మెయిన్ ఫీచర్

ఆత్మీయతకు... ఆమె ప్రతిరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తు గురించి అమృతం లాంటి ప్రేమను పంచే అమ్మ ఎనె్నన్నో కలలు కంటుంది. పుట్టగానే బిడ్డకు భాష నేర్పడానికి తానూ మూగదై బిడ్డకు అర్థమయ్యే ఊసులతోనే భాష నేర్పడానికి ప్రయత్నిస్తుంది అమ్మ. మాట్లాడటం పూర్తీగా రాని చంటి పిల్లాడు మాట్లాడే కొత్త కొత్త మాటలకు అర్థాలు చెప్పే నిఘంటువు అమ్మ. గతంలో అయితే పిల్లలకు 6 సంవత్సరాల వయసు నిండే వరకు ఆప్యాయతా అనురాగాలతో తల్లి చాటునే ఉంచుకుని తరువాత చదువుకునేందుకు బడికి పంపేవారు. అయితే ప్రస్తుతం బిడ్డ పుట్టి అప్పుడప్పుడే నడక నేర్చుకుని మాట్లాడే తీరు కూడా సరిగా తెలియని వయసులోనే బడికి పంపేస్తున్న కాలమిది. పట్టణాల్లో అయితే ప్లే స్కూళ్ళకు పంపుతారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్ వాడీ కేంద్రాలకు పంపుతారు. వేలకు వేలు డబ్బులు తీసుకునే ప్లేస్కూళ్ళలోని సంరక్షకులు అమ్మ ప్రేమను చూపుతారో లేదో గానీ అంగన్‌వాడీ కేంద్రాల్లోని అంగన్‌వాడీ వర్కర్లు మాత్రం తమ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలకు అమ్మ ప్రేమను చూపుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా అందజేస్తున్న పౌస్టికాహారాన్ని పిల్లలకిస్తూ ఆరు మాసాలు నిండిన పిల్లలకు తల్లిలా అన్నప్రాసన, బుడిబుడి అడుగులేస్తూ తనకు వచ్చీ రాని నత్తినత్తి భాషతో మురిపించే చిన్నారులకు ఓ ఉపాధ్యాయనిలా అక్షరాభ్యాసం, యుక్త వయసులోని బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియబరుస్తూ రక్తహీనతకు గురికాకుండా జాగ్రత్తలు చెబుతూ తీసుకోవాల్సిన పౌష్ట్టికాహారాన్ని అందజేసే ఓ వైద్యురాలిలా, గర్భం దాల్చిన మహిళకు శీమంతం చేసే ఓ తోబుట్టువులా, పురిటి నొప్పులొచ్చిన మహిళకు తోడుండి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళే మంచి స్నేహితురాలిలా ఇలా ఎన్నో పనులు చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామాల్లో విధి నిర్వహణలో బాధ్యత మరవకుండా వ్యవహరిస్తున్నవారున్నారు. దాంతో పాటు తమకు సంబంధం లేకపోయినా మండల స్థాయి అధికారులు ఏపనులు చెప్పినా తూ.చ. తప్పకుండా చేయాల్సిందే. ఇలా తన పరిధిలోని బాధ్యతను ఏనాడూ మరువకుండా తన కేంద్రానికొచ్చే పిల్లలను తన కన్నబిడ్డల్లా ఆదరిస్తూ విధినిర్వహణను కొనసాగిస్తూ జిల్లా అధికారులతో మెప్పు పొంది జాతీయ స్థాయిలో ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్తగా జాతీయ అవార్డును పొందింది ఎం.పి.పద్మావతి. ఈమె అనంతపురం జిల్లాలోని మారు మూల ప్రాంతం కర్ణాటక సరిహద్దు గ్రామమైన అమరాపురంలోని నాలుగవ అంగన్‌వాడీ సెంటర్లో అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అంగన్ వాడీ బాటను నిర్వహించి తన సెంటర్ పరిధిలోని ప్రతి ఇంటినీ పరిశీలించి 3 ఏళ్ళ వయసున్న పిల్లలను తన సెంటర్‌ను పంపండి మీ పిల్లల భద్రత నా బాధ్యత అంటూ పిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించి తన కేంద్రంలో పిల్లలకు అమ్మ ప్రేమను చూపెడుతూ విధులు నిర్వహిస్తోంది. గర్భం దాల్చిన మహిళలకు వారి, వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్య జీవనం కోసం ఏ సమయంలో ఏ సూదిమందులు వినియోగించాలో నిత్యం సలహాలు సూచనలివ్వడం, ఓ తోబుట్టువులా ప్రేమను పంచుతూ శీమంతాలు చేయడం, ప్రసవం కోసం ఆసుపత్రులకు స్వయంగా తీసుకెళ్ళడం, బాలింత ఆరోగ్యంతో పాటు పుట్టిన బిడ్డ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియబరుస్తూ నిరంతరం అందుబాటులో వుంటోంది. తన కేంద్రంలోని పిల్లల పుట్టిన రోజున స్వయంగా కేకులు తీసుకువచ్చి పుట్టినరోజు వేడుకలు చేయడం, పండుగల సమయంలో రంజాన్, సంక్రాంతి, క్రిస్మస్ వేడుకలు చంటి పిల్లలతో జరపడం, తన కేంద్రంలోని పిల్లలకు అక్షరాలు నేర్పి బడికి పంపే వయసొచ్చాక కచ్చితంగా ప్రభుత్వ బడికే పంపాలని తల్లిదండ్రులకు చెప్పి ప్రభుత్వ బడుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేస్తోంది. తన పరిధిలో విధినిర్వహణలో ఎక్కడా రాజీపడకుండా వ్యవహరిస్తున్న పద్మావతి సేవలను గుర్తించి 2018 ఆగస్టు 15న అనంతపురం జిల్లాలో ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్తగా మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తాను చదివింది 12వ తరగతి. అక్షర జ్ఞానంపై పట్టు అంతంతమాత్రమే వున్నా ఏ ఇంట్లో అయినా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించేది అమ్మేననీ, ఆ అమ్మతనమే తన బాధ్యతను మరువకుండా చేస్తూ విధినిర్వహణలో గుర్తింపు తెస్తోందని పద్మావతి చెప్తోంది. అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా చంటిపిల్లలు, యువతులు, గర్భిణీలు, బాలింతలకు వచ్చే పౌష్టికాహారాన్ని అంతంతమాత్రంగా అందజేస్తూ పబ్బం గడుపుకునే అంగన్‌వాడీ కార్యకర్తలూ లేకపోలేదు. అయితే అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్న పిల్లలు, యువతులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్ట్టికాహారం అందజేసి వారి ఆరోగ్య జీవనం కోసం విధులు నిర్వహించడం తనకెంతో తృప్తినిస్తోందని పద్మావతి సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆమె చేస్తున్న సేవలను కేంద్రప్రభుత్వం కూడా గుర్తించి జనవరి 7- 2019న కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకాగాంధీ చే దేశరాజధాని ఢిల్లీ నగరంలో ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్తగా పద్మావతి అవార్డును అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై ఎన్నో విమర్శలు చోటు చేసుకుంటున్న ఈ రోజుల్లో మారుమూల గ్రామానికి చెందిన ఓ సామాన్య అంగన్‌వాడీ కార్యకర్త ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్తగా జాతీయ అవార్డును పొందడం చాలా గర్వించదగ్గ విషయం. పద్మావతి లాంటి అంగన్‌వాడీ కార్యకర్తను స్ఫూర్తిగా తీసుకుని విధులు నిర్వహిస్తే మహిళా శిశుసంక్షేమ శాఖ ద్వారా అందజేస్తున్న పౌష్ట్టికాహారం పూర్తి స్థాయిలో వినియోగపడి పిల్లలు, మహిళలు రక్తహీనతకు గురికాకుండా ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించడం సాధ్యమే.. విధి నిర్వహణలో పిల్లలకు అమ్మ ప్రేమను పంచుతూ, మహిళలకు తోబుట్టువులా ఆదరిస్తున్న ఎం.పి.పద్మావతికి జాతీయ అవార్డు దక్కడం ప్రశంశనీయం.

-నల్లమాడ బాబ్‌జాన్ 85000 83799