మెయిన్ ఫీచర్

పుకార్లను కాదు.. సంతోషాన్ని పంచుకుందాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మెసేజ్ మనకు దిశానిర్దేశం చేస్తుంది..
ఓ మెసేజ్ మనకు మంచి సందేశాన్ని అందిస్తుంది..
ఓ మెసేజ్ మనలోని మానవత్వాన్ని తట్టిలేపుతుంది..
ఓ మెసేజ్ చేరుూ చేరుూ కలిపి ఓ ప్రాణాన్ని నిలబెట్టమని కోరుతుంది..
ఇలాంటి మంచి పనులకు వేదికైన వాట్సాప్‌లలోనే..
ఓ మెసేజ్ భయాన్ని పంచుతోంది..
ఓ మెసేజ్ మతకల్లోలాన్ని రేపుతోంది..
ఓ మెసేజ్ అల్లర్లని పెంచుతోంది..
ఓ మెసేజ్ ప్రాణాలకు సంకటంగా మారుతోంది..
మంచి ఉన్నచోటే చెడు ఉంటుందనే మాట సహజమే.. కానీ ఒక మెసేజ్ ఇతరులకు సంకటంగా మారుతుంది అని తెలిసిన వెంటనే దాన్ని షేర్ చేయకుండా డెలిట్ చేయడం మంచిది. లేకపోతే ఆ చెడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందో.. తెలియదు.. నకిలీ సందేశాలు, ఫేక్‌న్యూస్‌లను అరికట్టేందుకు వాట్సాప్ ఎంచుకున్న నినాదం ఇది. దీనిలో భాగంగా యూజర్లకు అవగాహన కల్పించేలా పలు ప్రాంతీయ భాషల్లో పత్రిక, టీవీ ప్రకటనల్ని విడుదల చేసింది. ఎందుకంటే.. నకిలీ వార్తల కారణంగా దేశవ్యాప్తంగా పలు అల్లర్లు, దాడులు చోటు చేసుకుంటూ మనుషుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటువంటి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వాలు సోషల్ మీడియా సంస్థల్ని హెచ్చరించటంతో పాటు, నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టాలని సూచిస్తున్నాయి. నిజమేకానీ.. ఇది కేవలం వాట్సాప్ నిర్వాహకులు పూనుకుంటే సాధ్యమయ్యేది కాదు.. యూజర్లు.. అంటే మనం.. మన బాధ్యతని గుర్తెరిగినప్పుడే నకిలీ ఫార్వర్డ్‌లకు చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది.
మంచి స్నేహితులందరూ కలిసి వాట్సాప్‌లో ఒక గ్రూపును క్రియేట్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే.. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా వాట్సాప్ గ్రూపులను పంచుకుంటున్నారు. ఓ కుటుంబంలోని రమ్య అనే మహిళ తను రోజూ చేసే రుచికరమైన వంటల్ని గ్రూపులో పంచుకుంటూ సందడి చేసేది.. వంటలకు సంబంధించిన చిట్కాలు చెప్పేది. ఓ రోజు రమ్య స్నేహితురాలు షేర్ చేసిన వంటకానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కోరింది. దానికి రమ్య స్నేహితురాలు ఆ వంట గురించి తనకేమీ తెలియదని, ఎవరో పంపితే గ్రూపులో షేర్ చేశానని చెప్పింది. అధికారికంగా ధ్రువీకరించని సమాచారం ఏదైనా ఇతరులతో ఇలా పంచుకోవడం సరైనది కాదని.. ఎవరైనా ఆ వంటకాన్ని ప్రయత్నించి అనారోగ్యం పాలైతే ఎవరు జవాబుదారీ అని ప్రశ్నించింది రమ్య. ఇలా చెప్పడమే కాదు వెంటనే ఆ వంట మెసేజ్‌ని డెలిట్ చేసింది. మొదట రమ్య స్నేహితురాలు చిన్నబుచ్చుకున్నా.. చివరికి వాస్తవాన్ని అంగీకరించింది.
* షేర్ అవుతున్న డేటాకి రమ్య బాధ్యత వహించినట్టుగానే అందరూ ప్రవర్తిస్తే నకిలీ సమాచారం కచ్చితంగా ఫిల్టర్ అవుతుంది. ప్రభుత్వాలు కూడా నివారణకు తగిన చట్టాల్ని తీసుకొచ్చి కట్టుదిట్టంగా అమలుచేయాలి.
* ఉచితం అంటూ.. డిస్కౌంట్ ఆఫర్లనీ.. వచ్చే వాట్సాప్ మెసేజ్‌లకు స్పందించడం గానీ.. ఫార్వర్డ్ చేయడంగానీ చేయకూడదు. ఎందుకంటే.. అవన్నీ యూజర్లను బుట్టలో వేయడానికే..
* ఆన్‌లైన్ అంగళ్లలో ‘బిగ్ బిలియన్ సేల్’ అంటూ వేల ఖరీదైన వస్తువుల్ని రూ. 10, 20లకే అమ్ముతున్నట్టుగా మెసేజ్‌లు వస్తే స్పందించకూడదు. అవన్నీ ఫిషింగ్ ఎటాక్‌లే అని నమ్మండి.
* ప్రముఖ బట్టల కంపెనీలు, బూట్ల కంపెనీలు వార్షికోత్సవం సందర్భంగా అతి తక్కువకే విలువైన బూట్లు ఉచితం అంటూ మెసేజ్‌లు పెట్టి ఆ లింక్‌లను షేర్ చేస్తే.. అటువంటి ప్రమాదకరమైన ఫిషింగ్ లింక్‌లతో అవి హల్‌చల్ చేస్తున్నాయి.
* ఈమధ్య హోటల్స్, పిజ్జా కంపెనీల నుంచి కూడా ఇలాంటి ఆఫర్ల మెసేజ్‌లు వస్తున్నాయి. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు.. నాలుగు పిజ్జాలు ఉచితమనో, జంబో బిర్యానీ ఉచితమనో ఊరిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌లను క్షణం ఆలస్యం చేయకుండా తొలగించాలి.
* కేవలం రూ. 999లకే ఐఫోన్ అంటూ వచ్చే మెసేజ్‌లను చూసి అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. ఆయా లింక్‌లను చూసి క్లిక్ చేసే ప్రయత్నం అస్సలు చేయకూడదు.
* ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ‘ఈ-డొనేషన్’ లేదంటే ‘ఈ-దర్శన్’కి ప్రత్యేక రుసుము చెల్లించమంటూ వచ్చే వాటిని అస్సలు ముట్టుకోకూడదు. ఆయా లింక్‌లపై క్లిక్ చేసి చెల్లించే ప్రయత్నం చేస్తే చిక్కులు మాత్రం తప్పవు.
* న్యూ ఇయర్ కార్నివాల్ సేల్ అంటూ ఆన్‌లైన్ అంగళ్లలో డిస్కౌంట్ సేల్‌కు సంబంధించిన మెసేజ్‌లు వస్తే వాటిని అస్సలు తాకకూడదు. ఆయా లింక్‌లను తాకి అడిగిన వివరాల్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఫిషింగ్ వలలో చిక్కినట్టే..
* వాట్సాప్ అధికరంగా ధ్రువీకరించిన ఉచిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. ప్రీమియం వెర్షన్ లేదు. కానీ వాట్సాప్ ప్రీమియం వెర్షన్‌కి అప్‌డేట్ అవ్వొచ్చంటూ వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మి క్లిక్ చేసి వివరాల్ని ఎంటర్ చేయకూడదు.
* వాట్సాప్ రంగుని నీలం రంగుకో లేదంటే బంగారు వర్ణంలోకి మార్చేసుకోవచ్చంటూ వచ్చే నోటిఫికేషన్‌ను పట్టించుకోకూడదు. అధికారిక వాట్సాప్ వెర్షన్‌లో ఇలా రంగు మార్చే ఆప్షన్ అంటూ ఏదీ లేదు.
* గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే పిక్చర్ మెసేజ్, జిప్ ఫైల్స్, మల్టీమీడియా ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయకూడదు. ఎందుకంటే.. ఆయా ఫైల్స్‌ని క్లిక్ చేస్తే వెంటనే క్లిక్ చేసిన వ్యక్తి లొకేషన్, ఇతర విషయాల్ని హ్యాకర్ ట్రాక్ చేయడం సులభం అవుతుంది.
* అనాలోచితంగా ఫార్వర్డ్ చేసే మెసేజ్‌తో డేటా ఒక్కటే ఖర్చు అనుకుంటే పొరబాటే.. దాంతో పాటు విలువైన సమయం కూడా వృథా అవుతుందన్న విషయాన్ని కూడా గ్రహించాలి.
* సిగరెట్ కాల్చే వారిదే కాదు.. వారు వదిలే పొగ పీల్చేవారి ఆరోగ్యము కూడా పాడైనట్లే.. ఒకరు పంపే ఫేక్‌న్యూస్‌ల వల్ల మన సమయంతో పాటు గ్రూపులోని ఇతరుల సమయం కూడా వృథా అవుతుంది.
* గ్రూపుని నియంత్రించాలంటే ఒక్కరే లీడర్ ఉండాలి. గ్రూపంతా లీడర్లు ఉంటే కంట్రోల్ ఉండదు. గ్రూపు అడ్మిన్‌గా ఓ వ్యక్తి మాత్రమే జవాబుదారుగా ఉండాలి. అప్పుడే పంచుకునే సమాచారంపై నిఘా పక్కాగా ఉంటుంది.
* వాస్తవ ప్రపంచంలో సమాజ హితాన్ని ఎలా కోరతామో.. నెట్టింట్లోని సోషల్ లైఫ్ హితాన్ని కోరడం విధిగా అలవాటు చేసుకోవాలి. నెటిజన్‌గా అది ప్రతి ఒక్కరి బాధ్యత.
* ‘నోరు జారితే మాటని ఎలా వెనక్కి తీసుకోలేమో.. అలాగే ఏ మెసేజ్‌ని పడితే ఆ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయకూడదు. ఎందుకంటే దాన్ని మనం వెనక్కి తీసుకోలేం. ఒకరి కాంటాక్ట్ నుంచి బయటికి వెళ్లినా ఆ సమాచారం మరెందరో కాంటాక్ట్‌లకు క్షణాల్లో చేరిపోతుంది. అది కేవలం పంపించిన వారి మాటగానే.. ఓ గ్రూపులో ఫార్వర్డ్ చేస్తే ఒకేసారి 256 మందికి చేరుతుంది. ఓ అవాస్తవం వైరల్ అవ్వడం అంటే ఇదేగా..
* సోషల్ మీడియా రాకతో వార్తాంశాల్ని ఎవరికి వారే జనరేట్ చేస్తున్నారు. వ్యక్తిగతమైన వెబ్‌సైట్‌లతో తోచిందేదో రాసేస్తూ వైరల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిల్లో ఎక్కువ శాతం పుకార్లే.. అలాంటివాటిని ఎక్కువమందికి చేరేలా చేసింది వాట్సాప్ లాంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లే.. ఎవరికివారు తమ వంతు బాధ్యతగా వాస్తవాలేంటో తెలుసుకున్నాకే ఫార్వర్డ్ చేయాలి.
ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా, మానవత్వంతో మంచి మాత్రమే ఒకరి నుంచి ఒకరికి చేరవేస్తూ పోతే ప్రపంచమంతా మంచితో, మానవత్వంతో నిండిపోతుంది. ఇప్పటిదాకా ఎలా పడితే అలా మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినా.. కనీసం ఈ నూతన సంవత్సరం నుంచైనా కేవలం మంచికి మాత్రమే సోషల్ మీడియాను వాడితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.