మెయన్ ఫీచర్

చతురత లేక చతికిలపడ్డ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాదిలో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీని ఓడించి అధికార పీఠాలను కైవసం చేసుకొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం బోర్లాపడింది. ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత లేకున్నా, సహజంగానే అధికారంలో వున్న పార్టీపై వుండే వ్యతిరేకత తెలంగాణలోనూ వుంది. తెరాస అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడంతో ప్రజల్లో ఆ వ్యతిరేకత మరింత పెరిగింది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయించి ఎన్నికలకు సిద్ధమైనది మొదలు రోజురోజుకూ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందన్న వార్తలూ విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నికలు అయ్యేంతవరకూ అన్ని సర్వేలు, జాతీయ- ప్రాంతీయ సర్వేలూ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాదనే దాదాపుగా చెప్పాయి. ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్‌ఎస్ నాయకులను నిలదీసి వాగ్దానాలెందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా సరే- ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్క లగడపాటి సర్వే తప్ప అన్ని సర్వే సంస్థలు టీఆర్‌ఎస్ గెలుస్తుందనే చెప్పాయి. చివరికి అదే నిజమైంది. ఇంతకీ తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహం ఎందుకు విఫలమైనట్టు?
కొన్ని నెలల క్రితం జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికల్లో, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయాలను సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు భంగపడింది? ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొనైనా ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? ఇది స్వయంకృతమా? టీఆర్‌ఎస్‌పై ప్రజలకున్న అపారమైన నమ్మకమా? ఎవరికీ అంతుపట్టని కేసీఆర్ ఎన్నికల చాణక్యమా? అని పరిశీలిస్తే- ఇవన్నీ కారణమని అర్థమవుతుంది. ‘మహాభారతం’లో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టిన యోధానయోధుడే అయినా, ధర్మపక్షపాతే అయినా యుద్ధంలో మరణించక తప్పలేదు. కర్ణుని చావుకు ఎన్ని కారణాలున్నాయో, తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి అన్ని కారణాలున్నాయి. మహాదాత, మహాయోధుడైన కర్ణునికి ఎన్ని శాపాలున్నాయో, కాంగ్రెస్ ఓటమికీ అన్ని శాపాలున్నాయి. చాలా దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ గురించి వాడుకలో మాటొకటుంది. కాంగ్రెస్‌ను ఓడించడానికి వేరే పార్టీ అవసరం లేదు. ఆ పార్టీ నేతలు తమను తామే ఓడించుకుంటారన్నది ఆ మాట. ఇంతకీ కాంగ్రెస్ ఓటమికి గల కారణాలేంటో పరిశీలిద్దాం...
2014, 2018 ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ తాము చేసిన పనులను కూడా ప్రజలకు చెప్పలేకపోయింది. భోళాతనంతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్ల- తాము రాజకీయంగా లాభపడాలన్న విషయాన్ని కాంగ్రెస్ విస్మరించింది. తెలంగాణ బహుజనుల ప్రయోజనాల కోసమే రాష్ట్రం ఇచ్చామన్న విషయాన్ని ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటర్ల మనసుల్లోకి చొప్పించలేక పోయింది. తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చిందీ తామేనని బలహీనమైన గొంతుతో చెప్పారే తప్ప- అదెలా జరిగిందో సామాన్య జనాలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రాన్ని తేవడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్, సోనియాగాంధీలను ఒప్పించిన విషయాన్ని కూడా చెప్పలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాప్యం జరిగినా అందుకు కారణం కోస్తాఆంధ్ర నాయకులు తప్ప తాము కాదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పలేకపోయారు. తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లు పదవులనే వదులుకున్నారన్న సంగతినీ తమ ప్రచారంలో బలంగా జనంలోకి తీసుకొని వెళ్లలేకపోయారు. అంతేకాదు, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు వచ్చిన ప్రాజెక్టులను, పారిశ్రామిక ప్రగతిని, ఐటీని, విద్యాభివృద్ధిని, చారిత్రక కట్టడాలను, మిగులు బడ్జెట్‌ను, సస్య విప్లవాన్ని.. ఇంకా అనేక విషయాలను జనంలోకి తీసుకుపోలేదు. కేసీఆర్ ఆరోపణలకు జవాబులిస్తూ అతి బలహీనమైన గొంతుతో డిఫెన్సివ్‌గానే ప్రచారం కొనసాగించారు తప్ప అఫెన్సివ్‌గా ప్రచారం చేయలేదు. సోనియా, రాహుల్ గాంధీలకు తాము రాసిచ్చిన ఉపన్యాసాల్లోనూ జవసత్వాలు, ప్రాంతీయ ముద్ర లేవు. వీరి ఉపన్యాసాలు సామాన్య జనాన్ని పెద్దగా ఆకర్షించలేదు.
కేసీఆర్ సెప్టెంబర్ ఆరవ తేదీన అసెంబ్లీని రద్దుచేసి, ఎన్నికలకు తాను సిద్ధమై ఇతరులకు సమయం లేకుండా చేశాడు. సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రచార భేరిని మోగించి రాష్టమ్రంతటా వందల సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహించాడు. మరి కాంగ్రెస్ ఏం చేసింది? శాసనసభ రద్దు తర్వాత మూడు నెలల సమయాన్నైనా సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సింది. ఎన్నికల ప్రకటన వచ్చి నామినేషన్లు వేయడానికి చివరి తేదీ వచ్చేవరకూ కాంగ్రెస్ వారు సీట్ల సర్దుబాటులోనే తలమునకలయ్యారు. ఇంకా పదిహేను రోజుల్లో పోలింగ్ జరుగుతుందనే వరకూ సీట్ల పంపకంలోనే మునిగితేలారు. మరి ప్రచారం చేసేదెప్పుడు? టీఆర్‌ఎస్‌కు దీటుగా రాష్టమ్రంతటా తిరిగే అవకాశాన్ని కోల్పోయారు. సీట్లమాట ఎలావున్నా సెప్టెంబర్ ఏడు నుంచే ప్రచారం ఉధృత స్థాయిలో చేసివుంటే బాగుండేది. అదీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓ ‘విశే్లషణ విభాగం’ (అనాలసిస్ వింగ్) కానీ, ఏ విషయాన్ని ఎలా ఎక్కడికి చేరవేయాలన్న మేధోమథన విభాగం కానీ లేవు. ఎవరైనా మంచిమాటలు చెప్పినా పట్టించుకోరు. తామనుకున్న యాభై ఏళ్ల క్రితం నాటి మూస పద్ధతులతోనే గెలవాలనుకుంటారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఎదుటి పార్టీ వైఫల్యాలపై గెలవాలనుకోవడం.. పోనీ ఆ వైఫల్యాలనైనా ఓ శాస్ర్తియ పద్ధతిలో మారుమూల పల్లెటూరి ఓటరుకు చేరేలా చేయడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారు. అదే సమయంలో తామిచ్చిన బతుకమ్మ చీరలు, రైతుబంధు చెక్కులు, కంటి వెలుగు కళ్లద్దాలు, నిరంతర విద్యుత్, కల్యాణలక్ష్మి చెక్కులు, రంజాన్ బిర్యానీ భోజనాలు, గొర్రెలు, చేపల పంపిణీ, క్రిస్ట్‌మస్ బిర్యానీలు పొందినవాళ్లను గుంజుకొచ్చి మరీ ఓట్లేయించారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్ మాత్రం అసంతృప్తి వున్న ఉస్మానియా విద్యార్థులను, అమరవీరుల కుటుంబాలను కూడా ఆకర్షించలేక పోయింది.
అద్భుతమైన, ఆకర్షణీయమైన, ఆచరణ యోగ్యమైన ఎన్నికల మేనిఫెస్టోను తయారుచేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తుందని, ఇదివరకు అమలుచేసిన సంఘటనలను ఉదాహరణలు చూపి సామాన్య జనాన్ని నమ్మించడానికి విస్తృతంగా ప్రచారం చేయాల్సింది. ఆ మ్యానిఫెస్టో మారుమూల పల్లెటూరి ఓటరును చేరి నమ్మకం కలిగితే విజయం నల్లేరుమీది నడకలా కొనసాగేది. కాని మ్యానిఫెస్టో గురించి- అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడమే తప్ప దాన్ని విడుదల చేసిందిలేదు. వారం రోజుల్లో ఎన్నికలు జరిగే సమయం వరకూ మ్యానిఫెస్టో విడుదల చేయలేదు. ఆ మ్యానిఫెస్టో కూడా పార్టీ నాయకులు, మేధావుల దగ్గరే తప్ప తెలంగాణ ఓటరును చేరలేదు. చేర్చే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు మరికొన్ని అంశాలు చేర్చి టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను రాష్టమ్రంతటా విస్తృతంగా ప్రచారం చేసింది. మరి కాంగ్రెస్‌కు జనం ఎలా ఓట్లేస్తారు? మ్యానిఫెస్టోను కూడా ప్రజలకు చేర్చకుంటే ఓటేసేదెలా? రెండు నెలలకు ముందు మ్యానిఫెస్టోను విడుదల చేసి ఇంటింటికీ చేర్చితే తప్ప ఫలితాలుండవన్న అతి సామాన్య విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు విస్మరించారు.
కాంగ్రెస్ వారు తెలంగాణను ‘దొరల పాలన’ నుంచి విముక్తం చేయాలని ప్రచారం చేసారు. కాని టీఆర్‌ఎస్ ఓడిపోతే తెలంగాణ ‘దొరల పాలన’ నుండి విముక్తమై బహుజన కులాల చేతుల్లోకి వస్తుందని మాత్రం చెప్పలేదు. అందువల్ల పాలనలోకి వచ్చేది దొరే అయినప్పుడు ఏ దొరయితే ఏందన్న భావం ఓటర్లలో స్పష్టంగా కనపడింది. తాము అధికారంలోకి వస్తే అత్యధిక జనాభాగా వున్న బీసీలకు మేలైన రీతిలో పాలనలో ప్రాతినిధ్యం దక్కుతుందన్న నమ్మకాన్నైనా కాంగ్రెస్ కల్గించలేకపోయింది. ఓ దిక్కు గొర్రెలు, బర్రెలు, చేపలు, కల్లు డిపోలు, మంగలి షాపులు, చాకలి రేవులిచ్చి టీఆర్‌ఎస్ బీసీలను ఆకర్షించింది. కాంగ్రెస్ సామాజిక సమీకరణాల ప్రసక్తే లేకుండా ఎన్నికలకు వెళ్లడంతో బీసీ ఓటర్లకు దూరం కావలసి వచ్చింది. టీఆర్‌ఎస్ ఇచ్చినవి తాత్కాలిక తాయిలాలు, మేమిచ్చే గిట్టుబాటు ధరల లాంటివి శాశ్వత పరిష్కార మార్గాలని కాంగ్రెస్ బహుజనులను అర్థం అయ్యేలా చెప్పలేక పోయింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో బలంగా ఓటర్లలోకి చేరకపోవడం వల్ల, సామాజిక కోణంలోంచి ప్రచారం జరగకపోవడం వల్ల- గొర్రెలో, బర్రెలో ఇచ్చిన టీఆర్‌ఎస్సే నయమని ఆ పార్టీని బలపరిచారు తెలంగాణ ఓటర్లు.
అంతేకాకుండా తెలుగుదేశంతో పొత్తు వల్ల ఆ పార్టీ ఓటుబ్యాంకు కాంగ్రెస్‌కు బదిలీ అవుతుందనుకుంటే- చివరికి భారీ నష్టమే కల్గించింది. కేసీఆర్ బహు చాకచక్యంతో ఈ ఎన్నికలను తనకు, చంద్రబాబుకు మధ్య పోటీగా, ఆంధ్ర- తెలంగాణల మధ్య పోటీగా చిత్రించాడు. తెరాస గనుక ఓడిపోతే అన్ని ప్రాజెక్టులూ ఆగిపోతాయని, తెలంగాణపై ఆంధ్ర నేతల పెత్తనం కొనసాగుతుందని, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలిసిపోతాయని, రాష్ట్రం తెచ్చుకున్న ఫలితం ఉండదని ప్రజలను కేసీఆర్ బాగా నమ్మించాడు. చదువుకున్నవాళ్లను కూడా అలాగే నమ్మించాడు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి కేసీఆర్ మాటలను పూర్వ పక్షం చేసే చాతుర్యం, అధ్యయనం కాంగ్రెస్ వాళ్లకు లేదు. తాము కూటమిగా ఏర్పడింది కేసీఆర్‌ను ఓడించడానికేనని చెప్పారు. కానీ ఎందుకు ఓడించాలో, తాము గెలిస్తే టీఆర్‌ఎస్ కంటే భిన్నంగా ఏం చేస్తారో చెప్పలేకపోయారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయారు. వీటన్నిటికీ తోడు విపరీతమైన ధనప్రవాహం, మద్యం ప్రవాహం, ఈవీఎంల అవకతవకలు, ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణి కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేసాయి. ఏదేమైనా కేసీఆర్ ఎన్నికల వ్యూహం, ఇంటింటికీ పథకాలను తీసుకెళ్లడం, ప్రతి లబ్దిదారుడితోనూ ఓటేయించుకోవడం టీఆర్‌ఎస్‌కు విజయాన్ని చేకూర్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను, నిర్లక్ష్యం చేసిన విషయాలను సరిచేసుకుంటే తప్ప కాంగ్రెస్‌కు ఉత్తరాది రాష్ట్రాల్లోలా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమిని సోనియా, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ పరంగా చూడరాదు. ఇది ముమ్మాటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఓటమి మాత్రమే.

-డా. కాలువ మల్లయ్య 98493 77578