మెయన్ ఫీచర్

దండకారణ్యంలో ప్రశాంతత ఎండమావేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పిడికిలి బిగించాక కరచాలనం చేయలేం..’ అని అలనాడు ప్రధాని ఇందిరా గాంధీ అన్న మా టలు నేడు పాలకులకు, మావోయిస్టులకు మధ్య నెలకొన్న సంఘర్షణకు అతికినట్లు సరిపోతాయి. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మావోయిస్టులతో చర్చల ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ చర్చలు జరిగితే- ప్రభుత్వం, మావోయిస్టులు ‘పిడికిలి’ బిగించి కరచాలనం చేసేందుకు ప్రయత్నిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. తుపాకీ మోతలు, మందుపాతరల పేలుళ్లతో దద్దరిల్లుతున్న దండకారణ్యంలో శాంతి కుసుమం వికసించాలంటే అటు ప్రభుత్వం, ఇటు మావోలు చిత్తశుద్ధితో చర్చల ప్రక్రియను జరపాలి. తమ పార్టీ గెలిస్తే మావోలతో చర్చలు జరుపుతామని కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సంకేతాలు పంపడం ఆహ్వానించదగిన పరిణామం. దండకారణ్యంలో ‘బుల్లెట్‌కు బుల్లెట్’అనే విధానం విఫలమైందని, కొత్త ఆలోచనలతో చర్చలు జరిపే తరుణం ఆసన్నమైందని బాగేల్ అన్నారు.
దండకారణ్యంలో పారా మిలటరీ బలగాల క్యాంపులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా బలగాలను మోహరించడం వల్ల ఉపయోగం లేదని బాగేల్ పేర్కొన్నా, ఆచరణలో ఆయన మాటలను అధికార యంత్రాంగం వింటుందనే నమ్మకం లేదు. ఎదురుకాల్పుల సంఘటనల్లో ఎంతమంది మరణించారని మృతదేహాలను లెక్కించుకోవడం లాంటి పరిస్థితులు పునరావృతం కానివ్వమని కొత్త సీఎం అంటున్నారు. బస్తర్ అభివృద్ధికి, దండకారణ్యంలో శాంతికి మావోలతో చర్చలే శరణ్యమని బాగేల్ నమ్ముతున్నారు.
కాంగ్రెస్‌కు 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో అధికారం వచ్చింది. అధికారం చేపట్టాక- ముఖ్యమంత్రులు జనం సమస్యలపై ఉల్లాసపరిచే ప్రకటనలు చేయడం రివాజు. కాలం గడిచే కొద్దీ తాను సమాజాన్ని శాసించే శక్తులు, బ్యూరోక్రసీ, ఆధిపత్యం చలాయించే వర్గాల మధ్య పావుననే విషయాన్ని ప్రతి ముఖ్యమంత్రి గ్రహించేందుకు ఎక్కువ కాలం పట్టదు. అధికారాన్ని రుచిమరిగిన నేతలు మావోలతో చర్చల ప్రక్రియ అనే సంక్లిష్టమైన పాలనా నిర్ణయాలను అమలు చేసే శక్తిని సహజంగానే కోల్పోతారు. ఛత్తీస్‌గఢ్ లాంటి వెనకబడిన చిన్న రాష్ట్రంలో పరిస్ధితి గురించి పెద్దగా మదింపువేయాల్సిన పనిలేదు. చర్చలు జరుగుతాయా? లేదా? అనే విషయం పక్కనపెడితే, ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు దండకారణ్యంలోకి వెళ్లాయి. ఈ చర్చలపై పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంస్థలు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్య సంఘాలు, అధికారంలోకి ఎప్పటికీ రాని కొన్ని పార్టీల నేతలు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. వీరంతా వాస్తవానికి అతీతంగా ఆలోచించి అద్భుతాలు జరుగుతాయనుకుంటారు.
పదిహేనేళ్లుగా దండకారణ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చర్చల వల్ల ఉద్రిక్తతలు సడలితే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ప్రశాంత పరిస్థితుల్లో మావోలు కూడా స్థిమితంగా ఆలోచించేందుకు తగిన అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే తమ సుదీర్ఘ పోరాటంలో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బతిన్నారు. చర్చలు జరిగినంత మాత్రాన మావోలు ఆయుధాలు వదలరు, జన జీవన స్రవంతిలోకి రారు. చర్చల వల్ల- కాలదోషం పట్టిన సిద్ధాంతాలతో పోరాడుతున్న మావోల్లో తప్పనిసరిగా పరివర్తన వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ చరిత్రను తిరగేస్తే రాజకీయంగా ఏ వాదం కూడా తుడిచిపెట్టుకుపోదు. క్లిష్ట పరిస్థితుల్లో మావోలు రెండడుగులు వెనక్కి వేసినా అదను చూసి మరో అడుగు ముందుకేస్తారు.
దండకారణ్యం 2005 వరకు ప్రశాంతంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోలతో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తీవ్రవాద సిద్ధాంతాలను అమలు చేసే నక్సలైట్లతో పెద్ద ఎత్తున చర్చలు జరపడం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చర్చల వల్ల కొంతకాలం శాంతి నెలకొంది. ఈ చర్చలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు హోం మంత్రి కుందూరు జానారెడ్డి దక్షతతో నిర్వహించారు. అప్పటి పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్చలు జయప్రదం కావాలని కోరుకున్నారు. నక్సలైట్ నేతలను హైదరాబాద్‌కు ఆహ్వానించి వారికి అన్ని సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత అనేక కారణాలతో చర్చ లు విఫలమయ్యాయి. అనేక ఎదురుకాల్పుల ఘటనల్లో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు మృతి చెందారు. సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో మార్పులు, సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మావోల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చలు, విధి విధానాలను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలించాలి. ఇక్కడ తలెత్తిన లోపాలేమైనా ఉంటే సరిచేసుకోవాలి.
2005 నుంచి 2018 వరకు 14 ఏళ్ల పాటు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని విశే్లషిస్తే- 3165 మంది పౌరులు, 1999 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది, 2897 మంది నక్సలైట్లు కలిపి 8066 మంది మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లో 832 మంది పౌరులు, 1022 మంది పోలీసులు, 1093 మంది నక్సలైట్లు కలిపి 2947 మంది, ఆంధ్రాలో 276 మంది పౌరులు, 37 మంది పోలీసులు, 429 మంది నక్సలైట్లు కలిపి 747 మంది, 2014లో తెలంగాణ అవతరించిన తర్వాత గత ఐదేళ్లలో 8 మంది పౌరులు, 16 మంది నక్సలైట్లు కలిపి 24 మంది, ఒడిశాలో 345 మంది పౌరులు, 196 మంది పోలీసులు, 248 మంది నక్సలైట్లతో సహా 789 మంది మరణించారు.
2005లో చర్చల తర్వాత తలెత్తిన పరిణామాలను విశే్లషిస్తే కొంత కాలం తుపాకుల మోత తగ్గినా, ఆ తర్వాత ప్రభుత్వం ఆదేశం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేయడం, మావోలు కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడడంతో ఎన్‌కౌంటర్లకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే నక్సలైట్లు దండకారణ్య ప్రాంతానికి తరలివెళ్లారు. ఆ తర్వాత గిరిజనుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాటానికి దిగారు. వామపక్ష తీవ్రవాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశాకు మకాం మార్చినట్లు స్పష్టమవుతుంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు ఖర్చుపెడుతున్నాయి. ఈ పథకాలు నిర్దేశించిన ఫలితాలు అందిస్తున్నాయా? లేదా? అనే విషయం పక్కన పెడితే- పేదలు ఆకలితో అలమటించే పరిస్థితులు లేకుండా చేశారు. టెక్నాలజీని వినియోగించుకుని సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు ప్రభుత్వాలు అలవాటు చేశాయి. ప్రజలు కూడా భోగలాలసకు అలవాటుపడడంతో ఆశ్చర్యకరంగా వామపక్ష తీవ్రవాదానికి నిలువనీడ లేకుండాపోయింది.
ఆంధ్ర, తెలంగాణల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో రైతులు, రైతుకూలీలు, శ్రామిక, కార్మికవర్గాల్లో చోటు చేసుకున్న మార్పులు తాత్కాలికమే. భూసంస్కరణలు పూర్తిగా అమలు కాలేదు. పేదవర్గాల్లో బయటకు కనపడే మార్పు శాశ్వతంగా ఉండకపోవచ్చు. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి నిధుల కొరత తలెత్తితే ముందుగా వేటుపడేది సంక్షేమ రంగంపైనే. కంటికి కనపడేదంతా నిజం కాదు. బయటకు అంతా పచ్చగా కనపడుతున్నా సంపద పంపిణీ లేదు. ‘పేదవాడికి భోజనం చేసేందుకు చేపను ఇవ్వకు.. చేపలను ఏ విధంగా పట్టాలో నేర్పించాలి..’ అనే సిద్థాంతానికి తిలోదకాలిచ్చేశారు. ఓటుబ్యాంకు కోణంలో అర్హత లేని వారికి కూడా సంక్షేమాన్ని వర్తింప చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విధానం బెడిసికొట్టక తప్పదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే మళ్లీ భూమి సమస్య తెరపైకి వస్తుంది.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబాళ్ల కేశవరావు ఎన్నిక కావడంతో రానున్న రోజుల్లో ఆ పార్టీ- సరికొత్త విస్తరణ, అర్బన్ నక్సలిజం ఎత్తుగడలతో ముందుకు వస్తుంది. ప్రస్తుతం నక్సలైట్లపై పోలీసు బలగాలు టెక్నాలజీ సహాయంతో పైచేయి సాధించాయి. నక్సలైట్లు తమ రాజకీయ అజెండా కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. వీరికి పోలీసులు శత్రువులు కారు. సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ చేయాలనే సిద్ధాంతాన్ని వ్యతిరేకించే పార్టీలు అధికారంలో ఉంటాయి. ఈ ప్రభుత్వాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు పోలీసుల భుజం మీద తుపాకీ పెట్టి నక్సలైట్లను నిర్వీర్యం చేయాలని చూస్తాయి. ఈ హింసాక్రీడలో బలయ్యేది పోలీసులు, నక్సలైట్లు, సాధారణ పౌరులే. పోలీసు సంస్కరణలకు మూల పురుషుడు, రిటైర్డు పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకాశ్ సింగ్ - ‘నేను నక్సలైట్ల గురించి నిస్సంకోచంగా చెప్పేందుకు వెనకాడను. నక్సలైట్లలో చాలా మంది రాజకీయ సిద్ధాంతాలకు ప్రేరేపితులై వచ్చారు. ఒక ఉదాత్తమైన లక్ష్యం కోసం పోరాడుతున్నామనే భావనతో ఉన్నారు. ప్రస్తుతం మన చట్టసభల్లో చొరబడిన నేరగాళ్ల కంటే నక్సలైట్లే మేలు. క్రిమినల్స్ సైతం మంత్రులు అవుతున్నారు’ అని చెప్పారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్డయిన ఎం.కృష్ణ్ధర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ,‘్భరత్‌లో మావోయిస్టు పార్టీ ఉద్యమం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మధ్య ఉన్న వ్యత్యాసానికి నిదర్శనం. పోలీసు చర్యల ద్వారా నక్సలైట్ సమస్యను పరిష్కరించలేం’ అన్నారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో నక్సలైట్లతో చర్చల ప్రక్రియను ఎలా ప్రారంభించబోతుందనే విషయమై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 15 ఏళ్లుగా దండకారణ్యంలో రక్తం ఏరులై పారుతోంది. ఈ రాష్ట్రంలో ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, గోదావరి నదుల మధ్య విస్తరించి ఉన్న దండకారణ్యంలో శాంతి నెలకొనేందుకు ప్రభుత్వం పెద్ద అడుగు వేయాలి. రాజ్యాంగ విధులు కాపాడేందుకు పోలీసు బలగాలను నక్సలైట్లపైనే వినియోగించడమా ? నక్సలైట్లు కూడా కాలదోషం పట్టిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలి. తెలుగురాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ఉద్యమ వ్యాప్తిలో కీలకపాత్ర వహించిన ప్రజా గాయకుడు గద్దర్ కూడా చివరకు బుల్లెట్ కంటే బ్యాలెట్ పదునైన ఆయుధం అని ప్రకటించాడు. భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. భారతీయ సాంస్కృతిక, సామాజిక వ్యవస్థలకు వ్యతిరేకమైన వామపక్ష తీవ్రవాదం ద్వారా నక్సలైట్లు సాధించేదేమీ లేదు. జనజీవన స్రవంతిలోకి వారు అడుగుపెట్టి, భ్రష్టుపట్టిన రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పేలా ప్రజాస్వామ్య పంథాలో నడవాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097