మెయిన్ ఫీచర్

మానవత్వమే దైవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యసాయిబాబా గొప్ప మానవతామూర్తి. ఏదైతే బోధించారో దాన్ని అమలు చేసిన మహర్షి. విద్య, వైద్యం, తాగునీరు మనిషికి ముఖ్యమైనవని, వీటిని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని భావించారు. ఈ కోణంలో ఆలోచించి 1972 సెప్టెంబర్ 2 న ‘శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఆయనే ఫౌండర్ ట్రస్టీ. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 లోని 12 ఎ సెక్షన్ కింద ఈ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేశారు. పేదలకు చేయూత ఇవ్వడం, వైద్య సేవలు అందించడం, విద్యావకాశాలు కల్పించడం, తాగునీరు, మ్యూజియముల నిర్మా ణం, కనె్వన్షన్ సెంటర్ల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఈ ట్రస్ట్ చేపట్టింది. ట్రస్ట్‌కు దేశ, విదేశాల నుండి వచ్చే విరాళాలపై సుంకం లేకుండా మినహాయింపు తీసుకున్నారు.
విద్య
‘విద్య జీవిత పరమావధికే కానీ జీవనోపాధికి కాదు’ (ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్) అన్నారు సాయి. సెంట్రల్ ట్రస్ట్ నేతృత్వంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పీహెచ్‌డీ వరకు విద్యా ఉచితంగా అందిస్తున్నారు. ట్రస్ట్ నేతృత్వంలో నడుస్తున్న వివిధ సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి.
* శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్
* శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్
* శ్రీ సత్యసాయి మిర్‌పురి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్
* శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం
గురుకులాల్లో సనాతన భారతీయ విధానంలో విద్యాబోధన జరుగుతోంది. కేవలం అకడమిక్ విద్య మాత్రమే కాకుండా విద్యార్థులు సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో రాణించేందుకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతివిద్యార్థి తన క్యారెక్టర్ సమాజానికి ఉపయోగపడేలా శిక్షణ ఇస్తున్నారు.
శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ పరిపాలనా భవనం పుట్టపర్తిలోని విద్యాగిరిపై బ్రహ్మాండమైన భవనంలో ఉంది. 1981 లో దీన్ని డీమ్డ్ యూనివర్సిటీగా ప్ర భుత్వం గుర్తించింది. ఈ యూనివర్సిటీ పరిధిలో అనంతపురం, వైట్‌ఫీల్డ్ (బెంగళూరు), పుట్టపర్తిలలో కాలేజీలు నడుస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ -గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సులు ఈ యూనివర్సిటీ అందిస్తోంది.
శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ పుట్టపర్తిలో నడుస్తుండగా, శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజమండ్రిలో నడుస్తోంది. ప్రశాంతి నిలయంలో శ్రీమతి ఈశ్వరమ్మ హైస్కూల్ నడుస్తోంది. ఢిల్లీలో శ్రీ సత్యసాయి ఇంటర్‌నేషనల్ సెంటర్ అండ్ స్కూల్ నడుస్తోంది. యువతలో మానవతా విలువలను పెంపొందించేందుకు ఈ సెంటర్ పనిచేస్తోంది. అలాగే ప్రాథమిక పాఠశాలను కూడా పేదల కోసం నడిపిస్తోంది.
పాఠశాలలు, కళాశాలల కోసం అధునాతన హంగులతో భవనాలు నిర్మించారు. అన్ని స్థాయిలలోనూ విద్యను ఉచితంగా అందిస్తున్నారు.
హెల్త్‌కేర్
ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేందుకు, వివిధ రకాల రోగాలకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులను నడిపిస్తున్నారు. పుట్టపర్తిలో ఒక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని, బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నడిపిస్తున్నారు. ఈ రెండు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల భవనాలకోసం భారీ ఎత్తున భవనాలు నిర్మించారు. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికిత్స ఉచితంగా అందిస్తున్నారు. గుండెజబ్బులకు చికిత్స అందించడం, గుండె ఆపరేషన్లు నేటికీ చేస్తున్నారు. సీటీవీఎస్, కంటి చికిత్స, కంటి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆసుపత్రులు ప్రారంభం అయినప్పటి నుండి ఇంత వరకు వివిధ విభాగాల్లో 40 లక్షలకు పైగా ఆపరేషన్లు జరిగాయి.
మానవీయ విలువలు
మానవత్వమే దైవత్వం. అదే సత్య స్వరూపం. అదే ధర్మ స్వరూపం. అదే ప్రేమ స్వరూపం. అదే శాంతి స్వరూపం. అదే అహింసా స్వరూపం. అట్టి మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని సత్యసాయి చెప్పారు. ప్రపంచంలో మనిషితో సహా ప్రతివస్తువూ ఏదో ఒకనాటికి మార్పు చెంది క్షీణిస్తుంది. కానీ మానవుడు పెట్టుకున్న ఉన్నతమైన ఆదర్శాలు, ఆశయాలకు మాత్రం మరణం ఉండదంటారు. ఈ ఆదర్శాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందించాలంటారు. మానవీయ విలువలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సత్యసాయి బోధనలను, సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు ప్రశాంతి నిలయంలో 16 ఏళ్ల క్రితమే రేడియో సాయి డివిజన్ ఏర్పాటు చేశారు. హార్ట్ టు హార్ట్ అనే ఒక పత్రిక (జర్నల్) ను ఇంటర్నెట్ ద్వారా అందిస్తున్నారు. రేడియో సాయి కార్యక్రమాలు వివిధ భాషల్లో కొనసాగుతున్నాయి. ఎవరైనా తమ మొబైల్ ఫోన్లలో కూడా సాయి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కార్యక్రమాలు వినవచ్చు. సత్యసాయి బోధనలు నిరంతరం ప్రసారం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో రోజూ జరిగే వేదపఠనం, భజనలు నేరుగా, ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. మీడియాద్వారా సత్యసాయి బోధనలను ప్రజలకు తెలియచేసేందుకు మొట్టమొదటిసారి అంతర్జాతీయ మీడియా వర్క్‌షాప్‌ను 2017 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు.
సత్యసాయి ఆర్చీవ్స్ పేరుతో ఒక భవనాన్ని నిర్మించి సాయి సంభాషణలను రికార్డు చేసి భద్రపరచారు. వీటి కాపీలను భక్తులకు అందుబాటులో ఉంచారు.

ప్రధాన సందర్శనీయ స్థలాలు

పుట్టపర్తి పట్టణంలో ‘ప్రశాంతి నిలయం’ వెలుపల కొన్ని సందర్శనీయ స్థలాలున్నాయి. పుట్టపర్తి పట్టణంలో సత్యసాయి జన్మించిన స్థలంలో 1979 లో శివాలయం నిర్మించారు. ప్రశాంతి నిలయానికి వచ్చేవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పుట్టపర్తి పట్టణంలో వేణుగోపాలస్వామి ఆలయం, హనుమంతుడి ఆలయం ఉన్నాయి. వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో సత్యసాయి కొంతకాలం నివసించిన పాత మందిరం ఉంది. ఈ మందిరానే్న ఇటీవల ఆధునీకరించి పెద్దవెంకమరాజు కళ్యాణ మండపం అనే పేరుపెట్టారు. వివాహాలు తదితర శుభకార్యాలకు దీన్ని వినియోగిస్తున్నారు. ముస్లింలకోసం ఒక మసీదును బాబా నిర్మించారు.
ప్రశాంతి నిలయానికి దక్షిణం వైపు ఉన్న కొండపై విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఉంది. అత్యద్భుతంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి వెళ్లే దారిలో మ్యూజియం ఉంది. దీనే్న శ్రీసత్యసాయి సనాతన సంస్కృతి మ్యూజియం అంటున్నారు. సత్యసాయి జీవిత చరిత్ర తెలియచేసే ఫోటోలు, వీడియో ప్రదర్శనలు ఉంటాయి. మూడంతస్తుల మ్యూజియం భవనం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
సత్యసాయి జీవితం, సందేశాలను తెలియచేసేందుకు ‘చైతన్యజ్యోతి’ పేరుతో మరొక మ్యూజియం ఏర్పాటు చేశారు. మ్యూజియం భవనం పైకప్పు చైనీయుల పద్ధతిలో, ఆర్చీలు గోథిక్ పద్ధతిలో, డోములు మూరిష్ పద్ధతిలో ఉన్నాయి. ప్రపంచంలోని శిల్పకళారీతులు, సంస్కృతుల సమ్మేళనంగా ఈ భవనాన్ని నిర్మించారు. సత్యసాయికి ప్రీతిపాత్రమైన ‘సత్యగీత’ అనే పేరుతో పెరిగిన ఏనుగు ఇటీవల చనిపోతే దానికి ప్రశాంతి నిలయం సమీపంలోనే ప్రత్యేకంగా సమాధి నిర్మించారు. ప్రశాంతి నిలయం సమీపంలోనే ఆధునిక హంగులతో ప్లానిటోరియం నిర్మించారు. విశ్వాంతరాళంలోని గ్రహాల చలనం, నక్షత్రాలను ఈ ప్లానిటోరియంలో ప్రదర్శిస్తారు. విద్యాగిరి కొండను ఆనుకుని హిల్‌వ్యూ స్టేడియం ఉంది. ఈ స్టేడియంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా పనిచేస్తోంది. సత్యసాయి అంతర్జాతీయ క్రీడా కేంద్రం (ఇండోర్‌స్టేడియం) కూడా ప్రత్యేకంగా నిర్మించారు. విద్యాగిరి కొండపై 60 అడుగుల ఎతె్తైన హనుమంతుడి విగ్రహం, శ్రీకృష్ణుడు, షిరిడీబాబా, శివుడు, బుద్దుడు, జోరాస్టర్, ఏసుక్రీస్తు విగ్రహాలు ఉన్నాయి. ప్రశాంతి నిలయం నుండి కొద్ది దూరంలో విద్యాలయాలు ఉన్నాయి. వీటికి సమీపంలోనే ‘గోకులం’ ఉంది. గోకులంలోని ఆవుల పాలనే ఆశ్రమం అవసరాలకు, విద్యాసంస్థల విద్యార్థుల అవసరాలకు వినియోగిస్తున్నారు.
పుట్టపర్తికి దగ్గర్లోనే సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, దానికి దగ్గర్లో సత్యసాయి విమానాశ్రయం ఉన్నాయి. ప్రశాంతి నిలయం ప్రధాన గేటు ఎదురుగా కొద్ది దూరంలో సత్యసాయి తల్లిదండ్రులైన ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజుల సమాధులు ఉన్నాయి. వీటినే సమాధి మందిరం అంటున్నారు. ఈశ్వరమ్మ వర్థంతి అయిన మే 6 న ఏటా ఇక్కడ భజనలు, అన్నదానం (నారాయణసేవ) జరుగుతుంది.