మెయిన్ ఫీచర్

ఆమె సందేశాలు నిత్య స్ఫూర్తిదాయకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ 22న దివ్య జనని శ్రీ శారదామాత 165వ జయంతి

శాంతి కోరితివా తల్లి స్వాంతమందు
చూడు నీ తప్పు పరులది చూడవద్దు
అన్యులెవ్వరు లేరు నీకవనియందు
ఎల్లలోకము నీదె గావించుకొనుము
పరుల దోషాలను చూసేవారు చండాలురు. నిజ దోష దర్శనం దైవంతో సమానం. ‘తేనెటీగలా జీవించు’ ఆమె అంటూ, ఎలా? వేప చెట్టులో అన్నీ చేదే. ఈ దోషాన్ని విస్మరించి తేనెటీగ వేపు పువ్వులో ఉన్న తేనెనే గ్రహిస్తుంది. అంతటి ఉదార స్వభావం గలవారికి యావత్ ప్రపంచం స్వకుటుంబమే- ఇంతటి ప్రేమమయి సందేశాన్ని ప్రపంచానికి అందించిన ఆమె ఎవరో కాదు దివ్య జనని శ్రీ శారదామాత!
వంగ (పశ్చిమబెంగాల్) రాష్ట్రంలోని బాంకురా జిల్లాలో జయరాంబాటి అనే కుగ్రామంలో 1853 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు పేదవారైనప్పటికిని భక్తినిష్టాతత్పరులు. శ్రీ శారదాదేవికి తన ఆరవ ఏటనే శ్రీరామకృష్ణునితో పెండ్లి జరిగింది.
శ్రీ శారదాదేవి భర్తతో గడపడానికి కొన్నాళ్ల తర్వాత దక్షిణేశ్వరానికి కొత్తగా వచ్చిన రోజున శ్రీరామకృష్ణుడామెను ప్రశ్నిస్తాడీవిధంగా.
‘‘నన్నీ సంసార కూపంలోకి దింపడానికివచ్చావా?’’
‘‘లేదు లేదు, మీరెన్నుకున్న పారమార్థిక మార్గంలో మీకు సహకరించడానికి వచ్చాను’’ అన్న శ్రీ శారదాదేవి మాటలు ఒట్టి నీటి మాటలు కావు. అవి ఆమె నిష్కళంక శీలానికి నిదర్శనం. 1872 జూన్ 5వ తేదీన శ్రీరామకృష్ణులు శ్రీ శారదాదేవిని జగన్మాతగా భావించి షోడశపూజ నొనరించారు. ఈ విధంగా సర్వజీవులయందు ఆమెలో గల మాతృభావాన్ని జాగృతం చేశారు. శ్రీరామకృష్ణుల పారమార్థిక సంపదకంతటికి వారసురాలైనప్పటికి శ్రీ శారదాదేవి తన జీవితంలో కఠోర సాధనలనెన్నిటినో ఆచరించింది.
శ్రీ శారదాదేవిది నిరాడంబర జీవితము, నిస్వార్థత, మాతృవాత్సల్యం, కరుణ సాటిలేవిని. నిశ్శబ్దప్రార్థన, భక్తితత్పరతయే ఆమె జీవితం. భక్తి, కర్మ, యోగాల పరిపూర్ణ సమ్మేళనమే ఆమె జీవితము. శ్రీ శారదామాత యొక్క సత్సంకల్పంతో శ్రీరామకృష్ణ సంఘాన్ని తదుపరి మిషన్ మఠంగా ఏర్పడింది. భక్తితో సేవాగుణం ఎక్కువగా కన్పడేది. శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందిన తరువాత 34 సం.ల సుదీర్ఘకాలం రామకృష్ణ మహోద్యమంలో ఆమె పాత్ర అమోఘమైనది. తన వద్దకు వచ్చినవారికి వారిలో అట్టడుగు వర్గాల వారుండేవారు. వారిని చేరదీసి వారితో కలిసిమెలిసి వుండటమే గాక తనే స్వయంగా వడ్డించి వారి విస్తర్లను తనే తీసేవారు. మానవత్వానికి ప్రతీక శ్రీ శారదామాత!
శ్రీమాతృదేవి శారదామాత 1920 జూలై 20న కలకత్తాలో మహాసమాధి పొందారు.
‘‘తండ్రి కృపకంటే తల్లి కృప నాకు కోటి రెట్లు మాన్యమైనది. శారదామాత అనుగ్రహం, ఆశీస్సులు నాకు వరప్రసాదాలు’’-స్వామి వివేకానంద

‘‘ఆదర్శ హిందూ స్ర్తిత్వాన్ని గురించిన శ్రీరామకృష్ణుని చివరి మాట శ్రీ శారాదేవియే’’- సోదరి నివేదిత
శ్రీ శారదామాత ఉపదేశములు:
- నాయనా, ఓర్మి వహించడము సద్గుణము. దీనికి సమానమైనది వేరేమీ లేదు.
- తృప్తిని మించిన సంపద లేదు. కష్టాలను సహనంతో ఎదుర్కొనడం కంటె మించిన సద్గుణము లేదు.
-కోరికలే వద్దని భగవంతుని ప్రార్థించాలి. ఎందుకంటే మన దుఃఖానికి కోరికలే మూల కారణము. మోక్షానికి అవరోధములు.
- సర్వము మనస్సుపై ఆధారపడి యున్నది. పరిశుద్ధమైన మనస్సు కలిగివుంటే అన్నీ సాధించినట్లే. సాధకునికి గురు కృప.
- తగిన సమయంలోనే మనస్సే నీకు గురువవుతుంది.
- మనశ్శాంతి కావాలంటే పరుల దోషాలు ఎంచవద్దు. దానిబదులు నీలోని దోషాలు చూసుకో! సరిచేసుకో!
- దుఃఖం కూడా భగవంతుని వరప్రసాదమే.
- ఇతరుల విషయాలలో కుతూహలం కనబరచకు.
- భగవంతుణ్ణి, భగవద్భక్తులను ధనికులు ధనంతో సేవించాలి. పేదలు భగవన్నామస్మరణ రూపంలో ఆయనను అర్చించాలి.
- ఎంత చిన్న పనినైనా గౌరవ భావంతో చేయాలి.
- ఎంత చిన్న వస్తువునైనా తృణీకర భావంతో చూడరాదు.
- భగవంతుడు నీ నుండి కోరేది నిజాయితీ, నమ్మకము, ప్రేమ. అంతేకాని ముఖస్తుతి కాదు.
దివ్య జనని శ్రీ శారదామాతా సందేశాలు నిత్య స్ఫూర్తిదాయకాలు. శ్రీ శారదాదేవి నిత్య ప్రాతఃస్మరణీయురాలు.

-వేదుల జనార్దనరావు 9502469464