మెయన్ ఫీచర్

కశ్మీర్‌లో ‘రాజకీయ ప్రక్రియ’ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఎక్కడ కూడా ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని సాయుధ దళాలతో మాత్రమే పరిష్కరించడం సాధ్యం కాదు. ఆ విధంగా ప్రయత్నం చేస్తే విధ్వంసక ఫలితాలే వస్తాయి. సాయుధ దళాలు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే అక్కరకు వస్తాయ. సాధారణ ప్రజలను విశ్వాసంలోకి తీసుకొనే విధంగా రాజకీయ పక్రియను చేపట్టకుండా ఇటువంటి సమస్యలను పరిష్క రించలేము. జమ్మూ కశ్మీర్‌లో నేడు నెలకొన్న అస్థిర పరిస్థితులకు మన రాజకీయ నాయకత్వమే కారణం. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని చెబుతూ ఉంటాం. కానీ అక్కడి ప్రజలలో- ‘మీరు మాలో ఒకర’నే అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నాలు మాత్రం కనిపించవు. అందుకనే ఢిల్లీలోని రాజకీయ నాయకుల పట్ల, ప్రభుత్వాల పట్ల కశ్మీర్ ప్రజలు అనుమానంతో చూస్తున్నారు.
1980వ దశకం ప్రారంభంలో కశ్మీర్‌లో తీవ్రవాదం తలెత్తినప్పుడు, పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదులకు వ్యతిరేకంగా స్థానిక తీవ్రవాదులు పోరాడారు. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని కట్టడి చేయడంలో స్థానిక ప్రజలు సంపూర్ణంగా అప్పటి ప్రధాని వీపీ సింగ్ వెంట ఉండడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే, వీపీ సింగ్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడంతో కశ్మీర్ సీమాంతర ఉగ్రవాదానికి స్థావరంగా మారింది. ఆ తర్వాత కూడా సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం, స్థానికంగా రాజకీయ ప్రకియకు అవకాశం లేకుండా ఢిల్లీ పాలనను రుద్దే ప్రయత్నం చేయడం పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులకు స్థావరాలను ఏర్పర్చుకొనే అవకాశాలు ప్రభుత్వం కల్పించింది. అప్పటి ప్రధాని వాజపేయ, అంతకు ముందు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహరావు కొంతమేరకు ఈ పరిస్థితులను గుర్తించారు.
కశ్మీర్ ప్రజల విశ్వాసం వాజపేయి పొందినంతగా గత నాలుగు దశాబ్దాలలో మరే ప్రధాన మంత్రి, జాతీయ నాయకుడు పొందలేదు. ఆయన నిజాయతీతో పలు ప్రయత్నాలు చేశారు. కొన్ని రంగాలలో విజయాలు సాధించినా ప్రస్తుత మోదీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఘోర వైఫల్యం చెందుతున్నది. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీతో కలసి కశ్మీర్‌లో భాజపా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మక పరిణామం. కశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడానికి లభించిన సువర్ణ అవకాశం. అవసరమైన రాజకీయ చొరవను ప్రదర్శించని కారణంగా ఈ అవకాశాన్ని జారవిడుచు కున్నారని చెప్పవచ్చు.
గతంలో కేంద్రంలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ మంత్రులకు కశ్మీర్ వ్యవహారాలను అప్పచెప్పేవారు. కానీ, మొదటిసారిగా ఉద్యోగ విరమణ చేసిన కొందరు అధికారులపై ఆధారపడటంతో మోదీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో విధ్వంసకమైన పరిణామాలకు కారణ మవుతోంది. ఈ విషయంలో కీలక పాత్ర వహించ వలసిన హోమ్, విదేశీ వ్యవహారాలు, రక్షణ మంత్రిత్వ శాఖలు ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేశారు. పీడీపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. దాని అమలు పట్ల కేంద్ర ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ కనబరచక పోవడం గమనిస్తే కశ్మీర్ సమస్య పట్ల ఢిల్లీలో సరైన అవగాహన ఉన్నవారు లేరని, కొందరు మాజీ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమవుతోంది. గత సంవత్సరం జనవరిలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఢిల్లీకి వెళ్లి, ప్రధాని మోదీని కలసి కశ్మీర్‌లో రాజకీయ పక్రియ ప్రారంభానికి చొరవ చూపమని కోరారు. ఆ తరువాత పలుసార్లు ఈ విషయమై అభ్యర్థనలు చేసినా ఢిల్లీ నుండి తగు స్పందన లభించలేదు. అక్కడ తీవ్రవాదాన్ని అదుపు చేశామని, తమ వంతు చేయవలసింది చేశామని రాష్ట్ర డిజిపి, భారత సైన్యాధిపతి గత ఏడాది పలు ప్రకటనలు చేసారు. సమస్య పరిష్కారానికి రాజకీయ ప్రకియ మాత్రమే చేపట్టవలసి ఉన్నదని కూడా స్పష్టం చేసినా, కేంద్రం నుండి స్పందన లేక పోవడంతో పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయి. ఇటువంటి సమయంలో పీడీపీతో బంధం తెంచుకొని, సంకీర్ణ ప్రభుత్వ పతనానికి కారణమైన భాజపా ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాన్ని ఎంచుకొనే ప్రయత్నం చేయలేదు. మొన్నటి వరకు కలసి కాపురం చేసిన పీడీపీలో చీలికలు తీసుకు వచ్చి, వారిలో ఒక్కరిని ముఖ్యమంత్రిగా చేసి, తమ చెప్పు చేతలలో ఉండే ప్రభుత్వం ఏర్పడేలా విఫల ప్రయత్నం చేశారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు దేశ సరిహద్దులో సున్నిత పరిస్థితులలో ఉన్న ప్రాంతంలో చుక్కెదురవుతాయని భాజపా అధినాయకులు గ్రహించలేక పోయారు.
గత నాలుగున్నరేళ్ల తమ ప్రభుత్వ పాలనలో దేశంలో ఒక్క చోట కూడా ఉగ్రదాడి జరగలేదని గర్వంగా చెప్పుకొంటున్న భాజపా నేతలు కశ్మీర్ లోయలో క్షీణిస్తున్న పరిస్థితుల పట్ల మాత్రం బాధ్యత వహించే ప్రయత్నం చేయడం లేదు. పరిస్థితులు అంతగా క్షీణించడానికి కారణాలను సమీక్షించుకొనే ఆలోచనా లేదు. వాజపేయి హయాంలో ఈ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేసిన బృందంలో ఉన్న ఎల్‌కే అద్వానీ వంటి వారిని పిలిచి సమాలోచనలు జరిపేందుకు చొరవ చూపలేదు. మొదటి సారిగా సైనిక స్థావరాలలో పాక్ ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు. కశ్మీర్ లోయకు పరిమితమైన ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూకు సైతం విస్తరించారు. అక్కడి నుండి పంజాబ్ కు వ్యాపించారు. పంజాబ్ నుండి ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఇవ్వన్నీ రాగాల ప్రమాదాల్ని సూచిస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం అమృతసర్ దగ్గరలో నిరంకారీ భవన్ వద్ద కాల్పులు జరిగిన సందర్భంలో పలువురు మాజీ సైనికాధికారులు ఈ ప్రమాదాలను ప్రస్తావించారు. సైనికులు, పోలీసులు దేశంలో ప్రవేశించిన ఉగ్రవాదులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు తప్ప, అసలు వారు రాకుండా చేయాలంటే రాజకీయ పక్రియ అవసరమని స్పష్టం చేశారు. అటువంటి ప్రయత్నం చేయడం లేదని గవర్నర్ సత్యపాల్ మాలిక్ కశ్మీర్ అసెంబీని రద్దు చేయడం వెల్లడి చేస్తున్నది. కొద్దీ రోజుల క్రితమే అసెంబ్లీ రద్దు ఆలోచన లేదని ప్రకటించి అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దేశ ప్రయోజనాల దృష్ట్యాకాకుండా సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమని భావించ వలసి వస్తుంది. శాసనసభ రద్దు విషయమై భాజపా ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ నాలిక కరుచుకొని, తన మాటను వెనుకకు తీసుకొనవలసి రావడం గమనిస్తే అసలు ఎందుకు అసెంబ్లీని రద్దు చేశారో అన్న విషయం భాజపా నేతలకు కూడా అంతుబట్టడం లేదని భావించవలసి వస్తున్నది. అసెంబ్లీ రద్దుకు గవర్నర్ చెప్పిన ఏ ఒక్క కారణం కూడా సహేతుకంగా లేదు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంటగలిపే విధంగా మాత్రమే ఉంది. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు గలవారు చేతులు కలిపితే- దాన్ని ప్రశ్నించే అధికారం గవర్నర్‌కు ఎక్కడిది ? గతంలో పీడీపీ- భాజపా కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా ?
మొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు గవర్నర్‌గా జమ్మూ కశ్మీర్‌కు రావడంతో రాజకీయ ప్రకియ ప్రారంభించడం కోసం మోదీ ప్రభుత్వం తీవ్రమైన కృషి చేస్తున్నదని అంతా భావించారు. కానీ, గవర్నర్ రాజకీయ నాయకుడి వలే రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించ లేదు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గవర్నర్‌కు అభ్యంతరం ఎందుకు ? ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే భయం తప్ప మరో కారణం కనిపించనే లేదు. ప్రభుత్వాల ఏర్పాటు గురించి ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులు స్పష్టంగా ఉన్నా గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తుంది.
ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వని పక్షంలో నూతన రాజకీయ సమీకరణాలు తప్పవు. కొన్ని సార్లు వాటి సుస్థిరత, మనుగడ పట్ల అనుమానాలు ఉన్నా ప్రజా స్వామ్య వ్యవస్థలో అనుమతించక తప్పదు. అంతేగాని గవర్నర్ కోరుకున్న రీతిలోనే సమీకరణాలు జరగాలని భావించడం ఏమాత్రం హర్షణీయం కాబోదు. గవర్నర్ చెప్పిన్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, మరొకొందరు అసెంబ్లీ రద్దు చేయమని మొన్నటి వరకు పదే పదే కోరుతుంటే స్పందించనే లేదు. రద్దు కోరిన పక్షాలే మరో రాజకీయ సమీకరణకు పూనుకోవడాన్ని స్వాగ తించకుండా అడ్డుకొనే ప్రయత్నం చేయడం ఏ విధంగా సమర్ధనీయం కాదు.
ఇద్దరు ఎమ్మెల్యేల పీపుల్స్ కానె్ఫరెన్స్ కూడా బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం గమనిస్తే ఎమ్యెల్యేలను సంతలో కొనుగోలు చేసినట్లు కొనడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో అర్థం అవుతుంది. భాజపా మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆక్రోశంతోనే అసెంబ్లీని రద్దు చేసినట్లు భావించవలసి వస్తున్నది. గవర్నర్ ఇలా వ్యవహ రించడం- వివేకంతో సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టమవుతోంది. ఢిల్లీ నుండి వచ్చిన ఆదేశాల కారణంగానే ఆయన వ్యవహరించి ఉంటారనే అభిప్రా యం కలుగుతున్నది. అసహనంతో తీసుకొనే ఇటువంటి తొందరపాటు నిర్ణయాల కారణంగానే వ్యవస్థలను ధ్వంసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమ ర్శలను మోదీ ప్రభుత్వం ఎదుర్కోవలసి వస్తున్నది. ఆర్‌బీఐ, సీబీఐ, ఈడీ వంటి సంస్థల విషయంలో ఇటు వంటి అపోహలను ఎదుర్కొనవలసి వస్తున్నది. వాస్తవానికి ప్రధాని మోదీ గాని, ఆయన ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు గానీ ఇటువంటి సంస్థల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించిన రీతిలో వ్యవహరించిన ఒక్క ఉదంతం కూడా లేదు. వారి అండ చూసుకొనే, సంబంధం లేని కొందరు జరుపుతున్న వ్యవహారం కారణంగానే మొత్తం ప్రభుత్వం, అధికారంలో ఉన్న భాజపా అప్రదిష్ఠకు గురవుతున్నాయ. ఇటువంటి సమస్యల పరిష్కారానికి రాజకీయ ప్రకియ మాత్రమే మార్గం అని గ్రహించాలి. అందుకు ప్రధాని చొరవ తీసుకొంటే వాజపేయి వలే ఆయన మరో చరిత్ర సృష్టించవచ్చు. రాజకీయ ప్రక్రియకు చొరవ చూపించకుండా, సాయుధ దళాలపైనా, రిటైరైన ఉన్నతాధికారుల పెత్తనం మీద ఆధారపడటం వల్ల పరిస్థితులు మరింత అధ్వానంగా మారగలవని గ్రహించాలి.

-చలసాని నరేంద్ర