేశాలు చెప్పే జాతీయవాదం, దేశభక్తి మధ్య ఉన్న సున్నితమైన విభజన రేఖలు తుడిచిపెట్టుకుని పోయి ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో వ్యవస్థలు, ప్రజలు ఆ దేశాల్లో మాదిరిగా పరిణతి చెందలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రకాల విలాస వస్తువులు, ఐటీ టెక్నాలజీ మన మార్కెట్లను, ఇండ్లను ముంచెత్తుతున్నంత మాత్రాన మనమేదో అభివృద్ధి చెందామనుకోవడం భ్రమ మాత్రమే. భారత్‌లో రెండే రెండు సందర్భాల్లో ప్రజలంతా ఏకమవుతుంటారు. జాతీయవాదం అప్పుడే చూస్తాం. భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే చాలు. జాతీయవాదం విజృంభిస్తుంది. ఇరు జట్లకు చెందిన 22 మంది క్రీడాకారులు కొంతసేపుఆడే ఆటలో గెలుపు కోసం ఉద్రేకపూరితమైన నినాదాలతో భారత్ మార్మోగుతుంది. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసినా, మన దేశంపై పాకిస్తాన్ దాడికి దిగినా, ప్రతి పౌరుడు దేశభక్తితో ఊగిపోతుంటాడు. ఈ రెండు సంఘటనలు ఒక శాంపిల్ మాత్రమే. ఈ రెండు ఘటనల్లో చోటు చేసుకునే పరిణామాలే గగుర్పాటు కలిగిస్తే, అతి జాతీయవాదం ఎలా ఉంటుంది? జాతీయ వాదం అంటే- నా దేశం సర్వోన్నతమైంది. ఇతరదేశాల కంటే గొప్పది. ఇతర దేశాలను ఆక్రమించేసి అవసరమైతే ధ్వంసం చేయాలనే అనే భావనలతో కూడుకున్నది.
దేశభక్తి అంటే మన దేశాన్ని ప్రేమించాలి. విలువలు, నమ్మకాలతో ఈ ప్రేమ కూడి ఉంటుంది. సహజీవనం, సమభావం, అందరినీ గౌరవించడం, ప్రపంచ ప్రజలందరూ ఒకటే అనే భావం కలిగి ఉండడమని నిర్వచిస్తారు. విదేశీ దురాక్రమణ జరిగితే మన దేశం చేతులు ముడుచుకోకుండా దాడిని తిప్పికొట్టాలని, అందులో రాజీపడరాదని దేశభక్తికి పరిమితమైన వ్యక్తి ఆలోచిస్తాడు. జాతీయవాదులు విమర్శను భరించరు, సహించరు. దేశభక్తిపరుడు సహనంతో విమర్శను స్వీకరించి తప్పొప్పులను సరిదిద్దుకునే వ్యక్తి. ఇలా చెప్పుకుంటే పోతే ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసం, లోతుపాతులు అర్థమవుతాయి.
స్వాతంత్య్ర సమరయోధుడు ‘లోకమాన్య’ బాలగంగాధర్ తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించాడు. దేశభక్తి, జాతీయభావం సంగతి పక్కనపెడితే, ప్రజలకు స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియని సమాజాన్ని చైతన్యపరిచేందుకు వినాయక చవితి పండుగను ఆయన వేదికగా ఎంచుకున్నారు.ప్రజల్లో దేశభక్తిని రగిల్చాలంటే జాతీయ భావం ఉప్పొంగాలి. వినాయకచవితి ఉత్సవాలు అందరూ పాల్గొనే ఉత్సవంగా గుర్తించి ఆయన చేసిన ప్రయోగం సూపర్ హిట్టయింది. ఆ కాలానికి తిలక్ చేసిన ప్రయోగం సరైనదే. మహాత్మా గాంధీ ఆచరణలో కఠిన హిందుత్వవాది. ఆలోచనల్లో దేశభక్తితత్వం అలవరుచుకున్నారు. గాంధీ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను సందర్శించడానికి ఇష్టపడలేదు. ఆయన జీవితం సంపూర్ణంగాప్రయోగమే. తాను అనుకున్నది ఆలోచించి ఆచరణలో అమలుచేసిన గొప్ప తాత్విక వేత్త. భారత రాజ్యాంగ నిర్మా త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వాస్తవవాది. భారతీయ సమాజంలో సామాజిక అసమానతలు నిర్మూలిస్తే మిగతా లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చన్నారు. మనలో అంబేద్కర్‌ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారెందరు? అంబేద్కర్ ఆలోచనా విధానాలు కొంతవరకు మనలో దాగి ఉన్న అజ్ఞానాన్ని, అహంభావాన్ని తగ్గించే టానిక్ ఆని చెప్పవచ్చు.
భిన్నత్వంలో ఏకత్వంతో అలరారే భారత్‌లో మొదట్లో అందరూ హిందువులే. చరిత్రలోకి వెళితే సమాజంలో వివక్షకు గురైన వారు బౌద్ధం, జైనం స్వీకరించారు. ఆ తర్వాత వైష్ణవ మతంలోకి మారిన వారున్నారు. ఇస్లాం మత ప్రవేశం, ఆంగ్లేయుల రాకతో క్రైస్తవం వచ్చింది. ప్రస్తుతం 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న భారతీయులు దేశీయంగా ఒకటి రెండు సంఘటనలు మినహాయించి అన్ని సమయాల్లో జాతీయవాదం, దేశభక్తితత్వంతో ఉంటారు. ఈ మధ్య రాజకీయ పార్టీల కొత్త ధోరణుల వల్ల జాతీయవాదం, దేశభక్తి కలుషితమవుతున్నాయి. ‘్భరత్‌మాతాకీ జై’ అంటే బీజేపీవారని అనుకుంటాం. అది ముమ్మాటికీ తప్పు. వింధ్య పర్వతాలకు ఎగువకు వెళితే ఆర్యావర్తనం అంటే పంజాబ్ నుంచి బెంగాల్ వరకు, మహారాష్ట్ర, గుజరాత్‌లో ‘్భరత్‌మాతాకీ జై’ అనేది నిత్యం వినిపించే ఒక మంత్రం. వీరిలో కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని పార్టీల వారుంటారు. ‘్భరత్‌మాతాకీ జై’ అనే నినాదం బీజేపీ సొత్తు కాదు. ‘వందేమాతరం’ నినాదం బెంగాల్ మహనీయులు భారత్ ఏకత్వానికి ఇచ్చిన మహత్తర సాధనం. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్ర సమరంలో జనాన్ని ఏకం చేసేందుకు ఈ నినాదాన్ని ప్రయోగించి సత్ఫలితాలు సాధించింది. ఈ రోజు ఈ రెండు నినాదాలనూ బీజేపీ సొంతం చేసుకుంది. వాస్తవానికి ఉత్తర భారతంలో ఇప్పటికీ కాంగ్రెస్ సభలు ఈ రెండు నినాదాలతోనే ముగుస్తాయి. దక్షిణ భారతంలో ఈ రెండు నినాదాలను కాంగ్రెస్ పార్టీ కాలక్రమంలో అటకెక్కించింది. ఈ రెండు నినాదాలు దేశభక్తిని చాటేందుకు ఉత్తేజభరితమైనవి.
ఇజ్రాయేల్ జాతీయ వాదం ప్రమాదకరమైంది. అది ఒక యూదు దేశం. గత రెండు వేల సంవత్సరాల్లో ఆ దేశం ఎదుర్కొన్న అనేక సంఘటనల నేపథ్యంలో యూదులు జాతీయవాదం సంఘటితంగా ఉండేందుకు ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఇస్లాం దేశాలు ఆ మత బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాయి. దీనికి ఈజిప్టు, టర్కీ దేశాలు మినహాయింపు. సింధు నాగరికత పునాదిగా జన్మించిన పాకిస్తాన్ పేరుకు ఇస్లాం దేశమైనా, సమాజంలో అణువణువునా హైందవ సంస్కృతి ఆలోచనలు ప్రతిబింబిస్తుంటాయి. టీవీల్లో పాక్‌కు చెందిన మతోన్మాదుల మాటలను వింటే మనకు ఆగ్రహం వస్తున్న మాట నిజమే. కాని పాక్ సమాజం వేరని విషయం లోతుల్లోకి వెళితే తెలుస్తుంది. బంగ్లాదేశ్ కూడా అంతే. పేరుకు ఇస్లాం దేశం. కాని సమాజంలో అనేక వర్గాలుగా చీలి ఉంటుంది. బెంగాల్ చేసుకున్న అదృష్టమేమిటంటే, వారి బంధం బెంగాలీ భాష. బెంగాల్ జాతీయవాదం వల్ల బంగ్లాదేశ్ అవతరించింది. మయన్మార్ పేరుకు బౌద్ధం అయినా అక్కడ విగ్రహారాధన చేస్తారు. హిందువుల్లో ఎన్నికులాలు ఉన్నాయో, ముస్లింలలో అన్ని తెగలు ఆఫ్గనిస్తాన్ సమాజంలో ఉన్నాయి. ఈ దేశం మూలాలు హైందవంలో, బౌద్ధంలో ఉన్నాయి.
ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి. దేశభక్తి ముదిరితే జాతీయవాదమవుతుంది. మతపరమైన జాతీయవాదం ప్రమాదం. లౌకిక జాతీయవాదం, మత జాతీయవాదం దేశంలో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. భారతదేశానికి జాతీయవాదం, దేశభక్తి రెండూ అవసరమే. అదే సమయంలో సంఘ సంస్కరణలు కావాలి. ఈశాన్య రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో దేశభక్తి కనిపించినా జాతీయవాదం ఉండదు. పశ్చిమ భారతంలో గుజరాత్, మహారాష్టల్ల్రో జాతీయవాదం ఎక్కువ. ఉత్తర భారతంలో జాతీయవాదం తారస్థాయిలో ఉంటుంది. దేశ భక్తి గురించి చెప్పనక్కర్లేదు. విదేశీ దురాక్రమణల వల్ల జాతీయ వాదం ఎక్కువ ప్రభావం చూపుతుంది. దేశభక్తిపరులైన సంస్కరణ వాదులు అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే జాతీయవాదం కంటే ముందుగా సమాజంలో కులపరమైన అసమానతలను నిర్మూలించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ కాలక్రమంలో అన్ని వాదాలను కోల్పోయింది. 2014కంటే ముందు మహోధృతమైన జాతీయవాదం నినాదంతో ముందుకొచ్చిన బీజేపీ కూడా తన విధానాలకు సవరణలు చేసుకుంటోంది. ఈ దేశాన్ని ఏకతాటిపైన నడిపించేందుకు దేశభక్తి, సమభావన చాలు. జాతీయవాదంపై నాలుగు గోడలకు పరిమితమైన మేధావుల సభలోనే బీజేపీ సిద్ధాంతకర్తలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. శబరిమల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఆ పార్టీకి చేటు అని చెప్పవచ్చు. సెక్యులరిజం, సమానత్వం గురించి మాట్లాడే కాంగ్రెస్ కూడా బీజేపీ మాదిరిగా శబరిమలపై కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనకారులతో గొంతు కలిపింది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన దేశంలో జాతీయ పార్టీలు అన్ని వాదాలను పణంగా పెట్టి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుంటాయి. గోవధ విషయంలో గత నాలుగేళ్లుగా జరిగిన హింసాత్మక ఘటనల్లో హిందుత్వ వాదుల అత్యుత్సాహం, అసహనం, దుశ్చర్యలు ఏహ్యభావాన్ని కలిగించాయి. ఈ రోజు శబరిమల విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదేంటి ? మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల మ్యానిఫెస్టోలను చూస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ దారినే ఎన్నుకుంది. గోశాలలను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. భారతీయులకు గోవుపవిత్రమైంది. కాని ఈ సెంటిమెంట్ బీజేపీ సొంతం కాదు.
ఉత్తరాదిన చూస్తే ఎంతసేపూ దేశభక్తి, సేవకు సంబంధించిన చర్చలు వినపడుతుంటాయి. అక్కడ కూడా కులతత్వం ఉంది. కాని విశాలంగా చూస్తే ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య ఆలోచన విధానాల్లో తేడా కనపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు, బస్సులు, విమానాల్లో ప్రయాణిస్తే ప్రతి ఒక్కరికీ ఒక భయంకరమైన అనుభవం ఎదురవుతుంటుంది. పక్కన ఉన్నవాడి కుల గోత్రాలు తెలుసుకునే వరకూ నిద్రపట్టదు. ఈ జబ్బు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలకు ఉంది. జాతీయవాదం, దేశభక్తి అనే మాటలకు తెలుగు సమాజం ఎప్పుడో పాతరేసింది. ఈ పదాల గురించి చర్చ లేదు. తెలుగునాట తొలుత సంస్కరణోద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భయంకరమైన కులవాదం మొదలై ఈ రోజు విషఫలాలు ఇస్తోంది. నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాయకల్ప చికిత్స కూడా పనికిరాదు. కులం, సంస్కృతి, సంప్రదాయాలు, ఇతర వేడుకలు ఇంటి గుమ్మానికి పరిమితం కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తిరోగమన దిశ కనిపిస్తుంది. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగి, సరిపడక బయటకు వచ్చిన టీడీపీ ఈ రోజు మతతత్వానికి వ్యతిరేకంగా, ‘సేవ్ డెమొక్రసీ’ అంటూ మాట్లాడుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును మరచిపోయారు.
ప్రజాస్వామ్యానికి వేదిక అసెంబ్లీ. పవిత్ర మందిరం అయిన అసెంబ్లీకి వెళ్లకుండా సమావేశాలను ఎవరి మీదో కోపంతో బహిష్కరించిన వైకాపా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అర్థం ఉంటుందా? ఆంధ్రాలో రాజకీయాలు సినిమాలో కామెడీ సన్నివేశాల మాదిరి మారిపోయాయి. దీనికి మీడియా చేస్తున్న అపకారం అంతా ఇంతా కాదు. తమిళనాడు, కర్నాటకలో కూడా ఇంచుమించు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కేరళ బాగుందనుకుంటే, అక్కడ కూడా జాతీయ పార్టీల తీరు వల్ల అశాంతి రాజ్యమేలుతోంది. దేశభక్తి , జాతీయవాదం ఏ పార్టీ సొం తం కాదు. ఈ రోజు కులవ్యవస్థ అంతరించే పరిస్థితి లేదు. కాని కులోన్మాదం, కులాంహంకారం తగ్గించుకునేందుకు మరో సంఘ సంస్కరణద్యోమం తెలుగు సమాజంలో రావాలి. అంబేద్కర్ చెప్పినట్లు ఈ పైత్యాలు తగ్గించుకుంటేనే సమాజం బాగుపడుతుంది. నేడు దేశంలో ఏ పార్టీకీ కూడా దేశభక్తి, జాతీయ వాదం గురించి ప్రజలకు నీతిబోధలు చేసే అర్హత లేదు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097