మెయన్ ఫీచర్

స్వజాతీయ స్ఫూర్తికి ‘రాఖీ’ కట్టరా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైసలను రక్షించుకున్నట్టయితే రూపాయలు సహజంగా రక్షితవౌతాయి- అన్నది జనజీవనంలోని లోకోక్తి. చిన్న చిన్న సంస్కారాలను రక్షించుకున్నట్టయితే సం స్కారాల సమాహారమైన సంస్కృతి సురక్షితం కావడం కూడ హైందవ జాతీయ జీవనంలో వికసించిన యుగయుగాల వాస్తవం. చైనీస్ ఫుడ్, అంకుల్ షామ్ చిప్స్, నెజల్ నూడుల్స్, క్యాడ్బరీ చాక్లెట్లు- ఇవన్నీ వేరువేరు దుకాణాలలో లభించడం రెండేళ్ల క్రిందటి మాట... ఇప్పుడవన్నీ ‘వాల్‌మార్ట్’ అన్న అమెరికావారి దుకాణంలోనే లభిస్తున్నాయట. పైసలు లేవు కాబట్టి ఒక్కొ క్క రూపాయికి విలువ లేదు కాబట్టి వందరూపాయల నోట్లను చెల్లించి ఈ విదేశీయ వస్తువులను కొని భోంచేస్తున్నాము. ఆర్థిక వ్యవస్థకు రక్షణ ఎందుకు ఉండాలి? ‘‘మన దేశం వస్తువులకు ఇతర దేశాల వస్తువులకు అసలు తేడా ఏమిటి?? ఏవి నచ్చితే అవి కొంటాము..’’అంటున్న వారికి సమాధానం చెప్పాలన్న ‘ఆసక్తి’కి రక్షణ ఏది? చెప్పగల ‘శక్తి’కి అసలే రక్షణ లేదు. ఆసక్తి, శక్తి మానవీయ వౌలిక సంస్కారాలు. వీటికి రక్షణ కావాలి. వీటికి రక్షణ లేదు కనుకనే మనదేశానికీ ఇతర దేశాలకూ మధ్య తేడా తెలియని మేధావులు విస్తరించిపోతున్నారు. ఈ తేడా తెలియడం జాతీయ సంస్కారం.. తేడా తెలియజెప్పడం కోసమే కలియుగం 5007వ సంవత్సరం-క్రీస్తుశకం 1905-1906-వ సంవత్సరంలో బ్రిటన్ దోపిడీ మూకలకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమాన్ని భారతీయులు జరిపిఉన్నారు. లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి మహనీయులు దురాక్రమణ దారుల లాఠీల దెబ్బలు తిన్నారు. ఈ తేడా చెప్పడం కోసమే మహాత్మాగాంధీ దండి యాత్ర జరిపాడు. ఉప్పును తయారు చేశాడు. ఈ జాతీయ స్మృతులకు రక్షణ లేనితనం దాపురించి ఉంది అందువల్లనే ఉప్పును తయారు చేసే సముద్రతీర క్షేత్రాల శ్రామికులు పనికోల్పోయి వలస పోతున్నారట. సాంస్కృతిక వ్యవస్థకు రక్షణ కలిగితే ఆర్థిక వ్యవస్థకు రక్షణ కలుగుతుంది..కానీ ‘‘చేత వెన్నముద్ద’’ పట్టుకొని ‘‘చెంగల్వ పూదండ’’ ధరించిన చిన్ని కృష్ణు ల బొమ్మలు చైనా నుండి లక్షల కొలదీ దిగుమతి అయిపోయాయి.. ‘‘దేవుడి గదిలో నిరంతరం వెలిగించడానికి ‘జీరో’ బల్బు కావాలి..’’ అని అడగండి. దుకాణదారు డు యాబయి లేదా అరవయి రూపాయలు పుచ్చుకొని అందమైన బల్బునిస్తున్నాడు. దీపం వెలగగానే అందమైన చిన్ని కృష్ణుని బొమ్మ ఉజ్వలంగా భాసిస్తుంది. ‘‘బాగుంది కానీ ‘జీరో’ బల్బు ధర అరవై రూపాయలనడం బాగాలేదు..తగ్గించాలి!’’ అన్న వినియోగదారునికి, ‘‘తగ్గదండీ, ఇది చైనా నుంచి వచ్చింది!’’ అన్నది దుకాణం యజమాని చెబుతున్న సమాధానం. ‘‘ఇది చైనా నుంచి వచ్చిందా? అయితే మాకు వద్దు..’’ అని తిప్పికొట్టడం జాతీయ సం స్కారం. ఈ సంస్కారానికి ఇప్పుడు రక్షణ కా వాలి. కావున ‘‘ఆహా చైనా నుంచి దిగుమతి అయిందా?’’ అని గొప్ప ఆశ్చర్యాన్ని అభినయించి కొనుక్కొని వెడుతున్న వారి సంఖ్య విస్తరించిపోతోంది. రక్షణను ఎవరు ఎవరికి కల్పిస్తున్నారు? ఈ జాతీయ సంస్కార రక్షణ హస్తానికి రక్షణ సూత్రాన్ని ‘‘బంధించేదెవరు?’’ రంగురంగుల, వనె్నల చినె్నల, జిలుగుల వెలుగుల రాఖీల ను కూడ చైనా ఎగుమతి చేస్తోందట. ఇది కలియుగం 5118వ సంవత్సరం...శ్రావణమాసం పున్నమినాటి ముచ్చట ఇది..
ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో మెట్రోరైలు మార్గం ఏర్పడింది, ఏర్పడుతోంది, రైళ్లు పరుగులు తీయడమే తరువాయి. మెట్రో రైలు స్టేషను వరకు ఇళ్లనుండి జనం వెళ్లాలి. ఇళ్లనుండి రైలు స్టేషన్లకు కనీసం ఒక కిలోమీటరు దూరం ఉంటుంది. మూడు నాలు గు కిలోమీటర్లు ఇంకా ఎక్కువ దూరంలో ఉండే ఇళ్ల గురించి, ఆ ఇళ్లలోని జనం గురించి, మెట్రో యాజమాన్యాల వారు పట్టించుకున్న ట్టు లేదు. ఎక్కిన ప్రయాణికులు తమ కార్యాలయాలకు సమీపంలోని స్టేషన్లలో రైలు దిగుతారు. అందువల్ల ఇళ్లనుండి ఏక్కే రైలు స్టేషను వరకు, దిగే స్టేషన్ల నుండి ప్రయాణికులు కా ర్యాలయాల వరకు వెళ్లడానికి వీలుగా మెట్రో యాజమాన్యం వారు సైకిళ్లను సమకూర్చనున్నారట. మెట్రో రైళ్లలో నియతంగా ప్రయాణించేవారికి, రైలు ఛార్జీల పత్రాలను కొనుగోలు చేసేవారికి ఈ సైకిళ్లను సమకూర్చనున్నారట. ఇంటి నుంచి స్టేషన్‌కు రావడానికి ఒకటి, స్టేషన్ నుంచి కార్యాలయాలకు కదలి వెళ్లడానికి మరొకటి-తలా రెండు సైకిళ్లు-తిరుగు ప్రయాణంలో కూడ ఆ రెండు సైకిళ్లు ఈ మెట్రో రైల్ ఫేర్ కార్డులను కొన్నవారికి ఉపయోగపడతాయి. కార్డులు కొననివారు కేవలం టిక్కెట్లు మాత్రం కొనేవారు రైలు దిగి తమ గమ్యాలకు నడిచి వెడతారు. అలా సమీపంలోని బస్సుస్టాండ్ వరకు నడుస్తారు. ఆటోరిక్షాలు, ఉబర్, ఓలా వంటి బహుళ జాతీయ వాణిజ్య దళారీల కారులు-వీటిని ‘క్యాబ్’లు అని అనాలని అమెరికా వాళ్లు ఆదేశించారు, మనం శిరసావహిస్తున్నాము- ఎలాగూ ఉంటాయి. కానీ నియతం గా ప్రయాణించే వారికి మాత్రం సైకిళ్లు లభిస్తాయి. ఈ సైకిళ్లు జర్మనీ నుంచి దిగుమతి కా వడం, ఈ రైలు ప్రస్థాన ప్రహసనానికి ముక్తాయింపు. రైలు పెట్టెలు ఇంజన్లూ మన దేశంలో తయారు చేయలేరన్నది బహుళ జాతీయ వాణిజ్య సంస్థల-మల్టీ నేషనల్ కంపెనీల- కామందుల నిర్ధారణ. కనీసం సైకిళ్లు కూడ మనదేశంలో తయారు కావా? సెల్‌ఫోన్లు వచ్చిన తరువాత ‘టెలిగ్రాముల’ను మరచిపోయినట్టు క్యాబ్‌లు వచ్చిన తరువాత సైకిళ్లను తయారు చేయడం మనం మరచిపోయామా? లేక మనదేశపు సైకిళ్లు మెట్రో రైలు ప్రయాణం స్థాయికి పనికిరావా? ఎవరు అడగాలి? అడగడం జాతీయ సంస్కారం. స్వదేశీయ ఆర్థిక వ్యవస్థను విదేశీయపు గునపాలతో తవ్వి ధ్వంసం చేస్తున్న వికృతి నుంచి రక్షణ కల్పించమని రాఖీ కట్టే చెల్లెళ్లు కట్టించునే అన్నలను అడగగలరా?
క్రీస్తుశకం 1940వ దశకంలో బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరం ద్విముఖంగా ఊపందుకుంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ నాయకత్వంలోని సాయుధ సమరం తొలి విజయాలను సాధించింది. శ్రీరామ్ అన్న జాతీయ విప్లవకారుడు తలను కోడిగుడ్డువలె నున్నగా గీయించుకొని, మీసాలు పెంచేసి బ్రిటన్ వారికి వ్యతిరేకంగా సాయుధ సమరం జరిపినట్టు ఆర్‌కె నారాయణ్ వివరించాడు. ఆర్కే నారాయణ్ రచించిన ఆంగ్ల నవల ‘మహాత్ముని అనుమతి కోసం’- వెయిటింగ్ ఫర్‌ది మహాత్మా -లో ఈ శ్రీరామ్ కథానాయకుడు. మహాత్మాగాంధీ ఉద్యమంలోను, నేతాజీ సమరంలోను సవ్యసాచివలె పాల్గొన్న శ్రీరామ్ ఆ తరువాత జైలుకు వెళ్లి చిత్రహింసలు అనుభవించాడు. జైలుకు వెళ్లడానికి ముందు బ్రిటన్ వ్యతిరేక సమరంలో భాగంగా విధ్వంసకాండ సృష్టించాడు. మాల్‌గుడి సమీపంలోని ‘మెంపి’ కొండలలో సంచరించి స్వదేశీయ తత్వాన్ని ప్రచారం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధం కోసం మన చెట్లను నరికి బ్రిటన్ దోపిడీ దారు లు కలపను తరలించుకొని పోవడాన్ని నిరసించాడు. చెట్టును కౌగలించుకొని తనను నరికిన తరువాతనే చెట్టును కొట్టాలని సత్యాగ్రహం చే శాడు. వందల ఎకరాల ఆటవీ భూములలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని కాఫీ, టీ తోటలను ఇతర తోటలను పెంచిన తెల్లదొరల ఇళ్ల వద్దకు వెళ్లి వనసీమలు మారుమోగే విధం గా ‘‘్భరత్‌ను విడిచి వెళ్లిపొండి’’-క్విట్ ఇం డియా-అని నినదించాడు. చంకలో రంగు తైలాలను, కుంచెలను పెట్టుకొని అటవీ ప్రాంత గ్రామాలలో తిరిగి గోడలపై ‘క్విట్ ఇండియా’ అని రాశాడు. ఈ స్వదేశీయ సంస్కారం మిగిలిన భారతీయులలో ప్రధానంగా గ్రామీణులలో వికసించనందుకు విలపించాడు. ప్రస్తు తం ఈ సంస్కారం నాగరికులలో అడుగం టిపోయి ఉండడం చరిత్రకు పునరావృత్తి..
అలా తిరిగిన శ్రీరామ్ ఒక సాయం సమయంలో సూళూరు గ్రామానికి చేరుకున్నా డు..ఒక దుకాణం వద్దకు వెళ్లాడు. రెండు అరటి పండ్లు తిని సోడా నీళ్లు తాగాడు. ఒకటిన్నర అణా-తొమ్మిది పైసలు-చెల్లించాడు. తృప్తి చెందిన దుకాణందారుడు, ‘‘నావద్ద చాలా మంచి బిస్కెట్లు ఉన్నాయి, లండన్ నుంచి ఓడలో మద్రాసుకు వచ్చాయి. కేవలం సైనికులు తినడం కోసం వీటిని ఉత్పత్తి చేశారట..తెలిసిన దళారి ద్వారా అతికష్టం మీద ఇక్కడికి తెప్పించాను!’’ అని శ్రీరామ్‌ను ఊరించాడు.. ‘‘నిజంగా ఆ బిస్కెట్లు ఇంగ్లాండులోనే తయారయ్యాయా?’’ అని శ్రీరామ్ ప్రశ్నించాడు. ‘‘అవును కావాలంటే ఎక్కడైనా పరీక్ష చేయించుకోవచ్చు.. మొదటిరకం మేలైన ఇంగ్లండు బిస్కెట్లు..ఆని ధీమాగా చెప్పాడు. ‘‘నీకు సిగ్గు లేదా. ఇంగ్లాండు వారి వస్తువులను బహిష్కరించాలన్న ఉద్యమం దేశమంతా జరుగుతోంది. నువ్వు ఆదేశంలో తయారైన వస్తువులు అమ్ముతావా? ఆ బిస్కెట్లను తీసి బయట పారేయి..’’ అంటూ శ్రీరామ్ గద్దించాడు! ‘‘ఎవడివయ్యా నువ్వు, దౌర్జన్యం చేస్తున్నావు. నడు ఆవలకు..’’ అని దుకాణం వాడు కూడ మరింత గట్టిగా అరిచాడు. వెంటనే దుకాణం దారుడికి జ్ఞానోదయం అయింది. ‘‘ఓహో తెలిసింది, నువ్వు గాంధీ మనిషివి.. మీవల్ల లేనిపోని గొడవలు జరుగుతున్నాయి!’’ అని అన్నాడు. జనం గుమికూడారు. శ్రీరామ్ దుకాణం ముందు పడుకొని సత్యాగ్రహం మొదలుపెట్టాడు. విదేశీయ వస్తువులన్నీ పడేసేవరకు దుమ్ములోనే పడివుంటానని శ్రీరామ్ ప్రతిజ్ఞ చేశాడు. సరుకులు కొనడానికి వచ్చిన వారితో ‘‘ఈ దుకాణంలో కొనకండి’’ అని శ్రీరామ్ బతిమాలుతున్నాడు. ఒక మహిళ ‘ఒకటిన్నర పైసలకు’ ఉప్పు కొనడానికి వచ్చింది. ‘‘నేను త్వరగా వెళ్లాలి. లేకపోతే పొయ్యిమీద పులుసు ఆవిరి అయిపోతుంది, మాడిపోతుం ది..’’ఆమె శ్రీరామ్‌ను ప్రాథేయపడింది. ‘‘మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఎందుకో తెలుసా?’’ అని ఆమెను శ్రీరామ్ అడిగాడు. ‘‘ఎందుకు సామీ?’’ అని ఆమె అయోమయం గా అడిగింది. ‘‘స్వరాజ్యం కోసం, స్వరాజ్యం వస్తే ఉప్పు దండిగా వస్తుంది.’’ ఈ డబ్బుకు ఇంత ఉప్పు వస్తుందా?’’ అని ఆమె కళ్లు పెద్దవి చేసి చేతులలో పరిమాణాన్ని నిర్దేశించింది.
ఇప్పుడు స్వరాజ్యం వచ్చి ఏడు దశాబ్దాల కాలమైంది. స్వదేశీయుల ఉప్పుకు మాత్రం రక్షణ లభించడం లేదు. ఉప్పు తయారు చేసే యజమానులు-కార్మికులు-వేలాదిమంది ఆం ధ్రప్రదేశ్‌లో ఉపాధిని కోల్పోతున్నారట. ఉప్పు కు రక్షణ కావాలి. ఉప్పు నుంచి అప్పడాల వర కు సకలవిధ ఆహారాన్ని బహుళజాతి సంస్థ లు బొక్కేస్తున్నాయి..రక్షించేదెవరు??
మాతృభూమి విలపిస్తోంది..పరిసరాలు విలపిస్తున్నాయి, ప్రకృతి విలపిస్తోంది, జాతీ య హృదయం విలవిలలాడుతోంది. గతంలో ఐరోపావారు దేశమంతటా రాజకీయ సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వైపరీత్యానికి ప్రాతిపదిక ఐరోపా సంస్థలు ఏర్పాటు చేసిన వాణిజ్య సామ్రాజ్యాలు...అప్పుడవి రెండు, మూడు, నాలుగైదు! ఇప్పుడు బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు దేశమంతటా ‘‘ప్ర త్యేక ఆర్థిక సామ్రాజ్యాల’’ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడివి వందలు, వేలు! స్వజాతీయ సంస్కారానికి ఎవరు రక్షలు కడతారు..?

- హెబ్బార్ నాగేశ్వరరావు e-mail: 2013hebbar@gmail.com