మెయన్ ఫీచర్

మానవ హక్కులకు ప్రమాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన 70వ వార్షికో త్సవాన్ని జరుపుకొంటున్నాము. ఈ సంద ర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విశేష కార్యక్రమాలను జరుపుకొంటున్నాము. మానవజాతి చరిత్రలో సరిగ్గా 70 ఏళ్ళ క్రితం జరిగిన ఈ ప్రకటన అతి పెద్ద మలుపు అని చెప్పవచ్చు. ఆధునిక మానవ నాగరికతకు, నాగరిక జీవనానికి బలమైన పునాది వేసిన చారిత్రాత్మక ఘడియలు అవి.
వరుసగా రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి . కోట్లాది మంది ప్రజలు ఈ సందర్భంగా జరిగిన మారణకాండలో మృతి చెందారు. కొన్ని కోట్ల మంది వికలాంగులు అయ్యారు. మరికొన్ని కోట్లమంది ఆధారాలు కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. మానవ జీవనమే అతలాకుతలమైంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం కొన్ని దేశాలు విజయం సాధించామని చెప్పుకొన్నా ఆర్థికంగా మాత్రం బాగా చితికి పోయాయి. మానవ జాతి భవిష్యత్ అంధకారంగా మారింది. అటువంటి నిరాశాపూరిత వాతావరణంలో మొత్తం మానవజాతి గౌరవంగా, పరస్పరం సహకారంతో సహజీవనం చేయడం ద్వారా అద్భుతమైన నాగరిక జీవనం గరపడం కోసం పలు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. అటువంటి ప్రయత్నాల నుండే ఐక్యరాజ్య సమితి, ఆ తరువాత పలు అంతర్జాతీయ, ప్రాంతీయ వేదికలు ప్రారంభం అయ్యాయి. ఈ మొత్తం పక్రియ ఉద్దేశం ప్రపంచ ప్రజలు అందరూ గౌరవంతో, ఆత్మాభిమానంతో ఎటువంటి భయాందోళనలు లేకుండా జీవించాలనే ఆతృతే కేంద్ర బిందువని గమనించాలి.
నేడు అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ, వాణిజ్య పరంగా జరుగుతున్న ఒప్పందాలు... ఈ సందర్భంగా ఏర్పడుతున్న పలు కూటములు, దౌత్యపరంగా జరుగుతున్న పలు ప్రయత్నాలు... వీటన్నిటి లక్ష్యం ఒక్కటే. మానవహక్కుల కేంద్రంగా అందరం పరస్పరం గౌరవంతో, సహకారంతో సహజీవనం చేయాలి. అందుకు అవసరమైన వాతావరణం కల్పించాలి. అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటనలో ప్రధానంగా పౌర, రాజకీయ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే క్రమంగా ఆర్థిక, సామాజిక హక్కులు లేనిదే వాటికి విలువ ఉండదనే గ్రహింపుతో వాటి పట్ల కూడా దృష్టి సారించడం జరిగింది. ఈ హక్కులు అన్నింటి మూల సిద్ధాంతం జన్మతహా మనిషి స్వేచ్ఛా జీవి. తనకు ఇష్టం వచ్చిన రీతిలో గౌరవంగా, సాధికారికంగా జీవించే అవకాశం ఉండాలి. గౌరవమైన విద్య, ఉపాధి, నివాసం, సామాజిక సంబంధాలు ఏర్పర్చుకొనే సౌలభ్యం ఉండాలి.
రాజకీయంగా, ఆర్థికంగా ఎటువంటి విధానాలు, వ్యవస్థలను అవలంబిస్తున్నప్పటికీ పుట్టుకతో లభించిన ఈ హక్కులను కాలదనే్న అధికారం ఎవ్వరికీ లేదు. ఆ మేరకు ప్రపంచంలోని దేశాలు అన్ని ఒక అంగీకారానికి వచ్చాయి. మానవ హక్కులకు సరిహద్దులు ఉండవు. మానవ హక్కుల ప్రమాణాలను దేశీయ రాజ్యాంగాలు, చట్టాలు అడ్డుకోలేవు అనే ఒక అవగాహనతో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ దిశగా మనం ఎంతో పురోగతి సాధిస్తున్నాము. అనేక అంశాలలో ఒక అవగాహనకు వస్తున్నాము. ప్రజలందరికీ కనీస మానవ హక్కులు కల్పించడం కోసం అనేక వ్యవస్థలు ఏర్పాటు చేసుకొంటున్నాము. హక్కుల ఉల్లంఘనకు గురవుతున్న వారికి తగు రక్షణ, న్యాయం కలిగించడం కోసం అనేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకొంటున్నాము.
అయితే రాను రానూ మానవహక్కుల పట్ల పాల కులలో అసహనం పెరుగుతున్నది. హక్కుల ఉల్లం ఘనలకు ప్రభుత్వాలతో పాటు అనేక ప్రైవేట్ వ్యవస్థలు, సంస్థలు సహితం పెద్ద ఎత్తున దోహదపడుతున్నాయి. ప్రభుత్వాలు ఉల్లంఘనకు పాల్పడిన సందర్భాలలో వ్యతిరేకత, అసమ్మతి వ్యక్తం చేయడం కోసం నేడు అనేక వ్యవస్థలు, సాధనాలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ముఖ్యంగా సాయుధ సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు బాధ్యత వహించే వారే ఉండటం లేదు. రాజకీయ సిద్ధాంతాల పేర్లతో పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతూ, తమ వాదనలను ఒప్పుకోని వారిపై దాడులు చేస్తూ ఉండటం, మారణకాండకు పాలపడుతూ ఉండడం జరుగుతున్నది.
మరోవంక ప్రత్యక్ష యుద్ధాలలో విజయం సాధించలేమని గ్రహిస్తున్న కొన్ని ప్రభుత్వాలు పరోక్షంగా తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సాహం కల్పిస్తూ, పొరుగు దేశాలపై వాటిని ప్రయోగించి, ఆయా దేశాలలో విధ్వంసాలు, అరాచకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి దారుణమైన హింసాకాండకు హక్కుల సంస్థలు, ఉద్యమకారులు అని చెప్పుకొనే వారు సహితం కొందరు ప్రత్యక్ష, పరోక్ష మద్దతు అందజేస్తున్నారు.
ఇక, ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకొనే పలు దేశాలలోని ప్రభుత్వాలు సహితం మానవ హక్కుల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు ప్రభుత్వానికి భిన్నమైన అభిప్రాయలు వ్యక్తం చేసినా, ప్రభుత్వ చర్యలను, ధోరణులను అంగీకరించకుండా శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నా సహించలేక అణచివేతకు దిగుతున్నాయి. దేశ రక్షణ, అంతర్గత భద్రత, తీవ్రవాదులను కట్టడి చేయడం పేరుతో నిరంకుశ చట్టాలను అమలు చేస్తూ ఉండటం, సాయుధ దళాలకు ఎటువంటి జవాబుదారీతనం లేకుండా ప్రజలపై అకృత్యాలు జరుపుతున్నా వౌనం వహించడం జరుగుతున్నది. ఇటువంటి పరిణామాలు మానవ హక్కుల మూల భావనలని హేళన చేస్తున్నట్లు భావించ వలసి వస్తున్నది.
అంతర్జాతీయ సంబంధాలు, ఒప్పందాలలో నేడు మానవహక్కులు ప్రధాన అంశంగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలిలో ప్రతి నా లుగున్నర ఏళ్లకు ఒకసారి ప్రతి దేశంలోని మాన వహక్కుల పరిస్థితులపై సమీక్ష జరుపుతున్నారు. అయితే, ఈ సమీక్షలు ఒక ప్రహసనంగా మారుతున్నాయి. మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలు తమ దేశం దౌత్య, ఆర్థిక అంశాలను ఎరగా చూపి ఇతర దేశాలు ఏ విధంగానూ నోరెత్తకుండా చేసుకోగ లుగుతున్నాయి. మానవహక్కుల పరిరక్షణ కోసం ఏర్పడుతున్న జాతీయ మానవ హక్కుల కమిషన్లు ఉద్యోగ విరమణ చేసేవారికి అలంకార పదవులను కట్టబెట్టే పునరావాస వేదికలుగా మారుతున్నాయి. మానవ హక్కుల పరిరక్షణలో ఆ కమిషన్లు స్వతంతంత్రంగా పనిచేయలేక పోతున్నాయి.
మరోవంక నేడు రాజకీయ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కార్పొరేట్ సంస్థలు మానవ హక్కుల ఉల్లంఘనకు పెద్ద ఎత్తున కారణం అవుతున్నాయి. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన కార్పొరేట్ సంస్థలను జవాబుదారిగా చేసే ప్రయత్నాలు చెప్పుకోదగిన విజయాలు సాధించడం లేదు. నేడు ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల ఉద్యమకారులు అన్నా, సంస్థలు అన్నా ప్రభుత్వాలు, ప్రధాన రాజకీయ పక్షాలు ఒకవిధమైన అసహనం ప్రదర్శిస్తున్నాయి. హక్కుల కార్యకర్తలకు, నేతలకు అడుగడుగునా నిర్బంధాలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ సంబంధాలలో ఆర్థిక, వాణిజ్య అంశాలు కీలక పాత్ర వహిస్తూ ఉండడంతో మానవహక్కుల ఉల్లంఘన తీవ్రతరం కావడానికి దారితీస్తుంది.
మానవహక్కులు అంటే అభివృద్ధిని అడ్డుకోవడంగా నేడు ఒక విధంగా దుష్ప్రచారం జరుగుతున్నది. అభివృద్ధి కోసం ప్రజల హక్కులను త్యాగం చేయవలసిందే అనే ఒక విధమైన దురహంకార ధోరణులు ప్రబలుతున్నాయి. పలు అభివృద్ధి పథకాల పేర్లతో లక్షలాది ప్రజలను నిరాశ్రయులు అవుతున్నారు. దాంతో అభివృద్ధి ఎవరి కోసం ? ఎందు కోసం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజలందరూ గౌరవంగా జీవించ గలిగినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది. అట్లా కాకుండా కొద్దిమంది కోసం మానవ వనరులను ధారాదత్తం చేయడాన్ని అభివృద్ధిగా అపోహ పడుతున్నారు. మానవహక్కులు మానవులందరి వికాసం కోసం అత్యవసరం అని గ్రహించాలి. నేడు పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, సంపదతో పాటు ఆర్థిక, రాజకీయ వనరులు అతికొద్ది మంది వద్దనే కేంద్రీకృతం అవుతూ ఉండటం మానవ హక్కులకు పెను ప్రమాదంగా పరిణమిస్తుంది. మాన వులందరికీ సమాన అవకాశాలు మృగ్యంగా మారు తున్నది. అయినా మానవహక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేయడం ద్వారా మానవ సమాజం ఆనందంగా ఉండేందుకోసం మనవంతు కృషి చేద్దాం.

-చలసాని నరేంద్ర