మెయన్ ఫీచర్

రైతు సమస్యలపై దిక్కుతోచని మోదీ సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో ఆరు నెలల్లో తన ఐదేళ్ల పదవీ కాలాన్ని ముగించుకోబోతున్న నరేంద్ర మోదీ ప్రభు త్వం ప్రస్తుతం ముఖ్యంగా రెండు వర్గాల నుండి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నది. మొదటిది ఉపాధి అవకాశాలు లేకపోగా, ఉన్న అవకాశాలు సైతం సన్నగిల్లి పోతూ ఉండడంతో యువత ఆగ్రహిస్తున్నది. మరొకటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతాంగం. ఈ రెండు విషయాల్లో ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితులలో మోదీ ప్రభుత్వం కనిపిస్తున్నది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే గంభీరమైన హామీ ఇచ్చినా, ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. పైగా రైతుల వెతలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటం, లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ఇదే సరైన సమయం అని భావించి పలు రాష్ట్రాలలో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి తమ డిమాండ్లు సాధించుకోవాలని భావి స్తున్నారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతుల్లో తీవ్ర అసహనం వ్య క్తం అవుతోంది. నిత్యం నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నా కొందరు మృతి చెందటం, ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగడం, అశాంతి చెలరేగడాన్ని నివారించలేక పోతున్నారు. అక్టోబర్ మొదట్లో భారత కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కిసాన్ క్రాంతి యాత్ర ఢిల్లీలోని కిసాన్ ఘాట్‌కు చేరుకొంది. అఖిల భారత కిసాన్ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు రైతుల నిరసనలు సాగాయి. ఈ మధ్యనే మహారాష్టల్రోని పలు జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు ముంబయికి చేరుకొని ప్రభుత్వాన్ని నిలదీయగా, దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం వారి కోర్కెలకు తలవంచ వలసి వచ్చింది. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రైతుల నిరసనల ఫలితంగానే రుణమాఫీ పథకాన్ని ప్రకటించవలసి వచ్చింది. రైతులకు సంబంధించి పలు డిమాండ్లు తెరపైకి వస్తున్నా ముఖ్యంగా రెండు డిమాండ్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవలసి ఉన్నదని చెప్పవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, కనీస మద్దతు ధరలకు హామీ ఇవ్వడం, రుణమాఫీ అమలు చేయడం. వీటితో పాటు ఇంధనం, విద్యుత్ చార్జీలు తగ్గించాలని కుడా రైతన్నలు కోరుతున్నారు. రైతుల డిమాండ్లు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది- స్వామినాథన్ కమిటీ సిఫార్సులు. వాటిని పూర్తిగా అమలు చేయాలని రైతులు చిరకాలంగా కోరుతున్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏమిటి? వాటిని ఏమేరకు అమలు పరచవచ్చు, మద్దతు ధరలు ఏమిటి? వాటికి ఎంతవరకూ హామీ ఇవ్వవచ్చు, రుణమాఫీ అమలైతే సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? వంటి ప్రశ్నలకు ఉద్యమకారులు గాని, వారి ఉద్యమాలకు ప్రాధాన్యత ఇస్తున్న మీడియా గాని, ఈ డిమాండ్లకు మద్దతు ఇస్తున్న వివిధ రాజకీయ పార్టీలు గాని, వాటి పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్న ప్రభుత్వాలు గాని, పాలనలో కీలకపాత్ర వహిస్తున్న అధికారులు గాని, ఆర్థిక నిపుణులు గాని లోతుగా చర్చించిన్నట్లు కనబడదు. రుణమాఫీ తమ పరిధిలోకి రాదంటూ కేంద్రమంత్రులు తిరస్కరిస్తున్నారు. కానీ గతంలో రెండు సార్లు - మొదటగా విపి సింగ్ ప్రభుత్వం, తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రుణమాఫీని అమలు చేయడాన్ని మరచిపోలేం. ఆ తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి హామీలు ఇస్తూ, అమలుకు కుస్తీ పడు తున్నాయి. మొదటిసారిగా భాజపా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రుణమాఫీ వాగ్దానం చేసింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా దాదాపు అన్ని పార్టీలు పోటీ పడి మరీ ఇటువంటి హామీలు కురిపిస్తున్నాయి.
గతంలో అమలు జరిపిన రుణమాఫీ వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయని ఎవరైనా అధ్యయనం చేశారా? రుణమాఫీ అన్నది బ్యాంకులు తమ రాని బకాయిలను తగ్గించుకొని, ఆర్థిక సామర్ధ్యాన్ని పెంపొదించుకోడానికి ఉపయోగ పడుతుంది. నిజంగా రైతులు రుణ విముక్తులు అవుతున్నారా ? వారు తిరిగి రుణం పొండుతున్నారా ? వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందా ? వంటి విషయాలపై లోతైన సమాలోచనలు జరుపవలసి ఉంది. మరోవంక మద్దతు ధరలపై హామీల వల్ల రైతులు ప్రయోజనం పొందుతున్నారా ? మద్దతు ధర లేనపుడు ప్రభుత్వాలు ఏ మేరకు జోక్యం చేసుకొని సహాయం అందించగలవు? నాలుగైదు పంటలకు మినహాయించి నియంత్రణ గల మార్కెటింగ్ వ్యవస్థలు భారత దేశంలో లేనందున మద్దతు ధరల వల్ల దళారులు, వ్యాపారులు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు గాని రైతులు మాత్రం కాదు. పైగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే, వాటి ప్రభావం అన్ని నిత్యావసర వస్తువులపై పడుతున్నది. దాంతో ఆహార పదార్థాల ద్రవ్యోల్భణం పెరిగి ప్రజలందరిపై భారం పడుతుంది. ఆ భారం రైతులపై కూడా పడుతుంది. రైతులకు పారదర్శకత ఉన్న, దోపిడీకి అవకాశం లేని మార్కెటింగ్ వ్యవస్థ అందు బాటులో లేకపోవడం ప్రధాన సమస్య. మన వ్యవసాయ మార్కెట్లలో దళారులే రాజ్యమేలుతున్నారు. వారి ప్రమేయం లేకుండా మార్కెట్‌ను ప్రభుత్వం సంస్కరించ గలదా ? రైతులు నేరుగా తమ ఉత్పత్తులను మంచి ధర ఇచ్చే వారికి అమ్ముకోగాలరా ? సరైనా ధర లభించని పక్షంలో ఉత్పత్తులను నిల్వ చేసేందుకు గిడ్డంగులను సర సమైన ధరలకు అందుబాటులోకి తెచ్చి, నిల్వ ఉంచుకున్న ఉత్పత్తులపై కొంత మొత్తం రుణంగా లభించే ఏర్పాటు చేయగలిగితే ఎంతో ప్రయోజనం ఉండగలదు.
ఇటువంటి వౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. దాంతో ప్రభుత్వాలు చేబడుతున్న ఆకర్షణీయ పథకాలు ఆచరణలో రైతులకు ఎటువంటి ప్రయోజనం కల్గించలేక పోతున్నాయి. అసలు రైతుల సమస్యల పట్ల, క్షేత్రస్థాయి అంశాల పట్ల అవగాహన గల వారు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నా రా? కనీసం భాజపాలో ఉన్నారా ? ఉన్నా అటువంటి వారికి విధాన నిర్ణయాలలో తగు ప్రాధాన్యత లభిస్తుందా ? పార్లమెంట్‌లో రైతాంగ సంక్షోభం గురించి ఏడాది మొత్తం మీద ఐదారు గంటల సేపు అయినా చర్చ జరిపారా? మన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నదనడంలో సందేహం లేదు. అందుకు ప్రధాన కారణం వ్యవసాయం లాభసాటిగా లేకపోవడమే, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతూ ఉండడమే. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉండటం లేదు. వడ్డీ వ్యాపారుల దోపిడీ,, వ్యవసాయ మార్కెట్లలో అరాచకాల నుండి రైతుకు రక్షణ లభించడం లేదు. ఇటువంటి అంశాలపై ఆలోచనలు జరగడం లేదు.
ఒక నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి రోజూ రెండు వేలమంది చొప్పున వ్యవసాయ రంగం నుండి నిష్క్ర మిస్తున్నారు. వ్యవసాయం చేసే యువకులను వివాహం చేసుకోవడానికి ఆడపిల్లలు ముందుకు రావడం లేదు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు చాలా నిరుత్సాహంగా ఉంటున్నది. యూపీఏ పాలనలోని పదేళ్లలో వృద్ధి రేటు 4 శాతంగా ఉండగా తర్వాత ఒక దశలో సగానికి తగ్గిపోయింది. జీడీపీలో వ్యవసాయం వాటా మోదీ ప్రభుత్వ హయంలో తగ్గిపోతూ వస్తున్నది. రైతులలో ఆత్మహత్యలు తగ్గటం లేదు. ఈ విషయంలో జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ ఇస్తున్న అంకెలను రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. చాలామంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడానికి వ్యవసాయం కారణం కాదని వాదిస్తున్నారు. అదే వేరే అంశం.
రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కోరడం ఇప్పుడే కొత్తగా చేస్తున్న డిమాండ్ కాదు. దశాబ్దాల కాలంగా అందుకోసం పలు ప్రాంతాలలో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏ ప్రభుత్వం కుడా తగిన పరిష్కార మార్గాలను రూపొందించి, వాటిని అమలు పరచే ప్రయత్నం చేయడం లేదు. రైతులు పంటలు వేసే ముందు వివిధ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్లు, మంచి ధర వస్తుందనే అభిప్రాయం కలిగించడం.. తీరా పంట చేతికి వచ్చే సరికి ధరలు పడిపోవడం, ప్రభుత్వం ఏదో ఒక రూపంలో కొంత సహకారం అందించి ధరలు పెరిగేటట్లు చేసే సరికి- ఆ ఉత్పత్తులను రైతులు తక్కువ ధరకు అమ్ముకొంటే ప్రభుత్వం అందించే సహకారంతో దళారులు, వ్యాపారాలు ఎంతో ప్రయోజనం పొందటం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అందుకనే ప్రభుత్వం అందించే సహాయం ఎక్కువగా దళారులకే మేలు చేకూరుస్తున్నది. గత మూడేళ్ళలో 10 శాతం మంది రైతు లు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగారని అధికారిక నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన లేని అధికారులు, నిపుణులు, రాజకీయ నేతల ద్వారా వ్యవసాయ సంక్షోభాన్ని నివారించలేరని గ్రహించాలి. ఎన్నికలతో ముడి పెట్టకుండా, ప్రజాకర్షక నినాదాలతో వదిలి వేయకుండా నిజాయతీతో పరిస్థితులలో మార్పు కోసం ప్రయత్నం జరగాలి.

-- చలసాని నరేంద్ర