మెయన్ ఫీచర్

‘ఢిల్లీ వైభవం’ ఇక గత చరిత్రే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశ రాజధాని ఢిల్లీ మహా నగరం మెల్లగా ‘కోమా’లోకి జారుకుంటోంది! ఈ మహానగరంలో నెలకొన్న భయంకర వాయు కాలుష్యం తీరు చూస్తే ఇది మానవ నివాస యోగ్యం కాదని ఎప్పుడో తేలిపోయింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానంలో ఉంది. కానీ, పర్యావరణపరంగా ఈ రోజు ఢిల్లీ గురించి గర్వంగా చెప్పుకునేందుకు ఏముంది? ఢిల్లీలో ఉదయం వేళ నడిచేవారు కనిపించడం లేదు, మాస్క్‌లు పెట్టుకుని జనం తిరుగుతున్నారు. ఊపిరితిత్తులను నాశనం చేసి, మృత్యువు ముంగిటకు చేర్చే న్యూమోనియా వ్యాధి కరాళ నృత్యం చేస్తోంది. ఇక విష జ్వరాల సంగతి చెప్పనక్కర్లేదు. ఇసుక తుపానులు,మంచుతుపానులు, కాలుష్యంతో కూడిన వర్షాలు, పరిసర రాష్ట్రాల్లో పంట చెత్తను రైతులు తగలబెట్టడం వల్ల ఢిల్లీ కాలుష్యం బారినపడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ నగరం దేశ రాజధానిగా కొనసాగే అర్హతను కోల్పోయింది.
రాజధాని నగరమే నివాసయోగ్యం కానప్పుడు చట్టసభల ప్రతినిధులు, సుప్రీం కోర్టు, జాతీయ సంస్థలు, రాష్టప్రతి, ప్రధానమంత్రి దేశానికి ఇచ్చే సందేశం ఏమిటి? రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి పరిశుభ్రమైన ఆక్సిజన్ అందుబాటులో ఉంటుంది. సామాన్యుల సంగతి ఏమిటి ? ఢిల్లీకి పనుల నిమిత్తం దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజల సంగతి ఏమిటి? ఈ దిశగా ఆలోచించే శక్తి బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలకు ఉందా? ఇక, మన దేశంలో ప్రజలకు ‘రాజధాని ఫోబియా’ ఎక్కువ. కొత్త రాజధానిని నిర్మించాలన్నా, రెండవ రాజధానిని నెలకొల్పాలన్నా, రాజధానిని మార్చాలన్నా రాద్దాంతం తప్పదు. కీలక నిర్ణయం తీసుకునే శక్తి మన రాజకీయ పార్టీ నేతలకు ఉండాలి. ఉత్తరాది రాష్ట్రాలు ఢిల్లీనే రాజధానిగా కోరుకుంటాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాచి ప్రజలను కబళిస్తుంటే రాజ్యాంగ పెద్దలు అత్యవసరంగా నిర్ణయం తీసుకుని వాస్తవాలను చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది.
స్వాతంత్య్రం వచ్చాక ఢిల్లీ విస్తీర్ణం 1951లో 198 చ.కి.మీ మేరకు విస్తరించి ఉండేది. 1961కి 323 చ.కి.మీకి విస్తరించింది. ‘నేషనల్ క్యాపిటల్ రీజియన్’గా ప్రకటించి కేంద్రపాలిత రాష్ట్రం చేయడంతో చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు దీన్ని విస్తరించారు. ఈ రోజు ఢిల్లీ రాజధాని ప్రాంతం 54,984 చ.కి.మీ మేరకు విస్తరించింది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్, సోనిపట్, బహదూర్‌గఢ్, ఘజియాబాద్, తదితర ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ జనాభా 1947లో 9 లక్షలు. దేశ విభజనతో 4 లక్షల మంది ముస్లింలు ఢిల్లీ వదిలి పాకిస్తాన్‌కు వెళ్లారు. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్, బలూచిస్తాన్ నుంచి 5 లక్షల మంది హిందువులు, సిక్కులు ఢిల్లీకి కాందిశీకులుగా వచ్చారు. వీరిలో సిక్కులు,హిందువులు, కరాచీ నుంచి వచ్చిన సింధీలు, మార్వాడీలు ఎక్కువ. ప్రస్తుతం ఈ వర్గాల గుప్పిట్లోనే ఢిల్లీ రాజధాని ఉందనేది నిర్వివాదాంశం.
మహాభారత కాలంలో ఇంద్రప్రస్థ నగరమే నేటి ఢిల్లీ. చరిత్రలో ఢిల్లీకి మహర్దశ ప్రారంభమైన కాలమది. కాలగర్భంలో అనేక సామ్రాజ్యాలకు రాజధాని ఢిల్లీ. ఢిల్లీకి 1192 నుంచి 1857 వరకు గడ్డుకాలం అని చెప్పవచ్చు. పృథ్వీరాజ్ చౌహాన్ 1192లో మహ్మద్ ఘోరీ చేతిలో ఓటమి చెందిన తర్వాత ఢిల్లీ పతనం ప్రారంభమైంది. దురాక్రమణదారుల చేతిలోచిక్కి దోపిడీకి గురైంది. పాండవుల కాలంలో ఇంద్రప్రస్థగా పేరున్న ఢిల్లీకి మళ్లీ 736 ఎ.డి నుంచి చరిత్ర ప్రారంభమైంది. ఆ మధ్య కాలంలో పెద్దగా చరిత్ర లేదు. 736 నుంచి 1206 వరకు దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు తోమ్రా, చౌహానుల ఏలుబడిలో రాజధానిగా ఉండేది. ఆ తర్వాత ముస్లింల దండయాత్రలతో అతలాకుతలమైంది.
సూల్తానుల పాలనలో 1206 నుంచి 1320 వరకు 15 మంది రాజులు, తుగ్లక్‌ల హయాంలో 1320 నుంచి 1413 వరకు 9 మంది రాజులు, సయ్యదీల పాలనలో 1414 నుంచి 1451 వరకు నలుగురు రాజులు, లోధీల ఏలుబడిలో 1451 నుంచి 1526 వరకు ముగ్గురు ప్రభువులు, మొఘలుల ఆధిపత్యంలో 1526-1857 వరకు 330 సంవత్సరాల పాటు అప్పుడప్పుడు కొంత విరామంతో 21 మంది చక్రవర్తుల పాలనలో ఢిల్లీ రాజధానిగా ఉండేది. 1540 నుంచి 1553 వరకు ఏడుగురు సూరి వంశ ముస్లింల రాజుల ఆధిపత్యం, 1553-1556 మధ్య మూడేళ్ల పాటు హిందూ చక్రవర్తి హేము వంశస్తుల ఆధీనంలో, మళ్లీ మొఘలుల పాలనలో 1556-1757 మధ్య, మరాఠాల ఏలుబడిలో కొంత కాలం ఢిల్లీ రాజధానిగా ఉండేది. బహదూర్ షా మొఘల్ చక్రవర్తుల్లో చివరి వ్యక్తి. 1857లో బ్రిటీష్ సైన్యం చుట్టుముట్టి బహదూర్ షాను బర్మాకు పంపించివేసి జైలులో పెట్టింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మగ్గిన భారత్‌కు అప్పట్లో కలకత్తా రాజధానిగా ఉండేది. 1911లో బ్రిటీష్ ప్రభుత్వం దేశ రాజధానిని ఢిల్లీకి మార్చింది. కలకత్తాలో ఎండలు ఎక్కువ. దీనికితోడు బెంగాలీల ఆధిపత్యం, తిరుగుబాటు ధోరణి, వందేమాతరం, సాంస్కృతిక ఉద్యమం, హిందువులు, ముస్లింలలో లౌకిక వాదన బలంగా ఉండడం చూసి బ్రిటీష్ ప్రభుత్వం ఈ నాటి పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వరకు విస్తరించి ఉన్న ఆనాటి భారత్‌కు ఢిల్లీని రాజధానిగా ప్రకటించింది. ఐదు రోజుల్లో ఢిల్లీకి రాజధానిని మార్చేశారు. ఇంగ్లాండ్ ప్రభువు ఐదవ జార్జి ఢిల్లీని సందర్శించి రాజధానిగా ప్రకటించారు. వేసవికాలంలో మాత్రం సిమ్లాను రాజధానిగా వినియోగించేవారు. ఢిల్లీకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఢిల్లీ పరిసరాల్లో ఉన్నాయి. ఇంద్రప్రస్థ, సూరజ్‌కుండ్, లాల్‌కోట, తగ్లకాబాద్, జహనాపనా, ఫిరోజాబాద్,షాహజనాబాద్ తదితర పేర్లతో ఆయా కాలాల్లో పూర్వం రాజులు రాజధానిని ఏర్పాటు చేశారు. మనం ‘పిచ్చి తుగ్లక్’ అంటాం కాని, మహ్మద్ బిన్ తుగ్లక్ తుగ్లకాబాద్ నుంచి రాజధానిని మహారాష్టల్రోని దౌలతాబాద్‌కు మార్చాడు. దండయాత్రలు తట్టుకోలేక తుగ్లక్ ఆ పనిచేశాడు. రాజధాని సురక్షిత నగరంగా ఉండాలన్నది అతని ఆకాంక్ష. ఆ రోజు పంజాబీ, సింధీ, పఠాన్ల వత్తిళ్ల వల్ల తుగ్లక్ ఢిల్లీకి వచ్చేశారు. ఢిల్లీ అనే పేరు 50 బిసిలో ఆ నాటి రాజుల వల్ల వచ్చిందని చరిత్రకారుల విశ్వాసం.
కాగా, నేడు పౌరులు క్షేమంగా ఉండేందుకు అనువైన ప్రదేశం ఢిల్లీ కాదు. దేశ రాజధానిలో పీల్చే గాలి ఇంత ప్రమాదకరంగా ఉంటే- నేతల దూరదృష్టి, దార్శనికత ఎంత? దేశ చరిత్రను సంపూర్ణంగా విశే్లషించి, ఔపోసిన పట్టిన మహనీయులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. ఒకరు సర్దార్ పటేల్. రెండవ వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ రాసిన ‘్థట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్’ పుస్తకంలో ‘నీడ్ ఫర్ సెకండ్ క్యాపిటల్’ (రెండవ రాజధాని అవసరం) పేరిట రాసిన చాప్టర్‌లో పలు విషయాలు పొందుపరచారు. రెండవ రాజధాని ఆవశ్యకత, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను తొలగించడం ఎలా అనే ఆసక్తికరమైన అంశాలను రాశారు. మొఘలులు, బ్రిటీష్ వారి పాలనలో ప్రజా ప్రభుత్వం లేదు. పాలకుల ఇష్ట ప్రకారం ఢిల్లీ రాజధానిగా ఉండేది. ఇప్పుడున్న రాజధాని సంతృప్తిగా లేకపోతే, మరో రాజధాని గురించి ఆలోచించాలి. ఏ విధంగా చూసినా ఇది విసిరేసినట్లుగా ఉండేప్రాంతం. తీవ్రమైన చలి, భయంకరమైన ఎండలు. శత్రుదేశాలకు సమీపంలో ఈ నగరం ఉంది. కోల్‌కత కూడా ఈ రోజు సరైన ప్రదేశం కాదు. మరాఠాల గడ్డ ముంబయి కూడా రాజధానిగా క్షేమకరం కాదని అంబేద్కర్ పేర్కొన్నారు. అంబేద్కర్ రెండవ రాజధానిగా హైదరాబాద్ పేరును ప్రస్తావించారు. హైదరాబాద్-సికింద్రాబాద్-బొలారం ప్రాంతం రెండవ రాజధానిగా అనుకూలమైన నగరమని పేర్కొన్నారు. అంబేద్కర్ 67 ఏళ్ల క్రితమే దూరదృష్టితో ఢిల్లీ దీర్ఘ కాలిక అవసరాల దృష్ట్యా యోగ్యమైన రాజధాని కాదని, హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేస్తే బాగుంటుందన్నారు.
ఈ రోజు ఢిల్లీ రాజధానిగా పనికిరాదు. పార్లమెంటు, సుప్రీం కోర్టుతో పాటు అన్ని జాతీయ సంస్థలను తరలించాలి. దీని కోసం మళ్లీ ఏదో ఒక నగరాన్ని నిర్మించి, సాంకేతిక కారణాల వల్ల కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుంది. కొత్త రాజధానిని నిర్మించడమే పాలకుల కర్తవ్యం. దీనికి అనువైన ప్రాంతాలు నాగ్‌పూర్, హైదరాబాద్, బెంగళూరు. మహారాష్టల్రో నాందేడ్ వద్ద విస్తారంగా లభ్యతలో ఉన్న భూములను సేకరించి రాజధానిగా నిర్మించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. పాకిస్తాన్ తొలి రాజధాని కరాచీ, ఆ తర్వాత రావల్పిండికి మార్చారు. పాక్‌కూడా ఇస్లామాబాద్ రాజధాని నగరాన్ని నిర్మించింది. దేశానికి నడిబొడ్డున రాజధాని ఉండాలంటే విస్తరమైన భూములు లభ్యతలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర లేదా తెలంగాణ మాత్రమే. గోదావరి, కృష్ణా నదీ జలాల లభ్యత ఉంది.
1960లో బ్రెజిల్ తన రాజధానిని రియో డీ జనేరీయో నుంచి బ్రసిల్లాకు, నైజీరియా లాంగోస్ నుంచి అబూజాకు 1991లో రాజధానిని మార్చింది. మయన్మార్ తన రాజధానిని రంగూన్ నుంచి మార్చింది. దేశ రాజధానిని మార్చే విషయమై పార్లమెంటులో చర్చ జరగాలి. ఈ ప్రతిపాదనకు ఉత్తరాదిన బలమైన లాబీయింగ్ చేసే శక్తివంతులైన పంజాబీ హిందువులు, సిక్కులు, జాట్‌లు, ఠాకూర్లు, ఉత్తరాది బ్రాహ్మణులు, బనియాలు వంటి సామాజిక వర్గాలు. ఢిల్లీని వద్దనుకున్నపుడు కొత్త రాజధానిని యూపీలోనే కట్టమని ఉత్తరాది వారు అంటారు. చారిత్రక తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలను ఎన్నుకోవాలి. రాజధానిని మూడేళ్లలో నిర్మించే శక్తి కేంద్రానికి ఉంది. ఈ దేశం తమ వల్లనే అభివృద్ధి సాధించిందని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కనీసం రాజధాని విషయమై ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి. ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను, ప్రజల మనోభావాలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన సమయమిదే. 1200 ఏళ్లుగా రాజధానిగా సేవలు అందించిన ఢిల్లీ శిథిలావస్థకు చేరుకుంది. ఢిల్లీలో రాజధాని లేనంత మాత్రాన అభివృద్ధి ఆగదు. మనదేశానికో పాలక రాజధాని కావాలి. బ్రిటీష్ రచయిత నోవల్ కోవర్డ్ చెప్పినట్లు లండన్‌లో ఏముంది? ఎతె్తైన భవనాలు, అన్ని చోట్లా నీచస్థాయిలో అనైతికత తప్ప. ఎంతో ఘన చరిత్ర ఉన్నా రాజధానిగా కొనసాగేందుకు ఢిల్లీ యోగ్యతను కోల్పోయింది. దీనికి భవిష్యత్తు లేనందున పాలకులు పర్యావరణాన్ని దృష్టిలో ఆదర్శవంతమైన పరిపాలనా రాజధానిని నిర్మించాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097