మెయిన్ ఫీచర్

జీవన(ది) వేదన బుధ్నీ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవభారత నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్రానంతరం జాతీయ స్థాయి భారీ నీటిపారుదల పథకాలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. 1948లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, దామోదర్ నదీ జలాలను పంట పొలాల సౌభాగ్యానికి వినియోగించే నీటిపారుదల పథకాలను చేపట్టింది. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్, బీహార్ సరిహద్దులలో (ప్రస్తుతం జార్ఖండ్) ధనబాద్ జిల్లా పాంచెట్ వద్ద రు.19 కోట్ల వ్యయంతో నిర్మించబడిన నాల్గవ డ్యామ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఊహించని రీతిలో వ్యవహరించి, ఒక విషాద కథనానికి పరోక్షంగా బాధ్యులయ్యారు.
స్వతంత్ర భారతావనిలో దశాబ్దాల ప్రస్థానంలో, 60ళ్ళ నాటి ఆ ప్రారంభోత్సవంలో నాడు జరిగిన అపురూప సంఘటన చరిత్రలో నిక్షిప్తమైన జీవన వైచిత్రిగా నిలిచిపోయింది. అప్పటి రోజులలో దామోదర్ నది సృష్టించే వరద బీభత్సం కారణంగా ఆ నదిని 3బెంగాల్ విషాద నది2గా పిలిచేవారు. డామ్ నిర్మాణంలో ఆ ప్రాంతాలలో అధికంగా నివసించే సంతాల్ ఆదివాసీ తెగలకు చెందిన గిరిజన కుటుంబాలు నిర్మాణ కార్మికులుగా శ్రమించారు. 15 సంవత్సరాల వయసున్న 3బుధ్నీ మెజ్‌హాన్2 అందరితో కలిసి తట్టలు మోసే కూలి పనిలో పాల్గొనవలసి వచ్చింది. పాంచెట్, మైథా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంవలన పునరావాసం కోసం ముంపు కారణంగా, తరలి వెళ్లిన బాధితులలో 56.46 శాతం ఆదివాసీలుగా గుర్తించబడింది.
నాడు 3కర్బొనా2 ఆదివాసీపల్లెలో నివసించే బుధ్నీ మెజ్‌హాన్‌కు దేశ ప్రధాని ఘనత తెలియదు. జవహర్‌లాల్ నెహ్రూ గొప్పతనం అసలే తెలియదు. తాను మట్టిమోసిన, రాళ్ళెత్తిన పని పూర్తయిందని మాత్రం తెలుసు. అంతే.. ఆ రోజు 1959 డిసెంబర్ 6వతేదీ. జవహర్ లాల్ నెహ్రూకు ఆ సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది. డ్యామ్ ప్రారంభోత్సవం తానే ఎందుకు చెయ్యాలి? కష్టించి పనిచేసిన నిర్మాణ కార్మికులకు ఆ అవకాశం ఇవ్వాలనిపించింది. ప్రధానమంత్రి ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. సంప్రదాయ వేషధారణ, ఆదివాసీ అలంకరణలతో, తలలో కొండపువ్వు, అమాయకత వుట్టిపడే చూపులు, నల్లటి ఛాయ వున్న బుధ్నీని ఒప్పించి వేదికపైకి తీసుకెళ్లారు. ఛార్మింగ్ ప్రిన్స్ ఆఫ్ ఇండియా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సరసన అమాయక గిరిజన బాలిక. డ్యామ్ ప్రారంభోత్సవ సంకేతంగా ఆమె పవర్ స్టేషన్ బటన్ నొక్కటం. ఆ సంఘటన దేశమంతటా సంచలనం కలిగించింది. మీడియా నెహ్రూ ఆలోచనలపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రపంచం హర్షించింది.
బుధ్నీ మెజ్‌హాన్ ఇంటికి తిరిగి రావటంతోనే అసలు కథ ప్రారంభమైంది. సంతాల్ ఆదివాసీ పెద్దల సమావేశం జరిగింది. ఆమె నెహ్రూకు దండవేసింది కనుక గిరిజన తెగ ఆచారం సంప్రాదయం ప్రకారం పెళ్లిచేసుకొన్నట్టే. కానీ వ్యక్తి సంతాల్ తెగకు చెందినవాడు కాదు. ఆ అపరాధ నేరానికి ఆమెకు బహిష్కరణ శిక్ష పడింది. ఆమె బతుకు అడవిపాలైంది. పాంచెట్ నివాసి సుధీర్ దత్తా ఆశ్రయం పేరిట, ఆమెను తరువాత తల్లిని చేశాడు. మూడేళ్ళ తరువాత పని ఊడిపోయి రోజు గడవటం కష్టమైంది. బతుకు భారమైంది. 1964లో నెహ్రూ మరణించేనాటికి ఆమె జీవితం దుర్భరంగా వుంది. చాకిరీతో బతకటం కష్టమవడంతో ఎవ్వరో సలహా ఇచ్చారు, ఢిల్లీకి వెళ్లి 1980లో నెహ్రూ మనవడు రాజీవ్‌కు మొరపెట్టుకొంది. మళ్లీ పని దొరికింది. 2001లో ఒక వెబ్‌సైటులో 3నెహ్రూ ఆదివాసీ భార్య2 అంటూ ఆమె దుర్భర దారిద్య్ర వేదన కథనం వచ్చింది. 58 ఏళ్ల బుధ్నిని అప్పటికి ఊరు పొమ్మంది. తరువాత పదేళ్ల జీవితం ఎలా తెల్లారిందో ఎవ్వరికీ తెలియదు.
స్వాతంత్య్రానంతరం నవభారత నిర్మాణంలో తిండి గింజల ప్రాధాన్యత దృష్ట్యా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా జాతి నేతలు పరిగణించారు. శాస్ర్తియ ప్రగతి, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికలు కొనసాగాయి. అటవీ, జల, ఖనిజ ఇతర ప్రకృతి వనరులను కొల్లగొట్టడమే అభివృద్ధి, ప్రగతి, స్వయం సమృద్ధి, స్వాలంబనకు మార్గమైంది. 2000 సంవత్సరం నాటికే భారీ ప్రాజెక్టుల కారణంగా 50 మిలియన్ పైగా సంఖ్యలో ఆదివాసీలు, నిరుపేదలు నిర్వాసితులయ్యారు. అడవుల నరికివేత, నదులపై భారీ ప్రాజెక్టులతో నిస్సహాయ, అమాయక ఆదివాసీల జీవన విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతోంది. గంగానదిపై జల విద్యుత్ కేంద్రాలు, గంగ, నర్మదా, గోదావరిపై ప్రాజెక్టులు, మైనింగ్ పేరిట కొండల విధ్వంసం ప్రస్తుత నాల్గవ పారిశ్రామిక విప్లవంలో దేశం శరవేగంగా దూసుకుపోతోంది. అరవై ఏళ్ళనాటి ఆదివాసీ బాలిక 3బుధ్నీ2 విషాద జీవన కథనం దామోదర నదీ జలగర్భంలో సమాధి అయింది. వెలుగుచూడని ఇటువంటి కథనాలు చరిత్ర నిర్మిస్తున్నాయి. ఇది గతం కాదు ప్రస్తుత వాస్తవం.

-జయసూర్య సెల్- 9440664610