మెయిన్ ఫీచర్

ఆ బంధం..అపురూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోదరి సహాయం మరువలేను
అవి మద్రాసు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్మాలజీలో నాకు ఇంజనీరింగ్ సీటు వచ్చిన రోజులు. ఫీజు చెల్లించటానికి, అక్కడ చదవటానికి వెయ్యి రూపాయలు కావల్సి వచ్చింది. అది నాన్నకు తలకుమించిన భారం. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. నా సోదరి జొహరా బంగారు గాజులు, గొలుసు తాకట్టుపెట్టి ఆ వెయ్యి రూపాయలు సమకూర్చింది. తదనంతరం స్కాలర్‌షిప్‌గా వచ్చిన డబ్బుతో వాటిని విడిపించి తెచ్చి ఇచ్చాను.
మాజీ రాష్టప్రతి, అబ్దుల్ కలామ్

***

శ్రావణమాసం వచ్చిందంటే అక్కాచెల్లెళ్ళూ, అన్నాతమ్ములూ ఎదురుచూసేది శ్రావణ పౌర్ణమి కోసం అంటే వెనె్నల కుప్పలు పోసుకోను కాదు సుమా, ఆ రోజున వచ్చే రక్షాబంధన్ కోసం. ఇది సోదరీ సోదరుల పండుగ. తమ సోదర ప్రేమను చాటే రోజు ఈ పండుగకు వారం పది రోజుల ముందునుంచే రంగు రంగుల దారాలతో తయారుచేసిన అందమైన రక్షాబంధనాలు మార్కెట్లో దర్శనమిస్తాయి. దీనే్న రాఖీ అంటారు. దీనిలోని రంగుల దారాలు అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ముచ్చటైన గుర్తులు.
ఈ రాఖీలను వారు పరమ పవిత్రంగా భావిస్తారు. ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో సైతం ఉన్న అన్నా చెల్లెళ్ళను ఈ రాఖీ మళ్లీ కలుపుతుంటుంది. స్వదేశం విడిచి దూర ప్రాంతాల్లో ఉంటే పోస్టులోనైనా రాఖీ పంపి తమ ప్రేమను చాటుకుంటారు అప్పాచెల్లెళ్ళు. అన్నతమ్ములకు సోదరి పంపిన రాఖీ చూస్తే సోదరుల మనస్సు ప్రేమా మమకారాలతో నిండిపోతుంటుంది. సోదరుడు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని సోదరి ఆశిస్తూ సోధరునికి తన హృదయంలోని ప్రేమను రాఖీలో నింపి పంపుతుంది. స్వదేశంలో ఉంటే అవకాశాన్ని బట్టి ఇద్దరూ ఎవరో ఒకరి ఇంట్లో కలిసి సోదరి సోదరుని చేతికి రాఖీ కట్టి తీపి తినిపిస్తుంది. సోదరుడు ప్రతిగా తన సోదర ప్రేమను సోదరికి మంచి బట్టలు కానీ మరేదైనా ఆమెకు ఇష్టమైన బహుమతి ఇచ్చి చాటుకుంటాడు.
భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా చీడపీడలూ, అనారోగ్యాలూ, దుష్ట ప్రేత పిశాచ బాధలు తమ దరికి రావని విశ్వాసం ఉంది. సోదరులు రాఖీ కట్టేప్పుడు అప్పచెలెళ్ళు ఈ శ్లోకాన్ని చదువుతారు.
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభి బధ్నామి రక్షే మా చల మా చల
రక్షాబంధనంలో శ్రీ మహావిష్ణు శక్తి ప్రవేశించి తమ సోదరులను కాపాడుతుందని నమ్మిక.వ
మొగలాయి చక్రవర్తుల కాలంనాటి ఒక సంఘటన కూడా చరిత్రలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టతను సమకూర్చింది. చిత్తూరు మహారాణి కర్ణావతి, గుజరాత్ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నపుడు తమ కోట రక్షణలో సహకరించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయున్‌కు రక్షాబంధనాన్ని పంపి కోరిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమికొట్టాడని, ఆనాటినుంచి సోదరీ సోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం పండుగ ఒక ఆచారంగా వచ్చిందని అంటారు.
రాఖీల వ్యాపారం ఎందరికో ఉపాధి!
ఈ రాఖీలు తయారుచేయడం ఒక గొప్ప వ్యాపారంగా మారి ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. మంచి ఖరీదైన వింతైన రాఖీ కడితే సోదరులకు అంత రక్షగా ఉంటుందని సోదరీమణులు భావిస్తున్నారు. కొందరు వారి శక్తి చాటుకుంటూ ఖరీదైన బంగారు వెండి రాఖీలను కడితే మధ్య తరగతివారు సాధారణమైన రాఖీలను కొని కడుతున్నారు. కొందరు స్వయంగా రాఖీలు తయారుచేసి తమ ప్రియతమ సోదరులకు కడతారు. మార్కెట్లో అనేక స్థాయిల రంగుల రాఖీలు దర్శనమిస్తున్నాయి.
జంధ్యాల పూర్ణిమగానూ...
ఆత్మీయతానురాగాలకు ప్రతీక ఈ రాఖీ పండుగ. ఒకరికి మరొకరు నీకు మేమున్నాం అనే భావనను, తోడున్నామనే భరోసాను సోదర సోదరీమణులు పరస్పరం తెలుపుకునేదే ఈ రాఖీ పండుగ. ఇకపోతే ఈ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజున తన జంధ్యాలను మార్చుకుంటారు. శాస్త్రోక్తంగా పాత జంధ్యాలను తీసివేసి కొత్తవాటిని ధరిస్తారు. ఆ సమయంలో ఈ ప్రార్థన చేస్తారు.
యజ్ఞోపవీతం పరమ పవిత్రం
ప్రజాపతేర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్య్రం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః
కొత్త యజ్ఞోపవీతానికి పూజ చేసి, పాతది తీసివేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్నాననుసరించి ఇలా ఈ పండుగ పేరు జంధ్యాల పూర్ణిమగా కూడా వాడుకలోకి వచ్చింది.
వివిధ రాష్ట్రాలలో.. విభిన్నంగా..
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అంటే కొబ్బరికాయలు కొట్టి పూజించే రోజు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్లి పూజలు చేసి కొబ్బరికాయలను కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా నార్ల పూర్ణిమ, నార్ణీపూర్ణిమ అని వాడుకలోకి వచ్చింది.
హయగ్రీవ జయంతిగానూ
ఇక శ్రీ మహావిష్ణువు తమ హయగ్రీవావతారంలో జరిగిన ఒక సంఘటనను కూడా ఈ సందర్భంలో చెప్పుకోవడం ఉచితం. పూర్వం ఒకసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి అమిత తీవ్రంగా తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన దేవి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆ రాక్షసుడు తనకు మరణం లేకుండా చేయమన్నాడుట. ఐతే ఆమె అది అసాధ్యమని చెప్పగా హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడుట వాడు. ఆమె ఆ రాక్షసుడిని అలా అనుగ్రహించి అంతర్థానమైందిట. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు త్రగించేవాడుట. దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని అంతమొందించను నిరంతర యుద్ధంలో పోరాడుతున్నా ఫలితం లేకపోయిందట. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసటతో ఆ బాణం అగ్రభాగాన తలవాల్చి నిద్రపోయాడుట. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదుట. ఐతే దేవతలంతా ఒక ఆలోచన చేసి, వమ్రి అనే ఒక కీటకాన్ని ఆ ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పి పంపారుట. అలా కొరికతే ఆ తాడు వదులై విల్లు కదిలి విష్ణువుకు మెలకువ వస్తుందనీ ఆయన తిరిగి ఆ రక్కసునితో యుద్ధం చేస్తాడనీ వారి ఆలోచన. ఐతే ఆ పురుగు తాడును కొరగానే దేవతలు ఊహించిన విధంగా వింటికి వున్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎగిరి ఎక్కడో పడిపోయిందట. దేవతలు అంతా వెదికి ఆ తల కనిపించక బ్రహ్మదేవుని ప్రార్థించగా, ఆయన వచ్చి వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడట. అపుడు దేవి ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పగా, దేవతలు అలా చేశారుట. ఆ హయగ్రీవం అంటే గు ర్రపు తల అతికిన విష్ణుమూర్తిలో మళ్లీ జీవం వచ్చి లేచాడుట. ఆ లేచిన రోజే శ్రావణపూర్ణిమ. ఆ తర్వాత హ యగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా సంహరించాడుట. అం దుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపటం జరుగుతున్నది.
ఇలా శ్రావణ పూర్ణిమను రాఖీపూర్ణిమగానూ, జంధ్యాల పూర్ణిమగానూ, హయగ్రీవ జయంతిగానూ ఇంకా ఎనె్నన్నో రకాల పండుగగా జరుపుకోవడం తరతరాలుగా వస్తున్నది.

‘‘దివిలో దేవతలు, భువిలో మానవులు ధూళిలో కలిసినా అన్నాచెల్లెళ్ల జన్నబంధాలు నిత్యమై నిలుచునులే’’ అని అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అపురూపంగా మలచిన ఈ సినిమా పాట వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. ఒకే ఇంట పుట్టి కష్టాలనూ, సుఖాలనూ కలసి పంచుకునే ఈ బంధానికి ఏదీ సాటిరాదు.
నట్టింట నడియాడిన చిట్టిచెల్లెలు సుఖంగా జీవించటానికి, ఆ బతుకు తుదివరకు సాగేలా అన్న
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అపుడే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సుగంధం అద్దినట్లవుతోంది.
***

రక్షాబంధన్ పండుగ దేశమంతానే కాక విదేశాల్లో సైతం
ఉత్సాహంగా జరుపుకుంటారు. చెల్లెలు లేక అక్క రాఖీ కట్టిందంటే సోదరుని మేలు, సుఖం
కోరుకుంటూ అన్ని కాలాల్లో సర్వదా తనకు రక్షణ సోదరుని నుంచి కోరడం అన్నమాట. సోదరునికి అన్నివేళలా రక్షణ కలిగించమని భగవంతుని ప్రార్థిస్తూ కుడి చేతి మణికట్టుకు రాఖీని పట్టుదారంతో కట్టి సోదర అనుబంధాన్ని గుర్తు చేయడమే రక్షాబంధన్
గొప్పతనం.
**

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

-హైమా శ్రీనివాస్