మెయిన్ ఫీచర్

వివక్షతోనే విద్య దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులైన విద్య, ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ అందాలి. కానీ ఆడపిల్లల విద్య విషయానికి వచ్చేసరికి వివక్ష వచ్చేస్తుంది. ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. వారికి త్వరత్వరగా ఇంట్లో పనులను నేర్పించేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంట్లోంచి పంపించేయాలని చూస్తారు తల్లిదండ్రులు. అమ్మ స్వతహాగా ఒక మహిళ అయి కూడా, తమ బిడ్డ స్వతంత్రంగా పెరగాలని, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని కోరుకోదు. ఇంట్లో పనులను నేర్చుకుని త్వరగా మెట్టినింటికి వెళ్లాలని కోరుకుంటుంది. అందుకనే చాలామంది ఆడపిల్లలు చదువుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు. తల్లిదండ్రులకు భయపడి పుస్తకం వైపు కూడా చూడటం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో గత పదేళ్లలో ఆడపిల్లల చదువు విషయంలో ఎటువంటి మార్పూ లేదని, లక్షల మంది బాలికలు ఇప్పటికీ పాఠశాల మొహం కూడా చూడలేకపోతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి. అరవై కోట్లమంది విద్యార్థులు స్కూలుకు వెళ్తున్నా, వాళ్లక్కడ ఏమీ నేర్చుకోవడం లేదని, అనేక దేశాల్లో విద్యా ప్రమాణాలు మరీ తీసికట్టుగా మారాయనీ ఐక్యరాజ్యసమితి స్పష్టం చేస్తోంది. ఒక పక్కన అభివృద్ధి చెందిన దేశాల్లో ఆడపిల్లలు చదువుల్లో దూసుకెళ్తున్నారు. మరో పక్క పేద దేశాల్లో బాలికలు పాఠశాల మెట్లెక్కడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల చదువుకి ఏమాత్రం అనుకూలంగా లేని టాప్ టెన్ దేశాల జాబితాను ‘వన్ క్యాంపైన్’ అనే సంస్థ రూపొందించింది.
జాబితాలో ఉన్న దేశాల్లో ఎక్కువ శాతం పేదరికం, పౌష్టికాహారలోపం, అనారోగ్య పరిస్థితులూ, అంతర్గత యుద్ధాల వంటి సమస్యలతో సతమతమవుతున్నవే.. ఈ పరిణామాలన్నీ కలిసి ఆ దేశాల్లో ఆడపిల్లలను చదువుకు పూర్తిగా దూరం చేస్తున్నాయి. అక్కడ బాలికలను పాఠశాలకంటే పనులకు పంపించడానికే తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంకొందరైతే చిన్న వయసులోనే వారికి పెళ్లిళ్లు చేసి చదువుకోవాలన్న వారి కోరికపై నీళ్లు జల్లుతున్నారు. ప్రాథమిక విద్య, హైస్కూల్, కాలేజీల చదువు పూర్తిచేసిన అమ్మాయిలు, ఆడవాళ్ల అక్షరాస్యత శాతం, టీచర్లూ విద్యార్థుల నిష్పత్తి, విద్యారంగంలో పెట్టుబడులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆడపిల్లల చదువుకు అనుకూలంగా లేని దేశాల జాబితాను సిద్ధం చేసింది ఆ సంస్థ. సిరియా వంటి కొన్ని దేశాలకూ ఆ జాబితాలో చేరే అవకాశం ఉన్నా, సరిపడా గణాంకాలు లేని కారణంగా వాటిని చేర్చలేదు.
ఆ దేశాలు ఇవే..
సౌత్ సూడాన్
ఆరేళ్ల క్రితం స్వాతంత్య్రాన్ని సాధించిన ఈ చిన్న దేశం అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. యుద్ధం, హింస కారణంగా ఇక్కడ ఎన్నో స్కూళ్లు నేలమట్టమయ్యాయి. ఇక్కడ మూడొంతుల మంది ఆడపిల్లలు కనీసం ప్రైమరీ స్కూల్లో కూడా అడుగుపెట్టలేదు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
ఈ దేశంలో ప్రతి ఎనభై మంది విద్యార్థులకు ఒక టీచరే ఉన్నారు. అక్కడ చదువు చెప్పని కారణంగా చాలామంది విద్యార్థులు బడి వైపే చూడటం లేదు.
నైగర్
ఈ దేశంలో పదిహేను, ఇరవై నాలుగు మధ్య వయసున్న యువతుల్లో పదిహేడు శాతం మందే చదువుకున్నారు. మిగిలిన ఆడపిల్లలు ఇంటి పనులకు పరిమితమవ్వడమో, పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లడమో జరుగుతోంది.
ఆఫ్గనిస్థాన్
ఇక్కడ లింగ వివక్ష ఎక్కువ. ఫలితంగా తండ్రులు ఆడపిల్లలను చదువువైపు దృష్టి సారించనివ్వడం లేదు.
చాద్
ఇక్కడ సామాజిక, ఆర్థిక పరిమితుల కారణంగా ఆడపిల్ల చదువుకోవడం చాలా కష్టం. ఆడపిల్లను బడికంటే పనులకే ఎక్కువ పంపుతారు.
మాలి
ఈ దేశంలో కేవలం 38 శాతం అమ్మాయిలే ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నారు.
గినియా
ఇక్కడ పాతిక సంవత్సరాలు దాటిన మహిళలు సగటున ఏడాది పాటు కూడా చదువుకోలేదు.
బర్కినా ఫాసో
ఇక్కడ కేవలం ఒక్క శాతం బాలికలు మాత్రమే హైస్కూలు విద్యను పూర్తిచేస్తున్నారు. ప్రాథమిక విద్యలోనే చాలామంది చదువును మానేసి ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.
లైబీరియా
ఈ ప్రాంతంలో దాదాపు మూడులో రెండొంతుల మంది బాలికలు ప్రాథమిక విద్యకు కూడా దూరమయ్యారు. సరిగ్గా అక్షరాలు కూడా నేర్చుకోలేదు ఇక్కడి ఆడపిల్లలు.
ఇథియోపియా
ఇక్కడ ప్రతి ఐదుగురిలో ఇద్దరికి పద్దెనిమిదేళ్లలోపే పెళ్లి చేస్తున్నారు. దాదాపు అన్ని దేశాల్లోనూ సరిపడా టీచర్లు లేకపోవడం ప్రధాన సమస్య. ఆడపిల్లలు చదువుకి దూరమయ్యే కొద్దీ ప్రపంచం పేదరికానికి దగ్గరవుతూనే ఉంటుందన్నది ‘వన్ క్యాంపైన్’ సంస్థ అభిప్రాయం. ఇప్పటికీ 13 కోట్ల మంది ఆడపిల్లలు స్కూళ్లకు దూరంగానే ఉన్నారు. అంటే.. వీరిలో ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారులు, టీచర్లు, రాజకీయ నేతలు వంటి ఎంతోమంది సేవల్ని ప్రపంచం కోల్పోనుంది.