మెయిన్ ఫీచర్

విరిసి.. మెరిసే.. పట్టు పరికిణీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుంకుమ వనె్న అంచుపై జరీపూలతో లేత తెలుపు పట్టు పరికిణి, జాకెట్టుపై బంగారు జరీ బుటాలు, కుంకుమ రంగు జార్జెట్ ఓణీ, జడగంటలతో జడ ముందుకేసుకుని, చెవులకు అందంగా ఊగే కెంపుల జూకాలు ధరించి అమ్మాయి ఇంటిముందు సంక్రాంతి ముగ్గు పెడుతుంటే.. ఆ ఇంటి పండుగ కళ గురించి వేరే చెప్పాలా.. వర్ణరంజితమైన పూ బంతులు, ముంగిట రంగవల్లికలు, గొబ్బెమ్మలు, భోగిమంటలు.. ఇలా సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో కలగలుపు కూరలు, పిండివంటలు, ఇంటినిండా చుట్టాలు, కొత్త అల్లుళ్లూ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. సంక్రాంతి పండుగ అంటేనే ఓ సంబరం.. గ్రామీణ సౌందర్యం.. ఆడపిల్లలు సంప్రదాయ దుస్తులైన పరికిణీ, ఓణీలు వేసుకుంటే ఆ అందం తిరుగులేనిది. ఈ అందమైన ప్రకృతికి ఎన్ని రంగులున్నాయో పరికిణీ ఓణీలకు అన్ని అందాలున్నాయి. ఒక అద్భుతమైన చిత్రకారుడు దీక్షగా ఓ పండుగ సౌందర్యాన్ని ఆవిష్కరించాలనుకుంటే పట్టు పరికిణీ, ఓణీ, జడలో పువ్వులు, జడకుచ్చులు, కాళ్లకు అందెలు ఉండాల్సిందే.. కళ్ళు చెదిరే రంగులతో ఉండే కంచి పట్టు పరికిణీపైకి ఎలాంటి డిజైన్‌లేని సాదా ఓణీ, బుట్ట చేతుల జాకెట్టు వేసుకుంటే అది అచ్చమైన సంక్రాంతి సౌందర్యమే.. పట్టుని ఒంటిపై వేసుకుంటే చాలు.. ఎక్కడలేని కళ వచ్చేస్తుంది. అందుకే మరి.. ఎంత ధగధగలాడే చీర కట్టినా, ఎన్ని నగలు పెట్టినా పట్టుచీర కట్టకపోతే పెళ్లి కూతురు పెళ్లి కూతురుగానే కనిపించదు. అదీ పట్టుకున్న గొప్పతనం.

మెరిసిపోయే బంగారు రంగు అంచుతో పట్టుబట్టలు అందానికే కాదు, దర్పానికీ, హుందాతనానికి కూడా ప్రతీకగా కనిపిస్తాయి. ఆ కారణంతోనే ఈ తరం కూడా పట్టుపై మోజు పెంచుకుంది. అయితే ఎంత కోరిక ఉన్నా రోజుకోరకం ఫ్యాషన్ మారుతున్న ఈ రోజుల్లో ప్రతి వేడుకకూ పట్టు పరికిణీ కట్టుకుంటే చూసేవాళ్లు బొత్తిగా ఫ్యాషన్ సెన్స్ లేదనుకుంటారేమో.. లేక ఇక కంచి భారీగా ఉంటుంది అనుకుంటే నెట్ పరికిణీలు, లెహంగాలు కూడా ఉండనే ఉన్నాయి. వీటిపైకి భారీ పనితనం ఉన్నా, లేక చక్కని అంచులు మాత్రం ఉన్నా వాటిపైకి షిఫాన్ నెట్ జార్జెట్, బెనారస్ జార్జెట్, బుటీ ఓణీలు నప్పుతాయి. ఇక ఇలాంటి అందమైన పరికిణీకి బోటునెక్ బ్యాక్ ఓపెన్ హైనెక్ డిజైన్‌తో జాకెట్ ఉంటే అది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే మెడ చుట్టూ జువెలరీ వర్క్ లేదా అద్దాలు కుట్టేస్తే పండుగవేళ ప్రత్యేకంగా ఉంటాయి. సంప్రదాయంలో కూడా మరీ ట్రెండీగా ఉండాలనుకునేవారు క్రాప్‌టాప్ లెహెంగా వేసుకుని దుపట్టా మ్యాచింగ్‌లా వేసుకుంటే ఇటు ఫ్యాషనూ, అటు పండుగ కళా వచ్చేస్తుంది.
అలాగే పండుగరోజు సంప్రదాయంగా వేసుకోవడానికి పట్టును కట్టుకునే అవకాశం కోసం ఏకంగా అనార్కలీలు, పొడవాటి టాపుల్నే పట్టుబట్టతో కుట్టించేసుకుంటున్నారు. ఇక సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూనే కాస్త ఆధునికంగా కనిపించాలనుకునేవారు ధోతీ చీరల్ని ప్రయత్నిస్తున్నారు. సన్నని జరీ అంచుతో పట్టు లేదా జార్జెట్ ధోతీ చీర అదిరిపోతుంది.