మెయన్ ఫీచర్

‘కామ్రేడ్ల సర్కారు’కు కష్టకాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది ఆరంభంలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు మార్క్సిస్ట్ (సీపీఎం) పార్టీ కేరళలో ఘోర పరాజయాన్ని పొందబోతున్నదని రాజకీయ పండితులు అపుడే జోస్యం చెపుతున్నారు. ఇది భారతీయ జనతాపార్టీ కల్పించిన కట్టుకథ కాదు. కేరళలో వామపక్ష కూటమి బలహీనపడి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేరళలో ఓసారి లెఫ్ట్ ఫ్రంట్, మరోసారి కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు చాలా కారణాలున్నాయి. సీపీఎం నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ దుందుడుకు ధోరణి, హత్యా రాజకీయాలు, వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో అవకతవకలు వామపక్ష ప్రభుత్వానికి ‘మైనస్ పాయింట్లు’గా మారే అవకాశం ఉంది. మరోవైపు సీపీఎం అగ్రనేతలు ప్రకాశ్ కారత్, ఏచూరి సీతారాంల మధ్య నాయకత్వ పోరు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నడుమ ఆధిపత్య పోరు, శబరిమల ఆలయం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విజయన్‌కు శాపాలుగా మారే ప్రమాదం ఉంది. ‘అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడ్డ సీపీఎం కార్యకర్తలపై కేసులు నమోదుచేయవద్దు’- అని పోలీసు ఉన్నతాధికారులకు స్వయంగా ముఖ్యమంత్రి విజయన్ వౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
కొచ్చిలో సీపీఎంకు చెందిన అభిమన్యు అనే విద్యార్థి సంఘ నాయకుడిని ముస్లిం లీగ్ ఉగ్రవాదులు హత్యచేసినా ముస్లిముల ఓట్లుపోతాయనే భయంతో విజయన్ నిస్సహాయంగా ఉండిపోయారన్న ఆరోపణలున్నాయి. బిషప్ ఫ్రాంకో ములక్కల్ మూడు దశాబ్దాలుగా క్రైస్తవ సన్యాసినుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నా అతనికి బెయిల్ రావడం వెనుక లెఫ్ట్ ఫ్రంట్ హస్తం ఉందట! ఈ మధ్య మరో సంఘటన జరిగింది. జిహెచ్ యతీశ్‌చంద్ర అనే పోలీసు అధికారికి (నీలక్కల్) కేరళ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఎందుకో తెలుసా? ‘రైట్ వింగ్’ మహిళా నాయకురాలు కె.పి.శశికళ (హిందూ ఐక్యవేదిక అధ్యక్షురాలు)ను శబరిమల వద్ద అరెస్టు చేసినందుకు యతీశ్‌చంద్రకు లబ్ధి చేకూరింది. చెప్పులు ధరించి శబరిమల ఆలయం వద్దకు వచ్చిన తృప్తి దేశాయ్, న్యూయార్క్ టైమ్స్ మహిళా విలేఖరికి ముఖ్యమంత్రి ఆదేశాలపై రక్షణ కల్పించటం చూచి కేరళ ప్రజలు విస్తుపోయారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరుపై జనంలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాలు, లెఫ్ట్‌ఫ్రంట్ 4 స్థానాలు గెలుచుకోబోతున్నట్లు పలు సర్వేల్లో తేటతెల్లమైంది.
***
మనం బ్యాంకుల్లో వెయ్యి రూపాయలు దాచుకుంటే సంవత్సరానికి డెబ్బది రూపాయలు మాత్రమే వడ్డీ వస్తుంది. కాని నాలుగువందల శాతం వడ్డీ ఎక్కడా రాదు. మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్‌లో విలేఖరుల సమావేశంలో- ‘400 శాతం వడ్డీ’ రహస్యమేమిటో వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన ఆస్తుల గణాంకాలను కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. 2009లో కేసీఆర్ ఆస్తికోటి యాభై లక్షల రూపాయలట! 2014 నాటికి నలభై ఒక్క కోట్లు అని కాంగ్రెస్ వారు అంటున్నారు. విదేశాలలో ఏయే బ్యాంకుల్లో తెరాస అధినేత ఆస్తులు ఉన్నాయో తమకు తెలుసునని కాంగ్రెస్ నేత జితేంద్రప్రసాద్ వెల్లడించారు. ఇందులో నిజం ఎంత?
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ‘ప్రజాకూటమి’ అధికారంలోకి వస్తే ఆ డబ్బు మొత్తం భారత్‌కు తెప్పిస్తామంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ వాగ్దానం చేశారు. బతుకమ్మ చీరల పంపిణీ, అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ ఉత్సవాల పేరుతో కొన్ని కోట్ల ధనం దారి మళ్లిందని కూడా ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు సహజమే. వాటిని సాక్ష్యాధారాలతో నిరూపించినప్పుడే ప్రామాణికత ఉంటుంది. కేసీఆర్ ఆస్తులు 400 శాతం పెరిగాయని రాజకీయ కోణంలో చేసిన ఆరోపణల్లో నిజమేమిటో కాంగ్రెస్ నాయకులకే తెలియాలి. ఒకటి మాత్రం నిజం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దాదాపు 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అప్పులు చేయటం తప్పుకాదు. ఆ ధనం దుర్వినియోగం కానపుడే పథకాలకు సార్ధకత ఉంటుంది. తమకంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయని టిఆర్‌ఎస్ వాదిస్తున్నది. ప్రపంచ బ్యాంక్ దగ్గర భారత ప్రభుత్వం అప్పులు చేసింది. అప్పులు ఎవరు చేసినా, వాటిని సకాలంలో తీర్చకుంటే ముప్పుగా మారుతుంది. అప్పులు తీరుస్తూ, పథకాలను అమలు చేయడం తెరాస సర్కారుకు నిజంగా కత్తిమీద సాము వంటిదే.
***
దక్షిణ కొరియా సరిహద్దులలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. దీనిని పత్రికలు కాని సోషల్ మీడియా కాని అంతగా పట్టించుకోలేదు. ఉత్తర కొరియాకు చెందిన సరిహద్దు గస్తీదళం సైనికుడు ఉన్నట్లుండి దక్షిణ కొరియా భూభాగంలోకి ప్రవేశించాడు. తిరిగి ఉత్తర కొరియాలోకి వెళ్లడానికి అతడు నిరాకరించాడు. ఈ చిన్న సంఘటనకు ప్రాధాన్యం ఏముంది? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కొరియా ఒకప్పుడు అఖండంగా ఉండేది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కొరియాను రెండుముక్కలు చేశారు. ఉత్తర కొరియాపై చైనా పట్టు బిగించగా, దక్షిణ కొరియాపై అమెరికా ఆధిపత్యం పెరిగింది. సరిగ్గా ఇది ఉభయ జర్మనీల విభాగం వంటిదే. తూర్పు జర్మనీ కమ్యూనిస్టుల స్వాధీనంలో ఉండగా, పశ్చిమ జర్మనీ ఐరోపా దేశాలకు సన్నిహితమయింది. ఉభయ జర్మనీలు ఏకమైనరోజున నేను మూనిచ్ నగరంలో ఉన్నాను. ‘రెండు జర్మనీలు కలియటం మాకు సంతోషమే కాని దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్న తూర్పు జర్మనీని మాలో కలుపుకోవటం ద్వారా ఆర్థికంగా మేము దివాలా తీస్తున్నాము’అని జర్మనీ ప్రజలు అన్నారు. సారాంశం ఏమంటే- ఉత్తర కొరియాలో కిమ్ నేతృత్వంలో ప్రజలు నియంతృత్వంలోను, దరిద్రంలోను మగ్గుతున్నారు. ఇది తూర్పు జర్మనీ, ఉత్తర కొరియాలకే కాదు అన్ని కమ్యూనిస్టు దేశాలకు వర్తిస్తుంది. రష్యా విచ్ఛిత్తికి అక్కడ ఆర్థిక సంస్కరణల యుగం- గోర్బచేవ్ తర్వాత వచ్చిన గ్లాసోనాట్ పరిణామాలు ప్రధాన కారణం. అంటే ఎక్కడ నిరంతర పోరు, ఆందోళన, అరాజకం, కమ్యూనిజం ఉంటుందో అక్కడ గర్భ దరిద్రం ఉంటుందనేది ఒక ప్రధాన సూత్రం. బెంగాల్, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఇందుకు ఉదాహరణలు చూడవచ్చు. దక్షిణ కొరియా సైనికుని ‘చొరబాటు’ వెనుక కనబడని చరిత్ర చాలా ఉంది.
***
‘నేనేం తప్పు చేశాను? ననె్నందుకు కేసీఆర్ తిడుతున్నాడు?’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రశ్నించారు. చంద్రబాబు వల్లనే సైబరాబాదు మరొక సిలికాన్ వాలీగా మారిందనేది వాస్తవం. ఆయన వల్లనే కొన్ని వేలమందికి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. ఈ కోణంలో చూస్తే- కొత్త ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికలను కేసీఆర్ అంతగా చేపట్టలేదు. యాదాద్రి ఆలయ నిర్మాణానికి వేల కోట్లు ఇస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయా? తిరుపతి వెంకన్నకు వజ్ర కిరీటాన్ని కేసీఆర్ గతంలో ఎందుకు ప్రభుత్వ ధనంతో ఇచ్చినట్లు? వేములవాడ రాజన్న, విజయవాడ దుర్గమ్మకు కానుకలు ఇవ్వటం సరే. కాని రోడ్డుమీద అరటిపండ్లు అమ్ముకునే కరీం భాయి, జానీమియా, యాదమ్మ, యశోద వంటి పేదల బతుకులు 2014లో ఎలా ఉన్నాయో 2018లోనూ అలాగే ఉన్నాయి. అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి. ఇదీ విపక్షాల ప్రధాన ఆరోపణ.
చంద్రబాబు ఏ తప్పులూ చేయలేదని, ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పాలన అంతా సజావుగా జరుగుతోందని ఎవరూ అనరు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదిపై ఆవిర్భవించిన తెదేపాను ఈరోజు సోనియా గాంధీ పాదాల చెంత చంద్రబాబు ఉంచారని ఎంతోమంది ఆరోపించారు. కాంగ్రెస్, తెదేపాల కలయికతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభించిందని, ఈ కారణంగానే తెలంగాణ ఎన్నికల్లో బాబుకు పరాభవం ఎదురైందని మరికొందరు సూత్రీకరిస్తున్నారు. కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు వల్ల తెదేపా భారీ మూల్యం చెల్లించింది. గతంలో సోనియాను, కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసిన చంద్రబాబు ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలిపారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా అవకాశాలకు గండికొట్టే అవకాశం ఉందన్న అంచనాలు జోరందుకుంటున్నాయి.
***
కాలం ఇంద్రజాలం.. మిత్రులు శత్రువులవుతారు.. ఓడలు బండ్లు అవుతాయి.. నాస్తికులు భజనలుచేస్తూ శ్రీరంగానికి పోతారు.. నిన్నటి వరకు గొంగళిని భుజాన వేసుకొని భూస్వాములు దురంతాలను- తన గీతాలతో గెంతులతో ఎండగట్టిన ‘ప్రజాగాయకుడు’ గద్దర్ తన కుటుంబ సమేతంగా కాంగ్రెస్‌కు మద్దతు పలకడం విడ్డూరం. మావోయిస్టుల విప్లవోద్యమ ప్రచారకుడు, పరిచారకుడు ప్రొఫెసర్ కోదండరామ్ సైతం రాహుల్, సోనియాలకు ఎలా పాదాక్రాంతం అయినాడు? ‘ఇటలీ దయ్యం’ అంటూ ఎవరిని తిట్టారో ఆ వ్యక్తికి చెందిన పార్టీతో చంద్రబాబు ఎందుకు జత కట్టినట్టు? ఈస్టిండియా కంపెనీ వలస రాజకీయాల నుండి ఇప్పటికీ బయటపడలేని దుస్థితిలో- ఇండియా మళ్లీ అమెరికా మాల్స్‌కు, చైనా సెల్‌ఫోన్లకు ఎందుకు మార్కెట్ కల్పించింది? ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ చెప్పిన అఖండ భారత్ నినాదం ఎక్కడా వినపడటం లేదేమిటి? కమ్యూనిస్టు పతాకంపై ఒకప్పుడు ఎన్నికలలో విజయం సాధించిన నల్గొండ, ఖమ్మం ఎర్రదండు దొరల గడిలోకి ఎందుకు జారిపోయింది? మహాత్మా గాంధీకి ఒక జత కొల్లాయి బట్టలు ఉండేవి. కానీ నేడు ఆయన పేరును నామాంతంలో ధరించినవారికి కనీసం పది విదేశీ బ్యాంకుల్లో రహస్య ఖాతాలున్నాయి. ఎంత విడ్డూరం?
***
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇటీవల పౌర హక్కుల సంఘం వారు ఒక సభ నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్, చంద్రశేఖర్, పొత్తూరి వెంకటేశ్వరరావు, చుక్కా రామయ్య ప్రభృతులు ఇందులో పాల్గొన్నారు. ఈ సభలో కొందరు వక్తలు మాట్లాడుతూ, చంద్రబాబు పరిపాలన నియంతృత్వాన్ని గుర్తుకు తెస్తున్నదని పేర్కొన్నారు. ‘విరసం’ నాయకుడు వరవరరావును పూణె పోలీసులు అరెస్టు చేయటం దుర్మార్గం అన్నారు. ప్రధాని మోదీని హత్య చేయాలని వ్యూహరచన చేసిన మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారన్న అభియోగంపై వరవరరావుపై తప్పుడు కేసులు పెట్టారని వక్తలు నిరసించారు. ఇటీవల విశాఖ ఏజెన్సీలో ఇద్దరు ప్రజానాయకులను మావోయిస్టులు కాల్చి చంపినప్పుడు పౌర హక్కుల సంఘాలు ఏ విధంగానూ స్పందించలేదు. సంతాపసభ పెట్టలేదు. ఎందుకని? పోలీసులకు, ప్రజాప్రతినిధులకు పౌరహక్కులు ఉండవా? కేవలం ఉగ్రవాదులకే పౌర హక్కులు ఉంటాయా?
పాతికేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఒక నరహంతకునికి సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధిస్తే, అతనిని విడిపించాలంటూ సీపీఎం నేత ఏచూరి సీతారాం అర్ధరాత్రి న్యూఢిల్లీలో ఆందోళన చేశారు. పౌరహక్కుల సంఘం, మానవ హక్కుల సంఘం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం తదితర సంస్థల పేర్లతో అర్బన్ మావోయిస్టు సానుభూతిపరులు నగరాలలో ఉద్యమాలు నడుపుతున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఐకమత్యం శూన్యం. ‘అరుణోదయ’ విమలక్క పౌరహక్కుల సమావేశంలో పాల్గొనగా, ఆమె భర్త గద్దర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతునిచ్చాడో ఆలోచింపవలసిన విషయం. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య సామరస్యం లేదు. ఇటీవల చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం ఎలా పరస్పరం ఎన్నికల సమయంలో విమర్శించుకున్నారో అంతా చూచారు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్