మెయిన్ ఫీచర్

శంకర్..! సీక్వెల్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైరెక్టర్ శంకర్ అంటేనే ఓ సంచలనం. అతనొక సినిమా ప్రకటిస్తే -మరింత సంచలనం. ప్రాంతీయ సినిమాను ప్రపంచస్థాయిలో చూపించగల సమర్థుత అతని ట్రాక్ రికార్డు. అప్పుడప్పుడూ ఫ్లాపుపడినా -వెంటనే బ్లాక్‌బస్టర్ హిట్‌తో సత్తా చాటుకోగల గ్రేట్ డైరెక్టర్. సామాజికాంశాన్ని కొత్త ఎత్తుగడతో చూపించగల అతని క్రియేటివిటీకి -ఆడియన్ ఫ్యాన్ మెయిల్ తక్కువేం కాదు. అందుకే -అతని
సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి శంకర్.. కెరీర్‌ను సాఫ్ట్‌గా నడిపించేస్తూ
-కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. అదే రోబో సీక్వెల్ -2.ఓ. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా థియేటర్లలో ఉండగానే
-మరో సీక్వెల్ ప్రకటించి మరో ట్విస్ట్ ఇచ్చాడు. అది -ఇండియన్-2. ఈ సీక్వెల్ సెట్స్
ఎక్కకముందే మరో సీక్వెల్‌ను మనసులోంచి బయటపెట్టాడు. అంటే మరో ట్విస్ట్.
అదే -ఒకే ఒక్కడు. ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్న శంకర్ స్ట్రాటజీ ఏమై ఉంటుందబ్బా!?
*
చెన్నైలో విద్యార్థులు, బస్ డ్రైవర్ల మధ్య తలెత్తిన వివాదం కుల ఘర్షణలకు దారితీస్తుంది. ఘర్షణలు తారాస్థాయికి చేరడంతో జనజీవనం స్థంభిస్తుంది. తన కులం, తన పార్టీకి చెందిన ఆందోళనకారులను అరెస్ట్ చేయొద్దంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే (రఘువరన్) పోలీసులను వైర్‌లెస్ సెట్ మెసేజ్‌లో కట్టడి చేస్తాడు. అది -క్యూటీవీ న్యూస్ రిపోర్టర్ (అర్జున్) కెమెరాకు చిక్కుతుంది. తరువాత ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చిన సందర్భంలో -‘మేకవనె్న పులి’ బండారాన్ని బయటపెట్టడం సంచలనమవుతుంది. ఇద్దరి మధ్యా లైవ్‌లో సాగిన ఇంటర్వ్యూ సంవాదంలో నిగ్రహాన్ని కోల్పోయిన సీఎం -‘ఒక్కరోజు తన సీట్లో కూర్చుంటే తెలుస్తుంద’ని చాలెంజ్ విసురుతాడు. అనివార్య పరిస్థితుల్లో చాలెంజ్‌ను స్వీకరిస్తాడు అర్జున్. చట్టంలోని వెసులుబాటు ఆధారంగా ఒక్కరోజు సీఎం స్థానంలో కూర్చున్న కథానాయకుడు -అదే చట్టంలోని నిబంధనలను సక్రమతీరున ప్రయోగించి సెనే్సషన్ క్రియేట్ చేస్తాడు. ప్రతినాయకుడి ప్రతిబంధకాలను తిప్పికొడుతూనే -అపసవ్య పాలనను గాడినపెడతాడు. 24 గంటల్లో చేతల్లో చూపిన ప్రజాభీష్ట పాలనతో జనహృదయాన్ని, మరోపక్క ప్రియురాలి మనసు గెలిచి -‘ఒకే ఒక్కడు’ అవుతాడు.
*
20 పంక్తుల కథను రెండు గంటల రన్‌టైమ్‌తో స్క్రీన్‌పై రీళ్లురీళ్లుగా పరిగెత్తించాడు దర్శకుడు శంకర్. -‘పొలిటికల్ థ్రిల్లర్’గా వచ్చిన సినిమా అందుకే వంద రోజులాడింది. ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ ఆదరణ సాధించింది. ప్రాంతీయ అవార్డులు కొల్లగొట్టింది. శంకర్‌ని తిరుగులేని డైరెక్టర్‌ని చేసింది. నిర్మాత (శంకర్ షణ్ముగం)కు కోట్ల లాభాలు ఆర్జించిపెట్టింది. రెండు దశాబ్దాల క్రితంనాటి సినిమాకు ఇంత ఉదోద్ఘాతం ఇప్పుడెందుకంటే -‘ఒకే ఓక్కడు’ స్క్రీన్స్‌కు వచ్చి పందొమ్మిదేళ్లయ్యింది కనుక. ’99 నవంబర్ 7న దీపావళి చిత్రంగా థియేటర్లకు వచ్చిన చిత్రానికి సీక్వెల్ తీయాలని శంకర్ అనుకుంటున్నాడు కనుక. ఇరవయ్యేళ్ల క్రితం శంకర్ దర్శకత్వ ప్రతిభే ఆ స్థాయిలోవుంటే -సాంకేతికతను దర్శకత్వానికి అనుసంధానించి ముందుకెళ్తున్న ఇప్పటి శంకర్ మెదడులో ‘సీక్వెల్’ కథ ఇంకెలా తయారవుతుందోనన్న ఆసక్తి మొదలైంది కనుక.
***
పరిస్థితి చూస్తుంటే -శంకర్ సీక్వెల్స్‌మీద పడ్డాడా? అనిపిస్తోంది. ఇకముందూ సీక్వెల్సే తీస్తాడా? అన్న ప్రశ్నలూ పుట్టుకొస్తున్నాయి. కొత్త కథలకంటే సీక్వెల్స్ మీదే శంకర్ ఎందుకు దృష్టి పెడుతున్నట్టు? అన్న డౌట్లు డామినేట్ చేస్తున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్‌కు సరైన సక్సెస్ గ్రాఫ్ లేకున్నా -శంకర్ కొత్త సెంటిమెంట్‌కు ఎందుకు పదును పెడుతున్నట్టు? అన్న సందేహాలూ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇన్ని ‘?’ తలెత్తడానికి కారణం -ఇప్పటికే భారతీయుడు సీక్వెల్‌కు శంకర్ శ్రీకారం చుట్టాడు కనుక. రోబోకు సీక్వెల్ చేస్తున్న టైంలోనే ‘భారతీయుడు’ సీక్వెల్‌ను బుర్రకెక్కించుకున్న శంకర్ -ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ మొదలెట్టాల్సిన టైంలో ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌ను ప్రస్తావించాడు కనుక.
***
నిజానికి గొప్ప దర్శకులంతా కెరీర్‌లో తాము తీసిన హిట్టు చిత్రాలకు సీక్వెల్స్‌పై ఆసక్తి ప్రదర్శించినోళ్లే. కొందరు ఆలోచనల వద్దే ఆగిపోతే, ఇంకొందరు ముందుకెళ్లి మాడు పగులగొట్టుకున్న దాఖలాలు లేకపోలేదు. చిన్న చిత్రాలుగా వచ్చిన కొన్ని సీక్వెల్స్ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సక్సెస్ కొట్టిన దాఖలాలు ఉన్నాయేమోగానీ, స్టార్లతో చేసిన చిత్రాలేవీ మాతృకస్థాయి చిత్ర విజయాన్ని దాటిన సందర్భాలు లేవు. దీంతో ఒకదశలో సీక్వెల్స్‌పై అత్యుత్సాహం ప్రదర్శించిన స్టార్ డైరెక్టర్లంతా.. ఆ తరువాత వాటిని ప్రస్తావించడం మానేశారు. కోరికను కోరికలాగే అణిచిపెట్టేశారు. అయితే పెద్దఎత్తున సీక్వెల్స్ సీజన్ నడిచిన సందర్భంలోనూ -శంకర్ ఏనాడూ సీక్వెల్స్ ఊసెత్తలేదు. ‘సామాజికాంశా’లను కథలుగా మలచుకుని తన మార్క్ చిత్రాలు తీశాడే తప్ప, సీక్వెల్స్‌పై ఆసక్తిని ప్రదర్శించలేదు. అందుకే -రోబోకు సీక్వెల్ చేస్తున్నట్టు శంకర్ ప్రకటించినపుడు ఇండస్ట్రీ విస్మయానికి గురైంది. సూపర్‌స్టార్ రజనీని కొత్తగా చూపించి భారీ విజయం అందుకున్న రోబోకు సీక్వెల్ చేయడం అసాధ్యమేనన్న చర్చలేపింది. అయితే శంకర్ స్టయిల్ వేరు. అతని మనస్థత్వాన్ని అంచనా వేయడం కష్టమే. చాలెంజ్‌నుంచే సక్సెస్ అందుకోవాలన్న శంకర్ తపన -2.ఓగా అనూహ్య విజయాన్ని అందించింది.
‘రోబో’ చిత్రానే్న గమనిస్తే -సినిమాటిక్ ఈక్వెషన్స్‌తో కథ సిద్ధం చేసుకుని నాయకానాయికలుగా అనూహ్య కాంబినేషన్‌ను (రజనీ -ఐశ్వర్యరాయ్)ను స్క్రీన్‌మీద చూపించడంతోనే శంకర్ సక్సెస్ కొట్టాడు. మర మనిషికి మనసుపెట్టి మానవ మేథకు కొత్త ఆలోచన పుట్టించి -దటీజ్ శంకర్ అనిపించుకున్నాడు. నిజానికి శంకర్ తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్లే అనలేం. అతని ఖాతాలో ఫ్లాపులు సైతం బలంగానే ఉన్నాయి. అలా రోబో తరువాత తీసిన రెండు చిత్రాలూ శంకర్ ఉనికినే ప్రశ్నించే స్థాయిలో దెబ్బతిన్నాయి. హిందీలో వచ్చిన ‘3 ఇడియట్స్’ను ‘స్నేహితుడు’గా రీమేక్ చేసి పరాజయాన్ని ఎదుర్కొంటే, విక్రమ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తీసిన ‘ఐ-మనోహరుడు’ కోలుకోలేని దెబ్బకొట్టింది. ఆ పరాభవం నుంచి కోలుకోడానికి శంకర్‌కు కనిపించిన ఒకే ఒక్క మార్గం -సీక్వెల్. అందుకే అప్పటి వరకూ అతను ఆలోచించని అంశంపై దృష్టి పెట్టి రోబో సీక్వెల్‌కు శ్రీకారం చుట్టాడు. ఏ రోబో కోసం సినీ టెక్నాలజీని ఔపోసన పట్టాడో -అదే టెక్నాలజీ సాయంతో భారీ విజయాన్ని అందుకోవాలనుకున్నాడు. ఎలాగూ ‘సామాజిక కోణం’ అనే పేటెంట్ కానె్సప్ట్‌ను అలవాటు చేశాడు కనుక -మొబైల్ స్క్రీన్‌లో ఇరుక్కున్న ప్రపంచానికి కొత్త కథ చెప్పాలనుకున్నాడు. అదే రోబో 2.ఓ. భారీ బడ్జెట్టు, ఆధునిక సాంకేతికత కలబోతతో కథ చెబితే -ఆడియన్స్ వినోదానికి అంతుండదని ఇప్పటికే రుజువైన సినీ సూత్రాన్ని శంకర్ ప్రయోగించాడు. 2.ఓ చిత్రం ఎలాంటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా విడుదలకు ముందే సీక్వెల్ సక్సెస్‌ను రుచి చూసిన శంకర్ -2.ఓ విడుదలకు ముందే ‘భారతీయుడు’ని ప్రకటించడం ఇక్కడ కొత్త ట్విస్ట్. నిజానికి 2.ఓతో తనకు ఇష్టులైన రజనీ, కమల్‌ను ఒకే స్క్రీన్‌మీద చూపించాలన్న శంకర్ ప్రయత్నం ఫలించలేదు. ‘కాకాసుర’ పాత్రకోసం కమల్‌ను కలిసినా అయిష్టత చూపటం, ‘ఇండియన్’పై ఆసక్తి ప్రదర్శించటం గ్రేట్ డైరెక్టర్‌కు గ్రేట్ ఇన్సిడెంట్ అయ్యింది. దాంతో అప్పటి వరకూ ఊగిసలాటలోవున్న ఇండియన్ -2 సీక్వెల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆగమేఘాల మీద ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం, నాలుగేళ్ల 2.ఓ కష్టం నుంచి సేదతీరకుండానే -ఈ డిసెంబర్ నుంచే ఇండియన్ 2 రెగ్యులర్ షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకోవడం జరిగిపోయాయి. 2.ఓ షూటింగ్ మధ్యలో ‘ఇండియన్-2’ను ప్రకటిస్తే -ఇప్పుడు ఇండియన్-2 మొదలెట్టక మునుపే ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌ను ప్రకటించడం శంకర్ ఇస్తోన్న మరో ట్విస్ట్.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సక్సెస్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. పైగా ‘నాయక్’ పేరుతో బాలీవుడ్‌లోనూ రీమేక్‌తో భారీ విజయాన్ని అందుకున్నాడు శంకర్. అర్జున్‌కు ‘ఒక్కరోజు ముఖ్యమంత్రి’ ఇమేజ్ ఇచ్చిన శంకర్ -ఈ సీక్వెల్‌నూ పొలిటికల్ థ్రిల్లర్‌గానే డిజైన్ చేయకతప్పదు. అయితే ప్రజెంట్ పాలిటిక్స్‌లో ఏ అంశాన్ని కథ చేసుకుంటాడన్నదే ఆసక్తిరేపుతోన్న అంశం. అయితే ఒకే ఒక్కడు చిత్రం చేసిన అర్జున్ అర్జాకు ఇప్పుడంత మార్కెట్ లేదు. అందుకే -సీక్వెల్‌లో రజనీ లేదా కమల్ అయితేనే మంచిదన్న అభిప్రాయాన్నీ ఆమధ్య శంకర్ బయటపెట్టాడు. ఒకవేళ ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ -యంగ్ హీరోను డిమాండ్ చేస్తే మాత్రం తప్పకుండా విజయ్‌తో సినిమా చేస్తానంటూ శంకర్ ఇప్పటికే డైలాగ్ వదిలాడు. దీనివెనుకా పెద్ద స్ట్రాటజీ లేకపోలేదన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయాలపై అంతర్లీనంగా ఆసక్తి చూపుతున్న హీరో విజయ్ -పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ‘సర్కార్’ సంతృప్తికరమైన ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా గత రెండేళ్లలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కథలు, సీఎం నేపథ్య కథలపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆసక్తి చూపిస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని -అటు తమిళం, ఇటు తెలుగు, పైగా ఓవర్సీస్‌లోనూ పెద్ద మార్కెట్‌వున్న విజయ్‌తోనే ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో విజయ్ సైతం సామాజిక కోణాన్ని ప్రతిబింబించే కథలతోనే ముందుకెళ్తున్నాడు. ఈ ఈక్వెషన్సన్నీ వర్కౌటై -విజయ్ ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి పట్టపగ్గాలు ఉండవన్నది మరో విషయం.
ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి పెద్ద నిర్మాత దీపక్ ముకుట్ ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌పై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. మరోపక్క కథను తయారు చేసే బాధ్యతను బజరంగీ భాయిజాన్, బాహుబలి లాంటి హిట్టు స్టోరీలు రచించిన సక్సెస్‌ఫుల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించే అవకాశాలు లేకపోలేదనీ అంటున్నారు.
గ్రాఫ్ మారుస్తాడా?
నిజానికి దక్షిణాది చిత్ర సీమలో ‘సీక్వెల్స్’ సక్సెస్ గ్రాఫ్ ఏమంత క్షేమకరం కాదన్నది ఇప్పటికే అనేక సినిమాలు రుజువు చేశాయి. ఒక్క తెలుగు వరకూ చూసుకున్నా జగపతిబాబు హీరోగా గాయం తరువాత గాయం -2 వికటించింది. చిరంజీవి హీరోగా శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఇచ్చిన సంతృప్తికర ఫలితం శంకర్‌దాదా జిందాబాద్ ఇవ్వలేకపోయింది. ఆర్యతో సెటిల్డ్ హీరో అనిపించుకున్న బన్నీ, ఆర్య-2తో మెప్పించలేకపోయాడు. రామూ తీసిన రక్తచరిత్ర గొప్ప చిత్రంగా నిలిస్తే -రక్తచరిత్ర-2 సోదిలోకి లేకుండా పోయింది. దీంతో చిత్రపరిశ్రమలో సీక్వెల్స్ సేఫ్ బెట్ అన్న మాటకు అర్థం చెరిగిపోయి -చేతులు కాల్చుకోవాలంటే సీక్వెల్స్ తీయాలనే నమ్మకాలు బలపడిపోయాయి. అంతేకాదు, రజనీకాంత్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన వెంకటేష్ నాగవల్లి, పవన్ గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్‌గా వచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్, రవితేజ కిక్‌కు సీక్వెల్‌గా వచ్చిన కిక్-2, జెడీ చక్రవర్తి చిత్రం మనీకి సీక్వెల్‌గా వచ్చిన మనీ మనీ మనీ, మంత్ర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన మంత్ర-2.. ఇలా ముందు వెనుకల్లో వచ్చిన సీక్వెల్స్ అన్నీ నిర్మాతలకు చెమటలు పట్టించినవే. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారి లారెన్స్ తీసిన ‘కాంచన’, ‘ముని’, ‘గంగ’లాంటి సీక్వెల్స్ మాత్రమే ఆడియన్స్‌ను మెప్పించగలిగాయి. సీక్వెల్స్ దెబ్బతింటాయన్న నమ్మకాల్ని 2.ఓతో పటాపంచలు చేశాడు శంకర్. సూపర్ స్టార్‌ను సీక్వెల్‌లోకి దించి -్భరీ బడ్జెట్‌తో తెరకెక్కించిన 2.ఓతో అనూహ్య విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఇండియన్-2, ఒకే ఒక్కడు సీక్వెల్స్‌కు సిద్ధమవుతున్న శంకర్ -గ్రాఫ్‌నే మార్చేస్తాడా? అన్న ఆసక్తి పెరుగుతోంది.
శంకర్ హిట్టు చిత్రాల్లో ఇంకా ఏవేం సీక్వెల్స్‌కు తీయొచ్చన్న విషయాన్ని పరిశీలిస్తే -98లో తీసిన జీన్స్ హిట్టందుకున్నా, కుటుంబ కథే అవుతుంది తప్ప సామాజికాంశాన్ని అందులో ఇమడలేదు. 93లో అర్జున్ అర్జానే హీరోగా జెంటిల్‌మేన్ చిత్రాన్ని -వైద్య విద్య బ్యాక్‌డ్రాప్ పెట్టి చేశాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి కనుక, దాని సీక్వెల్ ఇప్పుడు వర్కౌట్ కాకపోవచ్చు. 94లో ప్రభుదేవా హీరోగా వచ్చిన ప్రేమికుడు ఓ లవ్ స్టోరీ. 2003లో తెచ్చిన బోయ్స్ యూత్ ఎంటర్‌టైనర్. పైగా యావరేజ్. 2007లో తెచ్చిన శివాజీ అట్టర్ ఫ్లాప్. రీమేక్ స్టోరీ స్నేహితుడు, విక్రమ్‌తో చేసిన మనోహరుడు ఫ్లాప్ రిజల్టే ఇచ్చాయి. ఇక 2005లో విక్రమ్ హీరోగా చేసిన అపరిచితుడు ఓ బ్లాక్‌బస్టర్ హిట్టు ఉంది. దీనికీ శంకర్ సీక్వెల్ ప్రకటిస్తాడేమో చూడాలి.
హాలీవుడ్‌లో..: సీక్వెల్స్ మీద సీక్వెల్స్ చేయడం హాలీవుడ్‌కు అలవాటైన స్టయిల్. హిట్టయిన చిత్రాలన్నీ సిరీస్‌లుగా వస్తూనే ఉంటాయి. ఏళ్లపాటు సిరీస్ సినిమాలను తీస్తున్న నిర్మాణ సంస్థలూ అక్కడ కనిపిస్తాయి. ది హ్యాంగోవర్, టేకెన్, ట్రాన్స్‌ఫార్మార్స్, ఎవాన్ అల్మైటీ, సన్ ఆఫ్ ది మాస్క్, స్పీడ్, హన్నీబాల్, ఎగ్జార్సిస్ట్, ద గ్రెడ్జ్, ద రింగ్, బేసిక్ ఇన్‌స్టింక్ట్.. అలాగే సూపర్ హీరోస్ సిరీస్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని.
తెలుగులో..:
తెలుగులోనూ కొన్ని చిత్రాలున్నాయి. నిజానికి వాటికి సీక్వెల్స్ తీస్తే హిట్టుకొట్టగలవన్న నమ్మకాలూ ఉన్నాయి. అయినా, దర్శకులు ధైర్యం చేయలేకపోవడానికి అనేక కారణాలు. ఉదాహరణకు: చిరంజీవి ‘జగదేకవీరుడు -అతిలోక సుందరి’ ‘టాగూర్’, వెంకటేష్ ‘క్షణక్షణం’, సూపర్‌స్టార్ కృష్ణ ‘గూఢచారి 116’, నాగార్జున ‘హలోబ్రదర్’, మోహన్‌బాబు ‘పెదరాయుడు’, శ్రీకాంత్ ‘ఖడ్గం’, మహేష్‌బాబు ‘పోకిరి’, నాని ‘ఈగ’, రవితేజ ‘విక్రమార్కుడు’.. ఈ చిత్రాలు సీక్వెల్స్ తీయతగ్గ చిత్రాలే. సీక్వెల్స్ కోసం వీటిపై కొన్ని ఆలోచనలు, ప్రయత్నాలు సాగినా.. మొదలైన చోటే ఆగిపోవడం గమనార్హం.
***
ఏదేమైనా డైరెక్టర్ శంకర్ గ్రేట్ ‘ట్విస్ట్’లు ఇస్తున్నాడు. సీక్వెల్స్‌పై ఆసక్తిని పెంచే ప్రయత్నాలకు పదును పెడుతున్నాడు. చూద్దాం.. కొత్తగా ఇంకెవరెవరు ఇంకెలాంటి సీక్వెల్స్‌కు సిద్ధమవుతారో.

-శ్రీనివాస్