మెయన్ ఫీచర్

కెమిస్ట్రీ లేకపోతే పొత్తులు ఫట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కనీసం 150 లోక్‌సభ సీట్లు తెచ్చుకోవాలి. బీజేపీ వ్యతిరేక ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, తృణమూల్, బీజేడీ, టీడీపీ తదితర పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు తగిన బలం సమకూరుతుందనే నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ లేకుండా బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు పొత్తులు ఖరారు చేసుకున్నారు. రెండు పార్టీలు చెరో 38 సీట్లకు పోటీ చేసేటట్లు, మిగిలిన నాలుగు సీట్లు కాంగ్రెస్‌కు రెండు, ఆర్‌ఎల్‌డీకి రెండు సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం ఖరారైంది. ఒక వైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహా కూటమిని ఏర్పాటు చేసి, బీజేపీని ఓడించి దేశ ప్రధాని కావాలని రాహుల్ గాంధీ ప్రయత్నాలకు ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువ. ఈ రాష్ట్రంలో దళితులు మాయావతి వెంట, బీసీలు ఎస్పీ వెంట నడుస్తారు. ముస్లింలు ఇరు పార్టీలకు మొగ్గుచూపుతారు. ఇతర వర్గాల ఓటర్లు బీజేపీతో వెళుతుంటారు. కాని అన్ని వర్గాల్లో మూడు పార్టీలకు ఓటర్లు ఉన్నారు. గంపగుత్తగా ఒక కులం ఓట్లు పడవు. యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి దాదాపు 30 ఏళ్లయింది. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించేందుకు పెద్ద ప్రయత్నాలు చేయలేదు. ఆ ఓపిక ఆ పార్టీ సీనియర్లకు, గాంధీ కుటుంబానికి లేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాటల్లో చెప్పాలంటే, ‘అనేక సంవత్సరాలుగా పొత్తుల సందర్భంగా ఓట్ల బదలాయింపు చూస్తున్నాం. బీఎస్పీ ఓట్లు ఎస్పీకి, ఎస్పీ ఓట్లు బీఎస్పీకి బదలాయింపు అవుతున్నాయి. కాని కాంగ్రెస్ ఓట్లు బదలాయింపు కావడం లేదు. కాని మా ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయింపు అవుతున్నాయి. ఓట్ల బదలాయింపు సరిగా లేకపోతే పొత్తులు దండగ -అని చెప్పారు. ఈ ఓట్ల బదలాయింపు అనేది పొత్తు రాజకీయాల్లో చాలా ముఖ్యం. ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తులో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయింపు కాలేదు. అదే విధంగా కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి పడలేదు. ఇక టీజేఎస్, సీపీఐ ఓటు బ్యాంకుపై ఇంతవరకు స్పష్టత లేదు. దీంతో ఈ పొత్తు వికటించి కాంగ్రెస్ పతనానికి దారితీసింది. బీహార్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. 40 సీట్లలో బీజేపీకి 22 లోక్‌సభ సీట్లు వచ్చాయి. పొత్తులు నాయకుల కరచాలనాలు, వేదికలపై ఆలింగనాల వల్ల ఫలించవు. కింది స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీలను అభిమానించే ప్రజల మధ్య కెమిస్ట్రీ కుదరాలి. ఈ కెమిస్ట్రీ యూపీలో లేదని మాయావతి చెప్పారు. అందుకే కాంగ్రెస్‌ను పక్కకు తీసి పెట్టారు. కావాలంటే రాయబరేలీ, అమేథీ సీట్లు తీసుకోవాలని, అక్కడ తల్లీ, కుమారుడు సోనియా, రాహుల్ పోటీ చేసుకోవచ్చని నిర్మొహమాటంగా చెప్పారు. కాంగ్రెస్‌కు ఇంత కంటే అవమానం ఏముంటుంది ? స్వాతంత్య్రాన్ని తెచ్చి, దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇంత కంటే ఘోరమైన అవమానం మరొకటి ఉంటుందా ?
శరవేగంగా ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీహార్‌లో కూడా ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుకు ఓకే చెప్పినా అడిగినన్ని సీట్లు ఇచ్చే స్థితిలో లేదు. యూపీ, బీహార్‌లోనే 120 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌కు పట్టుమని పది సీట్లుకూడా రాకపోతే, దేశానికి ప్రధాని కావాలన్న ఆకాంక్ష ఈడేరుతుందా? మాయావతి, అఖిలేష్ యాదవ్ చేతులు కలిపినంత మాత్రాన ప్రజలు ఆ కూటమికి పట్టం కడతారన్న నమ్మకంలేదు. ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీకి ఉండే జనారక్షక శక్తితో పోలిస్తే ఈ రెండు పార్టీలు కలిసినంత మాత్రాన రాజకీయంగా లాభించి బీజేపీ తుక్కుగా ఓటమి చెందుతుందనుకుంటే వ్యూహాత్మక తప్పిదమే. గత లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి 80కు 73 సీట్లు రాకపోవచ్చు. కాని బీజేపీకి ఎక్కువ సీట్లుయూపీ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఉండే రాజకీయాలను చూసే పరిస్థితులను ప్రజలు చూస్తున్నారు.
హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీకి మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది. ఇక్కడ పొత్తులు ఉండవు. ముఖాముఖి పోటీలు ఉంటాయి. ఈ రాష్ట్రాల్లో దాదాపు 130సీట్లలో కాంగ్రెస్ స్వీప్ అయ్యే అవకాశాలులేవు. కాంగ్రెస్‌పార్టీ ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ దక్కే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కాంగ్రెస్ తెచ్చుకుంటే బీజేపీ మెజార్టీకి అడ్డుకట్టవేసినట్లవుతుంది. ఈ రాష్ట్రాల్లో బీఎస్పీకి కొద్దిగా బలం ఉన్నా, ఆ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ అంగీకరించదు. కాంగ్రెస్ ఓట్లు బీఎస్పీకి బదలాయింపు కావు. మహారాష్టల్రో మాత్రం ఎస్సీపీ, కాంగ్రెస్ పొత్తు గట్టిదే. కాని ఇక్కడ బీజేపీ ఇటీవల కాలంలో బలమైన శక్తిగా అవతరించింది. శివసేన అప్పుడప్పుడు అసంతృప్తి వెళ్లగక్కినా, బీజేపీకి దూరంగా జరగదు. ఇదే జరిగితే, శివసేనకు భంగపాటు తప్పదనే విషయం ఆ పార్టీ నేతలకే తెలుసు.
తూర్పు భారతంలోకి అడుగుపెడితే ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించినా, ఒకటి రెండు సీట్లు గెలవచ్చు. తృణమూల్ కాంగ్రెస్‌కు, వామపక్షాలు, బీజేపీకి మధ్య ముక్కోణపు పోటీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ఓడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ మూడవ స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోయంది.
దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తాజా ఎన్నికల్లో తన శక్తిని చాటింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఇక్కడ సంస్థాగతంగా బలంగా ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వైఫల్యం, టీడీపీతో పొత్తు వికటించడంతో చతికిలపడింది. ఈ తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి. బీజేపీ ఉనికి నామమాత్రమే.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయంగా బద్ధశత్రువైన కాంగ్రెస్‌ను సరైన కారణం లేకుండా చంద్రబాబు అక్కున చేర్చుకునే ప్రయత్నం వల్ల ఏమి జరిగిందో తెలంగాణ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ వేచిచూసే ధోరణిని అవలంభిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. 2019 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల తర్వాత ఆవిష్కృతం కానున్న రాజకీయ చిత్రపటం తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విశే్లషకులంటున్నారు. టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌కు చేటు. ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి. 1. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా గెలవని పక్షంలో, ఆ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడే శూన్యతను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం వస్తుంది. కానీ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉండరాదు. వైకాపాకు తరలివెళ్లిన నేతలు మరో ఐదేళ్ల పాటు వేచి ఉండే పరిస్థితి ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి వరుసగా పదేళ్ల పాటు అధికారంలేకుండా మనుగడ సాగించలేదు. అందుకే టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ దూరంగా ఉంటే మంచిది. 2. కాంగ్రెస్‌కు వాస్తవానికి ఇపుడు క్యాడర్, నేతలు అంతంతమాత్రంగానే ఉన్నారు. ఓటు బ్యాంకు వైకాపాకు చేరింది. కాంగ్రెస్‌కు మహా అంటే మూడు శాతం లోపు ఓటు బ్యాంకు నికరంగా ఉండవచ్చు. వీరంతా టీడీపీకి బద్ధ వ్యతిరేకులు. పై స్ధాయిలో చంద్రబాబు, రాహుల్ చేతులు కలిపినా దిగువ స్థాయిలో ఓట్లు బదలాయింపు జరగదు. ఒక వేళ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా, టీడీపీ గెలవని పక్షంలో, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాజకీయ చిత్రపటం నుంచి అదృశ్యమైనట్లే.
ఏపిలో వైకాపా, టీడీపీలో ఎవరు గెలిచినా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పదు. ఈ పార్టీలకు చెప్పుకునేందుకు తగిన రాజకీయ సిద్ధాంతాలేమీ లేవు. బలమైన సామాజిక వర్గాల మధ్య పోరుకు ప్రాతినిధ్యం వహించే పార్టీలకు సిద్ధాంత నిబద్ధత ఏమీ ఉండదు. వైకాపా లేదా టీడీపీలు ఏదో వంక చూసుకుని రాష్ట్భ్రావృద్ధి అజెండా పేరుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇస్తాయనడంలో సందేహం లేదు. కాని కాంగ్రెస్ ఇప్పటికే టీడీపీ వలలో చిక్కుకుంది. ఆంధ్రాలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చంద్రబాబు సంకేతాలు ఇచ్చినా ఆ మేరకు నష్టం జరిగిపోయింది.
తమిళనాడులో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ చేరుతుంది. ఇప్పటికే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడులో కమల్‌హాసన్, రజనీకాంత్‌లు కొత్త పార్టీలు పెట్టారు. ఇక్కడ బీజేపీ బలం అంతంతమాత్రమే. కన్యాకుమారిలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఇక్కడ కూడా ఎవరు గెలిచినా అభివృద్ధి పేరుతోనో, తమ పదవుల కోసమే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇస్తారు. ఆంధ్ర, తమిళనాడు రాజకీయాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. కేరళలో ఈ సారి సీపీఎం పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పదు. శబరిమల వివాదం వల్ల కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ బోణీ కొట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. కర్నాటకలో రాజకీయ అస్థిరత్వం నెలకొంది. కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి చెరి సగం లోక్‌సభ సీట్లను గెలుచుకునే అవకాశాలున్నాయి. దక్షిణ భారతంతో కర్నాటకలోనే బీజేపీకి బలం ఉంది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మొత్తం మీద వస్తే ఒకటి లేదా రెండు సీట్లు రావచ్చు. లేకపోతే అవి కూడా రాకపోవచ్చు. దక్షిణాదిన మొత్తం 129 వరకు ఉన్న లోక్‌సభ సీట్లలో ప్రాంతీయ పార్టీలకే 100కు పైగా సీట్లు వస్తాయి.
వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా చూసినా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటు సమయంలో వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలు జారుకుంటున్నారు. హిందీబెల్ట్‌లోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అపూర్వ విజయాలను సాధించి బీజేపీని చావుదెబ్బ కొట్టిన హీరో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ విషయంలో రాహుల్ గాంధీని అభినందించి తీరాలి. కాని కాంగ్రెస్ బలపడితే తమ ఉనికికి ప్రమాదమని ప్రాంతీయ పార్టీలు భయపడుతాయి. అందుకే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌తో కలిసేదీ లేదని ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణంలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఇంకా ఆవిర్భవించకపోయినా, యూపీలో జరిగిందేమిటి? ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఖరారైంది. ఓడిశాలో బీజేడీ, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కూడా కేసీఆర్ దారికి వచ్చేశాయి. మాయావతి లక్నోలో చేసిన ప్రకటన ప్రధానమైంది. ‘పొత్తుల గురించి వేలంవెర్రిగా రాజకీయ పార్టీలు తాపత్రయపడరాదు. పొత్తు పై స్థాయిలో అగ్రనేతల మధ్య ఖరారు కావచ్చు. కాని దిగువ స్థాయిలో పార్టీ క్యాడర్, ప్రజలు ఈ పొత్తును ఆమోదించాలి. ప్రత్యర్థి పార్టీలు పొత్తు కుదుర్చుకుంటే కెమిస్ట్రీ ఉండాలి. అప్పుడే బ్యాలెట్‌బాక్స్ పండుతుంది’ అని అన్నారు. మాయావతి చెప్పినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

-కే విజయశైలేంద్ర 9849998097