మెయిన్ ఫీచర్

ఆదర్శ ఉపాధ్యాయిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది ఒక ప్రసూతి గది, జ్ఞానానికి జన్మనిచ్చేందుకు..
తరగతి గది ఒక స్మశానవాటిక, అజ్ఞానాన్ని ఖననం చేసేందుకు..
తరగతి గది ఒక కర్మాగారం, జాతి భవితను నిర్మించేందుకు..
తరగతి గది ఒక న్యాయ స్థానం, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు..
- సర్వేపల్లి రాధాకృష్ణ
*
నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే..
మంచి విద్యావంతుల్ని తయారు చేయగలడు..
- రవీంద్రనాథ్ ఠాగూర్
నైతిక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే..
ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు నవ సమాజ నిర్మాత..
మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు..
- ఐఐటీ రామయ్య
*
‘‘ఆప్యాయతను పంచి ఆడించు అమ్మ.. పాఠాలు నేర్పేటి తొలి పంతులమ్మ.. అటువంటి అమ్మ ఒడిలో ఆడుతూ పాడుతూ పెరిగిన బిడ్డ ఒక్కసారిగా పాఠశాల వాతావరణంలో ఇమడాలంటే అమ్మను మించిన ప్రేమ, ఆప్యాయత ఆ బిడ్డకు ఉపాధ్యాయులు అందించాలి. చిన్న పిల్లలలాగే ఉపాధ్యాయుల ప్రపంచం ఎంతో చిన్నది. వాళ్ళ ఆనందం, ఆసక్తి, ఆకాంక్షలు కూడా చిన్నవే.. ఎంత చిన్నదైతేనేమీ ఆ ప్రపంచం వాళ్ళకి అద్భుతమైనది.. ఆ అనుభూతులు మరువలేనివి.. పెద్దలు తమ పిల్లలను బాగా చదివించాలన్న ఆలోచనతో వాళ్ళను ఆ ప్రపంచం నుంచి దూరం చేస్తుంటారు. ప్రపంచ భవిష్యత్తు ఆ చిన్నారుల మీదనే ఆధారపడి ఉందని మరిచిపోతుంటాం. ఉపాధ్యాయుడు చిన్నారుల ప్రపంచంలోకి అడుగుపెట్టి వారితో కలిసిపోయి సహానుభూతి పొందడంలోనే అసలైన ఆనందం వుంటుంది. అందుకే గురుశిష్యుల సంబంధం గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో..గురుశిష్యుల మధ్య కావలసింది సాన్నిహిత్యమేనా? కాదు.. ఆంతరంగిక అభేదం. అది లేకుండా గురువు ఇచ్చేది లేదు.. శిష్యుడు తీసుకునేదీ లేదు. ఉపాధ్యాయులు అత్యంత సున్నితమైన, సుకుమారమైన పిల్లల మనసుతోటి వ్యవహరిస్తున్నామనే విషయం సర్వదా గుర్తుంచుకోవాలి. పిల్లల మనసు గురించి అనుకునేటప్పుడు మంచు ముత్యాలు తొణికిసలాడే మృదువైన గులాబీ పువ్వును గురించి ఊహించుకోవాలి. మంచు బిందువులు చెదిరిపోకుండా ఆ పువ్వును చేరాలంటే ఎంతో జాగ్రత్త అవసరం. అలాగే విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు కూడానూ..’’ ఆహా.. ఎంతమంచి మాటలు అనుకుంటున్నారు కదూ.. ఈ మాటలు ఎవరో గొప్ప వ్యక్తులు చెప్పినవి కావు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన అవార్డును పొందిన ఉపాధ్యాయురాలు అరుణకుమారి.
నిజమే...తల్లి ఒడి నుంచి ఒక్కసారిగా బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి.. పాఠశాలలో అక్షరాలు నేర్చుకునే చంటి పిల్లలకు చదువు చెప్పాల్సిన తీరు అదే.. ప్రాథమిక విద్యా స్థాయి విద్యార్థులు భవిష్యత్తులో రాణించేందుకు ఓ పునాది వంటిది. ప్రభుత్వ విద్యావిధానం అట్టడుగుకు చేరుతోందని ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు చాలానే వున్నాయి. ఈ నేపథ్యంలో నైతిక విలువలను కాపాడుకుంటూ, ఉపాధ్యాయుల వ్యవహార శైలిపై ఎందరో మహానుభావులు చెప్పి విధంగా నడుచుకుంటూ, విధి నిర్వహణలో రాజీపడకుండా బాధ్యతగా పాఠాలు బోధించే పంతుళ్ళు, పంతులమ్మలు ఇంకా కొద్దిమందైనా మిగిలి వున్నారని అరుణకుమారి లాంటి ఉపాధ్యాయనిని చూసినప్పుడనిపిస్తుంది. ప్రభుత్వం ప్రతి నెలా జీతమిస్తుంది. నిర్దేశించిన సమయంలో విధులకు హాజరై తిరిగి వెళ్ళిపోవడమే వారి పని.. అని అనుకునే ఉపాధ్యాయులున్న ఈ రోజుల్లో భావిభారత పౌర నిర్మాణం ప్రాథమిక విద్యా దశ నుంచే తయారు చేయాలన్న సంకల్పం వుండాలంటారు అరుణకుమారి. ఆ ఆలోచనతోనే కేవలం పాఠ్యాంశాల బోధన మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర అంశాలపై కూడా ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అవగాహన పెంచడంలో ముందుంటున్నారు. విద్యాశాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే పద్ధతిలో బోధన చేస్తున్నారు. ఆటలు, పాటలు, చిత్రాలు.. పిల్లల బలహీనతలు. వాటినే బలంగా మార్చుకుని పాఠ్య పుస్తకాల్లోని బొమ్మలు గీయించడం, గేయాలు రాయించడం, చదవడం, రాయడం అనే ప్రక్రియలతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాటితోపాటు మనిషి జీవన విధానానికి అవసరమయ్యే విషయాలను కథల రూపంలో విద్యార్థులకు చెప్తూ పలు అంశాలపై అవగాహన కల్పించడం కూడా తన పనేనంటూ విధులు నిర్వహిస్తూ ఆదర్శ ఉపాధ్యాయినిగా పేరు తెచ్చుకున్నారు.
పిల్లలు గీసిన బొమ్మలు, రాసిన రచనలను తీసుకుని వాటిని సంకలనం చేసి తాను బోధించే విద్యార్థులో దాగివున్న ప్రతిభను పదిమందికీ తెలియజేసి ఇతర పాఠశాలల్లోని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలన్న సదుద్దేశ్యంతో బాలసాహితి పేరుతో పాఠశాల విద్యావికాస సంచికను తయారుచేసి సుమారు 600ల ప్రతులను ఉచితంగా ఇతర పాఠశాలలకు అందజేశారు. దాంతో చాలా పాఠశాలల్లో విద్యాబోధన విధానంలో అరుణకుమారి అనుసరిస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర కొన్ని పాఠశాలల్లో కూడా అమలుపరచడం గమనార్హం. కేవలం ఒక ఉపాధ్యాయినిగా మాత్రమే కాకుండా ఆమె విధులు నిర్వహించే గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, మహిళల వ్యక్తిగత శుభ్రత, మహిళలు రక్తహీనతకు గురికాకుండా తీసుకోవాల్సిన పౌష్టికాహారం, చిన్నారులకు వేసే పల్స్‌పోలియో కార్యక్రమాలు, మహిళా విద్య-ఆవశ్యకత, ఇలాంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను బాధ్యతగా నిర్వహిస్తూ ఆమె విధులు నిర్వహించే గ్రామాల్లోని మహిళలకు తలలో నాలుకలా నిలుస్తున్నారు.
‘ఉపాధ్యాయుడంటే ఒక ఉద్యోగి మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాత, ఒక సామాజిక వైద్యుడు’ అని ఐఐటీటి రామయ్య చెప్పిన మాటలను నిజం చేస్తూ, రచయిత్రిగా రాణిస్తూ ఉపాధ్యాయ వృత్తికే వనె్న తెస్తున్న ఉపాధ్యాయిని అప్పిరెడ్డి అరుణకుమారికి మన తొలి మహిళా ఉపాధ్యాయిని ‘సావిత్రీబాయి పూలే’ స్మారకంగా అందజేస్తున్న అవార్డు అభించింది. ఎం.ఏ., బి.ఈడీ వరకు చదివిన అరుణకుమారి ప్రస్తుతం అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలోని బొగ్గిటివారిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 16జనవరి 1999లో ఉపాధ్యాయినిగా విధుల్లో చేరిన ఈమె తన 19 సంవత్సరాల సర్వీసులో వృత్తి ధర్మాన్ని బాధ్యతగా కొనసాగిస్తూనే రచయితగా, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె వృత్తి పరంగా, సామాజికంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి 2017లో నేషనల్ బిల్డర్ అవార్డు, 2005-06వ సంవత్సరంలో ప్రాథమిక స్థాయి పిల్లల భాషాభివృద్ధికి కృషి చేయడంతో ప్రశంసాపత్రాన్ని కూడా అందుకున్నారు. ఇలాంటి సేవలు అందజేస్తున్న ఉపాధ్యాయిని అప్పిరెడ్డి అరుణకుమారికి ఉత్తమ ఉపాధ్యాయినిగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సావిత్రీబాయి పూలే స్మారక అవార్డు అందజేయడం అభినందనీయం.. ఆనందదాయకం..

చిత్రాలు.. సావిత్రీబాయిపూలే స్మారక అవార్డు తీసుకుంటున్న ఉపాధ్యాయిని అరుణకుమారి
సహోపాధ్యాయుల సన్మానంలో అరుణకుమారి

- నల్లమాడ బాబ్‌జాన్ 85000 83799