మెయిన్ ఫీచర్

చట్టసభల్లో ‘ఇంతే’నా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగ సమానత్వం, మహిళా సాధికారత వంటి ఘనమైన నినాదాలను పాలకులు దశాబ్దాల తరబడి ఎంత గొప్పగా వినిపిస్తున్నా.. ఆచరణలో ఇవేవీ కానరావడం లేదు. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు గడిచినా చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం నామమాత్రంగానే ఉంటోంది. సువిశాల భారతదేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల సంఖ్య 4,118 కాగా.. ఇందులో మహిళల వాటా తొమ్మిది శాతం మాత్రమేనని, స్ర్తిలకు సమానావకాశాలు దక్కనందున అభివృద్ధిలో వారి పాత్ర అంతంత మాత్రంగానే ఉంటోందని తాజా ‘ఆర్థిక సర్వే’లో వెల్లడైంది. రాజస్థాన్, బిహార్, హర్యానా శాసనసభల్లో మహిళల భాగస్వామ్యం 14 శాతంగాను, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 13 శాతంగాను, పంజాబ్‌లో 12 శాతంగాను ఉంది. దేశంలోనే అత్యున్నతమైన చట్టసభ అయిన పార్లమెంటులోనూ అతివల భాగస్వామ్యం మెరుగుపడడం లేదు. 542 సీట్లు ఉన్న లోక్‌సభలో మహిళల పాతినిధ్యం 11.8 శాతంగాను, 245 సీట్లు ఉన్న రాజ్యసభలో 11 శాతానికి పరిమితమైంది. భారత్‌లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండగా, చట్టసభల్లో మాత్రం అందుకు తగ్గట్టు వాటా దక్కడం లేదని ఐక్యరాజ్యసమితిలోని మహిళా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటులో మహిళల సంఖ్యకు సంబంధించి 227 దేశాల్లో పరిస్థితులను విశే్లషిస్తే భారత్ 148వ స్థానంలో నిలిచింది.

1966లో భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాతి కాలంలో రాష్టప్రతి, లోక్‌సభ స్పీకర్ పదవులు మహిళలకు దక్కాయి. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రక్షణ, విదేశీ వ్యవహారాల వంటి కీలక మంత్రిత్వ శాఖలను మహిళలే నిర్వహిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ కొనసాగుతున్నారు. ఒకటీ అరా మంత్రిపదవులు దక్కుతున్నాయే తప్ప పార్లమెంటులో, శాసనసభల్లో మహిళల సంఖ్య పరిమితంగానే ఉంటోందన్నది కాదనలైని కఠోర వాస్తవం.
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అనంతరం దేశవ్యాప్తంగా మహిళల్లో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. ఆ ఆందోళన ఫలితంగా మహిళలపై లైంగిక దాడుల నిరోధానికి ‘నిర్భయ చట్టం’ రూపుదాల్చింది. ఈ స్థాయిలో మహిళలు ఉద్యమించక పోవడం వల్లే రాజకీయాల్లో వారికి సముచిత ప్రాతినిధ్యం దక్కడం లేదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. లింగ సమానత్వం అంటూ పాలకులు అందమైన హామీలివ్వడం తప్ప చట్టసభల్లో మహిళలను ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధి రాజకీయ పార్టీల్లో కనిపించడం లేదు. ‘తలాక్ బిల్లు’ను ఆమోదించినంత మాత్రాన మహిళల సమస్యలు సమూలంగా పరిష్కారం కావని సామాజిక నిపుణులు అంటున్నారు.
‘మహిళానామ సంవత్సరం’..
అమెరికాలోని ‘ప్రతినిధుల సభ’కు తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మహిళలు వంద స్థానాలను మించి గెలవడం ఓ చారిత్రక విజయంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిని ‘మహిళా నామ సంవత్సరం’గా అమెరికా కీర్తించింది. ఇలాంటి శుభ పరిణామాలు భారత్‌లోనూ చోటుచోసుకోవాలని మహిళా ఉద్యమనేతలు ఆకాంక్షిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ సహా పలు శాసనసభలకు జరిగే ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే డిమాండ్‌తో బెంగళూరుకు చెందిన ‘్భరత మహిళా సమాలోచన’ (ఐడబ్ల్యుసీ) అనే స్వచ్ఛంద సంస్థ విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాజకీయ పార్టీల ప్రమేయం లేని ఈ సంస్థ- ఎన్నికల్లో మహిళలు అధిక సంఖ్యలో పోటీ చేసేందుకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చింది. స్థానిక సంస్థల్లో మాదిరి అసెంబ్లీలు, పార్లమెంటులో స్ర్తిలకు తగినన్ని సీట్లు ఇచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సంస్థ ప్రకటించింది. మొక్కుబడిగా కొన్ని పార్టీలు టిక్కెట్లు కేటాయిస్తున్నా, మహిళా అభ్యర్థుల పట్ల వివక్ష కొనసాగుతోందని ఐడబ్ల్యుసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయే స్థానాలను మహిళలకు కేటాయించడం, కుటుంబ సభ్యులు మరణించినపుడు సానుభూతి కోణంలో అతివలను విధిలేక బరిలో నింపడం పరిపాటిగా మారింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ మహిళలను ‘గెలుపు గుర్రాలు’గా భావించడం లేదు. ఏదో గతి లేక టిక్కెట్లు ఇవ్వడం తప్ప, లింగ సమానత్వం కోసం పార్టీలు కృషి చేయడం లేదు. కొన్ని సందర్భాల్లో మహిళలు ఎన్నికైనా, ఆధిపత్యం పురుషుల చేతుల్లోనే ఉంటోంది. దీంతో చట్టసభలకు ఎన్నికైన మహిళల్లో చాలామంది ‘ఉత్సవ విగ్రహాలు’గానే మిగిలిపోతున్నారు.
సూచనలే పట్టవు..
సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలంటే స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో మహిళలకు సముచిత గౌరవం దక్కాలని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు సహా అనేక అంతర్జాతీయ వేదికలు చిరకాలంగా ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. అయితే, వీటిని పట్టించుకోని పరిస్థితులు భారత్‌లో కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరొందిన భారత్‌లో రాజకీయంగా మహిళల పరిస్థితి నిరాశాజనంగానే ఉంది. అనేక చిన్న దేశాలు ఈ విషయంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆసియా ఖండం విషయానికొస్తే ఫిలిప్పీన్స్, నేపాల్ చట్టసభల్లో మహిళా ప్రతినిధులు 30 శాతానికి మించి ఉన్నారు. లావోస్‌లో 28 శాతం, వియత్నాంలో 27 శాతం మంది, చైనాలో 21 శాతం, సింగపూర్‌లో 23 శాతం, పాకిస్తాన్‌లో 21 శాతం, బంగ్లాదేశ్‌లో 20 శాతం మంది మహిళలు చట్టసభల్లో ఉన్నారు. దశాబ్దం క్రితం వరకూ కంబోడియాలో మహిళల ప్రాతినిధ్యం లేకపోగా గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 20 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారు. భారత పార్లమెంటులో మహిళా ఎంపీల భాగస్వామ్యం 12 శాతానికి మించలేదు. మలేషియా, శ్రీలంక, బ్రూనె, జపాన్ వంటి దేశాల్లో మహిళా ఎంపీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
చిన్న దేశంలో గొప్ప గౌరవం..
తూర్పు ఆఫ్రికాలో కేవలం 1.22 కోట్ల మంది జనాభా ఉన్నా ర్వాండా దేశం మహిళలను గౌరవించడంలో మిగతా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ చిన్న దేశంలోని పార్లమెంటులో మహిళల శాతం 61.3 కావడం విశేషం. 80 మంది సభ్యులున్న ‘దిగువ సభ’కు 49 మంది మహిళలు ఎన్నిక కావడం గమనార్హం. 26 మంది సభ్యులున్న ‘ఎగువ సభ’లో 10 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లింగ సమానత్వాన్ని గౌరవించాలన్న సంకల్పంతో ర్వాండా పార్లమెంటులో 30 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. అయితే, అంతకుమించిన సంఖ్యలో మహిళలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
ఎన్నికల్లో మహిళలకు సీట్లు కేటాయించేందుకు రాజకీయ పార్టీలు సుముఖత చూపకపోవడం వల్లే భారత్‌లో వారి ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంటోంది. మన దేశంలో తొలి లోక్‌సభ ఎన్నికల నుంచి 2014 వరకూ పరిస్థితులను విశే్లషిస్తే మహిళల ప్రాతినిధ్యం 4.4 శాతం నుంచి 11.9 శాతంగానే ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల పార్లమెంట్లలో మహిళల సగటు 23.4 శాతంగా నమోదైంది. ఈ సంఖ్యను కూడా భారత్ అధిగమించలేక పోవడం గమనార్హం. 1952లో మన రాజ్యసభలో మహిళల శాతం 6.9కాగా, 2014 నాటికి అది 11.4 శాతానికి చేరుకుంది. మంత్రుల సంఖ్యకు సంబంధించి 186 దేశాల్లో పరిస్థితులను గమనిస్తే మన దేశం 88వ స్థానంలో నిలిచింది. ఇక, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల్లో మహిళల శాతం 8.1గా నమోదు కావడం గమనార్హం. శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
అటకెక్కిన ‘కోటా’ బిల్లు..
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు ‘రిజర్వేషన్’ విధానం తప్పనిసరి అని భావించి మన పాలకులు ప్రతిపాదించిన ‘మహిళా బిల్లు’ ఇప్పటికీ మోక్షం లేకుండా పడి ఉంది. పలువురు రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి అటకెక్కించాయి. అన్ని శానససభల్లో, లోక్‌సభలో మహిళలకు 33 శాతం స్థానాలను విధిగా కేటాయించాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. రాజ్యాంగానికి 108వ సవరణగా, మహిళా రిజర్వేషన్ బిల్లుగా పేర్కొంటున్న పాలకులు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించడానికి మాత్రం వెనుకంజ వేశారు. 2008లో ‘మహిళా బిల్లు’ను ప్రతిపాదించగా దీన్ని అమలులోకి తెచ్చేందుకు ఏ పార్టీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఈ బిల్లును 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదించింది. దీనిపై లోక్‌సభలో ఇంతవరకూ ఎలాంటి వోటింగ్ జరగలేదు. 2014లో 15వ లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్లు మురిగిపోయింది. ఈ బిల్లు చట్టరూపం పొందాలంటే మరలా లోక్‌సభలో ప్రవేశపెట్టి మెజారిటీ సభ్యులు ఆమోదించాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను కేటాయించినట్లే అసెంబ్లీలు, లోక్‌సభకు ఇదే విధానాన్ని వర్తింపజేసేందుకు పాలకులు సుముఖత చూపడం లేదు. 1993లో రాజ్యాంగ సవరణ చేయడంతో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు దక్కాయి. -పి.ఎస్.ఆర్.

మళ్లీ చిన్నచూపే..
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘సెమీ ఫైనల్స్’గా ప్రస్తుతం జరుగతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. దేశం మొత్తమీద మహిళా వోటర్లదే ఆధిపత్యం అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా వారికి సీట్లు కేటాయించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు తీరుతెన్నులను గమనిస్తే ఈ విషయం అవగతమవుతుంది. వందేళ్లకు పైబడిన ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 11 మంది మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు వంద సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ‘మహాకూటమి’లో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ 14 చోట్ల పోటీ చేస్తుండగా కేవలం ఒక్క సీటును మాత్రమే మహిళలకు కేటాయించింది. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్న అధికార తెరాస పార్టీ ఈసారి కూడా మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. మరో జాతీయ పార్టీ అయిన భాజపా 14 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. సీపీఎం నేతృత్వంలోని ‘బహుజన వామపక్ష కూటమి’ (బిఎల్‌ఎఫ్) నుంచి పదిమంది మహిళలు పోటీ చేస్తున్నారు.