మెయన్ ఫీచర్

‘ఇద్దరు చంద్రుల’పై ముప్పేట దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైన వారి వారి రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు విమర్శల జోరు పెంచారు. ఈ సీఎంలిద్దరూ చేసిన ‘అక్రమాల’పైన విపక్ష నేతలు ఏకరువు పెడుతున్నారు. నిజంగా ఈ ఇద్దరు ‘చంద్రులు’ అవకతవకలకు పాల్పడ్డారా? తమ తమ రాష్ట్రాలకు వీరు ఏమీ చేయలేదా? చంద్రబాబు నిరంతర శ్రమజీవి. కొత్తగా ఆవిర్భవించిన నవ్యాంధ్రకు అంతర్జాతీయ స్థాయి కలిగిన సుమారు పాతిక సంస్థలు గత నాలుగేళ్లలో వచ్చాయి. తెలంగాణలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ఎన్నో ప్రాజెక్టులను కేసీఆర్ చేపట్టారు. లక్షా యాభైవేల కోట్ల రూపాయల ఖర్చుతో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన సంకల్పించారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రెండవ తిరుమలగా మార్చేందుకు కేసీఆర్ దీక్ష వహించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నిరంతర విద్యుత్తు వంటివి ఆయన సాధించిన విజయాలే. ఐతే కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని విపక్ష నేతలు విమర్శిస్తుంటారు.
దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తాననడం, ఎస్సీలకు మూడు ఎకరాల భూమిని ఇస్తాననడం, లక్ష ఉద్యోగాల కల్పన, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అంటూ కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుకాలేదన్నది విపక్షం ఆరోపణ. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రోళ్ళు వెళ్లిపోతే లక్ష ఉద్యోగాలు వస్తాయని 2014 ఎన్నికలకు ముందు తెరాస నాయకులు నమ్మబలికారు. అయితే, ఇదెలా సాధ్యం? అని శాస్ర్తియ దృక్పథంతో ఆలోచించిన వారెవరూ లేరు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉద్యమంలో వాడుకున్నారే తప్ప ఎవరికీ ఉద్యోగాలు దక్కలేదని ‘తెజస’ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపిస్తున్నారు. మావోయిస్టుల సానుభూతిపరుడని ముద్రపడ్డ కోదండరామ్ వంటివారు కేరళ, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోనూ నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లే మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. అధికారం చేపట్టాక గత నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 3 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసినట్టు ఆరోపణ ఉంది. పథకాల పేరిట ధనాన్ని దుబారా చేశారన్న విమర్శలు కేసీఆర్‌పై జోరందుకుంటున్నాయి.
ఏపీలో నూతన రాజధాని నిర్మాణానికి 35,000 ఎకరాల భూమిని సేకరించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. రాజధాని అంటే అగ్గిపెట్టెలా ఉండదు. లండన్, న్యూ యార్క్, పారిస్ వంటి నగరాలు వేలాది ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నాయి. రాబోయే శతాబ్దిని దృష్టిలో పెట్టుకొని బృహత్ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు భూసేకరణ చేశాడని భావించాలి. ప్రతి చిన్న విషయానికి సీఎంలను తిట్టడం నేడు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాల కార్యక్రమంలా మారింది. చంద్రబాబుకు భూ దాహం పట్టుకుందని ఏపీలో భాజపా నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. కాకినాడ ‘సెజ్’, విశాఖలో భూ కుంభకోణం, బంగారం పండే పంట పొలాలను తక్కువ ధరకు రైతుల నుంచి సేకరించడం, భోగాపురం విమానాశ్రయం పనుల్లో ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించడం వంటివి భాజపా చేసిన ప్రధాన ఆరోపణలు. చండీగఢ్, రాయ్‌పూర్‌లను రాజధానులుగా తీర్చిదిద్దేందుకు 20వేల ఎకరాల లోపు భూములను సేకరించగా, అమరావతికి ఇంత భారీగా భూ సేకరణ ఎందుకు అనడంలో అర్థం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా చేపట్టే భూసేకరణను ఆపేక్షించకూడదు. మంచిపనిని శత్రువుచేసినా అభినందించాలి.
* * *
చాణక్యుడు మహాపద్మనందుని ఆస్థానానికి వెళ్లినప్పుడు కనీసం కూర్చోవటానికి ఆసనం కూడా ఇవ్వకుండా అవమానించారు. జుట్టుపట్టి చాణక్యుణ్ణి గెంటివేశారు. అప్పుడు మహాపద్మనందుణ్ణి పదవీభ్రష్టుణ్ణి చేస్తానని చాణక్యుడు శపథం చేశాడు. ప్రొఫెసర్ కోదండరాం సీఎం కేసీఆర్ ఇంటికి వెళితే ‘అపాయింట్‌మెంట్’ ఇవ్వలేదట! కానీ, కోదండరాం ఇంటి తలుపులు అర్ధరాత్రి వేళ పోలీసులు పగలగొట్టారు. దాంతో ఆయన కేసీఆర్ కుటుంబాన్ని అధికారం నుంచి తొలగిస్తానని చాణక్య శపధం చేశారట! ఈ కారణంగానే ‘మహాకూటమి’లో కోదండరామ్ పార్టీ చేరింది. ఇంకా ఈ కూటమిలో మావోయిస్టు సానుభూతిపరులు, భూస్వాములు, మాజీ సంస్థానాధిపతులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ బలమైన సామాజికవర్గం వారు, తెలంగాణలోని ఓ ప్రధాన కులానికి చెందిన నాయకులు కేసీఆర్ ఓటమి కోసం కృషి చేస్తున్నారట! తాము అధికారంలోకి వస్తే కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని కొందరు కాంగ్రెస్ నేతలు శపథం చేస్తున్నారు.
***
తమ రాష్ట్రాల్లోకి సీబీఐని అనుమతించే ప్రసక్తే లేదని ఏపీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు తేల్చిచెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై పగ తీర్చుకునేందుకే ప్రధాని మోదీ సీబీఐని ఉసిగొల్పుతున్నారని ఈ ఇద్దరు సీఎంలు ఆరోపిస్తున్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని సీఎంలు ప్రశ్నించటం జాతీయ సమైక్యతకు భంగకరం అన్నారు. చంద్రబాబుకు సన్నిహితులైన వ్యాపార ప్రముఖులపై ఆర్థిక నేరారోపణలున్నాయి. బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై పలు చిట్‌ఫండ్ స్కామ్‌ల పేరిట ఆరోపణలున్నాయి. సీబీఐని తమ రాష్ట్రాల్లోకి అనుమతించేది లేదని చెప్పడం దేశద్రోహ నేరమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఫెడరలిజం’ పేరుతో కేంద్రాన్ని బలహీనపరిస్తే భారతదేశంలో చైనా ఆక్రమణలు పెచ్చుమీరే ప్రమాదం ఉంది. స్వయం ప్రతిపత్తి కోసం రాష్ట్రాలు పోరాడితే భారత్ మరోసారి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది.
* * *
ఒక దుర్మార్గుడు నేరం చేస్తే పాలకులకు చెప్పుకోవాలి. పాలకులే తప్పుచేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? సీబీఐలో అవినీతి బాగోతం చినికి చినికి గాలివానలా మారింది. కొందరు అధికారులు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. నిజానిజాలు తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. సిబిఐ డిఐజి ఎం.కె.సిన్హా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాల వ్యవహారం ముదిరి పాకాన పడింది. దీంతో కేంద్ర దర్యాప్తుసంస్థల పరపతి మంట కలిసింది. ఇందుకు కేవలం మోదీ ప్రభుత్వాన్ని ఆక్షేపించటం తగదు. దశాబ్దాలుగా ఈ దుర్మార్గాలు నిరాఘాటంగా సాగుతున్నాయి. ఇప్పుడు రాకేశ్ ఆస్థానా వద్ద కీలకమైన ఫైళ్లు ఉన్నాయి. సోనియా గాంధీ, పి.చిదంబరం, కార్తి చిదంబరం, రాబర్ట్ వాద్రా వంటి ప్రముఖుల ఆర్థిక నేరాలకు సంబంధించినవి. ఉన్నతస్థాయిలో ఉన్న నేరస్థులకు శిక్షలు పడకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. ఫలితంగా ఇండియా మరొక పాకిస్తాన్‌గా మారిపోతుంది.
* * *
పంజాబ్‌లోని అమృత్‌సర్ వద్ద నిరంకారీ ధార్మిక సంస్థపై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడిచేశారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున భాజపా వారు తీవ్రమైన ఆందోళన చేశారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వానికి ఇది అగ్నిపరీక్ష లాంటిది. ఆయన చాలాకాలంగా పాకిస్తాన్ పట్ల బుజ్జగింపు ధోరణిని అవలంబిస్తున్నాడు. సరిహద్దు రాష్ట్రంలో ఈయన ధోరణి క్షంతవ్యం కాదు. ఖలిస్థాన్ ఉద్యమకారులకు సౌదీ అరేబియా, కెనడా,బ్రిటన్‌ల నుండి నిధులు అందుతున్నాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించకూడదు. లేకుంటే మరొక భింద్రన్‌వాలే పంజాబ్‌లో పుట్టుకొస్తాడు.
* * *
ఎన్నికల సమయంలో భారీగా నోట్లు పట్టుబడుతున్నాయి. ఈ మొత్తం తెలంగాణలో యాభై కోట్లు దాటింది. ఈ సొమ్ము ఎవరిది? వివరాలు వెల్లడి కావటం లేదు. గోషామహల్ సికిందరాబాదు ప్రాంతాలల్లో హవాలా మనీ దొరికినట్లు నిఘా విభాగాలు ప్రకటించాయి. నోట్ల కట్టలు ఇలా పట్టుబడుతుండగా మరోవైపు అన్ని రాజకీయ పార్టీల్లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయ. కంకణాల నివేదితారెడ్డి చాలా ధార్మిక కార్యక్రమాలు చేశారు. ఈమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డిపై బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జానారెడ్డి గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీపడవచ్చు. కాబట్టి ఆయనను ఓడించాలని ప్రత్యర్థి వర్గంతోబాటు స్వీయవర్గంలో కూడా కొందరు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు జోరందుకుంటున్నాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీలకు రెబల్స్ నుంచే ప్రమాదం పొంచి ఉంది. అందుకే పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలో ‘బుజ్జగింపుల కమిటీ’ కాంగ్రెస్ రెబల్స్‌లో కొంతమందిని దారిలోకి తెచ్చింది. మరికొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు. మిగతా రెబల్స్‌తో ఎలాంటి ప్రమాదం లేదని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు వంటివి ఉదారంగా ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తులకు భరోసా ఇస్తున్నారు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్