మెయన్ ఫీచర్

అసత్య ప్రచారంతో అనర్థం తప్పదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిజం నిద్రలేచి నడక ప్రారంభించే సమయానికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది..’-అనే నానుడిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన వాగ్దానాల అమలు విషయంలో ప్రజలలోకి వెళ్ళిన అపోహలు నిజం చేస్తున్నాయి. విభజన చట్టంకు సంబంధించి అలనాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన లోని అంశాలను వాటి అమలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తున్న ప్రచారానికి భిన్నంగా పరిశీలిద్దాం.
చాలా ఆవేశపూరితంగా ప్రజల్లోకి వెళ్ళి పోయిన ముఖ్యాంశం- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా. ఈ అంశాన్ని విభజన చట్టంలో ప్రస్తావించలేదు అనేది వాస్తవం. దానిని ఎవరూ కాదనలేరు. మన్మోహన్ సింగ్ నాటి పార్లమెంటులో చేసిన ప్రకటనలో ఈ విషయం చోటు చేసుకుంది. చాలా స్పష్టంగా ఆర్థిక సహాయానికి ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. కానీ, ఎక్కడా ప్రత్యేక హోదా లో భాగంగా పరిశ్రమల రాయితీలు ఇస్తామనే అంశం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తావించలేదు. ఇక ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదా చరిత్రను పరిశీలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా 1969వ సంవత్సరం నుంచి అమల్లో ఉంది. పరిశ్రమలకు పన్ను రాయితీలు మాత్రం వేరే స్కీమ్ కింద 28 సంవత్సరాల తర్వాత 1997లో కొన్ని రాష్ట్రాల తో ప్రారంభించి క్రమంగా మిగిలిన రాష్ట్రాలకు విస్తరించారు. పరిశ్రమ రాయితీలు ఏనాడు ప్రత్యేక హోదా లో భాగంగా ఈశాన్య రాష్ట్రాలకు రాలేదు. ఈ వౌలిక అంశాన్ని విస్మరించి ప్రత్యేక హోదా లో భాగంగా పరిశ్రమల రాయితీలు వస్తాయి అనే అపోహ అన్ని రాజకీయ పార్టీల నాయకుల లోను ప్రజలలోను పాతుకొని పోయింది. ఈ అపోహ ఈనాడు ఈ అంశం పై నెలకొన్న గందరగోళానికి మూల కారణం.
ఇక 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, ఆ సౌలభ్యం లేని రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసాన్ని చూపలేదు అనేది వాస్తవం. వారి నివేదిక పేరా 2.29 లో స్పష్టంగా ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. ఇంతేకాక 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ మిగిలిన సభ్యులతో ఏకీభవించకుండా తనిచ్చిన నివేదికలో 14వ ఆర్థిక సంఘం మిగిలిన ఆర్థిక సంఘంతో పోల్చి చూస్తే ఐదు అంశాల్లో భిన్నంగా తన నివేదికను తయారు చేసిందని ప్రత్యేక హోదా రాష్ట్రాలు లేని రాష్ట్రాలకు మధ్య తేడాను రద్దు చేయడం ఈ ఐదు అంశాల్లో ఒకటి గా పేర్కొన్నాడు. ఆయన ఇచ్చిన ప్రత్యేక నివేదికకు మిగిలిన సభ్యులందరూ తమ సమాధానం ఇచ్చారు. ఆ రెండు అంశాలు 14వ ఆర్థిక సంఘం నివేదికలో భాగంగా పొందుపరచబడ్డాయి. తమ సమాధానాల్లో మిగిలిన సభ్యులు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసాన్ని 14వ ఆర్థిక సంఘం తొలగిస్తున్నదని అభిజిత్ సేను వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని వారు ఎవరూ ఖండించలేదు.
ఇందువలన ఇప్పుడు ఆ అంశంపై ఆనాటి సభ్యుల అభిప్రాయాలకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈనాడు ఈశాన్య రాష్ట్రాలకు కొనసాగించబడుతున్న పథకం 14వ ఆర్థిక సంఘం నివేదిక తర్వాత నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర పథకాలను క్రమబద్ధీకరించడానికి వేయబడిన ముఖ్య మంత్రుల కమిటీ నివేదికను అనుసరించి మాత్రమే. అదే స్థాయిలో ఆర్థిక సహాయానికి స్పెషల్ ప్యాకేజీ ద్వారా ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కారణాలు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. స్థూలంగా ఈ అంశానికి పూర్వ పరాలు పై విధంగా ఉన్నప్పుడు వాటిని వివరించకుండా అంశాన్ని వక్రీకరించడం భావ్యం కాకపోవచ్చు.
రెవెన్యూ లోటు విషయం లో విభజన వలన ఏర్పడిన సాధారణ లోటును కేంద్రం చాలా వరకు భర్తీ చేసింది మిగిలిన కొద్ది మొత్తాన్ని ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఎటొచ్చీ ఎన్నికల వాగ్దానాల మీద రాష్ట్రం చేసిన ఖర్చు భర్తీ చేయటానికి కేంద్రం అంగీకరించలేదు.
వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ విషయం పరిశీలిస్తే బుందేల్‌ఖండ్ లాంటి ప్యాకేజీల కనుగుణంగా ఇది లేదనేది ఒక అపోహ. బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజీలు ప్రకటించినప్పుడు అప్పటికి అమలులో ఉన్న చాలా కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కూడా దానిలో భాగంగా చూపెట్టడం జరిగింది. ఆ నిధులను వేరు చేసి కేవలం ఈ కార్యక్రమం కింద వచ్చిన నిధులను పరిగణనలోకి తీసుకుంటే ఆ ప్రాంతాన్ని కూడా మనకన్నా ఎక్కువగా వచ్చిన నిధులు ఏమీ లేవు. ఇక నాలుగో సంవత్సరానికి ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవటం విషయం విధి విధానాలకు సంబంధించిన విషయం. కేంద్రం ఇప్పటికే ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. తెలంగాణకు ఇచ్చిన విధంగానే క్షేత్రస్థాయి తనిఖీల తర్వాత ఈ మొత్తం మనకు వస్తుంది.
జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పే విషయంలో ప్రజలలో వాస్తవాలతో సంబంధం లేని అపోహ ఏర్పడింది. దాదాపు పది జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఒక సంవత్సరకాలంలో రికార్డు స్థాయిలో ఇంకే రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండదు. ఆనాడు మనమే తాత్కాలిక భవనాలలో ఏర్పాటు చేయమని వారిపై ఒత్తిడి తెచ్చి ఈనాడు ఆ సంస్థలు తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయని ఆరోపణ చేయటం సబబు కాదు. ఇవి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాటికి విడిగా డైరెక్టర్లు ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులను ఒక ప్రణాళిక ప్రకారం తెచ్చుకుంటారు. మనవి కాని సంస్థలను గురించి కేంద్రాన్ని అభ్యర్థించడం మంచిదే కానీ కేంద్రాన్ని దోషిగా నిలబెట్టి ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. కేటాయింపులు వినియోగాన్ని బట్టి ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉంటాయి. ఈ అంశాన్ని మరిచి రాజకీయ ప్రయోజనాలతో రా ష్ట్ర ప్రభుత్వం అనవసర రాద్ధాం తం చేస్తున్నట్లుగా కనిపి స్తున్నది. ఇక వౌలిక రంగం లోని వివిధ సంస్థలు అంశాల విషయంలో చట్టం లోనే స్పష్టత లేదు. ఒకటి రెండు సంస్థల ఏర్పాటు విషయంలో తప్పితే మిగిలిన అన్ని అంశాలను సాధ్యాసాధ్యాల పరిశీలించమని ఉంది. అంతేకాక వీటిని ఏర్పాటు చేయడానికి పది సంవత్సరాల కాలపరిమితి ఇచ్చారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంస్థల ఏర్పాటుకు అవసరమయ్యే మూలధనం చాలా ఎక్కువగా ఉంటుందని భావించబట్టే చట్టంలో ఇటువంటి అంశాలను స్పష్టత లేకుండా పొందుపరిచినట్టు ఉంది. వాటిలో కూడా కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలలో ఏర్పాటు చేస్తూనే ఉన్నది. వైజాగ్ చెన్నై పారిశ్రామిక ద్వారం, విమానాశ్రయాల ఆధు నీకరణ రాజధానికి రహదారుల రైలు మార్గం అనుసంధానం అనుకున్న విధంగా సాగు తున్నాయి. మిగిలిన అంశాలను కూడా ఒక్కటొక్కటిగా ముందుకు తీసుకు పోవచ్చు. ఎటు తిరిగి వీటిని ఏర్పాటు చేయడానికి చట్టంలో పది సంవత్సరాల వెసులుబాటు ఉంది.
రాజధాని ఏర్పాటు వరకు చట్టబద్ధత కలిగిన శివరామకృష్ణన్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్ళింది.అయినా ప్రధాన కట్టడాల కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రం అడిగిన స్థాయిలో లక్ష కోట్ల రూపాయలు ఒక రాజధానికి ఒక ప్రాంతంలో ఇచ్చేటట్టు అయితే ఆ నిధులను ఏకంగా బ్యాంకుల ఎన్ పీ ఏ లను తీర్చడానికి ఉపయోగించుకోవచ్చు. గొంతెమ్మ కోర్కెలు కోరకుండా హేతుబద్ధంగా అదనపు నిధులు రాజధాని కోసం అడిగితే తప్పకుండా వస్తాయని నా విశ్వాసం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత రాష్ట్రంగా హైదరాబాద్ నగరాన్ని కోల్పోయి వనరుల విషయంలో కుంటుబడిందనే మాట వాస్తవం. ఈ పరిస్థితిలో కావలసింది ఆర్థిక క్రమశిక్షణ, సుపరిపాలన, అన్ని విధాలా కొత్త రాష్ట్రానికి పునాదులు వేయాలనే సంకల్పం. కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య ఈ కార్యక్రమ సాధనలో ఎంతో అవసరం. అది మరిచి పోయి చేసిన దానిని కూడా ఒప్పుకోక అసత్య ప్రచారాలు చేస్తూ వ్యక్తిగత స్థాయిలో ఘర్షణ వాతావరణాన్ని కల్పిస్తే అంతిమంగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.

-ఐవైఆర్ కృష్ణారావు