మెయిన్ ఫీచర్

స్వలాభం లేని సరొగేసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో మొదటిసారి..
గర్భాశయ సంబంధ లోపాలతో సంతానాన్ని పొందలేకపోతున్న మహిళలకు ఓ శుభవార్త.. చనిపోయిన మహిళ గర్భసంచిని సేకరించి దానిద్వారా సంతానాన్ని పొందవచ్చని నిరూపించింది బ్రెజిల్‌లోని సావోపాలో విశ్వవిద్యాలయానికి చెందిన డేనీ ఎజెన్‌బర్గ్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం. గర్భాశయ మార్పిడి ద్వారా 2013లో ఒక స్వీడన్ మహిళ మాతృత్వాన్ని పొందింది. అయితే అది సజీవదాత నుంచి సేకరించిన గర్భసంచి. ఇప్పటివరకు ఈ ప్రక్రియ ద్వారా పదకొండు మంది శిశువులు జన్మించారు. గర్భాశయ మార్పిడి వైద్యపరంగా మంచి పనే అయినప్పటికీ దాతను పొందడం మాత్రం కష్టమైన పనే..
నేడు మరణానంతరం అవయవదానం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మృతదాతల నుంచి గర్భాశయాలను సేకరించి, మాతృత్వం అవసరం ఉన్న మహిళలకు అమర్చడంపై శాస్తవ్రేత్తలు దృష్టి సారించారు. గతంలో ఈ ప్రయత్నాలు జరిగాయి కానీ ఫలితం లేదు. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళకు చనిపోయిన మహిళ నుంచి సేకరించిన గర్భసంచిని అమర్చారు. అది ఫలించి ప్రపంచంలో మొట్టమొదటిసారి అరుదైన రీతిలో ఆ బ్రెజిల్ మహిళ ఓ బుజ్జాయికి జన్మనిచ్చింది. మాతృత్వాన్ని పొందింది.
మాతృత్వం.. స్వార్థం లేని ప్రేమకు నిర్వచనం.. అంతులేని అనురాగానికి మచ్చుక.. అందుకే ఈ ప్రపంచంలో ప్రతి మహిళా మాతృత్వం కోసం పరితపిస్తుంది.. పూజలు చేస్తుంది.. నోములు నోస్తుంది.. కడుపు పండడం కోసం ఎన్ని కష్టాలనైనా పంటి బిగువున భరిస్తుంది.. ఆ వరం దక్కదని తెలిసినప్పుడు నిలువునా కుంగిపోతుంది.
అమ్మతనం పొందలేకపోవడానికి కారణాలు ఎన్నో.. ఇలా మాతృత్వం పొందలేని మహిళల కోసం డాక్టర్లు అనేక పద్ధతులను ప్రవేశపెట్టారు. గర్భసంచి బాగుండీ పిల్లలు కలగని వారికి ఐవీఎఫ్ ద్వారా అండాన్ని ఫలదీకరణ చెందించి గర్భసంచి లోకి ప్రవేశపెడుతున్నారు డాక్టర్లు. మరికొంతమంది మహిళలు గర్భాశయ సంబంధ లోపాలతో మాతృత్వాన్ని పొందలేకపోతుంటే.. వారికి ‘సరొగేసి’ అనే ప్రత్యామ్నాయాన్ని చూపించారు డాక్టర్లు. ఈ పద్ధతి ఎంత పేరుగాంచిందంటే.. తల్లి కాలేకపోతున్న ప్రతీ మహిళకు ఇదో వరమైంది. సాధారణ మహిళలనుంచి సెలబ్రెటీల వరకు చాలామంది మహిళలు సరొగేసి ద్వారా తల్లులైపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరొగేసి పేరుగాంచింది. అలాగే ఇదో వ్యాపారంగా కూడా మారింది. ఆధునిక భావజాలం కలిగిన ఈ దేశంలో గత పదేళ్లలో సరొగేసి 400 శాతం మేర పెరిగిందని ఓ అంచనా.. విదేశాల్లో అయితే సరొగేసి ద్వారా బిడ్డను పొందడానికి 50 లక్షల నుండి 80 లక్షల వరకు ఖర్చు పెడతారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పిల్లలు కావాలనుకునే విదేశీయులు భారతదేశానికి వచ్చి సరొగేసి ద్వారా పిల్లలను కని విదేశాలకు తీసుకుపోయేవారు. కానీ నేడు భారత్, థాయిలాండ్, నేపాల్, మెక్సికో వంటి దేశాలు వ్యాపారాపేక్షతో జరిగే విదేశీ సరొగేసిని నిషేధించాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు మరో అడుగు ముందుకేసి అన్ని రకాల సరొగేసీని నిషేధించాయి. యూకే, ఐర్లాండ్, డెన్మార్క్, బెల్జియం వంటి దేశాల్లో కేవలం లాభాపేక్ష కోసం మహిళలు సరొగేట్ తల్లులుగా మారడానికి అనుమతించరు. సరైన కారణాలను చూపుతూనే వారు సరొగేట్ తల్లులుగా మారడానికి అర్హత సాధిస్తారు. జార్జియా, రష్యా, యుక్రెయిన్‌తో పాటు కొన్ని అమెరికా రాష్ట్రాల్లో సరొగేసీని వ్యాపారంగా కూడా అనుమతిస్తారు. కెనడాలో డబ్బు తీసుకుని ఇతరుల బిడ్డల్ని కడుపులో మోయడం నేరం.
కానీ కెనడాకు చెందిన మారిసా ఒక్క పైసా కూడా డబ్బు తీసుకోకుండా ‘సరొగేట్ మదర్’గా మారింది. మారిసా కెనడాకు చెందిన ఓ జంట కోసం మలెనా అనే బిడ్డను కంది. కెనడాలో సరొగేసి కేవలం పరోపకారం చేసే పని. దీనికి వారు ఎలాంటి డబ్బూ తీసుకోరు. అలా తీసుకోవడం చట్ట వ్యతిరేకం కూడా.. ఇక్కడ ఇతరుల కోసం పిల్లల్ని కనిచ్చే వందలాది తల్లులు ఉన్నారు. వారిలో ఒక మహిళ మారిసా మజిల్. ఫలదీకరణ చెందించిన పిండాన్ని ఆమె గర్భసంచిలో ప్రవేశపెట్టిన తరువాత.. ఒకరోజు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. గర్భస్రావం జరిగింది. మళ్లీ అలాగే జరిగింది.. ఇలా నాలుగుసార్లు గర్భస్రావం జరిగింది మారిసాకు. దీంతో నెలల తరబడి హార్మోన్ల ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి వచ్చింది మారిసా.. మరోసారి ప్రయత్నించారు డాక్టర్లు. ఈసారి ప్రయత్నం ఫలించింది. పదహారు గంటలపాటు ప్రసవ వేదనను భరించి, ప్రాణాలను పణంగా పెట్టి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అదీ తనకోసం కాదు. ఎవరో ముక్కూ, మొహం తెలియని పిల్లలు లేని దంపతుల కోసం.. దీని గురించి మారిసా మజిల్ మాట్లాడుతూ ‘నేను కేవలం ఆ దంపతుల కోసం బిడ్డను కనడం లేదు. ఒక వారసత్వాన్ని సృష్టించడం కోసం కంటున్నా.. పుట్టగానే బిడ్డను ఎలా ఇచ్చేస్తావు? అని చాలామంది నన్ను అడుగుతున్నారు. కానీ నేను ఇచ్చేస్తుంది నా బిడ్డను కాదు. కడుపులో పిండం ప్రవేశపెట్టిన క్షణం నుంచి అది ఆ దంపతులకే చెందుతుంది. నేను కేవలం ఆ బిడ్డకు సంరక్షకురాలిగా ఉన్నా. గర్భాన్ని అద్దెకిచ్చే చాలామంది మహిళల్ని చూశాను నేను. సరోగేసి ద్వారా ఇతరుల బిడ్డల్ని కడుపులో మోసినందుకు వారు 50 నుంచి 80 లక్షల ద్వారా తీసుకుంటారు. కానీ మా దేశంలో మేం అలా చేయం. మేము బిడ్డల్ని కనే యంత్రాలం కాదు. ఇక్కడ గర్భం అద్దెకు దొరకదు.. ఈ పని నేనేదో ఉద్యోగంలా, సంపాదన కోసం చేయడం లేదు. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. పిల్లలు లేకుండా జీవించడం చాలా కష్టం. అందుకే ఆ దంపతులకు సాయం చేశాను. ఈ పని చేసినందుకు నాకు చాలా చాలా ఆత్మ సంతృప్తిగా ఉంది’ అంది. ఏది ఏమైనా సంతానం లేని దంపతులకోసం మారిసామజిల్ చేసిన త్యాగం మరువలేనిది.

సూర్యదేవర. -ఉమా మహేశ్వరి